అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో గల సందర్శనీయ ప్రదేశాలు !

Written by:
Updated: Monday, January 4, 2016, 16:29 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ఎప్పుడూ హనీమూన్ ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, హిల్ స్టేషన్ లు, బీచ్ లు చూసి రొటీన్ గా ఫీలయ్యేవారికి కాస్త భిన్నంగా ఉండే చారిత్రక నేపధ్యం గల ప్రదేశం పూణే. ఇది మరాఠీయుల సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుంది.

పూణే మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక జిల్లా. ప్రస్తతం ఒక ఐటీ కేంద్రం గా భావిస్తున్న పూణే ఒకప్పుడు చరిత్ర పుటల్లో నిలిచిన ప్రదేశమే. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ఈ జిల్లాలోనే జన్మించినాడు. శివాజీ సుల్తాన్ లను, మొఘలులను ఓడించిన గొప్ప పోరాట సమయోధుడు. పూణే పశ్చిమ కనుమల్లో, సముద్రమట్టానికి 560 మీటర్ల ఎత్తున ఉన్న నగరం.

ఇది కూడా చదవండి : భారతదేశంలో చూడని 50 అద్భుత ప్రదేశ చిత్రాలు !

పూణే కు వచ్చే వారు చాలా వరకు చూడటానికి ఇష్టపడేది అగా ఖాన్ ప్యాలెస్, షిండే చాత్రి, సింహగడ్ కోట (సిన్హాగడ్ కోట). వీటితో పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ రాజభవనాలు, కోటలు మరియు అనేక చారిత్రక స్మారక కట్టడాలు ఉన్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో గల సందర్శనీయ ప్రదేశాలు విషయానికి వస్తే ....

సింహగడ్ ఫోర్ట్, పూణే

పూణే లో అతి ముఖ్యంగా చెప్పుకోవలసినది సింహగడ్ కోట. సింహగడ్ ఫోర్ట్, పూణే పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఒకప్పుడు ఈ కోటని చేజిక్కించుకోవడానికి ఛత్రపతి శివాజీ ఎన్నో సార్లు ప్రయత్నించారు కానీ వీలుకాలేదు. ఎందుకంటే, దుర్భేధ్యమయిన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తన సైనాధికారి తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చేసుకొనే బాధ్యత అప్పగించాడు.

చిత్ర కృప : Dmpendse

సింహగడ్ ఫోర్ట్, పూణే

తానాజీ తన అనుచరులతో రహస్యంగా సింహగడ్ కోటలోకి ప్రవేశించడానికి స్కెచ్ వేశాడు. చివరగా కోటకు ఒకవైపు ఉన్న కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం అని తెలుసుకున్న తానాజీ 'యశ్వంతి ' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం.

చిత్ర కృప : Kanad Sanyal

 

సింహగడ్ ఫోర్ట్, పూణే

అంతలో అటువైపు నుండి వచ్చిన తానాజీ సోదరుడైన సూర్యాజీ కోట ముఖద్వారంపైన దాడి చేసాడు. ఈ భీకర యుద్ధంలో శివాజీ సైన్యం గెలుస్తుంది కానీ, తానాజీ మరణిస్తాడు. సింహంవలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండమీదున్న ఆ కోట పేరును సింహగడ్ గా శివాజీ మారుస్తాడు. ఈ కోటకి అంతకు ముందు గల మరో పేరు కొండన కోట.

చిత్ర కృప : Akansha Mittal

అగా ఖాన్ ప్యాలెస్, పూణే

భారత స్వతంత్ర్య సంగ్రామంలో అగా ఖాన్ ప్యాలెస్ ప్రసిద్ధి చెందినది. దీన్ని సుల్తాన్ మహమ్మద్ షా అగా ఖాన్ నిర్మించారు. బ్రిటీష్ వారి హయాంలో ఈ ప్యాలెస్ లో స్వతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న పోరాటయోధుల్ని, విప్లవకారుల్ని ఖైదు చేసి బంధించేవారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న గాంధీ ని, ఆయన భార్యని బ్రిటీష్ వారు ఇక్కడే నిర్భంధించారు.

చిత్ర కృప : Hardik Boda

ఓషో ఆశ్రమం, పూణే

శరీరాన్ని, మనస్సును మానసికంగాను, ఆధ్యాత్మికంగాను పునరుద్ధరించుకోవడానికి గల చక్కటి కేంద్రం ఈ ఓషో ఆశ్రమం. 32 ఎకరాల సువిశాల స్థలంలో ఉన్న ఈ ధ్యాన కేంద్రం లో ఓషో నటరాజ్ ధ్యానం, ఓషో డైనమిక్ ధ్యానం, ఓషో కుండలినీ ధ్యానం వంటివి నేర్పిస్తారు.ఉదయం పూట తోపు రంగు దుస్తులు, రాత్రి ప్రార్ధనకి తెల్లటి దుస్తులు ఇక్కడి నియమం.

చిత్ర కృప : Priyan Nithya

పాతాలేశ్వర్ గుహాలయం, పూణే

పూణే లోని జంగ్లీ మహారాజ్ రోడ్ లో ఉన్న పాతాళేశ్వర్ ఆలయం క్రీ.శ 8 వ శతాబ్దానికి చెందినది. పాతాళ లోకపు దేవుడు కాబట్టే ఈ గుడికి పాతళేశ్వర్ దేవాలయం అనే పేరు వచ్చిందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ నిర్మాణశైలి ఎలిఫెంటా గుహలను, ఎల్లోర గుహలను తలపిస్తుంది. ఈ దేవాలయం లోని ఆశ్చర్యం గొలిపే విషయం ఏమంటే దీన్ని ఒకే ఒక పెద్ద రాయి నుంచి తొలిచారు.

చిత్ర కృప : Bharti

వీసాపూర్ కోట, పూణే

పూణే లో వున్న వీసాపూర్ కోట 1085 అడుగుల ఎత్తులో నిర్మించారు. వీసాపూర్ గ్రామానికి దగ్గరలోని ఈ కోటని పేష్వ వంశ మొదటి రాజు బాలాజీ విశ్వనాధ్ కట్టించారు. ఈ కోట నిండా చాలా వరకు గుహలు, మందిరాలు వున్నాయి. శాతవాహనుల నుంచి చాళుక్యుల దాక, మొఘలాయి రాజుల నుంచి మరాఠాల దాక, అందరూ ఈ కోటని వశపరుచుకొని పరిపాలన చేసినవారే.

చిత్ర కృప : Amar Mainkar

శనివార్ వాడ, పూణే

పూణే లోని పీష్వా వంశస్తుల రాజ్య కేంద్రం శనివార్ వాడ ఒక చారిత్రక స్థలం. సుమారు 300 ఏళ్ళ క్రితం బాజీ రావ్ దీన్ని నిర్మించారు. ఈ కోట చరిత్ర తెలుసువాలంటే రాత్రి పూట జరిగే సౌండ్ అండ్ లైట్ షో తప్పకచూడాల్సిందే. ఈ కోట అప్పటి మరాఠా నిర్మాణ శైలి, మొఘలుల నిర్మాణ శైలిని పోలి, మరాఠా సంస్కృతికి సాక్షిగా నిలుస్తుంది.

చిత్ర కృప : Prasad Dharmadhikari

కట్రాజ్ సర్ప ఉద్యానవనం, పూణే

పూణే నుండి సతారా కి వెళ్లే రహదారి లో కట్రాజ్ సర్ప ఉద్యానవనం ఉన్నది. ఇందులో సుమారు 160 రకాల పాములు మరియు అనేక సర్ప జాతులు ఉన్నాయి. దీనితో పాటుగా ఎన్నో జాతుల పక్షులు మరియు తాబేళ్ల ను ఇక్కడ చూడవచ్చు. వన్యప్రాణి ప్రేమికులు దగ్గరలోనే గల జంతు ప్రదర్శన శాల, ఉద్యానవనం ను బుధవారం తప్ప అన్ని రోజుల్లో సందర్శించవచ్చు.

చిత్ర కృప : Aashay Fotografi

భూలేశ్వర్ దేవాలయం, పూణే

పూణే లోని భూలేశ్వర్ దేవాలయాన్ని పాండవుల కాలం లో నిర్మించినారు. ఈ గుడి చుట్టూ ఉన్న పచ్చటి కారడవి వల్ల దానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడి ప్రధాన ఆలయం శివాలయం. ఇక్కడ శివుడి అయిదు లింగాలు వుంటాయి. వాటిని పగటి పూట చూడవచ్చు. విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి వంటి ఇతర దేవత విగ్రహాలు కూడా ఇక్కడ చూడవచ్చు.

చిత్ర కృప : Gururaj Kulkarni

దేహు ఆలయం, పూణే

పూణే లోని ప్రధానమైన ఆలయాల్లో ఒకటి దేహు ఆలయం. భక్త తుకారం పుట్టిన ఈ ప్రదేశంలో అతని చిన్న కొడుకు ఈ గుడిని కట్టించాడు. ఇంద్రావతి నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. క్రీ.శ. 18 వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం సుమారు 300 ఏళ్ళ నాటిదిగా భావిస్తారు. ఇదే స్థలం లో భక్త తుకారాం మోక్షం పొందాడని చెప్తారు.

చిత్ర కృప : ajay sapkale

పార్వతి దేవి కొండ ఆలయం, పూణే

పూణే లోని పార్వతి కొండ మీద క్రీ.శ. 17 వ శతాబ్దం లో కట్టిన పార్వతి దేవాలయం తప్పక చూడతగిన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ గణపతి, పార్వతి మొదలగు దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. పురాతన రాతి నిర్మాణంతో ఈ దేవాలయం కట్టబడింది. ఇక్కడ పూజలు చేసి ఆశీర్వాదం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. పర్వతారోహకులకు పార్వతి కొండ మంచి ఆటవిడుపుగా ఉంటుంది.

చిత్ర కృప : Purushottam Samarai

ముల్షి చెరువు, పూణే

ముల్షి చెరువు పూణే పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. కుటుంబం తో కలిసి విహార యాత్రకు వెళ్ళడానికి ఇది మంచి ప్రదేశం. పరిసరాల్లో వుండే పచ్చదనం మిమ్మల్ని ముగ్ధుల్ని చేస్తుంది. జల క్రీడలు, పక్షుల సందర్శన, సాహసాన్ని కోరే యాత్రికులకు ఆసక్తి గొలిపే కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. కోరాయిగడ్, ధన్ గడ్ కోటలను ఇక్కడి నుంచి వీక్షించవచ్చు.

చిత్ర కృప : Ravindra Prabhune

సరస్ బాగ్, పూణే

సరస్ బాగ్ పూణే లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ పార్క్ లో ప్రసిద్ధ చెందిన గణపతి దేవాలయం వుంది. క్రీ.శ.1774 లో 200 ఏళ్ళ క్రితం మాధవ రావ్ పీష్వా దీన్ని కట్టించాడు. మనం నిత్యం పడే ఒత్తిడి నుంచి విరామం తీసుకోవాలంటే ఇక్కడికి కుటుంబసభ్యులతో వస్తే సరిపోతుంది. స్వర్గేట్ కి కిలోమీటర్ దూరంలోని ఈ ప్రదేశంలో జాగింగ్, చల్లని సాయంత్రాన్ని హాయిగా గడపవచ్చు.

చిత్ర కృప : mayur ojha

కార్తికేయుని ఆలయం, పూణే

పూణే లో శబరిమలై మాదిరి స్త్రీలకు ప్రవేశం లేని ఆలయం ఉంది. ఈ ఆలయంలో బ్రహ్మచారిగా వెలిసిన కార్తికేయ స్వామి ప్రధాన దైవం. ఈ ఆలయం సమీపంలోని పార్వతి కనుమల్లో ఉంది. ఆరు ముఖాల్లో, నెమలి వాహనం పై కార్తికేయుడు భక్తులను అలరిస్తుంటాడు.

చిత్ర కృప : Ashwin Baindur

పూణే ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

పూణే నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహేగావ్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఇక్కడి నుండి డిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, దుబాయి, సింగపూర్ లకు కూడా నేరుగా విమానాల్లో ఎక్కి ప్రయాణించవచ్చు.

రైలు మార్గం

పూణే లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ రైల్వే జంక్షన్ నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు నిత్యం రైలు సర్వీసులు నడుస్తుంటాయి. పూణే నుంచి ముంబై 153 కిలోమీటర్ల దూరంలో వుంది. డెక్కన్ క్వీన్, శతాబ్ది ఎక్స్ ప్రెస్, ఇంద్రాయని ఎక్స్ ప్రెస్ లాంటివి ముంబై పూణే ల మధ్య తిరిగే రైళ్ళు.

రోడ్డు మార్గం

పూణే కి మహారాష్ట్ర లోను, ఇతర రాష్ట్రాల లోను వున్న ప్రధాన నగరాల నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి. ముంబై - పూణే రహదారి ప్రయాణించడానికి చాల సౌకర్యంగా వుంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పూణే వెళ్ళే దారిలో వుండే పశ్చిమాద్రి కనుమలు వర్షాకాలం లో ఓ అందమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తాయి.

చిత్ర కృప : Jbritto

 

English summary

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో గల సందర్శనీయ ప్రదేశాలు

The grandest city in Western Ghats, the city of Pune is situated in the state of Maharashtra, at an elevation of about 560 metres above sea level. Pune gets its name from Punyanagara which translates to ‘The City of Virtue’.
Please Wait while comments are loading...