Search
  • Follow NativePlanet
Share
» »అలంపూర్ - శిధిలమవుతున్న ఆలయాల మధ్య పర్యటన !

అలంపూర్ - శిధిలమవుతున్న ఆలయాల మధ్య పర్యటన !

By Mohammad

కొన్ని వందల ఏళ్ల పాటు పుణ్య క్షేత్రంగా విరాజిల్లిన ప్రదేశం ఇప్పుడు శిధిలావస్థకు చేరుకుంది. దక్షిణ కైలాసం గా భక్తుల నీరాజనాలు అందుకున్న ఆ చారిత్రక పట్టణం ఇప్పుడు చరిత్ర పుటలకే పరిమితం కావచ్చు కానీ అప్పట్లో శిల్ప సంపదకు నిలువెత్తు దర్పణంలా సాక్షాత్కరించింది. ఆ పట్టణం కనుమరుగు కాకమునుపే చూసొద్దాం పదండి ..!

బాదామి చాళుక్యుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ప్రదేశం అలంపూర్. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక పట్టణం ఉన్నది. జాతీయ రహదారికి చేరువలో ఉన్న అలంపూర్ కు బస్సు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

అలంపూర్ పట్టణం కర్నూల్ నగరానికి 27 కి. మీ ల దూరంలో, మహబూబ్ నగర్ పట్టణానికి 90 కి. మీ ల దూరంలో, గద్వాల కు 61 కి. మీ ల దూరంలో మరియు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 200 కి. మీ ల దూరంలో కలదు. అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో 5 దవది మరియు ఈ క్షేత్రంలో నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బాదామి చాళుక్యలు 2000 సంవత్సరాల క్రితం ఈ తొమ్మిది ఆలయాలను నిర్మించి శివునికి అంకితం చేశారు. జోగులాంబ, బ్రహ్మశ్వర స్వామి ఆలయాలు చరిత్ర ప్రసిద్ధి గాంచినవి.

జోగులాంబ ఆలయం

జోగులాంబ ఆలయం

దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో 5 దవది అలంపూర్ జోగులాంబ ఆలయం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. జోగులాంబ అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్లు పురాణ కధనం. అమ్మవారు ఉగ్రరూపం తో ఉన్నప్పటికీ, ఆలయంలోని కోనేరు శాంతపరుస్తుంది స్థానికుల విశ్వాసం.

చిత్ర కృప : రహ్మానుద్దీన్

సూర్యదేవాలయం

సూర్యదేవాలయం

క్రీ.శ. 9 వ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణు మూర్తి కి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. అలాగే, శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఉన్నది.

చిత్ర కృప : Venugopala Rao Veerisetti

పాపనాశనం

పాపనాశనం

అలంపూర్ కు కు సమీపంలో పాపనాశనం అనే ప్రదేశం కలదు. అక్కడ సుమారు 20 కి పైగా శివాలయాలు వివిధ ఆకారాలలో, పరిమాణాలలో ఉన్నాయి. ఇందులో పాపనాశేశ్వర ఆలయం ముఖ్యమైనది.

చిత్ర కృప : Venugopala Rao Veerisetti

నవ బ్రహ్మ ఆలయాలు

నవ బ్రహ్మ ఆలయాలు

నవబ్రహ్మ ఆలయాలను బాదామి చాళుక్యులు నిర్మించారు. వీరు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో చాలానే ఆలయాలను కట్టించారు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ మరియు విశ్వ బ్రహ్మ అనే తొమ్మిది బ్రహ్మ ఆలయాలు నవ బ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి చెందినాయి.

చిత్ర కృప : krishna gopal

ఆలయాల గురించి సంక్షిప్తంగా

ఆలయాల గురించి సంక్షిప్తంగా

బాలబ్రహ్మశ్వర దేవాలయం ఆలయాలన్నింటిలో పెద్దది.

తారక బ్రహ్మ దేవాలయం శిధిలమై ఉంటుంది మరియు గర్భగుడిలో ఎటువంటి విగ్రహం ఉండదు

స్వర్గ బ్రహ్మ దేవాలయం సుందరమైనది మరియు చాళుక్యుల మచ్చుతునక.

చిత్ర కృప : siva saradhi

ఆలయాల గురించి సంక్షిప్తంగా

ఆలయాల గురించి సంక్షిప్తంగా

పద్మ బ్రహ్మ దేవాలయం శిధిలమై అద్భుతమైన స్పటిక లింగాన్ని కలిగి ఉంటుంది

విశ్వ బ్రహ్మ దేవాలయం చూడచక్కని నిర్మాణం. ఆలయ గోడలపై రామాయణ, మహాభారత కావ్యాలను శిల్పాల రూపంలో అందంగా చెక్కినారు.

చిత్ర కృప : Sreekanth Pulipati

పురావస్తు ప్రదర్శన శాల

పురావస్తు ప్రదర్శన శాల

జోగులాంబ దేవాలయం సమీపాన 1952 వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శన శాల ఉన్నది. క్రీ. శ. 6 వ శతాబ్దం మొదలు క్రీ. శ.12 వ శతాబ్దం వరకు సంబంధించిన పురాతన, చారిత్రక శిల్పాలను మ్యూజియంలో భద్రపరిచారు. ఉదయం 10 : 30 నుండి సాయంత్రం 5 : 00 గంటల వరకు సందర్శించవచ్చు.

మీకు తెలీని అలంపూర్ !

మీకు తెలీని అలంపూర్ !

అలంపూర్ టవాళ్ళ కు ప్రసిద్ధి. చేనేత కార్మికులు నేత మొగ్గలపై నేసిన టవాళ్ళ కు అమెరికా లో గిరాకీ ఎక్కువ. మార్కెట్ లో లభిస్తున్న రంగురంగుల టవాళ్ళ కు ఏమాత్రం తీసిపోకుండా వీటిని తయారుచేస్తారు. జోగులాంబ దర్శనానికి వచ్చే చాలామంది భక్తులు విక్రయ కేంద్రాలకు వెళ్లి టవాళ్ళు, సాదర్ దుప్పట్లు కొనుగోలు చేస్తుంటారు.

చిత్ర కృప : tungyingtex

మీకు తెలీని అలంపూర్ !

మీకు తెలీని అలంపూర్ !

టవాళ్ళు అయిపోయాయా ! ఇక ఇళ్లవంతు. ఈ ఊరిలోని ఇళ్లన్నీ గమనిస్తే ఎక్కడా కూడా బహుళ అంతస్తులు కనిపించవు. కారణం అమ్మవారి ఆలయ గోపురానికి మించి తమ ఇళ్ల ఎత్తు ఉండకూడదని భక్తుల నమ్మకం. అలా కాదని కట్టుకుంటే, ఆర్థికంగా, మానసికంగా నష్టపోతారని స్థానికులు చెబుతారు.

చిత్ర కృప : ana belen plaza

కర్నూలు తో సంబంధం ఏంటి ?

కర్నూలు తో సంబంధం ఏంటి ?

అప్పట్లో ఆలయ నిర్మాణానికి అవసరమైన రాళ్లను ఎడ్ల బండ్ల పై తరలించేవారు. ఆ బండ్లు నదిలో ప్రయాణిస్తున్నప్పుడు కందెన నీటిలో కరిగిపోయేది. మళ్ళీ వేసేవారు మళ్ళీ కరిగిపోయేది. అందుకే ఆ చక్రాలకు వేసే కందెన తయారీ కొరకు ఒక గ్రామం ఏర్పాటుచేశారు. అదే కందెన వోలు .. ఇప్పటి కర్నూలు.

చిత్ర కృప : Veera.sj

అలంపూర్ ఎలా చేరుకోవాలి ?

అలంపూర్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

అలంపూర్ కు 200 కి. మీ ల దూరంలో హైదరాబాద్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి అలంపూర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

అలంపూర్ లో జోగులాంబ హాల్ట్ (అలంపూర్ రోడ్డు) పేరుతో రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు - హైదరాబాద్ రైల్వే లైన్ లో ఈ స్టేషన్ కలదు. కర్నూలు, హైదరాబాద్, గద్వాల్ నుండి ప్యాసింజర్ రైళ్లు, కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు వస్తుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం

జాతీయ రహదారి అలంపూర్ గుండా వెళుతుంది. హైదరాబాద్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Naidugari Jayanna

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X