Search
  • Follow NativePlanet
Share
» »బీచుపల్లి ఆంజనేయ ఆలయ విశేషాలు !!

బీచుపల్లి ఆంజనేయ ఆలయ విశేషాలు !!

వ్యాస రాయల ప్రతిష్ఠలో హనుమంతునికి ఇరువైపులా శంఖ, చక్రాలుంటాయి. ఆయన ఇక్కడ హనుమంతున్ని ప్రతిష్ఠించి, మొదట ఎవరు స్వామి దర్శనానికి వస్తే వారినే పూజారిగా నియమించమని సెలవిచ్చినాడట.

By Mohammad

బీచుపల్లి, గద్వాల్ (జోగులాంబ) జిల్లా, ఇటిక్యాల మండలంలో కలదు. ఈ గ్రామము జాతీయ రహదారి 44 (పూర్వం 7వ నెంబర్ జాతీయ రహదారి) పై ఉంది. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ గ్రామములో ప్రతి 12 సంవత్సరాలకు జరిగే కృష్ణానది పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ప్రాచీనమైన ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. జాతీయ రహదారికి అతి సమీపంలో ఉండుటచే లక్షలాది భక్తులు పుష్కరస్నానం చేయడానికి తరలివస్తుంటారు. ఇది మంచి పర్యాటక కేంద్రం కూడా. కృష్ణవేణి దేవాలయం, ఇతరదేవాలయాలు, ఉద్యానవనం మున్నగునవి ఇక్కడకు వచ్చే పర్యాటకులను సంతృప్తిపరుస్తాయి. జాతీయరహదారిపై కృష్ణానదిపై కల వంతెన దాటుతున్నప్పుడు ఈ దృశ్యాలు కానవస్తాయి.

చారిత్రక నేపథ్యం

కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉండటం వలన అలంపూర్, గద్వాల ప్రాంతాలను నడిగడ్డగా పిలుస్తారు. నడిగడ్డలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బీచుపల్లి మౌర్యులు, శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు మరియు సుల్తానుల పాలనలో కొనసాగింది. క్రీ. పూ. 902 సంవత్సరంలో చోడబల్లి దేవుడు అనే రాజు విశ్వనాథ దేవుడు అనే వ్యక్తికి ఈ ప్రాంతాన్ని దానంగా ఇచ్చినట్లు ఇక్కడ లభించిన శిలాశాసనం ద్వారా తెలుస్తుంది.

కృష్ణానది వంతెన

కృష్ణానది వంతెన

7వ నెంబరు జాతీయ రహదారిపై కృష్ణానది మీదుగా ఒక కిలోమీటరు పొడవు కల వంతెన ఉంది. దీన్ని 1958లో 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇటీవల రెండు లేన్ల రహదారిని నాలుగు లేన్ల రహదారిగా మార్చారు.

చిత్రకృప : Naidugari Jayanna

ఆంజనేయ స్వామి దేవాలయము

ఆంజనేయ స్వామి దేవాలయము

మహబూబ్‌నగర్ జిల్లాలో 7వ నెంబరు జాతీయ రహదారి పైన కృష్ణా నది తీరాన బీచుపల్లిలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఉంది. స్వామి వారిని వ్యాసరాయలు ప్రతిష్ఠించారని ప్రతీతి.

చిత్రకృప : Kautilya1

దేవతల ప్రతిష్ఠలు

దేవతల ప్రతిష్ఠలు

శ్రీకృష్ణదేవరాయలు దోష నివారణకై వ్యాసరాయలను ఆశ్రయించగా, ఆయన శ్రీకృష్ణ ముద్రతో మూడేళ్లపాటు రాజ్యపాలన చేసి అనంతరమతని రాజ్యాన్ని అతనికి దానము చేసెనట. దానం గ్రహించిన పిమ్మట ఆ దోష పరిహారార్థం 378 ప్రాణ దేవతల ప్రతిష్ఠలు చేసినాడట. ఇక్కడి ప్రతిష్ఠ వాటిలో ఒకటిగా భావిస్తారు.

చిత్రకృప : Prabirghose

బీచుపల్లిలో బోయవారిదే ప్రథమ పూజ

బీచుపల్లిలో బోయవారిదే ప్రథమ పూజ

వ్యాస రాయల ప్రతిష్ఠలో హనుమంతునికి ఇరువైపులా శంఖ, చక్రాలుంటాయి. ఆయన ఇక్కడ హనుమంతున్ని ప్రతిష్ఠించి, మొదట ఎవరు స్వామి దర్శనానికి వస్తే వారినే పూజారిగా నియమించమని సెలవిచ్చినాడట. అప్పుడక్కడ స్వామి దర్శనానికి మొదట బీసన్న అనే బోయపిల్లవాడు స్వామి దర్శనానికి రాగా, అప్పటి నుండి బీచుపల్లిలో బోయవారిదే ప్రథమ పూజ.

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

బీచుపల్లిలో శ్రీఆంజనేయస్వామి ఆలయంతో పాటు కోదండరామస్వామి ఆలయం కూడా ఉంది. అంతేకాకుండా కృష్ణా నది మధ్యలో నిజాంకొండ కోట కూడా ఉంది. ఇక్కడ సినిమా షూటింగులు కూడా జరిగాయి. చిరంజీవి నటించిన కొండవీటి రాజా సినిమా కొంత భాగం తీశారు.

చిత్రకృప : Adityamadhav83

శ్రీకోదండరామ స్వామి ఆలయం

శ్రీకోదండరామ స్వామి ఆలయం

2004లో కృష్ణానదికి అతి సమీపాన శ్రీకోదండరామస్వామి ఆలయాన్ని నిర్మించారు. చినజీయర్ స్వామి చే పూజలు చేయించి, విగ్రహప్రతిష్ఠ చేయించారు., సుందరంగా నిర్మించబడిన ఈ ఆలయ గోపురంపై దశావతారాల శిల్పాలు ఆకట్టుకుంటాయి. విశాలమైన ఆవరణ కలిగి ఉండటం వలన, వివాహా వేడుకలకు అనుకూలంగా ఉండటం వలన, ఈ ఆలయంలో వేసవి కాలంలో పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతుంటాయి.

చిత్రకృప : Naidugari Jayanna

శివాలయం

శివాలయం

కృష్ణానది ఒడ్డున ఒక చిన్న గుడి రూపంలో ఉన్నదే శివాలయం. నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు మొదటగా దర్శించుకొనేది ఇకడి పరమేశ్వరుడినే. ఈ పరమేశ్వరుడిని హనుమద్దాసులు వారు ప్రతిష్ఠించారని అంటారు.

చిత్రకృప :NAG

కలిమి చెట్టు పుట్ట

కలిమి చెట్టు పుట్ట

ఆంజనేయస్వామి ఆలయ సమీపాన ఒక పుట్టపై కలిమిచెట్టు ఉంది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఒక మహర్షి జీవించాడని, ఇక్కడే సమాధి అయ్యాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడ ఉన్న కలిమి చెట్టుకు ఏ కాలంలో నైనా, ఏ ఋతువులోనైనా ఒక పువ్వో, కాయో, పండో కనిపించడం జరుగుతుందట.

చిత్రకృప : Naidugari Jayanna

నిజాం కోటకొండ

నిజాం కోటకొండ

బీచుపల్లి క్షేత్రం దగ్గర కృష్ణా నదిలో ఒక ద్వీపపు కొండ ఉంది. ఈ కొండపై ఒక బలిష్టమైన దుర్గాన్ని 18 వ శతాబ్దిలో నిర్మించారు. దీనిని నిజాం కొండ అని అంటారు. ఈ కోటను సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కోటలోపల ఆంజనేయస్వామి ఆలయం, మసీదు, బావిని ఏర్పాటుచేశారు.

బీచుపల్లి చుట్టుప్రక్కల చూడవలసిన ఇతర దర్శనీయ ప్రదేశాలు

బీచుపల్లి చుట్టుప్రక్కల చూడవలసిన ఇతర దర్శనీయ ప్రదేశాలు

గద్వాల కోట, సాయిబాబా ఆలయం, చెన్నకేశవ ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి గుడి, ఈశ్వరస్వామి గుడి, దక్షిణ కైలాసం టెంపుల్, క్రిస్ట్ చర్చి (9 am - 5 pm) మొదలగునవి చూడవచ్చు. బీచుపల్లి కంటే గద్వాల వసతికి అనువైనది.

చిత్రకృప : Naidugari Jayanna

బీచుపల్లి ఎలా చేరాలి ?

బీచుపల్లి ఎలా చేరాలి ?

బీచుపల్లి జాతీయరహదారి 44 (హైదరాబాద్ - బెంగళూరు) మీదే ఉన్నది. గద్వాల, పెబ్బేరు వెళ్ళే బస్సులన్నీ బీచుపల్లి మీదే పోతాయి. గద్వాల సమీప ప్రధాన పట్టణం. ఇక్కడ రైల్వే జంక్షన్ కలదు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీప విమానాశ్రయం. బీచుపల్లి - గద్వాల్ మధ్య దూరం 18 కిలోమీటర్లు.

చిత్రకృప : Kautilya1

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X