అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

సుందరమైన ప్రకృతి మధ్యలో దోడ !!

Posted by:
Updated: Wednesday, December 30, 2015, 9:48 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

దోడ అనే పట్టణం జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి 1107 మీటర్ల దూరంలో ఉన్నది. ఈ పట్టణంలో ఎన్నో అందమైన లోయాలు, దేవాలయాలు ఉన్నాయి కనుకనే ఇది పర్యాటకులకు, భక్తులకు చక్కటి సందర్శనీయ ప్రదేశంగా చెప్పుకోవచ్చు.

మీకు చూడటానికి ఈ ప్రదేశం కొత్త అనిపించవచ్చు కానీ పురాతనమైనది. ఇక్కడ అమర్‌నాథ్ యాత్రలు లాగా కైలాష్ యాత్రలు చేస్తారు. ఈ యాత్రలు ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ప్రారంభమవుతాయి. అందమైన లోయలతో, ఆలయాలతో పచ్చని ప్రకృతి నడుమ ఏర్పడ్డ ఈ ప్రదేశంలో చెప్పుకోదగ్గ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిని చూసిన ప్రతి పర్యాటకుడికి ఆనందం కలగకమానదు. కేవలం ఇవే అనుకోవద్దండి ఇక్కడ ట్రెక్కింగ్ వంటి సాహస యాత్రలు కూడా చేయవచ్చు.

భాదేర్వా

భాదేర్వా ఒక అందమైన ప్రదేశం. దీనినే చోటా కాశ్మీర్ అంటారు. ఇక్కడ ఎన్నో ఆలయాలు మరియు ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. ఏప్రిల్ నెల నుండి ఎన్నో ఉత్సవాలు, పండుగలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రదేశాన్ని కైలాష్ యాత్ర అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో సుందరమైన ప్రకృతి దృశ్యాలను చూసి ఆనందించవచ్చు.

Photo Courtesy: Atif Malik

భాల్ పదిరి

భాల్ పదిరి, పదిరి కి ఈశాన్యాన 4 కి. మీ. దూరంలో ఉన్నది. అనేక లోయలతో, నీటి వాగులతో ఉన్న ఈ ప్రదేశం చూడటానికి అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

Photo Courtesy: Atif Malik

చప్రా పీక్

చప్రా పీక్ ని చప్రా శిఖరం అని పిలుస్తారు. ఈ శిఖరం దోడ జిల్లాలో ప్రసిద్ధి చెందినది. ఇది సముద్ర మట్టానికి 5600 మీటర్ల ఎత్తున ఉంది. దీనిని భాజం నాల అని కూడా అంటుంటారు స్థానికులు. దీనికి చుట్టుప్రక్కల ప్రాంతాలైన గలాహార్ చిశోట్, కిష్త్వార్ అతోలీ ల నుండి ట్రెక్కింగ్ మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

Photo Courtesy: Atif Malik

 

చింతా వ్యాలీ

చింతా లోయ భాదేర్వా లోని దట్టమైన అడవులలో ఉన్నది. దీని చుట్టూ ఉన్న పర్యాటక ఆకర్షణలలో తుబా బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పురాతన శివాలయం ఉన్నది. ఇక్కడ పర్యాటకులు హార్స్ రైడింగ్ చేయవచ్చు.

Photo Courtesy: Atif Malik

హంగా

హంగా ప్రదేశం భాదేర్వా నుండి 10 కి. మీ. దూరంలో దట్టమైన అడవి ప్రాంతం మధ్యలో ప్రవహించే హంగా నల్లా కు సమీపంలో కలదు. ఈ ప్రదేశంలో ప్రముఖ బాలీవూడ్ సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. 1980 వ సంవత్సరంలో వచ్చిన బాలీవూడ్ ఫిల్మ్ "నూరి" చిక్రీకరణ ఇక్కడ జరిగినదే. నూరి నుండి దేవ్ చాటర్ గ్రామం వరకు ట్రెక్కింగ్ చేయాలనుకునే పర్యాటకులు ఇక్కడ బస చేస్తారు.

Photo Courtesy: Atif Malik

కహాని టాప్

భాదేర్వాకు 25 కి. మీ. దూరంలో ఉన్న ఒక రొమాంటిక్ పిక్నిక్ స్పాట్ కహాని టాప్. ప్రకృతి ఒడిలో కల ఈ ప్రాంతంలో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ఎన్నో అంశాలు దాగి ఉన్నాయి. ఉదాహరణకి, ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమం చూడటానికి, చూసి ఆనందించడానికి చాలా బాగుంటాయి.

Photo Courtesy: Atif Malik

జై వాలీ

దోడ జిల్లాలో ఉన్న జై వాలీ ప్రదేశం చాలా అందమైనది. ఇది భాదేర్వా నుండి 35 కి. మీ. ల దూరంలో కలదు. 6 కి. మీ. ల పొడవు కల ఈ వాలీ గొప్ప టూరిస్ట్ ఆకర్షణగా నిలిచింది. ఇక్కడి మైదానాలు ఈ ప్రదేశానికి మరింత అందాన్ని చేకూర్చాయి.

Photo Courtesy: Atif Malik

కిస్ట్ వార్

అనేక ట్రెక్కింగ్ మార్గాల ద్వారా చేరే కిస్ట్ వార్ ఒక పర్యాటక ప్రదేశం మరియు పట్టణం. ఈ పట్టణానికి సమీపంలో నమత్సే , కేథడ్రాల్, చర్చా , లాలుంగ్ మరియు సికాల్ పర్వతాలు ఉన్నాయి. ఈ ప్రదేశం లో సుందరమైన పద్దార్, మార్వా, దచ్చాన్ లోయలు కూడా కలవు. ఇక్కడ కల భండార్కోతే గుహ పర్యాటకులలో ప్రసిద్ధి చెందినది.

Photo Courtesy: Atif Malik

కలార్

ప్రకృతి ఒడిలో గల కలార్ ప్రదేశం ఇక్కడ గల కలార్ టెంపుల్ తో ప్రసిద్ధి గాంచినది. ఈ ప్రదేశంలో ఆపిల్ మరియు పియర్ తోటలు ఉన్నాయి. ఇంకా కొన్ని రకాల పూల తోటలు కూడా కలవు.

Photo Courtesy: Atif Malik

స్వరణ్ బావ్లి

స్వరణ్ బావ్లిని గోల్డెన్ స్ప్రింగ్ అని కూడా అంటారు. ఈ స్ప్రింగ్ నీటిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని హిందువుల నమ్మకం. నవరాత్రులలో చెడుపై మంచికి విజయంగా ప్రతి ఏటా అక్టోబర్ నవంబర్ నెలలలో ఉత్సవాలు జరుగుతాయి. అపుడు, అక్కడ మంచు గడ్డలు ఉన్నప్పటికీ చాలా మంది దీనిలో స్నానాలు చేస్తారు.

Photo Courtesy: hamon jp

సేఒజ్ పచ్చిక మైదానం

సేఒజ్ పచ్చిక మైదానాన్ని భాదేర్వా కిరీటపు వజ్రం అంటారు. ఇది కైలాష్ కుండ్ కు దక్షిణంగా కలదు. చుట్టూ మంచుచే కప్పబడిన పర్వతాలుకల ఈ మైదానాన్ని సేఒజ్ దార్ అని స్థానికులు పిలుస్తారు. కైలాష్ యాత్రకు వెళ్ళే హిందువులు ఈ మైదానం లో బస చేస్తారు.

Photo Courtesy: Atif Malik

 

సర్తిగాల్

సర్తిగాల్ ఒక అందమైన ప్రదేశం. ఇక్కడ మైదానాలు, వాగులు మరియు వంకలు ఉన్నాయి. దీనికి సమీపంలో ఉన్న కైలాష్ పర్వతం మరియు ఆశాపతి పర్వతం దీనికి మరింత అందాన్ని చేకూర్చాయి.

Photo Courtesy: Atif Malik

రేయుశ్రా

రేయుశ్రా శిఖరం జై వాలీ మరియు చింత వాలీ మధ్యన ఉన్నది. సముద్రమట్టానికి సుమారు 11000 అడుగుల ఎత్తున ఈ శిఖరం కలదు. ఇక్కడ పురాతన దుర్గా దేవి ఆలయం ఉన్నది. నవరాత్రి పర్వదినాలలో మరియు ఇతర పండుగల సమయాలలో భక్తులు అధిక సంఖ్య లో వచ్చి ఈ మాతను దర్శించి పూజలు జరుపుతారు.

Photo Courtesy: Atif Malik

పదరి

పదరి గాలి ప్రదేశం భాదేర్వా కు 40 కి. మీ. ల దూరం లో సముద్ర మట్టానికి సుమారు 10500 అడుగుల ఎత్తున కలదు. ఎప్పుడూ మంచు పడుతూ చక్కని పిక్నిక్ స్పాట్ గా వుంటుంది. మని మహేష్ యాత్రకు వెళ్ళే యాత్రికులు పదరి గాలి గుండా విశ్రాంతి తీసుకొని వెళతారు. హార్స్ రైడింగ్ కూడా అనువైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు.

Photo Courtesy: JPS Kohli

నల్తి బస్తి

నల్తి బస్తి భాదేర్వా నుండి 10 కి. మీ.ల దూరంలో ఉన్నది. వేలాది ట్రెక్కర్ల కు ఇది ఒక బేస్ క్యాంపుగా ఉంది. ప్రకృతి ఒడిలోని ఈ ట్రెక్కర్ల క్యాంపు సర్తాల్ లేదా భాదేర్వా వెళ్లేందుకు విశ్రాంతి కి వినియోగిస్తారు. చుట్టూ మంచు కొండలు, దేవదారు వృక్షాలు, పచ్చిక మైదానాలు, వివిధ రకాల పూవులు చెట్లు వుంటాయి.

Photo Courtesy: JPS Kohli

మేలా పాట్

మేలా పాట్ అనేది భాదేర్వా లో ప్రసిద్ధి చెందిన జాతర. ఈ జాతరను మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నుండి చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతర లో వేడుకలు సంప్రదాయ దుస్తులతో, నృత్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతాయి.

Photo Courtesy: shoesonloose

మని మహేష్ యాత్ర

మని మహేష్ యాత్ర అనేది హిందువుల పవిత్ర యాత్ర . ఇది భాదేర్వా నుండి ప్రతి సంవత్సరం ఆగష్టులో మొదలవుతుంది. 7 రోజుల పాటు సాగే ఈ ట్రెక్కింగ్ యాత్రలో సుమారు 10000 కు పైగా యాత్రికులు పాల్గొంటారు.

Photo Courtesy: P Chander

అలలబాణీ ఆలయం

అలలబాణీ టెంపుల్ భాదేర్వా లోని ఒక కొండపై ఉన్న పురాతన దేవాలయం. ఈ టెంపుల్ లో రాగితో చేయబడిన సంగీత పరికరాలు వుంటాయి. ఈ టెంపుల్ లో కృష్ణాష్టమి పండుగ బాగా చేస్తారు.ఈ ఆలయంలో గల దేవుడు ఎంతో మహిమ కలవాడని చెపుతారు.

Photo Courtesy: bhaderwah temples

గుప్త గంగా ఆలయం

గుప్త గంగా ఆలయం భాదేర్వా లో ప్రసిద్ధి చెందిన ఆలయం. హిందూ పురాణాల మేరకు, మహాభారతంలోని పాండవులు, ఇక్కడ వారి వనవాసంలో కొంత కాలం గడిపారు. స్థానికులు ఇప్పటికి, ఇక్కడ కల భీముడి పాదాల గుర్తులు కొన్ని రాళ్ళ పై చూపుతారు.

Photo Courtesy: bhaderwah temples

కైలాష్ యాత్ర

హిందువులకు కైలాష్ యాత్ర చాలా ప్రధానమైనది. ఈ యాత్రను ప్రతి సంవత్సరం ఆగష్టు నెలలో ఘత నుండి మొదలు పెడతారు. ఈ కైలాష్ కుండ్ లోని నీరు మానస సరోవరం లోని నీటి అంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది హిందువులకు, బౌద్ధులకు పవిత్రమైనది. మంచుతో గడ్డ కట్టిన ఈ నీటిలో వీరు స్నానాలు చేస్తారు. పాపాలు పోతాయని, కోరికలు ఫలిస్తాయని భావిస్తారు.

Photo Courtesy: jaipal singh bandral

నాగ్ని మాతా ఆలయం

నాగ్ని మాత ఆలయం ఒక నాగ దేవత టెంపుల్. ఏప్రిల్ నెలలో భక్తులు అధిక సంఖ్యలో ఈ టెంపుల్ కు ఊరేగింపులో వస్తారు. ఈ దేవతకు గొర్రెలను బలులు ఇచ్చి, దానిని ప్రసాదంగా తింటారు.

Photo Courtesy: Atif Malik

శాంతన్ డేహ్ర

శాంతాన్ డేహ్ర టెంపుల్, నాగ భక్తులకు ఎంతో పవిత్రమైన ఆలయం. దీని చుట్టూ దేవదారు వృక్షాలు వుండి ఒక చిన్న కొండపై వుంటుంది. ఈ టెంపుల్ లో పురాతన శివలింగంలు కూడా కలవు. ఇటీవలే ఒక సూర్యుడి విగ్రహం కూడా కనుగొన్నారు. ప్రతియేటా జాతరలో జూలై, ఆగష్టు నెలలలో ఒక ఉత్సవం నిర్వహిస్తారు. పూజారులు చెప్పే భవిష్యత్ తప్పక జరుగుతుందని నమ్ముతారు.

Photo Courtesy: Atif Malik

శీతల్ మాతా ఆలయం

శీతల్ మాతా ఆలయం అంటు వ్యాధులకు సంభంధించిన మాతా ఆలయం. ఈ దేవాలయం రేహోశ్రా అనే చిన్న కొండపై కలదు. భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. నవరాత్రి వేడుకలలో మాత కు గొర్రెలు బలి ఇచ్చి ఆ ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు.

Photo Courtesy: Atif Malik

సుబార్ నాగ ఆలయం

సుబార్ నాగ టెంపుల్ ఒక పురాతన ఆలయం. ఇది సుబార్ నాగ లేదా శేష నాగ్ కు అంకితం ఇవ్వబడినది. ఈ టెంపుల్ ద్వారాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో తెరుస్తారు. ఈ గుడిలో సుబార్ నాగ దేవత వుంటుంది. భక్తులు అధిక సంఖ్య లో వచ్చి పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం జూలై నెలలో చింత అనే జాతర చేస్తారు.

Photo Courtesy: bhaderwah temples

వాసుకి నాగ ఆలయం

వాసుకి నాగ టెంపుల్ భాదేర్వాలో చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ చరిత్ర 11 వ శతాబ్దానికి చెందినది. వాసుకి అంటే పాము. హిందూ పురాణాల మేరకు, ఈ పాము తలపై నాగమణి అనే రత్నం వుంటుంది. ఈ టెంపుల్ లో ఒకే రాతి తో చెక్కబడిన వాసుకి నాగ విగ్రహం వుంటుంది. ప్రతి సంవత్సరం, కైలాష్ యాత్ర కు ముందు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.

Photo Courtesy: bhaderwah temples

దోడ ఎలా చేరుకోవాలి ??

విమాన ప్రయాణం

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ దోడ కు 231 కి. మీ.ల దూరం లో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ ఇండియాలోని ముంబై, షిమ్లా, చండీగర్, మరియు ఢిల్లీలకు కలుపబడి వుంది. విదేశీ ప్రయాణీకులు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి శ్రీనగర్ కు(729కి.మీ.లు) చేరి అక్కడ నుండి దోడ చేరవచ్చు.

రైలు మార్గం

దోడ కు శ్రీ నగర్ రైలు స్టేషన్ సమీపం. సుమారు 220 కి. మీ.ల దూరం వుంటుంది. ఈ స్టేషన్ ఇండియాలోని ప్రధాన రైలు స్టేషన్ లకు అనుసంధానించాబడి వుంది. రైలు స్టేషన్ నుండి టాక్సీ లలో దోడ చేరవచ్చు.

రోడ్డు ప్రయాణం

దోడ నుండి జమ్మూ మరియు శ్రీనగర్ లకు రెగ్యులర్ బస్సులు కలవు. ప్రభుత్వ బస్సులు కూడా కలవు. టూరిస్టులు స్పెషల్ డీలక్స్ బస్సులు కూడా వినియోగించవచ్చు.

Photo Courtesy: Atif Malik

 

English summary

places visit in doda in jammu and kashmir

Doda is a district, situated at a height of about 1107 m above sea level, in Jammu & Kashmir. Doda is a perfect tourist destination situated amidst nature.Doda is also has religious importance as several well known temples are situated here.
Please Wait while comments are loading...