Search
  • Follow NativePlanet
Share
» »మహా శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో సందర్శించు పర్యాటక స్థలాలు !

మహా శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో సందర్శించు పర్యాటక స్థలాలు !

By Mohammad

ముందుగా పాఠకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అంటే సాక్షాత్తూ మహాశివునికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజునే ఈశ్వరుడు మహా లింగ రూపంలో ఆవిర్భవించాడని చెబుతారు. మహా శివరాత్రి మాఘమాసంలో బహుళ చతుర్ధశి నాడు వస్తుంది. శైవ క్షేత్రలలో శివరాత్రి రోజున పార్వతిపరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని గొప్పగా జరుపుకుంటారు.

మన రాష్ట్రంలో కూడా శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయం కాకమునుపే స్నానాలు ఆచరించి ఇష్టదేవతలని పూజిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి, వివిధ రకాల ద్రవ్యములతో అభిషేకం, బిల్వ దళాలతో అర్చన చేస్తారు. అభిషేకాలలో చెప్పుకోదగ్గది విభూది అభిషేకం.

ఇది కూడా చదవండి : పరమశివుని పన్నెండు పవిత్ర లింగాలు !

శ్రీశైలం క్షేత్రానికి మహాశివరాత్రి పర్వదినాన దేశంలోని ఎక్కడెక్కడి నుంచో శివ భక్తులు వస్తుంటారు. శివ దీక్ష చేపట్టిన భక్తులు సైతం పాదయాత్రగా వచ్చి నల్లమల కొండల్లో వెలసిన ఆ మల్లికార్జున్ని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తున్నది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి వచ్చే భక్తులు చుట్టూ ఏ ఏ ప్రదేశాలను చూడవచ్చు, ఎక్కడ ఉండాలి ? అనే అంశాలకు సంబంధించి మీ నేటివ్ ప్లానెట్ ప్రత్యేక కథనం .. మహా శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో సందర్శించు పర్యాటక స్థలాలు

శ్రీశైలం

శ్రీశైలం

శ్రీశైలం ఒక ప్రాచీన పుణ్య క్షేత్రం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో గల కర్నూలు జిల్లాలో కలదు. జిల్లా ముఖ్య పట్టణమైన కర్నూలు నగరానికి 180 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉన్నది ఈ క్షేత్రం.

చిత్ర కృప : Santhosh Kumar

శ్రీశైలం

శ్రీశైలం

ఏటా లక్షల మంది భక్తులు దర్శించుకొనే శ్రీశైలం క్షేత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి ప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివుడిని మల్లికార్జున స్వామిగా, మాతా పార్వతీ దేవి ని భ్రమరాంబ గా పూజిస్తారు.

చిత్ర కృప : Jedi & Ananya

ఆలయాలు

ఆలయాలు

శ్రీశైలం లో ప్రధానంగా చెప్పుకోవలసిన ఆలయాలు రెండు ఉన్నాయి. వాటిలో మొదటిది శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం మరియు రెండవది భ్రమరాంబ ఆలయం. దేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రలలో శ్రీశైలం క్షేత్రం కూడా ఒకటి.

చిత్ర కృప : Pranayraj1985

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం

అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అబ్బురాపరిచే శిల్ప సంపద తో అలరారే అందమైన దేవాలయం శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం. ప్రధాన గర్భాలయం మాత్రం ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణంగా నిర్మించారు. శివరాత్రి రోజున దేశం నలుమూలల నుండి వచ్చే అశేష భక్త జనులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది.

చిత్ర కృప : NR Photography.

శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయం

శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయం

భ్రమరాంబ ఆలయం అద్భుతమైన శిల్పకళ లతో మరియు అందమైన శిల్పతోరణాలతో కూడిన స్తంభాలతో అత్యద్భుతంగా ఉంటుంది. బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయం ఇదేనేమో ..! ఆలయం నందు గర్భగుడి వెనక భాగాన గోడకు చెవి ఆనిచ్చి వింటే ఝుమ్మనే బ్రామరాంబనాదం వినిపిస్తుంది.

చిత్ర కృప : Padmini

మనోహర గుండం

మనోహర గుండం

మనోహర గుండం శ్రీశైలం లో చూడవలసిన వాటిలో ఒకటి. ఈ గుండం లోని నీరు చాలా స్వచ్ఛమైనది. ఎంత స్వచ్ఛమైనదంటే రూపాయి బిళ్ళ వేస్తే కూడా కంటికి కనిపిస్తుంది. ఈ గుండం చాలా ఎత్తైన ప్రాంతంలో కలదు. అంత ఎత్తులో ఉన్న కూడా ఈ రాళ్ళల్లో అంత స్వచ్ఛమైన నీరు ఉండటం నిజంగా చూడాల్సినదే ..!

చిత్ర కృప : Dhiraj Kumar Dwarapudi

పంచపాండవుల దేవాలయాలు

పంచపాండవుల దేవాలయాలు

పాండవులు మల్లికార్జున స్వామిని దర్శించుకొని వారి పేరు మీద ప్రధాన ఆలయం వెనుక భాగాన 5 ఆలయాలను నిర్మించినారు. ఈ పంచ ఆలయాలలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చొప్పున 5 శివలింగాలను ప్రతిష్టించినారు.

చిత్ర కృప : jony dev

వృద్ధ మల్లికార్జున లింగం

వృద్ధ మల్లికార్జున లింగం

వృద్ధ మల్లికార్జున లింగం ముడుతలు పడిన ముఖంలా ఉండే శివలింగం. ఇది చూస్తే అంత అందంగా కనిపించదు బహుశా ..! ముసలితనాన్ని గుర్తుచేస్తుంది !

చిత్ర కృప : Madan

మఠాలు

మఠాలు

శ్రీశైలం ఆలయ పరిసరాల్లో మఠాలు, మండపములు కలవు. ఘంటా మఠం, భీమ శంకర మఠం, విభూతి మఠం, సారంగధర మఠం, రుద్రాక్ష మఠం, విశ్వామిత్ర మఠం, నంది మఠం మొదలగునవి చూడవచ్చు.

చిత్ర కృప : Katta Srinivasa Rao

పాతాల గంగ

పాతాల గంగ

శ్రీశైలం కృష్ణా నది ఒడ్డున ఉన్నది. కాకపోతే ఇదివరకే చెప్పుకున్నట్లు శ్రీశైలం ఎత్తులో ఉంటుంది, కృష్ణా నది లోయలో ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడి కృష్ణా నదినే పాతాల గంగ గా భక్తులు వ్యవహరిస్తుంటారు. వందల మెట్లు క్రిందకు దిగి నదిలో స్నానాలు చేసి భక్తులు స్వామిని దర్శించుకుంటారు.

చిత్ర కృప : itsmaheshdesu

రోప్ వే

రోప్ వే

పాతాల గంగ వద్దకు చేరుకోవటానికి అన్ని మెట్లు ఎక్కిదిగవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం వారు రోప్ వే ను ప్రవేశపెట్టారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రోప్ వే అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయస్వామి గుడి ఇక్కడ చూడవలసిన వాటిలో ఒకటి.

చిత్ర కృప : Jedi & Ananya

సాక్షి గణపతి దేవాలయం

సాక్షి గణపతి దేవాలయం

సాక్షి గణపతి దేవాలయం ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలోనే ఉన్నది. సాక్షి గణపతి చేతిలో ఘంటం (కలం) మరియు పుస్తకం తో దర్శనమిస్తాడు. ఈయన శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించిన భక్తుల వివరాలను నమోదు చేసుకుంటాడని ప్రతీతి.

చిత్ర కృప : krishnannavam

శ్రీశైల శిఖరం

శ్రీశైల శిఖరం

శ్రీశైలం లో శిఖర దర్శనం చేసుకోకపోతే మరోజన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనం అంటే ఏదో పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు ; దూరంగా ఉన్న ఈ ఎత్తైన కొండ శిఖరం మీద నుంచి దూరం గా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి.

చిత్ర కృప : krishnannavam

హటకేశ్వరం

హటకేశ్వరం

శ్రీశైలం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరములో హటకేశ్వరం గ్రామంలో హటకేశ్వరాలయము ఉన్నది. పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని శివుణ్ని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదికాస్త హటికేశ్వరస్వామిగా మారిపోయింది. ఇక్కడికి శ్రీశైలం దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు కలవు.

చిత్ర కృప : Lotus Cuts

పాలధార, పంచధార

పాలధార, పంచధార

శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉన్నది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండ పగుల నుండి పంచధార లతో వెల్లువలావచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కథార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత.

చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.

ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్రదేశం

ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్రదేశం

ఆదిశంకరాచార్యులు దేశం అంతా తిరుగుతూ ఒకనాడు శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఇక్కడ ఆయన తపస్సు చేసిన ప్రదేశం కలదు. అధిక కాలం ఈ ప్రాంతంలో తపస్సు చేసినందుకు గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాద ముద్రికలు కలవు.

చిత్ర కృప : Vjvikram

అక్కమహాదేవి గుహలు

అక్కమహాదేవి గుహలు

అక్క మహాదేవి గుహలు నల్లమలై శ్రేణులలోని కొండలపై శ్రీశైలం కు సుమారు 10 కి. మీ. ల దూరం లో సహజంగా ఏర్పడిన గుహలు. ఈ గుహలకు 12 వ శతాబ్దపు వేదాంతి మరియు కర్ణాటక గాయని అయిన అక్కమహాదేవి అక్కడ గుహల లోపలి భాగాలలో కల సహజ శివలింగం కు తపము, పూజలు చేయుట వలన ఆమె పేరు పెట్టారు. సుమారు 150 అడుగుల పొడవు వుండే ఈ గుహల సందర్శన మంచి అనుభవం గా కూడా వుంటుంది.

చిత్ర కృప : Rajib Ghosh

మల్లెల తీర్థం

మల్లెల తీర్థం

మల్లెల తీర్థం అనేది ఒక జలపాతం. ఈ నీరు ఎంతో పవిత్రమైనది అందుకే భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వచ్చి ఈ జలపాతం వద్ద స్నానాలు చేసి మోక్షం పొందుతారు. ఈ నీటిలోకి వెళ్ళాలంటే సుమారుగా 250 మెట్లు దిగి వెళ్ళాలి కనుక చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లేకుంటే జారి పడతారు. ఈ జలపాతాలు దట్టమైన అడవుల మధ్యన ఉన్నప్పటికీ రోడ్ మార్గం లో తేలికగా ప్రయాణించవచ్చు.

చిత్ర కృప : Vivek Sheel Singh

ట్రైబల్ మ్యూజియం

ట్రైబల్ మ్యూజియం

ట్రైబల్ మ్యూజియంలో కి వెళ్ళగానే శ్రీశైల పుణ్యక్షేత్ర విశిష్టతకు కారణమైన అనేక నిజాలు ఇక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయనిపిస్తాయి. ట్రైబల్ మ్యూజియంలో నల్లమల్ల అడవుల్లో స్వామిని నెలకొల్పి నిత్యం పూజలు చేసిన మొదటి శ్రీశైల పూజారి అయిన మల్లన ప్రతిమ, అడవి జాతి అనవాళ్లను కాపాడే గిరిజనుల ప్రతిమలు సహజత్వానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటాయి.

చిత్ర కృప : krishnannavam

శివాజీ స్పూర్తి కేంద్ర

శివాజీ స్పూర్తి కేంద్ర

శివాజీ స్ఫూర్తి కేంద్ర శివాజీ స్ఫూర్తి కేంద్ర శ్రీశైలం లో ఒక క్రీడల కేంద్రం గా వుంది. ఈ సెంటర్ చేరాలంటే, సుమారు 30 మెట్లు ఎక్కవలసి వుంటుంది. క్రికెట్, ఫుట్ బాల్ , టెన్నిస్ , బాడ్మింటన్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. సెంటర్ యొక్క భవనం ఆకర్షణీయంగా వుండి దానిలో శివాజీ విగ్రహం ఒక సింహాసనం పై కూర్చుని వుంటుంది.

చిత్ర కృప : shivajikendra

టైగర్ వ్యాలి

టైగర్ వ్యాలి

శ్రీశైలం లో చూడదగిన ప్రదేశాలలో ఫరహబాద్ అటవీ ప్రాంతం ఒకటి. ఈ అటవీ ప్రాంతంలో టైగర్ వ్యాలి ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ అడవిలో పులులతో పాటు మరెన్నో వన్య ప్రాణులు ఉంటాయి. పక్షుల కిలకిలారావాలతో పాటు, అడవితల్లి అందాలను దగ్గరగా చూడొచ్చు. ఇక్కడకి వచ్చిన పర్యాటకులు జంగల్ సఫారీ చేస్తుంటారు. ఇక దీనికి తోడు అటవీ అందాలు, పచ్చని ప్రకృతి సోయగాలు ఆహ్లాదకర వాతావరణంలోకి తీసుకెళ్తుంది.

చిత్ర కృప : Nori Syamsunder Rao

శ్రీశైలం డ్యాం

శ్రీశైలం డ్యాం

శ్రీశైలం డ్యాం నల్లమల కొండలలో ఒక లోతైన మలుపు లో నిర్మించారు. ఈ డ్యాం రాత్రి పూట విద్యుత్ కాంతులతో ధగధగ మెరుస్తూ చూడటానికి వీనులవిందుగా ఉంటుంది. ఈ డ్యాం మీద సాయంత్రం 5 - 6 గంటలైతే నడవనివ్వరు. ఇది రాష్ట్రంలో కెల్లా లోతైన డ్యామ్.

చిత్ర కృప : saai kirren

వసతి

వసతి

శ్రీశైలం లో వసతి సౌకర్యాల విషయానికి వస్తే దేవస్థానం వారి సత్రాలు, కాటేజీలు, హోటళ్లు కలవు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కులాల ప్రాతిపాదికన ఏ కులం వారికి ఆ కులం సత్రాలు ఉన్నాయి. కొన్ని సత్రాల నిర్వాహకులు ఉచిత భోజన సదుపాయం కూడా కలిపిస్తారు. దేవస్థానం వారు ఉదయం 10 గంటలకు ఉచిత అన్నదాన ప్రసాద కూపన్లు ఇస్తారు.

చిత్ర కృప : విశ్వనాధ్.బి.కె.

శ్రీశైలానికి ఎలా చేరుకోవాలి ?

శ్రీశైలానికి ఎలా చేరుకోవాలి ?

శ్రీశైలం చేరుకోవటానికి రోడ్డు మార్గం సులువైనది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్నాటక ప్రభుత్వాలు శివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బస్సులను సైతం నడిపిస్తున్నాయి.

వాయు మార్గం

శ్రీశైలానికి సమీపాన ఉన్న విమానాశ్రయం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 200 కిలోమీటర్ల దూరంలో కలదు. క్యాబ్ లేదా ప్రవేట్ వాహనాలను అద్దెకు తీసుకొని శ్రీశైలం చేరుకోవచ్చు.

రైలు మార్గం

శ్రీశైలానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురం రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటుగా దేశంలోని కొన్ని ప్రధాన పట్టణాలతో కలుపబడినది. మార్కాపురం నుండి ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి శ్రీశైలానికి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

కర్నూలు, ఒంగోలు, కడప, నంద్యాల, హైదరాబాద్, నల్గొండ, గుంటూరు, విజయవాడ తదితర పట్టణాల నుండి శ్రీశైలం రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడింది.

చిత్ర కృప : Siddhartha Shukla

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X