Search
  • Follow NativePlanet
Share
» »భక్తుల కోర్కెలను తీర్చే పెన్న అహోబిలం స్వామి !!

భక్తుల కోర్కెలను తీర్చే పెన్న అహోబిలం స్వామి !!

స్వామివారికి ఆకుపూజలంటే బహుప్రీతి. స్వామివారికి ఆకుపూజలు కట్టించి మొక్కులు నివేదిస్తే 41రోజుల్లో కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

By Mohammad

పెన్న అహోబిలం, అనంతపురం జిల్లా, ఉరవకొండ కు 12 కి.మీ. ల దూరంలో, అనంతపురానికి 40 కి.మీ.దూరంలోనూ ఉన్నది. శ్రీ నరసింహస్వామి కొలువుదీరిన ప్రాచీన పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్నది. ఇక్కడ స్వామివారి పాదంక్రింద ఒక బిలం ఉన్నది. స్వామివారికి అభిషేకం చేసిన నీరు, ఈ బిలం గుండా వెళ్ళి పెన్నా నదిలో కలుస్తుంది. అందువలన ఈ క్షేత్రానికి "పెన్న అహోబిలం" అను పేరు వచ్చిందని స్థలపురాణ కథనం. క్రీ.శ. 14,15 శతాబ్దాలలో విజయనగర చక్రవర్తుల పరిపాలనా కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

ఎక్కడ ఉంది ?

శ్రీలక్ష్మినరసింహస్వామి పుణ్యక్షేత్రం అనంతపురం జిల్లాలో బళ్లారి-అనంతపురం ప్రధాన రహదారిలో ఉరవకొండకు 10 కి.మీ దూరంలోఉంది. అనంతపురం నుండి 30 కి.మీ దూరంలో రహదారికి పడమటిదిశలో ఒక కి.మీ దూరం గల ఒక గిరిపై ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. సముద్ర మట్టానికి 13 వందల అడుగుల ఎత్త్తెన ఒక కొండపై ఉంది.

పెన్న అహోబిలం దేవాలయం

పెన్న అహోబిలం దేవాలయం

చిత్రకృప : Jayachandra.Oleti

ఆలయవిశిష్టత

స్వామివారి కుడి పాద ముద్రికకు నిత్యపూజలు: ద్వాపర యుగంలో ఉద్ధాలక మహర్షి క్షేత్రగిరిపై ఘోర తపస్సు చేయగా స్వామి ప్రసన్నుడై తన కుడిపాద ముద్రికను గిరిపై అలాగే కర్నూలుజిల్లా అహోబిల క్షేత్రంలో ఎడమ పాదాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి శాసనాలు, స్థల, పద్మపురాణాలను బట్టి తెలుస్తోంది.

చారిత్రక ప్రస్థానం

పెన్నానదీ తీరంలో ఈ క్షేత్రం ఉన్నందున అలాగే స్వామివారి పాదముద్రికకు దిగువ బిలం ఉన్నందున పెన్నహోబిలంగా ప్రసిద్ధి చెందింది. విజయనగర పాలకుడు సదాశివరాయలు దిగ్విజయ యాత్రముగించుకొని పెనుగొండ నుంచి రాజధాని నగరానికి పోతూ స్వామి వారిని దర్శించుకొన్నాడు. ఆలయాన్ని పునరుద్ధరించమని ఆదేశించి రెండు వేల ఎకరాల భూమిని దానం చేసాడు. 1979 లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదముద్రికకు కొంత పైభాగంలో స్వామివారి మూలవిరాట్‌ను ప్రతిష్టించారు. అప్పటినుంచి స్వామివారి మహిమలు ద్విగుణీకృతమైనట్లు భక్తజనకోటి ప్రతీతి.

గర్భగుడిలో నరసింహస్వామి

గర్భగుడిలో నరసింహస్వామి

దేవస్థానానికి దిగువభాగంలో శ్రీఉద్భవలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని 1987లోనిర్మించారు. స్వయంభువుగా వెలసిన పుట్టుశిల ముందుభాగంలో ప్రతిష్టించారు. ఆగమశాస్త్రం ప్రకారం నిత్యం అలంకరణ, పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ఆకుపూజలంటే బహుప్రీతి. స్వామివారికి ఆకుపూజలు కట్టించి మొక్కులు నివేదిస్తే 41 రోజుల్లో కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

అమ్మవారిని ప్రసన్నం చేసుకొనే విధంగా అవివాహితులు, సంతానహీనులు పట్టువస్త్రాలను సమర్పించి కుంకుమార్చనలు చేస్తే తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమ మొక్కు నెరవేరినందుకు ఓ గొల్లభామ పాలమ్మిన సొమ్ముతో గోపురాన్ని నిర్మించారు. దాన్ని పాలగోపురంగా నేటికి పిలువబడుతోంది. భక్తులను విశేషంగా ఆకట్టుకొంటుతోంది. భక్తులు ప్రతినిత్యం వేలాది మంది వస్తుంటారు. పుణ్యక్షేత్రంగా, అటుపర్యాటక క్షేత్రంగా భక్తులను ప్రజలను విశేషంగా ఆకట్టుకొంటోంది.

ఏటిగంగమ్మ జాతర

ప్రతిఏటా మాఘమాసంలో స్థానిక వంతెన సమీపంలో వైభవంగా ఏటి గంగమ్మ జాతర నిర్వహిస్తారు. నిత్యంస్వామివారి పాదాబి షేకం చేసిన జలంకలిస్తుంది. దీంతో గంగస్నానాలు చేస్తే సర్వపాపాలు హరించి సకలశుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

ఆలయ సందర్శన వేళలు : 8.00 am to 11.00 p m & 5.30 pm to 8.30 pm.

నరసింహస్వామి ఉగ్ర అవతారం దృశ్యం

నరసింహస్వామి ఉగ్ర అవతారం దృశ్యం

చిత్రకృప : Jayachandra Oleti

బసవన్నకోనేరు

ఆలయ దిగువభాగంలోఉన్న లక్ష్మమ్మ మంటప సమీపంలో బుగ్గబసవన్న కోనేరులో ఏడాది పొడుగునా నీరు ప్రవహిస్తోంది. చెట్లతొర్రలనుంచి బసవన్న నోటిగుండా నీరు కోనేరులో చేరుతుంది. ఈ కోనేటిలో స్నానాలు చేస్తేమానసిక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారనేది భక్తులు భావన.

భగిరి గుండ్ల ప్రాముఖ్యత

స్థానిక దేవస్థానం నుంచి రెండు కి.మీ దూరంలోఉన్న భగిరిగుండ్ల అటవీప్రాంతంలో ఉగ్రనరసింహస్వామి వెలసి ఉన్నారు. ఉగ్రనరసింహస్వామి పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదునిప్రార్థనలకు శాంతించి చెంచులక్ష్మిని తనవెంటబెట్టుకొని వనవిహారంగా వ్యాహాళికి ఈ అరణ్య ప్రాంతానికి వచ్చి వరాహ రూపంలో ఉన్న ఒక రాక్షసున్ని తరిమితరిమి భగిరిగుండ్లపై సంహరించినట్టు తెలుస్తోంది. స్వామివారికి బ్రహ్మ రథోత్సవం తర్వాత రెండవ రోజున భక్తులు వచ్చి పూజలు చేస్తారు.

క్షేత్రంలో చూడదగిన ప్రదేశాలు

లక్ష్మమ్మకోనేరు, అక్కడ ఉన్నరెండు జలపాతాలు, చెట్లతొర్రలనుంచి వచ్చేనీరు, అందంగా నిర్మించిన పాలగోపురం భక్తులను సందర్శకులను ఎంతో ఆకర్షిస్తోంది.

పెన్న అహోబిలం డ్యాం

పెన్న అహోబిలం డ్యాం

పెన్న అహోబిళం ఎలా చేరుకోవాలి ?

పర్యాటకులు అనంతపురం చేరుకొని, అక్కడి నుండి ఉరవకొండ వెళ్ళే బస్సులు ఎక్కాలి. ఉరవకొండ వద్ద బస్సు దిగి, ఆటోలలో, జీపులలో పెన్న అహోబిలం చేరుకోవచ్చు. హిందూపూర్ నుండి కూడా ఉరవకొండ కు బస్సులు తిరుగుతుంటాయి. బెంగళూరు నుండి వచ్చే పర్యాటకులు వన్ డే ట్రిప్ లో భాగంగా క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని పెన్న అహోబిలం చేరుకోవచ్చు.

పెన్న అహోబిలం నుండి వివిధ ప్రాంతాలకు దూరం : అనంతపురం - 40 km, లేపాక్షి -157 km, హిందూపూర్ - 148 km, బెంగళూరు - 253 km, చిత్రదుర్గ -166 km, బళ్ళారి -59 km.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X