Want to share your reaction with friends?
మంగుళూరు - కర్నాటక రాష్ట్ర ముఖ ద్వారం
మంగుళూరు పట్టణాన్ని కర్నాటక రాష్ట్ర ముఖద్వారంగా చెపుతారు. ఎంతో సుందరమైన నగరం. ఒక పక్క అరేబియా మహాసముద్రం మరోపక్క పశ్చిమ కనుమలు ఈ నగరానికి ఎంతో వన్నె తెచ్చాయి. నగరాన్ని దేవీమాత మంగళాదేవి పేరుపై మంగుళూరు అని నామకరణం చేశారు. మంగుళూరు ఓడరేవు ఎపుడు చూసినా వివిధ ఎగుమతులు, దిగుమతులతో ఎంతో బిజీ ప్రదేశంగా ఉంటుంది. చరిత్రలో ఈ ఓడరేవు నగరం గురించి 14 వ శతాబ్దపు నిర్మాణంగా అక్కడి స్ధానిక పాలకులు పర్షియన్ గల్ఫ్ దేశాలతో వ్యాపారాలకుగాను చేయబడినట్లు తెలుపుతోంది. మంగుళూరు ప్రాంతం ప్రధాన నగరం కావటంతో పాలనలలో అనేక చేతులు మారింది. పోర్చుగీసు వారు, బ్రిటీష్ వారు, మైసూర్ పాలకులు హైదర్ ఆలి, టిపు సుల్తాన్ లు ఈ నగరం కొరకు గొప్ప యుద్ధాలు చేశారు.
ఎంతోమంది పాలకులు సుందరమైన ఈ నగరం కొరకు పోరాడారు. నేడు ఈ మంగుళూరు నగరం వివిధ సంస్కృతుల నగరంగా విరాజిల్లుతోంది. అంతేకాక ఈ నగరం నేటికి దేశంలోని ప్రధాన ఓడరేవులలో ఒకటిగా భారత దేశ కాఫీ, జీడిపప్పు, ఇతర వాణిజ్య పంటలను ఎగుమతులు చేస్తోంది.
ప్రకృతి ఆస్వాదకులకు ఒక స్వర్గం మంగుళూరు నగర సహజ అందాలు ఆ నగరానికి ఎంతో శోభనిస్తాయి. 132.45 చ.కి.మీ.ల ఈ నగరం రెండు నదుల మధ్య విస్తరించింది అది నేత్రావతి మరియు గురుపుర. అరేబియా సముద్ర తీరంలోని చక్కటి బీచ్ లు తాటి చెట్లు మరింత అందాన్ని తెచ్చాయి. ఈ సుందర నగరం పచ్చటి కొండలు, ఎర్రటి పెంకుల ఉపరిభాగం కల ఇండ్లు కలిగి సుమారుగా 6 లక్షలమంది ప్రజలకు నివాసంగా ఉంది.
మంగుళూరు ప్రజల సంస్కృతి సంప్రదాయాలు -మంగుళూరు నగరం వివిధ మతాల ప్రజలకు, భాషలకు నిలయం. ఇక్కడ నాలుగు భాషలు అంటే తుళు, కొంకణి, బియరీ, కన్నడ భాషలు మాట్లాడతారు. ఈ కారణంగా నగరం ఒక మంచి సాంప్రదాయ, సాంస్కృతికతలకు నిలయంగా మారింది. వీరి సాంప్రదాయక యక్షగానం, క్రిష్ణ జన్మాష్టమి, కరదాయ్ వేష డ్యాన్స్ మొదలైవి దేశం యావత్తూ ఆకర్షణలే. వాస్తవానికి మంగుళూరులోని దసరా పండుగ వేడుకలు రాచరిక హంగులకు అద్దంపడుతూ దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తాయి.


