Search
  • Follow NativePlanet
Share
» »సర్పవరం భావనారాయణస్వామి దేవాలయం, కాకినాడ !

సర్పవరం భావనారాయణస్వామి దేవాలయం, కాకినాడ !

సర్పవరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన భావనారాయణ స్వామి ఆలయం కలదు. ఇది కాకినాడ ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయంగా గుర్తించబడింది. దీని స్థలపురాణం గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ప్రస్తావించబడింది.

By Mohammad

సర్పవరం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ రూరల్ ప్రాంతంలో గల ఒక గ్రామీణ ప్రాంతం. పూర్వం ఇక్కడ అనేక పాములు సంచరించేవట ... అందుకే ఈ ఊరికి ఆ పేరొచ్చిందని చెబుతారు. ఈ గ్రామానికి మాధవపట్నం కమర్షియల్ ఏరియా జంక్షన్ నుండి రవాణా సదుపాయాలు చక్కగా ఉంటాయి. మాధవపట్నం నుండి 3 కిలోమీటర్ల దూరంలో మరియు కాకినాడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ల నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం కలదు.

సర్పవరం గ్రామీణ వాతావరణం, పంట చేలు

సర్పవరం గ్రామీణ వాతావరణం, పంట చేలు

చిత్రకృప : Adityamadhav83

సర్పవరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన భావనారాయణ స్వామి ఆలయం కలదు. ఇది కాకినాడ ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయంగా గుర్తించబడింది. దీని స్థలపురాణం గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ప్రస్తావించబడింది. అగస్త్య ముని సర్పవరం గాధను సనకసనందనాదులకు వివరిస్తాడు. పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన పాతాళభైరవాలయం ఇక్కడ ఉన్నది (పంచభావనారాయణ క్షేత్రాలు : బాపట్ల, పొన్నూరు, నరసరావుపేట, భావదేవరపల్లి, సర్పవరం).

సర్పవరం దేవాలయం గోపురం

సర్పవరం దేవాలయం గోపురం

చిత్రకృప : Adityamadhav83

ఆలయ విశిష్టత

సర్పవరం పాతాళభైరవాలయంనకు ఒక విశిష్టత ఉన్నది. పూర్వము నారదుడు కొలనులో స్నానం చేసి స్త్రీ రూపాన్ని ధరించాడని ... ఆతరువాత మరళా కొలనులో స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్నాడని చెబుతారు. నేటికీ ఆ కొలనులు దేవాలయం ప్రాంగణంలో పక్కపక్కనే చూడవచ్చు. దేవాలయం గోపురం శిల్పకళాశోభితమై ఆహ్లాదకరంగా, ఆశ్చర్యకరంగా కానవస్తుంది.

పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవాలయం !

సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం ప్రాశస్తి ..

ఒకనాడు ఇంద్రాది దేవతలు బ్రహ్మతో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించి ప్రస్తావన వస్తుంది. ఆ మాయ తెలుసుకోవటం కష్టమని అందరూ గ్రహించారు. కానీ అక్కడే ఉన్న నారదుడు తనకు తెలుసుకోవడం సులభమని చెబుతాడు. ఇది తెలుసుకున్న విష్ణుమూర్తి అతనిని ఒక కంట కనిపెడుతూ ఉండేవారు.

దేవాలయం లోపల శాశనం

దేవాలయం లోపల శాశనం

చిత్రకృప : Adityamadhav83

నారదుడు ఒకనాడు భూలోక విహారానికి వెళ్ళాడు. సంధ్యా సమయం కావడంతో నీటికొలనులో దిగి స్నానము చేయగా, అతను స్త్రీ రూపాన్ని ధరిస్తాడు. ఒడ్డున పెట్టిన వీణ, కమండలం కనిపించకుండాపోతాయి. శక్తులన్నీ నశిస్తాయి. ఏమిచేయాలో పాలుపోక భూలోకంలోనే ఉండిపోతాడు నారదుడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడును చూసిన పిఠాపురం నికుంఠ మహారాజు మోజుపడి వివాహం చేసుకుంటాడు. ఆతరువాత జరిగిన శత్రురాజుల యుద్ధాలలో అతను మరణిస్తాడు.

స్త్రీ రూపంలో ఉన్న నారదుడు అడవుల్లోకి పారిపోతాడు (ఒకేవేళ రాజ్యంలో ఉంటే శత్రురాజుల చేతిలో మరణమో లేదా బందీయో కావాలి కనుక). చాలా రోజులు అడవుల్లో ఇష్టమొచ్చినట్లు తిరుగుతాడు. ఆకలేసి చెట్టు కొమ్మపై ఉన్న ఒక ఫలాన్ని కోయటానికి ప్రయత్నిస్తూ, వ్యయప్రయాసలు పడుతుంటాడు. అప్పుడు అక్కడికి విష్ణుమూర్తి మారువేషంలో వచ్చి, "నీవు కొలనులో స్నానం చేసి వస్తే గానీ పండు కోసి ఇవ్వను" అని చెబుతాడు.

భావనారాయణ ఆలయం - విమాన గోపురం

భావనారాయణ ఆలయం - విమాన గోపురం

చిత్రకృప : Adityamadhav83

సరే అని కొలనులో వెళ్ళి స్నానం చేయగా, నారదరూపాన్ని ధరిస్తాడు నారదుడు. ఆశ్చర్యంగా ఒడ్డుకు వచ్చిన నారదుడు ఇదంతా విష్ణుమాయ అని గ్రహిస్తాడు. దాంతో శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం భావనారాయణ స్వామిని ప్రతిష్టించి, వందల ఏళ్ళు తపస్సు చేసాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై, కోరిక అడగగా ఇక్కడే కొలువుండమని చెబుతాడు నారదుడు. నారదుని కోరిక వలన భావనారాయణస్వామిగా విష్ణుమూర్తి ఇక్కడే వెలిశాడు. ఆతర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారిని విష్ణుమూర్తి విగ్రహానికి ఎదురూగా ప్రతిష్టించారు.

ప్రపంచంలో ఇలాంటి శివాలయం వుందని తెలుసా ?

దేవాలయం సందర్శన సమయం : ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.

ఉత్సవాలు : వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున కళ్యాణోత్సవం వైభవంగా జరుపుతారు. శేష, గజ, అశ్వ వాహనాలపై ఊరేగే స్వామివారిని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు.

కాకినాడ లోని ఒక రిసార్ట్

కాకినాడ లోని ఒక రిసార్ట్

చిత్రకృప : Varmapak

వసతి సదుపాయాలు:

సర్పవరంతో పోల్చుకుంటే కాకినాడ లో బస చేయటానికి అనేక హోటళ్ళు, లాడ్జీలు కలవు. బడ్జెట్ ధరలలోనే ఏసీ, నాన్ - ఏసీ గదులు మరియు ఇతర తరగతి గదులు దొరుకుతాయి. కాకినాడ లో కాజా రుచి చూడందే పర్యటన పూర్తికాదు.

ఐటీ ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ సమీపంలో గల ఈ గ్రామములో ఐటి - సెజ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం టైచే ఇండస్ట్రీస్ ప్రవేట్ లిమిటెడ్ మరియు ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ తన కార్యక్రమాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నది. హైదరాబాద్ వలె సైబర్ టవర్స్ ను ఇక్కడ నిర్మిస్తున్నారు.

భావనారాయణస్వామి ఆలయం చుట్టుప్రక్కల సందర్శించదగినవి

హోప్ ఐలాండ్, పెద్దాపురం పాండవుల మెట్ట, ద్రాక్షారామం భీమేశ్వర గుడి, పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి గుడి, బిక్కవోలు దేవాలయ సముదాయం, ఉప్పాడ బీచ్, సామర్లకోట లోని కుమారారామ భీమేశ్వర స్వామి దేవస్థానం, కోటిపల్లి కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం మొదలుగునవి సందర్శించవచ్చు.

కాకినాడ ప్రధాన రోడ్డు

కాకినాడ ప్రధాన రోడ్డు

చిత్రకృప : Dineshbilla.kumar

రవాణా సౌకర్యాలు

  • వాయు మార్గం : 60 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి దేశీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలను విమానసర్వీసులు నడుస్తున్నాయి. ఎయిర్ పోర్ట్ వెలుపల అద్దెకు దొరికే క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి సర్పవరం చేరుకోవచ్చు.
  • రైలు మార్గం : సర్పవరం గ్రామానికి సమీపాన 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ రైల్వే స్టేషన్, 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సామర్లకోట రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాల నుండి వచ్చే అన్ని రైళ్ళు స్టేషన్ వద్ద ఆగుతాయి.
  • రోడ్డు/ బస్సు మార్గం : కాకినాడ కు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై తదితర ముఖ్య పట్టణాల నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు కలవు. కాకినాడ నుండి ఆటోలలో ఎక్కి సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం వెళ్ళవచ్చు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X