Search
  • Follow NativePlanet
Share
» »అంకార్ వాట్ దేవాలయం కాదట ... ఇదే అతిపెద్ద దేవాలయమట !

అంకార్ వాట్ దేవాలయం కాదట ... ఇదే అతిపెద్ద దేవాలయమట !

శ్రీరంగం దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్దది. అందరూ కంబోడియాలో అంకార్ వాట్ దేవాలయాన్నే అతిపెద్దది అనుకుంటారు. కానీ నిత్యం పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ విష్ణు దేవాలయం ఇదే అని దేవస్థానం చెబుతుంది.

By Mohammad

శ్రీరంగం శ్రీమహావిష్ణువు దివ్యక్షేత్రాలలో మొదటిది మరియు ముఖ్యమైనది. విష్ణువు పాలసముద్రం నుండి ఇక్కడే ఉద్భవించినది. ప్రపంచములో అతిపెద్ద విష్ణు దేవాలయం కూడా ఇదే. భూలోక వైకుంఠం, ఆలయాల ద్వీపం, తిరువరంగన్ అనేవి శ్రీరంగం క్షేత్రానికి గల ఇతర పేర్లు. శ్రీరంగం ఆలయాన్ని " ఇండియన్ వాటికన్" గా కూడా పిలుస్తారు.

శ్రీరంగం ఆలయం, తిరుచిరాపల్లి లేదా ట్రిచి పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో కలదు. దేవాలయం కావేరి - కొల్లిదం (కావేరి నదికి ఉపనది) నదుల మధ్య కొలువై ఉన్నది. ఈ క్షేత్రం నిత్యం శ్రీరంగనాథుని నామస్మరణలతో మారుమ్రోగుతూ ఉంటుంది. విష్ణుభగవానిని 108 దివ్య క్షేత్రాలలో ఇదే మొదటిది మరియు స్వయంభూ క్షేత్రం కూడా.

అరుణాచలేశ్వరుని ఆలయ మహత్యం !

శ్రీరంగం గురించి పురాణాల్లో ...

రావణుడు తమ్ముడు విభీషణుడు, అన్న చేసే దురాగతాలు చూడలేక హితబోధనలు చేస్తాడు. నీవు చెప్తే నేను వినాలా !! అన్నట్లు రావణుడు ఆ మాటలను పెడచెవిన పెడితే, విభీషణుడు రాముడు వద్దకు వెళతాడు. రావణుడి వధ అనంతరం, విభీషణుడు భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహం కానుకగా ఇచ్చి, దానిని కింద పెట్టకూడదని ఉపదేశిస్తాడు. లంక కు వెళ్తున్న తరుణంలో విభీషణుడు ఆ విగ్రహాన్ని కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటాడు. కాసేపయినాక తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తుతాడు ... కానీ ఆ విగ్రహం లేవదు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారుస్తాడు. అతని అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు. విభీషణుడు కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కున తిరుగుతాడు (లంక దక్షిణ దిక్కున కలదు).

పూంపుహార్ ఒకప్పటి చోళ రాజుల రాజధాని !

ఆలయం

ఆలయం

శ్రీరంగం దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్దది. అందరూ కంబోడియాలో అంకార్ వాట్ దేవాలయాన్నే అతి పెద్దది అనుకుంటారు. కానీ ఈ దేవాలయం శిధిలావస్థలో ఉన్నది కనుక నిత్యం పూజాదికాలు జరిగే అతి పెద్ద హిందూ విష్ణు దేవాలయం ఇదే అని శ్రీరంగం అధికారిక వెబ్సైటు లో పేర్కొనటం జరిగింది.

చిత్రకృప : Giridhar Appaji Nag Y

గుడి ప్రాంగణం

గుడి ప్రాంగణం

సుమారు 157 ఎకరాలలో విస్తరించిన ఈ దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగ మూర్తి విగ్రహం కలదు. దేవాలయం 4 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉన్నది. గుడి ప్రాంగణంలో 50 పైచిలుకు దేవత మూర్తుల ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. బహుశా మరే విషుమూర్తి దేవాలయంలో ఇన్ని సదుపాయాలు ఉండవేమో !!

చిత్రకృప : Ssriram mt

ఆసియా ఖండం

ఆసియా ఖండం

శ్రీరంగం 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది. భక్తులు వీటిగుండా లోనికి నడుచుకుంటూ వెళుతారు. ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు లేదా 72 మీటర్లు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది.

చిత్రకృప : Gsnewid

గరుడాళ్వార్

గరుడాళ్వార్

శ్రీరంగం ఆలయంలో గరుడాళ్వార్ విగ్రహం 25 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ విగ్రహానికి వస్త్రాలంకరణకు 30 మీటర్ల పొడవున్న వస్త్రం అవసరం అవుతుంది. గురుడాళ్వార్ కు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మండపం కూడా కలదు.

చిత్రకృప : G41rn8

ధన్వంతరి దేవాలయం

ధన్వంతరి దేవాలయం

శ్రీరంగం ఆలయంలో మాత్రమే సాగర మథనం నుండి ఉద్భవించిన దేవతా వైద్యుడు ఆరోగ్య కారకుడైన ధన్వంతరికి దేవాలయం కలదు. ఈ ఆలయంలోనే స్వామి రామానుజాచార్యుని పార్థివ దేహాన్ని క్రీ. శ. 8 వ శతాబ్దంలో భద్రపరిచారు.

చిత్రకృప : Todayindian

ఉత్సవాలు

ఉత్సవాలు

సంవత్సరానికి 365 రోజులు .. ఐతే ఈ ఆలయంలో 322 రోజులూ ఉత్సవాలే. గుడికి సుదర్శన ఆళ్వార్ కు మాత్రమే ఆలయం కలదు.

చిత్రకృప : sowrirajan s

మతసామరస్యానికి ప్రతీక

మతసామరస్యానికి ప్రతీక

హిందూయేతరులను గుడి రెండవ ప్రాకారం వరకు మాత్రమే అనుమతిస్తారు. రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది. పైకప్పుకు బంగారు తాపడం చేశారు. గర్భగుడిలో ఆదిశేషుపై శయనించి ఉన్న స్వామిని చూడటానికి రెండుకళ్ళూ చాలవు.

చిత్రకృప : Ssriram mt

బంగారు స్తంభాలు

బంగారు స్తంభాలు

గర్భాలయానికి ఎదురూగా ఉన్న స్తంభాలకు "'తిరుమనై త్తూన్" అని పేరు. నంబెరుమాళ్ల సౌందర్య సందురంలో కొట్టుకొనిపోవు వారిని నిలువరించు స్తంభములుగా వీటిని పేర్కొంటారు. స్వామివారు ప్రసాదములారగించు ప్రదేశం 'గాయత్రీ మండపం' చూడవచ్చు.

చిత్రకృప : Redtigerxyz

మొదటిది, రెండవది

మొదటిది, రెండవది

మొదటి ప్రాకారం - ఇక్కడ చిలుకల మండపం, యాగశాల, విరాజుబావి మొదలుగునవి చూడవచ్చు.

రెండవ ప్రాకారం - పవిత్రోత్సవ మండపం, హయగ్రీవులకు, సరస్వతీ దేవికి ఆలయాలను చూడవచ్చు.

చిత్రకృప : Nagarjun Kandukuru

మూడవది, నాల్గవది

మూడవది, నాల్గవది

మూడవది - గరుత్మంతుని సన్నిధి, వాలిసుగ్రీవుల సన్నిధి, చంద్ర పుష్కరిణి, నంజీయర్ సన్నిధి ధ్యానం కొలిచే మందిరం మొదలుగునవి చూడవచ్చు.
నాల్గవది - కూరత్తాళ్వార్ సన్నిధి, నాదముని సన్నిధి, గరుడాళ్వార్ సన్నిధి మరియు ప్రాకారంలో శ్రీరంగం విలాసం మొదలగునవి తిలకించవచ్చు.

చిత్రకృప : Jean-Pierre Dalbéra

ఐదవది, ఆరవది, ఏడవది

ఐదవది, ఆరవది, ఏడవది

ఐదవది - దీనికే ఉత్తరవీధి అని పేరు. ఈ వీధి గుండా పంగుని, త్తై బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ఊరేగిస్తారు.

ఆరవది - ఈ ప్రాకారమునకు చిత్ర వీధి అని పేరు. చిత్రి బ్రహ్మోత్సవంలో నంబెరుమాళ్ళు ఈ వీధుల్లో ఊరేగిస్తారు.ఆళ్వార్లు తిరునక్షత్రము లయందు ఈ తిరువీధులలో ఊరేగించబడతారు.

ఏడవది - వామనుని సన్నిధి, తెప్ప గుంట, దశావతారముల సన్నిధి మొదలుగునవి ఉన్నాయి.

చిత్రకృప : sowrirajan s

ఆలయాన్ని సందర్శించు సమయం

ఆలయాన్ని సందర్శించు సమయం

సందర్శించు సమయం : 9 am -12 pm, 1:15 pm - 6:00 pm మరియు 6:45 pm - 9 :00 pm వరకు. పండుగల సమయాలలో టైమింగ్స్ మారుతూ ఉంటాయి.
శీఘ్ర దర్శనం : ఒక్కొక్కరికి 250 రూపాయలు, విశ్వరూప సేవ కు 100 రూపాయలు టికెట్ ఉంటుంది.

చిత్రకృప : Jayashree B

భారతీయ సంస్కృతి

భారతీయ సంస్కృతి

ఆలయాన్ని దర్శించే భక్తులు భారతీయ సంస్కృతి ఉట్టిపడే దుస్తులు ధరించి లోనికి వెళ్ళాలి. పంచె, కుర్తా ధరించి లోనికి వెళ్ళటం ఉత్తమం. సాధారణ భక్తులు ప్రధాన విగ్రహాన్ని ముట్టుకోరాదు.

చిత్రకృప : Nagarjun Kandukuru

ఉత్సవాలు

ఉత్సవాలు

శ్రీరంగనాథ స్వామి వారికి ఏటా మూడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అవి తాయ్ (జనవరి - ఫిబ్రవరి), పంగుని (మార్చి - ఏప్రియల్), చిత్తిరై(ఏప్రియల్ - మే). ఈ బ్రహ్మోత్సవాలను తిలకించటానికి దేశంలోని విష్ణు భక్తులు శ్రీరంగం తరలివస్తుంటారు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరంగం దేవాలయాన్ని 10 లక్షల మంది దర్శించుకుంటారు.

చిత్రకృప : shakarlamba

వసతి & అన్నదానం

వసతి & అన్నదానం

శ్రీరంగం ఆలయం సమీపంలో వసతి కై అనేక హోటళ్ళు కలవు. ఏసీ, నాన్ - ఏసీ గదులు లభ్యమవుతాయి. ఆలయంలో ప్రతిరోజూ అన్నదానం నిర్వహిస్తారు.

చిత్రకృప : Yuv103m

సమయపురం మరియమ్మన్ ఆలయం

సమయపురం మరియమ్మన్ ఆలయం

శ్రీరంగంలో స్వామి వారి ఆలయాన్ని తనివితీరా చూశాక సమయపురం మరియమ్మన్ దేవాలయాన్ని తప్పక దర్శించాలి. ఆది, మంగళ, శుక్రవారాల్లో దేవతకు ప్రత్యేక పూజలు జరుపుతారు. మవిలక్కు మావు గా పిలువబడే నైవేద్యం దేవతకు ఇష్టమైనదిగా చెప్తారు. దీనిని బియ్యంపిండి, నెయ్యి, పప్పు, బెల్లం తో తయారుచేస్తారు. ఈ నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా పెడతారు.

చిత్రకృప : TRYPPN

జంబులింగేశ్వర మరియు అఖిలాండేశ్వరి దేవాలయం, తిరువనైకవల్

జంబులింగేశ్వర మరియు అఖిలాండేశ్వరి దేవాలయం, తిరువనైకవల్

మీకు సమయం ఉంటే, శ్రీరంగం కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనైకవల్ లో జంబులింగేశ్వర మరియు అఖిలాండేశ్వరి దేవాలయం ను దర్శించండి. పురాణాల ప్రకారం శివుడు తపస్సుకు భంగం కలిగించిన పార్వతీ దేవిని భూమిపై తపస్సు చేయవలసిందిగా ఆదేశిస్తాడు శివుడు. అప్పుడు ఆమె అఖిలాండేశ్వరిగా అవతరించి జంబు అడవిలో తపస్సు చేసి కావేరి నీటితో శివలింగాన్ని తయారుచేసిందని చెబుతారు.ఇప్పటికీ శివలింగం ప్రదేశం నీటితో నిండి ఉంటుంది.

చిత్రకృప : Ilya Mauter

శ్రీరంగం ఇలా చేరుకోండి

శ్రీరంగం ఇలా చేరుకోండి

రైల్వే స్టేషన్ : శ్రీరంగంలో రైల్వే స్టేషన్ కలదు. అయినప్పటికీ 9 కిలోమీటర్ల దూరంలో తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ సూచించదగినది . హైదరాబాద్, చెన్నై,విజయవాడ, కన్యాకుమారి, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లన్నీ స్టేషన్ లో ఆగుతాయి.

విమాన మార్గం : 10 కిలోమీటర్ల దూరంలో ట్రిచి దేశీయ విమానాశ్రయం కలదు. ఇక్కడ కు దేశం నలుమూలల నుండి విమానాలు వస్తుంటాయి. ఎయిర్ పోర్ట్ బయట క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి శ్రీరంగం చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం : శ్రీరంగం క్షేత్రానికి తిరుచిరాపల్లి, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, కన్యాకుమారి తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్రకృప : FlickreviewR

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X