Search
  • Follow NativePlanet
Share
» »రొటీన్ లైఫ్ కి భిన్నంగా...మాచ్ ఖండ్ యాత్ర!!

రొటీన్ లైఫ్ కి భిన్నంగా...మాచ్ ఖండ్ యాత్ర!!

అందం అంటే అది ప్రకృతే! హిమగిరి సొగసులు... జడపాయల్లా విడిపోయే జలపాతాలు... పచ్చని కొండకోనలు... ప్రకృతి అందాలు ఎన్నో! ఇవన్నీ మాచ్‌ ఖండ్‌ సొంతం...ఉవ్వెత్తున ఎగిసిపడే ‘డుడుమా జలపాతం' పరవళ్ళ మనసును పరవశింపజేస్తాయి. ఆంధ్ర - ఒడిశా రాష్ట్రాల పరిహద్దు ప్రదేశం అయిన ఈ ప్రకృతి అందాలు వింత అనుభూతిని కలిగిస్తాయి. ఏడాది పాటు... ఇటు ఆంధ్ర అటు ఒరిస్సా రాష్ట్రాలను విడదీస్తూ పారే జలపాతం కార్తిక మాసంలో అదనపు అందాలతో కనిపిస్తుంది. ఈ ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది... ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు విద్యుత్‌ వెలుగులను ప్రసాదిస్తున్న ‘మాచ్‌ఖండ్‌ ప్రదేశం'.

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం

విశాఖ జిల్లా నుంచి ఉదయం బయలుదేరితే మధ్యాహ్నం వరకు మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం చేరుకోవచ్చు. ఎక్కడో లోయలో ఉన్న విద్యుత్‌ కేంద్రానికి వెళ్లాలంటే ట్రాలీలు ఉంటాయి. మెట్ల దారి కూడా ఉంటుంది. అయితే ఆ దారిని ఎవరూ ఉపయోగించరు. ఎందుకంటే మెట్లు దిగాలంటే సుమారుగా 45 నిమిషాలు సమయం పడుతుంది అదే ట్రలీ అయితే త్వరగా అవుతుంది. దారిలో డుడుమా జలపాతం అందాలను వీక్షిస్తూ... మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి చేరుకోవచ్చు. మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రం భారత్‌లో అతిపెద్ద హైడ్రోపవర్‌ ప్రాజెక్టులలో ఒకటి. దూరంగా డుడుమా జలపాతం... అంత ఎత్తునుంచి పడుతూ రెండు కొండల మధ్య నుంచి ప్రవహిస్తూ ఉన్న ఆ దృశ్యాన్ని చూడాలే గాని వర్ణించి చెప్పలేం.

రొటీన్ లైఫ్ కి భిన్నంగా...మాచ్ ఖండ్ యాత్ర!!

డుడుమా జలపాతం దగ్గరి నుంచి..

Photo Courtesy: Partha Pratim Patra

బాగ్రా

బాగ్రా కూడా దాని జలపాతాలకు చాలా పేరుగాంచింది. ఇది మాచ్ ఖండ్ వెళ్లే మార్గంలోనే ఒకవైపు వాలి ఉంటుంది. ఇది కూడా తప్పక చూడవాల్సిన జలపాతంగా ప్రసిద్ధి చెందింది. ఇది కొలాబ్ నది నుండి 30 అడుగుల ఎత్తునుండి కిందకు దిగే మూడు జలపాతాలను కలిగి ఉంది.సందర్శకుల సహాయార్ధం ఈ జలపాత ప్రదేశం వద్ద ఒక రెస్ట్ హౌస్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్రాంతాన్ని అలంకరించే అద్భుతమైన సహజ అందం కారణంగా వినోదం కోసం తరచుగా ప్రజలు ఇక్కడికి వస్తారు. పర్యాటకులు నిరంతరంగా ప్రవహించే ఈ జలపాతాన్ని చూడడానికి ఈ ప్రాంతానికి వస్తారు.30 అడుగుల ఎత్తునుండి చిక్కటి తెల్లని పాలలాగా జాలువారే సెలయేరు అందంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం కూడా జేయ్పూరే లోని చూడదగ్గ ప్రదేశాలలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది.

రొటీన్ లైఫ్ కి భిన్నంగా...మాచ్ ఖండ్ యాత్ర!!

పాలలాగా జాలువారే సెలయేరు

Photo Courtesy: orissa tourism

కొలాబ్ జలాశయం

మాచ్ ఖండ్ కి వస్తే చూడవాల్సిన మరొక ప్రదేశం ఈ కొలాబ్ జలాశయం!! ఇది సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున కొలాబ్ నదిపై ధారాళంగా ప్రవహిస్తుంది. ఈ జలాశయం జలవిద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ఉన్న ఒరిస్సా హైడ్రో ఎలక్ట్రిక్ కార్పోరేషన్ లిమిటెడ్ తాగు నీటిని జేయ్పూరేతో పాటు కోరాపుట్, సునబెడ, దమొంజోడి కి తాగు నీటిని సరఫరా చేస్తుంది. కొలాబ్ జలాశయానికి సమీపంలో ఉన్న బొటనికల్ గార్డెన్ వారాంతంలో విహారానికి వచ్చే పర్యాటకులు చూడవచ్చు. ఈ తోట మంత్రముగ్ధుల్ని చేసే 200 రకాల పూల మొక్కలకు నిలయం. ప్రజలు ఇక్కడ వినోదం తోపాటు బోటింగ్ కూడా ఆనందిస్తారు. ఇక్కడ నీటితో నిండి ఉన్న ‘కేచేలా' అనే ఒక చిన్న ద్వీపం ఉంది. దాదాపు గంటన్నర సమయం పట్టే ఈ ప్రయాణాన్ని కేవలం బోటింగ్ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ఈ రిజర్వాయర్ రాత్రిపూట దృశ్యం కూడా చూడదగ్గది. ఈ అద్భుతమైన రిజర్వాయర్ అందాన్ని, బాగా నిర్వహించబడే బొటనికల్ గార్డెన్ ను చూడడానికి ప్రజలు ఈ ప్రాంతానికి గుంపులుగా వస్తారు.

రొటీన్ లైఫ్ కి భిన్నంగా...మాచ్ ఖండ్ యాత్ర!!

బొటనికల్ గార్డెన్

Photo Courtesy: Udaya245

ఇక్కడికి ఎలా చేరుకోవాలి??

విమాన మార్గం
మాచ్ ఖండ్ లో ఎటువంటి విమానాశ్రయం లేదు. కానీ వైజాగ్ ఏర్‌పోర్ట్ ఉంది. ఈ ఏర్‌పోర్ట్ నుంచి సుమారుగా నాలుగు గంటలు ప్రయాణిస్తే మాచ్ ఖండ్ కి చేరుకోవచ్చు. వైజాగ్ ఏర్‌పోర్ట్ కి ప్రస్తుతం దేశంలోనే కాక వివిధ దేశాలనుంచి కూడా విమాన సర్వీసులు నడుపుతున్నారు.
రైలు మార్గం
జేయ్పూరే మాచ్ ఖండ్ కి చేరువలో ఉన్న రైల్వే స్టేషన్ కానీ దీనికంటే కూడా కోరాపుట్ బాగుంటుంది ఎందుకంటే ఇది జంక్షన్ కనుక!!. ఇక్కడి నుంచి రైళ్లు బాగానే రాక పోకలు సాగిస్తుంటాయి.
రోడ్డు మార్గం
విశాఖపట్టణం నుంచి గానీ, లేకుంటే విజయ నగరం నుంచి గానీ బస్సులు నడుపుతుంటారు. కోరాపుట్ అనేది ప్రధాన మార్గం. ఈ ఊరు మీదుగానే ప్రయాణం చేయవల్సి ఉంటుంది. కోరాపుట్ భువనేశ్వర్ నుంచైతే సుమారుగా 500 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖ పట్టణం నుంచైతే 200 కిలోమీటర్లు, జేయ్పూరే నుంచైతే 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి ఇక సులభంగా మచ్ ఖండ్ చేరుకోవచ్చు.
ఉత్తమ మార్గం
విశాఖ జిల్లా అరకులోయ మీదుగా ప్రయాణం ప్రారంభించి... కొత్తవలస, శృంగవరపుకోటల మీదుగా చిలుకలగడ్డ గుండా ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని ఈ అందాల గనిని చేరుకోవచ్చు. వెళ్లే దారిలో ఓ మీరు దారితప్పే ప్రమాదం ఉంది. ‘మాచ్‌ఖండ్‌'లానే మరో ప్రదేశం ‘మత్స్యఖండ్‌' కూడా ఉంది. ముందే ఎంక్వరీ చేసుకుంటే సరి లేదంటే... దారితప్పే ప్రమాదం ఉంది. దారిపొడవునా కొండకరివేపాకు చెట్లు ఉంటాయి. ఎంతకావాలంటే అంత కోసుకోవచ్చు. మధ్య మధ్యలో చిన్న చిన్న సెలయేళ్ళు... గిరిజన సంతలు... ప్రయాణాన్ని మరింత ఆహ్లాదపరుస్తాయి. ఇలా హాయిహాయిగా ఒడిశా సరిహద్దులోని మాచ్ ఖండ్ చేరుకోవచ్చు.

రొటీన్ లైఫ్ కి భిన్నంగా...మాచ్ ఖండ్ యాత్ర!!

పొదామా ఇక..

Photo Courtesy: Nibedita

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X