Search
  • Follow NativePlanet
Share
» »తిరువళ్ళ......ఆలయాల ఊరు

తిరువళ్ళ......ఆలయాల ఊరు

తిరువళ్ళ ప్రాంతం కేరళ లోని పాథానంతిట్టా జిల్లాలో గల మణిమాల నది ఒడ్డున వెలసిన ఒక చిన్న ప్రశాంతమైన పట్టణం. అనేకానేక దేవాలయాలతో చరిత్రకి, సంస్కృతికి నిలువుటద్దంగా,సాక్షిగా నిలిచి "ఆలయాల పట్టణం" గా పేరు గాంచింది. తిరువళ్ళలో ఉన్న ప్రసిద్ధి చెందినట్టి శ్రీ వల్లభ ఆలయం ఇక్కడ "దక్షిణ తిరుపతి" గా పేరుగాంచి , దేశం నలు మూలల నుంచి భక్తులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది.

తిరువళ్ళ తనలో ఎన్నో కథలను, గాథలను నింపుకుని చరిత్ర పుటల్లో తనకంటూ ఒక స్థానాన్నిఏర్పరచుకుంది. ఇక్కడి ప్రతి ప్రదేశానికి, గుళ్ళకి , పండగలకి , చివరకి దీని పేరుకి కుడా ఒక కథ ఉంది. అదేమిటంటే ఇక్కడి కథానుసారం , తిరువతంకూర్ మహారాజా వారి పరి పాలనా కాలంలో ఈ ప్రదేశం శ్రీ వల్లభాపురంగానూ, తరవాత తిరువల్లభాపురం గానూ, నేటి కాలానికి తిరువళ్ళ గానూ మారిపోయింది. మరో విశ్వాసం ప్రకారం, ఏమిటంటే! ఈ ఊరు భగవాన్ తిరు వళ్ళభన్ ( విష్ణు) పేరు మీదుగా తిరువళ్ళ అని పిలవబడుతుంది. అందుచేత, తిరువళ్ళ "విష్ణు పట్టణం" గా కుడా విఖ్యాతిగాంచింది.

పలియక్కర చర్చి

దేశం యావత్తూ ఉన్న సిరియన్ క్రైస్తవులకు ఆరాధ్య ప్రార్థన మందిరం అయినట్టి పలియక్కర చర్చి శ్రీ వల్లభాలయానికి అతిసమీపంలో ఉంది. చర్చి చరిత్ర ఏమి చెబుతుందంటే! క్రీ.శ 54 వ సంవత్సరంలో ఇక్కడికి సెయింట్ థామస్ విచ్చేసారని!.

అద్వితీయమైన దీని నిర్మాణ శైలి, నివ్వెరపరిచే ఇచ్చటి శిల్పకళా విన్యాసం , ముఖ్యంగా దైవపీఠం యొక్క తూర్పు గోడ పైని కుడ్యచిత్రాలు వర్ణించ వీలులేనట్టిది. ఈ చర్చిలోని చెక్కిన తడిక కిటికీలతో నిండిన గోడల మధ్య మత ప్రచారానికి , సాంఘిక ఉద్యమాలకి సంబంధించిన ఎన్నో పోరాట గాథలు దాగి ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే? ఇక్కడి పండుగలు శ్రీ వల్లభాలయం పండుగలని చాలా వరకు పోలి ఉంటాయి. హిందూ క్రైస్తవ మత సంస్కృతుల మేల సంగమం ఇక్కడ అనిర్వచనమైనది. ఉదాహరణకి, చర్చిలో ఏప్రిల్-మే నెలలలో జరిగే పది రోజుల పండుగ గుడిలో జరిగే ఉత్సవానికి చాలా దగ్గర పోలికలు ఉంటుంది.

తిరువళ్ళ......ఆలయాల ఊరు

Photo Courtesy: Pradeep Thomas

శ్రీ వల్లభ దేవాలయం

"దక్షిణ తిరుపతి"గా పిలవబడే శ్రీ వల్లభాలయం కేవలం భక్తులనే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులని ఆకర్షిస్తుంది. ఇది కేవలం అమూల్యమైన దైవానుభూతిని ఇవ్వటమే కాకుండా, సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఇక్కడి ప్రాచీన విగ్రహాలు ఏక శిలతో వివిధ రకాలైన శిల్పవిన్యాసాలతో , కుడ్యచిత్రాలతో చెక్కబడ్డాయి.

పచ్చని చెట్లు, పచ్చిక బయళ్ళు మరింత వన్నె తెస్తాయి.కేరళలో ప్రతిరోజు ఆలయంలో కథాకళి నృత్యం ప్రదర్శించే ఆనవాయితి కేవలం శ్రీ వల్లభాలయం లోనే ఉండటం ఇక్కడి విశిష్టత. విష్ణు భక్తులు కానప్పటికీ అత్యద్భుతమైన శిల్ప కళ అనిర్వచనీయమైన నిర్మాణ చతురత గల ఈ ఆలయ వైభవం చూసి ఎవ్వరైనా విస్మయం చెందాల్సిందే నండోయ్!. 50 అడుగుల ఎత్తు ఉండి ఒకే శిలతో చెక్కిన గరుత్మంతుడి విగ్రహం గల ఇక్కడి ధ్వజస్తంభమును చూసి ఆశ్చర్యం! కలిగించకమానదు. నిజంగా చెప్పాలంటే అప్పటి నిర్మాణ చాతుర్యానికి,కళలకి మైలుటద్దం.

తిరువళ్ళ......ఆలయాల ఊరు

Photo Courtesy: Dvellakat

చక్కులతు కవు ఆలయం

చక్కులతు కవు ఆలయం తిరువళ్ళకు పశ్చిమాన 12 కి.మీ ల దూరంలో ఉంది. అందమైన దృశ్యాలకి,చూపరులను కనువిందు చేసే విధంగా ఉండే ఇక్కడికి , యాత్రికులు కుడా భక్తులతో సమంగానే వస్తారు. పంపా, మణిమాల నదుల మధ్య ఒదిగి ఉన్న ఈ ఆలయం పతనంతిట్ట, అలప్పుళ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ దేవాలయం సుమారు మూడు వేల సంవత్సారాల క్రితం కట్టబడింది. ఇక్కడ బగవతి అమ్మవారు పూజలందుకుంటారు. ఈ అమ్మవారికే చక్కులతమ్మ అని మరోక పేరు.చక్కులతు కవు ఆలయం "మహిళల శబరిమల" గా పేరుగాంచినది.

ఇక్కడ నవంబర్ డిసెంబర్ నెలలలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. అడవి మధ్యలో ఉండటం వల్ల యాత్రికులకు ఇది ఒక ప్రశాంతమైన వాతావరణం అందిస్తుంది. రెండు నదుల సంగమం ముగ్ధమనోహరంగా ఉంటుంది. ఇక్కడ పడవ పోటి చాలా బాగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ నీటిలో అటూ ఇటూ తేలుతూ పడవ నడపటం ఒక అనిర్వచనీయమైన, ఆహ్లాదకరమైన అనుభూతి.

కవియూర్ మహాదేవ ఆలయం

తిరువళ్ళ పట్టణానికి 6 కి.మీ ల దూరంలో ఉన్న కవియూర్ మహాదేవ ఆలయం కేరళ లోనే అత్యంత ప్రాచీన శివాలయం. గోపురాలతో కూడిన ఒక అద్వితీయమైన నిర్మాణానికి ఈ గుడి ప్రసిద్ధి చెందింది. ఏటవాలుగానున్న పైకప్పు వల్ల ఏర్పడిన త్రిభుజాకారం ఈ భవనం యొక్క విశిష్టత. తిరిక్కవియూర్ మహాదేవ ఆలయం గా పేరు గాంచిన వందేళ్ళ చరిత్ర గల ఈ గుడి, దక్షిణ భారత దేశం లోనే అతి పురాతన దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాయలయం లో ప్రజలు భక్తి శ్రద్ధలతో మహాదేవున్ని(శివుడు), పార్వతి దేవిని కొలుస్తారు.
డిసెంబర్ మరియు జనవరి నెలల్లోని ఆలయ ఉత్సవానికి , ఇంకా హనుమాన్ జయంతి కి భక్త జన సందోహంతో కవియూర్ కోలాహలంగా ఉంటుంది. ఈ ఆలయ గోడల పై ఉన్న 16 వ శతాబ్దానికి చెందిన పురాతన చెక్కడాలలో ప్రధానంగా రామాయణం ,మహాభారతం లాంటి పురణాలలోనుంచి స్వీకరించిన వాక్యాలు కనపడతాయి. ఈ గుడిలో కలప యొక్క విస్తృత వినియోగాన్ని గమనించవచ్చు. ప్రాచీన చెక్కడాలతో కూడిన ఈ అపూర్వమైన కట్టడం నిజంగా ఒక వింతే. చూపరులను ఆకట్టుకోవడం ఖాయం.

ఎలా వెళ్ళాలి?

వాయు మార్గం

తిరువళ్ళ పట్టణంలో ఎయిర్ పోర్టు లేదు.మరి ఎలా? అంటే దగ్గరలో ఉన్న కొచ్చి ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ఎయిర్ పోర్టులో కాని లేదా తిరువనంతపురం ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ఎయిర్ పోర్టులో కాని దిగి రావాల్సిందే.కొచ్చి ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ఎయిర్ పోర్టు నుంచైతే 118 కి.మీ. లేదా తిరువనంతపురం ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ఎయిర్ పోర్టు నుంచైతే 125 కి.మీ.దూరంలో ఉన్నది.

రైలుమార్గం

తిరువళ్ళ పట్టణానికి దేశంలోని ప్రధాన నగరాల నుంచి సులభతరంగా ప్రయాణం చేయవచ్చు మరియు చౌకైనది కూడా!

బస్సు మార్గం

తిరువళ్ళ పట్టణానికి కోజికోడ్, కొచ్చి, తిరువనంతపురం, కొల్లాం, కన్నూర్, చెన్నై, మధురై, బెంగళూర్ మరియు మంగళూర్ ల నుండి రోడ్డు మార్గం కలదు.

వాతావరణం

తిరువళ్ళ పట్ఠణం ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా ఒదిగినట్టుగా కనిపిస్తుంది. జనవరి-మార్చి నెలలో సందర్శించినట్లయితే రమణీయంగా,ఆహ్లాద కరంగా ఉంటుంది.మధ్యస్థ ఉష్టోగ్రతతో ఈ నెలలలో స్వాగతం పలుకుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X