Search
  • Follow NativePlanet
Share
» »తిరుమల తొలిగడప - దేవుని కడప !!

తిరుమల తొలిగడప - దేవుని కడప !!

దేవుని కడప 'తిరుమల తొలిగడప' గా ప్రసిద్ధికెక్కింది. ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకోవటానికి గడపలాంటింది.

By Mohammad

దేవుని కడప 'తిరుమల తొలిగడప' గా ప్రసిద్ధికెక్కింది. ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకోవటానికి గడపలాంటింది. ప్రాచీన కాలంలో ఉత్తర భారత యాత్రికులు తిరుమల వెళుతూ ఇక్కడ విశ్రాంతి తీసుకొనేవారట. అక్కడిదాకా వెళ్ళలేనివారు ఇక్కడే ఆ ముడుపులు చెల్లించి వెనుతిరిగేవారట.

క్షేత్ర ప్రాశస్త్యం

దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలిగడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకు వెళ్ళే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు.

దేవుని కడప ఆలయం గోపురం

దేవుని కడప ఆలయం గోపురం

ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. తిరుమల క్షేత్రానికి దేవుని కడప గడప అంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. క్రీ.శ. 2వ శతాబ్దంలో టాలెమీ అనే విదేశీ యాత్రికుడు కడపను దర్శించాడు.

కడప లంకమల్ల అడవిలో దాగున్న నిత్య పూజ కోన క్షేత్రం !కడప లంకమల్ల అడవిలో దాగున్న నిత్య పూజ కోన క్షేత్రం !

ఏడుకొండల వేంకశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలసిన శ్రీలక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుడు. ఈ గుడిలో ఒక మందిరంలో వేంకటేశ్వరుడు, ఆయనకు ఎడమ వైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘ శుద్ధ పాడ్యమి నుండి సప్తమి (రథసప్తమి) వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు.

దేవాలయం లోపలి భాగం

దేవాలయం లోపలి భాగం

ఈ గుడిలో విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాళ్ మందిరం, శమీ వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి, సోమేశ్వరాలయం, దుర్గాలయం చూడదగినవి. ఇక్కడ ఇటీవల నిర్మించిన అద్దాల మందిరం ఒక ప్రత్యేక ఆకర్షణ.

గర్భగుడి వెనుకవైపు 13 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహముంది. ఈ ఆంజనేయస్వామి ఈ క్షేత్రానికి పాలకుడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువు నామాలుండడం విశేషం. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాపనివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు.

గుడిలో కొలువైన శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి

గుడిలో కొలువైన శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి

ఈ ఆలయానికున్న మరో విశిష్టత మతసామరస్యం. ఉగాదినాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామి వారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. వారితో పాటు జైనులు కూడా వస్తుంటారు. రథసప్తమి రోజు జనసందోహం మధ్య స్వామి రథాన్ని కులమతాలకతీతంగా లాగడం మతసామరస్యానికి నిదర్శనం.

ఉత్సవాలు

దేవుని కడప ఆలయ చెరువుల సముదాయాన్ని హరిహర సరోవరంగా పిలుస్తారు. హనుమ క్షేత్రం అయినందున హనుమత్ పుష్కరిణి అనికూడా అంటారు. కొలనులోని నిరయమంటపం, పడమరన తీర్థవాశి మంటపం ఉన్నాయి. పాతకడప చెరువు నుంచి నీరొచ్చే మార్గం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

ఉత్సవాలు

దేవుని కడప ఉత్సవాలు

ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ పాడ్యమి నుంచి ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఏడో రోజు మాఘ శుద్ధ సప్తమి (రథసప్తమి) నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. రథోత్సవంలో భాగంగా స్వామి గ్రామంలో ఊరేగుతాడు.

ఎపిటిడిసి టూర్ ప్యాకేజ్

ఎపిటిడిసి ఒక రోజు, రెండు రోజుల ప్యాకేజీని పర్యాటకులకు అందిస్తోంది. ప్యాకేజీలో భాగంగా కడపలోని గుడులు, అమీన్ పీర్ దర్గా, దేవుని కడప, పుష్పగిరి, బ్రహ్మంగారి మఠం, సిద్దవటం కోట, ఒంటిమిట్ట, శిల్పారామం సందర్శించవచ్చు.

పుష్పగిరి ఆలయం

పుష్పగిరి ఆలయం

చిత్రకృప : Rpratesh

ఖర్చు : రూ. 500 వరకు (భోజనాలతో కలిపి)

ప్రారంభం : ఉదయం 8 గంటల 30 నిమిషాలకు.

అడ్రెస్స్ : హరితా హోటల్, ఎస్పీ బంగ్లా ఎదురూగా, కడప.

ఎలా చేరుకోవాలి ?

హైదరాబాద్ నుండి కడప 450 కి. మీ ల దూరంలో ఉంది. రేణిగుంట, కడప విమానాశ్రయాలు సమీపాన ఉన్నాయి. ఆలయానికి కడప రైల్వే స్టేషన్ 7 కి. మీ ల దూరంలో, కడప బస్ స్టాండ్ 4. 5 కిలోమీటర్ల దూరంలో కలదు. తిరుపతి, బెంగళూరు, చెన్నై, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కడప కు నిత్యం ప్రభుత్వ/ ప్రవేట్ బస్సు సదుపాయాలూ కలవు. కడప లో దిగి ఆటోరిక్షా ఎక్కి దేవుని కడప ఆలయానికి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X