Search
  • Follow NativePlanet
Share
» »రాయలసీమ లో తప్పక చూడవలసిన ప్రదేశాలు !

రాయలసీమ లో తప్పక చూడవలసిన ప్రదేశాలు !

ఈ ప్రాంతంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి , శ్రీశైలం, అహోబిలం, లేపాక్షి, ఒంటిమిట్ట ప్రాంతాలు వెలిశాయి.

రాయలసీమ .... ఈ ప్రాంతం పేరు చెప్పగానే అందరి మనసులో మెలిగేది ఫ్యాక్షనిజం. ఈ గడ్డ ఎన్నో రక్తపు మరకలను అంటించుకొని ఉంది. రాయలసీమ ప్రాంతంలో తీసిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టరే !! ఉదాహరణకి చూసుకుంటే సమరసింహా రెడ్డి, ఇంద్ర, చెన్నకేశవ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... !! ఫ్యాక్షనిజం పుట్టింది ఇక్కడే అంతేనా బాంబులు, వేట కొడవాళ్లు ఇవన్ని మనకు సర్వసాధారణంగా కనిపించే పరికరాలు. ఫ్యాక్షనిజం చేయాలంటే ఇవన్ని తప్పనిసరనుకోండి. సరే అయితే మనం ఇక విషయానికి వద్దాం.

ఇది కూడా చదవండి : నల్లమల కొండల్లో దాగున్న వజ్రాల కొండ రహస్యం !

రాయలసీమ ప్రాంతాన్ని ఎంతో మంది పరిపాలించిన రాయల పరిపాలనలో చాలా ఖ్యాతి గడించింది. అందుకేనేమో ఈ ప్రాంతాన్ని "రాయల" సీమ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి , శ్రీశైలం, అహోబిలం, లేపాక్షి, ఒంటిమిట్ట ప్రాంతాలు వెలిశాయి. అంతేనా ఈ ప్రదేశంలో సినిమా షూటింగ్లు జరుపుకునే ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, విద్యా సంస్థలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈ ప్రాంతంలో వెలిశాయి. ఈ రాయలసీమ అనే ప్రాంతం ముఖ్యంగా నాల్గు జిల్లాల సమూహం. అవి వరుసగా కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూర్ . ఈ నాలాగు జిల్లాలలోని ప్రధానమైన ఆలయాలు, సినిమా షూటింగ్‌లు జరుపుకునే ప్రదేశాలు ఒకసారి పరిశీలిస్తే ...

తిరుపతి

తిరుపతి

ఇక్కడ చూడవలసిన వాటిలో ముఖ్యమైనది మరియు ప్రసిద్దమైనది తిరుపతి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో వుండడం వల్ల ఇది భక్తులకు, పర్యాటకులకు ఇష్టమైన నగరం అయింది. తిరుపతి అనే పదానికి మూలం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా ‘తిరు', ‘పతి' అనే రెండు పదాల కలయికతో ఈ పేరు ఏర్పడిందంటారు. తమిళంలో ‘తిరు' అంటే గౌరవప్రదమైన అనీ, ‘పతి' అంటే భర్త అనీ అర్ధం. కాబట్టి ఆ పదానికి అర్ధం ‘గౌరవనీయుడైన పతి' అని అర్ధం. నగరానికి చాలా దగ్గరలో వున్న తిరుమల కొండలు ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రాచీనమైన కొండలని చెప్తారు. తిరుపతి, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఆలయం, గోవిందరాజ స్వామి దేవాలయం, శ్రీనివాస మంగాపురం లలాంటి ప్రసిద్ధ గుళ్ళతో పాటు వివిధ పశు, వృక్ష జాతులకు ఆవాసమైన ఇక్కడి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కూడా చూడవచ్చు. శిలాతోరణం అనబడే ఇక్కడి రాతి ఉద్యానవనాన్ని కూడా చూడవచ్చు. చక్కర పొంగలి, లడ్డూ రుచి చూడకపోతే తిరుపతి సందర్శన సంపూర్ణం కాదు.

తిరుపతిలో చూడవలసిన ప్రదేశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Magentic Manifestations

శ్రీశైలం

శ్రీశైలం

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో నల్లమల కొండలలో చిన్న పట్టణం శ్రీశైలం హిందువులకు చాలా పవిత్ర మైనది. ఈ పట్టణం కృష్ణ నది ఒడ్డున కలదు. ఎంతో పవిత్ర యాత్రా స్థలంగా భావించే ఈ శ్రీశైలం పట్టణానికి లక్షలాది హిందువులు ప్రతి సంవత్సరం దేశం లోని అన్ని మూలల నుండి వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడి దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడు గా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబ గా పూజిస్తారు.హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యత నిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటి లో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.

శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Katta Srinivasa Rao

అహోబిలం

అహోబిలం

కర్నూల్ జిల్లాలో ఉన్న అహోబిలం ఒక పుణ్య ప్రదేశం. మన రాష్ట్ర గవర్నర్ అయిన నరశింహన్ కి ఈ ప్రదేశం మిక్కిలి ఇష్టమైనది. అహో... అంటే ఒక గొప్ప ప్రశంశ. బిలం అంటే బలం అని చెప్తారు. కనుక అహోబిలం అంటే "గొప్పదైన బలం" అని చెప్పాలి. పురాణాల మేరకు శ్రీ మహా విష్ణువు రాక్షసుల రాజు అయిన హిరణ్య కశిపుడిని సంహరించేందుకు సగం మనిషి గాను, సగం సింహ రూపంలో అవతరించినది ఈ ప్రదేశంలోనే అని చెపుతారు. విష్ణువు యొక్క ఈ భయంకర రూపం చూసిన సకల దేవతలు ఆయనను గురించి " అహో ...ఎంత బలవంతుడు " అని కీర్తిన్చారట. జయ జయ ధ్వానాలు చేశారట. అందుకని ఈ ప్రదేశానికి కాల క్రమేనా అహోబిలం / అహోబలం అనే పేరు వచ్చింది. ప్రస్తుత అహోబిలం క్షేత్రం సీమాంధ్ర లోని కర్నూల్ జిల్లాలో , ఆళ్ళ గడ్డ మండలం లో కలదు. ఈ పుణ్య క్షేత్రానికి వెళ్ళాలంటే, కర్నూల్, నంద్యాల్ మరియు హైదరాబాద్ నగరాల నుండి బస్సు లు తేలికగా లభిస్తాయి. ఈ ప్రదేశానికి రైలు మార్గం లేదు. సమీప రైలు స్టేషన్ నంద్యాల్ లో కలదు. ఇది బెంగుళూరు - వైజాగ్ రైలు మార్గంలో తగులుతుంది.

Photo Courtesy: RameshSharma / Karunakanth Bathula

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము . ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా,విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు.

Photo Courtesy: musikcan

మహానంది

మహానంది

మహానంది కర్నూల్ జిల్లాలోని నంద్యాల పట్టణానికి సమీపంలో ఉన్నది. మహానంది ఒక గొప్ప శివ క్షేత్రం.ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది.మహానందిలో పర్వతసానువుల్లో కొలువైన నందీశ్వర స్వామి దర్శనం ఆహ్లాదం కలిగిస్తుంది. ఆలయం వెనుక ఉన్న కొండల నుంచి స్వచ్ఛమైన నీరు వేసవిలో సైతం కిందకు ప్రవహిస్తూ ఉంటుంది. నందీశ్వరుని కిందుగా వచ్చే ఆ ధార, ఆలయం ఎదురుగా ఉండే కోనేరులో పడుతుంది. ఆ కోనేరులో భక్తులంతా స్నానాలు చేస్తారు. ఐదున్నర అడుగులు లోతు ఉన్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే ఉన్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు.

Photo Courtesy: MGA73bot2

యాగంటి

యాగంటి

కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌనద్ర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం వున్నది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కట్టారని కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్టించారని ఒక కథ ప్రచారంలో వున్నది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.

Photo Courtesy: Pusulurisudhakara

మంత్రాలయం

మంత్రాలయం

మంత్రాలయం ... దక్షిణ భారత దేశ రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటుంది. ఈ పట్టణం " మంచాలే " అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. గురు రాఘవేంద్ర స్వామి నిర్మించిన బృందావనం వల్ల తెలుగు వారిలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. శ్రీ రాఘవేంద్ర స్వామి, కుంబకోణంకి చెందిన శ్రీ సుధీంద్ర తీర్థుల యొక్క శిష్యుడు మరియు అనుచరుడు. ఆయనే రాఘవేంద్ర స్వామికి ద్వైత వేదాంతాన్ని, వ్యాకరణాన్ని అలాగే ప్రాచీన సాహిత్య రచనలు మరియు వేద పాఠాలు నేర్పారు.

మంత్రాలయంలో చూడవలసిన ప్రదేశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Dr Murali Mohan Gurram

పుట్టపర్తి

పుట్టపర్తి

పుట్టపర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో అనంతపురం అనే జిల్లాలో ఉన్న చిన్న పట్టణం. ఆధ్యాత్మిక గురువు సత్య సాయి బాబా యొక్క పవిత్ర నివాసం ఇక్కడ ఉండటం వల్ల ఒక ప్రసిద్ధ యాత్రా కేంద్రంగా మారింది. పట్టణం చిత్రావతి నది ఒడ్డున ఉంది.పుట్టపర్తి యొక్క చరిత్ర శ్రీ సత్య సాయి బాబా యొక్క పుట్టుక మరియు జీవితం చుట్టూ తిరుగుతుంది. అనేక సంఘటనలు కారణంగా ప్రజలు అతనిని అనుసరించడం ప్రారంభించారు, మరియు అతను ఒక ఆధ్యాత్మిక నాయకుడు అనే నమ్మకం వారికి కలిగింది. అతని బోధనలు ప్రపంచవ్యాప్తంగా జయ జయ ధ్వానాలు అందుకున్నాయి. ఆయన బోధనలు శాంతి, సత్యం, ప్రేమ, నిజాయితీ మరియు అహింస సూత్రాల పై ఆధారపడి ఉంటాయి. ఈ చిన్న గ్రామం ప్రపంచ స్థాయి పట్టణంగా మారింది. గతంలో పుట్టపర్తిని గొల్లపల్లి అని పిలిచే ఒక చిన్న వ్యవసాయ గ్రామం మరియు అక్కడ ఇళ్ళల్లో ఆవులను పెంచేవారు.

పుట్టపర్తిలో చూడవలసిన ప్రదేశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: nativeplanet telugu

కాణిపాకం

కాణిపాకం

కాణిపాకం ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామము. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉన్నది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది.కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

Photo Courtesy: Shiva333

లేపాక్షి

లేపాక్షి

అనంతపూరు జిల్లాలో భాగమైన లేపాక్షి దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందమైన ఒక కుగ్రామం. ఈ కుగ్రామంలో ఎన్నో చారిత్రాత్మక అలాగే ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినవి ఎన్నో ఉన్నాయి. దక్షిణ భారత దేశంలో మహా శివుడు, మహావిష్ణువు, వీరభద్ర స్వామి ల కి అంకితమివ్వబడి, ప్రఖ్యాతి గాంచిన మూడు ఆలయాలు ఈ ప్రాంతం లో ఉన్నాయి. తాబేలు వెనుక భాగాన్ని పోలి ఉన్న ఆకారంలో ఉన్న ఒక చిన్న పర్వతానికి కూడా ఈ ప్రాంతం ప్రాముఖ్యత చెందింది. ఈ పర్వతం పైన కూర్మ శైల. శ్రీరామ, రఘునాథ, వీరభద్ర, పాపనాథేస్వర ఇంకా దుర్గమ్మ వారి ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన ఆకర్షణ వీరభద్రుని ఆలయం. దక్షిణ భారత దేశం నుండి ఏంతో మంది భక్తులు వీరభద్రుని దర్శనార్ధం ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు.

లేపాక్షిలో చూడవలసిన ప్రదేశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy:Narasimha Prakash

ఒంటిమిట్ట

ఒంటిమిట్ట

ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రభుత్వ లాంఛనాలతో చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ ఈ ఏడాది నుంచి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడానూ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము.ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి.

Photo Courtesy: seeta dutta

అమీన్ పీర్ దర్గా

అమీన్ పీర్ దర్గా

కడప నగరంలో ఉన్న సూఫీ మందిరం అమీన్ పీర్ దర్గా. అన్ని మతాల ప్రజలచే సందర్శింపబడే ఈ మందిరం అత్యంత ప్రఖ్యాతి చెందినది. సామాజిక సామరస్యానికి ప్రతీక అయిన ఈ మందిరం అన్ని రోజుల్లో తెరిచే ఉంటుంది. పర్యాటకులు అలాగే స్థానికులు ఈ మందిరానికి విచ్చేస్తూ ఉంటారు. గురు, శుక్ర వారాల్లో అన్ని మతాల ప్రజలు పీరుల్లా హుస్సైని మరియు అరుఫుల్ల హుస్సైని అనే ఇద్దరి సాధువుల యొక్క దీవెనలు అందుకునేందుకు ఈ దర్గాకి విచ్చేస్తారు. ఈ మందిరంలో ఈ సాధువుల యొక్క సమాధులు ఉన్నాయి. ఇక్కడ ప్రార్ధించడం ద్వారా కోరికలు తీరతాయని ప్రజల నమ్మకం. ఈ దర్గాకి సెలెబ్రటీలు సైతం క్యూ లో నించుంటారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ ఇక్కడ సందర్శించే ప్రముఖులలో మొదటివాడు.

Photo Courtesy: Satyanath Venkata Rajamahanti

ఇస్కాన్‌ టెంపుల్‌

ఇస్కాన్‌ టెంపుల్‌

పెనుకొండ కొండపై ఇస్కాన్‌ టెంపుల్‌ సంస్థ ఆధ్వర్యంలో రూ.100కోట్ల వ్యయంతో బంగారు ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం సుమారుగా 150 ఎకరాల పైనే కడుతున్నారు. బెంగళూరుకు చెందిన అరోరా ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్‌ కంపెనీ వారు దీని నిర్మాణానికి నడుంబిగించారు. ఇది గనక పూర్తయితే ఆ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంవైపు పరుగులు పెడుతుంది. అంతే కాకా ఆ ప్రాంతమూ అభివృద్ది చెందుతుంది.

Photo Courtesy: Dr Murali Mohan Gurram

ఓర్వకల్లు రాక్‌ గార్డెన్‌

ఓర్వకల్లు రాక్‌ గార్డెన్‌

కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లు మండలానికి సమీపాన ఉన్న ప్రదేశమే రాక్ గార్డెన్. కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్ మండలానికి సమీపాన ఉన్న ప్రదేశమే రాక్ గార్డెన్. ఓర్వకల్లు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండలకు చాలా ప్రసిద్ధి. వీటికి రాక్‌ గార్డెన్‌గా ఎపి టూరిజం వారు పేరు పెట్టి ఇక్కడ యాత్రికుల సౌకర్యార్థం హోటల్‌ను కూడా నిర్వహిస్తున్నారు. సహజ సిద్ధంగా బండరాయితో ఏర్పడిన ఈ కొండలను జిల్లా వారే కాక, ఇతర ప్రాంతాల వారు కూడా సందర్శిస్తుంటారు. ఇక్కడనే ప్రముఖ సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఉదాహరణకి వెంకటేష్ నటించిన సుభాస్ చంద్రబోస్ , రవితేజ నటించిన శంభోశివ శంభో ఇక్కడనే షూటింగ్‌లు జరుపుకున్నాయి.

Photo Courtesy: Poreddy Sagar

అరుంధతి కోట

అరుంధతి కోట

ఈ కోట కర్నూల్ జిల్లాలోని బనగానపల్లె - యాగంటి పోయే దారోలో ఉంది . ఇక్కడే "అరుంధతి సినిమా" షూటింగ్ చేసింది. ఇక్కడ ఆ సినిమా చేయడం వల్లనేనేమో దీనిని అరుంధతి కోట గా నామకరణం చేశారు ఆ ఊరి ప్రజలు. సినిమా యూనిట్ అంతా ఇక్కడే ఒక నెల రోజులు మకాం వేసి షూటింగ్ చేశారు. ఈ కోట ఒక పెద్ద గట్టు మీద ఉంటుంది. ఇది నవాబుల వేసవి విడిది కానీ అక్కడున్న ప్రజలు దీనిని ఉంపుడుగత్తెకు కట్టించి ఇచ్చిన కోటగా చెబుతారు. కోట అయితే కాస్త శిధిలమైపోయింది అయినా కూడా ఇప్పటికీ కోట వన్నె తగ్గలేదు. ఈ కోటలో సుమారుగా 9 గదులు మరియు ఒక పెడా హాలు కింద ఒక పెద్ద నేలమాలిగా ఉన్నట్లు ఉంటుంది.

Photo Courtesy: telugunative planet

గండికోట

గండికోట

గండికోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతున్నది. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నది జలకళతో ఈ ప్రాంతం కనువిందు చేస్తుంది.

Photo Courtesy: Urdangaray

తలకోన జలపాతం

తలకోన జలపాతం

చుట్టూ ఎత్తైన కొండలు... దట్టమైన అరణ్యప్రాంతం... మధ్యలో ఓ జలపాతం ఉంటే ఎంత బాగుంటుందో కదా. అంత అందమైన ప్రకృతి ఎక్కడుందా అనుకుంటున్నారా? మరెక్కడో కాదు... చిత్తూరు జిల్లాలో. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతికి 58 కిలోమీటర్ల దూరంలోనే ఈ రమణీయ ప్రదేశం ఉంది. అదే తలకోన జలపాతం. ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. సాక్షాత్తూ ఆదిశేషుడే పర్వత రూపం దాల్చాడని పురాణ గాథ. కుబేరుని అప్పు తీర్చేందుకు శ్రీనివాసుడు ధనాన్ని కొలిచి అలసిపోయి నిద్రపోయాడని చెబుతారు. అలా పడుకోవడంలో తల భాగం ఇక్కడ ఉన్న కొండ(కోన)శిఖరం మీద ఆనించాడని అందుకే ఈ ప్రదేశానికి తలకోన అనే పేరు వచ్చిందని స్థలపురాణం. మన రాష్ట్రంలో ఎత్తయిన జలపాతం కూడా ఇదే మరి!. దీన్ని శిరోద్రోణం అని కూడా పిలుస్తారు.

Photo Courtesy: Adityamadhav83

హార్సిలీ హిల్స్

హార్సిలీ హిల్స్

హార్సిలీ హిల్స్, ఆంధ్రప్రదేశ్ లో చిత్తూర్ జిల్లాలోని మదనపల్లె పట్టణం సమీపంలో ఉన్న చాలా ప్రజాదరణ పొందిన వేసవి హిల్ రిసార్ట్.ఈ రిసార్ట్ కు బెంగుళూర్, హైదరాబాద్ మరియు తిరుపతి వంటి దక్షిణ ప్రధాన నగరాల నుండి సులభంగా చేరుకోవచ్చు. ఏప్రిల్ మరియు మే నెలల్లో వేడి పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సుందరమైన పర్వతం వేడి వాతావరణం నుంచి బాగా అవసరమైన ఉపశమనం ను కలిగిస్తుంది. అప్పట్లో కడపలో పనిచేసిన బ్రిటీష్‌ కలెక్టరు పేరు దీనికి పెట్టారు. ఈ కొండ ప్రాంతాల చల్లదనం, అందాలకు ఆకర్షితుడై ఆయన తన వేసవి విడిదిగా దీన్ని అభివృద్ధి చేశారు. హార్స్‌లీ హిల్స్‌ సముద్రమట్టం నుంచి 1265 మీటర్ల ఎత్తులో ఉంది. తిరుపతి 140 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుంచి కూడా అంతే దూరం ఉంటుంది. దీని ప్రక్కనే ప్రఖ్యాత రిషి వ్యాలీ ఉంది. ఇక్కడే రిషివ్యాలీ పబ్లిక్‌ స్కూలు ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది. ఎపిటిడిసి హరితహిల్‌ రిసార్టును నిర్వహిస్తోంది.

Photo Courtesy: SAIKAT SARKAR

కొండారెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజుగా కూడా పిలిచే కర్నూల్ కోట కర్నూల్ నగరంలో ఎంతో ముఖ్యమైన ప్రాంతం. విజయనగర రాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన ఈ కోట నగర౦ నడిబొడ్డున ఉంది. ఈ అద్భుతమైన కట్టడం లో మిగిలిన భాగం కొండ రెడ్డి బురుజు మాత్రమే. ఈ కోటలో ఉన్న కారాగారంలోనే కొండ రెడ్డి తుది శ్వాస వదలడం వలన ఈ స్తంభానికి ఆయన పేరు పెట్టారు.ఈ కోట చాల వరకు శిధిలావస్థలో ఉన్నప్పటికీ, కొన్ని భాగాలు ఇంకా బలంగా ఉన్నాయి. వీటిలో ఒకటి ఎర్ర బురుజు. ఈ బురుజు క్రింది భాగంలో రెండు చిన్న పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇవి ఎల్లమ్మ తల్లికి చెందినవి. ఈ బురుజు లో గుప్త నిధులు ఉన్నాయని విశ్వసిస్తారు. ఈ నిధులను కనుగొనడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ కోటలో అనేక అధ్భుతమైన శాసనాలు,చెక్కడాలు ఉన్నాయి. 2013లో కొండారెడ్డి బురుజుకు జాతీయ స్థాయి హౌదా లభించింది.

Photo Courtesy: Veera.sj

రాయలసీమ రుచులు

రాయలసీమ రుచులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నోరూరించే భిన్న రుచులకు కేంద్రం. రాష్ట్రంలోని రాయలసీమ, తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాలు రుచికరమైన పలు రకాల వంటకాలు దేశవిదేశాల్లో ప్రసిద్ధిగాంచాయి. ఇంకా చెప్పాలంటే కారంకారంగా ఉండాలంటే మాత్రం రాయలసీమ రుచులు రుచి చూడక తప్పదు. వాటిలో పల్లీల పచ్చడి, నాటుకోడి పులుసు, రాగిముద్ద, పొట్టేలు తలకూర ప్రసిద్ధమైన వంటకాలు., ఈ వంటకాలు భోజనప్రియులను ఆనంద పరుచుస్తాయి.. మైమరపిస్తాయి.. అంతే కాదు ఇక్కడ వగ్గని - బజ్జీ ఫెమస్ కాంబినేషన్ . మీకు వగ్గని - బజ్జీ బాగా టేస్ట్ కావాలంటే కర్నూల్ జిల్లాలోని ఎమ్మిగనూర్ పట్టణంలో బస్ - స్టాండ్ ఎదురుగా సందర్శిస్తే సరిపోతుంది. ఇక్కడ ఉన్న టేస్ట్ మరెక్కడా కూడా రాదు. మరి వాటిని తప్పక రుచి చూస్తారు కదూ !!

Photo Courtesy: Veera.sj / ruchulu

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X