Search
  • Follow NativePlanet
Share
» »ప్రకృతి ఒడిలో ... అనంతాద్రి ఆలయం !!

ప్రకృతి ఒడిలో ... అనంతాద్రి ఆలయం !!

ఆంధ్ర ప్రదేశ్ లోని మహిమాన్వితమైన ఈ క్షేత్రం వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో దర్శనమిస్తుంది. శ్రీమన్నారాయణుడు వివిధ రూపాలతో .. నామాలతో కొండలపై కొలువుదీరుతుంటాడని మనకు తెలుసు. అదే విధంగా ఈ క్షేత్రంలో సుభద్ర .. బలభద్ర .. జగన్నాథుడు, శ్రీదేవి .. భూదేవి సమేత శ్రీనివాసుడు స్వయంభువులుగా పూజలు అందుకుంటూ వుంటారు. ప్రకృతి అందాల నడుమ కొండలపై నెలకొన్న అనంతారం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తులతో ఆలరారుతోంది. ఆ స్వామిని దర్శించుకునే భక్తులు, అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులవుతుంటారు. పట్టణానికి సరిగ్గా నాలుగు కిలో మీటర్ల దూరంలోని కొండలు, గుట్టలు మధ్య వెలసిన స్వామి వారికి 11వ శతాబ్దంలో శాలి వాహనులు ఇక్కడ ఈ జగన్నాయక స్వామి దేవాలయాన్ని అత్యంత కళా నైపుణ్యతతో నిర్మించారు.

ఈ కొండపైన ఏం జరిగింది ??

అయితే భక్తులైనా .. అర్చకులైనా చీకటిపడిన తరువాత కొండదిగి వచ్చేస్తుంటారు. ఆ తరువాత ఆ కొండపై ఏంజరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనల వలన, కొన్ని విశేషాలు వెలుగు చూస్తుంటాయి. పూర్వం ఇక్కడి జగన్నాథుడికి భక్తులు సమర్పించిన కానుకలు ఆయన సన్నిధిలోనే భద్రపరిచేవారు. ఆ సొమ్ముకోసం ఒక రాత్రివేళ కొంతమంది దొంగలు స్వామివారి కొండపైకి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ విహరిస్తున్న స్వామివారిని ఎవరో భక్తుడనుకుని దొంగలు దాడి చేయడానికి ప్రయత్నించి శిలలుగా మారిపోయారు. ఆ శిలలను కూడా ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు. ఈ కారణంగా ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నాడనీ, రాత్రి వేళలో స్వామి సేదదీరతాడని భక్తులు విశ్వసిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో ఆయనని సేవిస్తూ తరిస్తుంటారు.

ప్రకృతి ఒడిలో ... అనంతాద్రి ఆలయం !!

వెంకటేశ్వర స్వామి ఆలయం

Photo Courtesy:Ramesh

అనంతారం గ్రామ శివారులో ఎతె్తైన గుట్టపై ఈ ఆలయాన్ని నిర్మించగా చుట్టూ దట్టమైన అడవి పక్కనే పెద్ద చెరువు చూడడానికి సుందరమైన ఆహ్లాదం కలిగించే వాతా వరణం సాక్షాత్కరిస్తోంది. గర్భగుడి ప్రాంతంలో కొండను తొలచి అదే రాయిపై శ్రీవెంకటే శ్వరస్వామి, పద్మావతి, అలివేలు మంగ రూపాలను మలచిన తీరు ముచ్చట గోలుపుతోంది. ఈ ఆలయంలోనే రామస్థూపం నిర్మించారు. ఇంకా ఈ ప్రాంతంలో వివిధ కట్టడాలతో పాటు చుట్టూ పచ్చని చెట్లు, గుట్టలు, చెరువు నీటితో, పచ్చని పంట పొలాలతో పర్యాటక కేంద్రంగా కూడా విలసిల్లుతోంది.

కొండపై ఆలయం నలు దిశల అభివృద్ధి జరుగుతూ భక్తులకు అన్ని విధాలుగా ఆ నిర్మాణాలు ఎంతో సౌకర్యంగా విలసిల్లుతున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల ఆట వస్తువులను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. పార్కులు, పూలమొక్కలు, కోనేరు, ఫౌంటెన్‌ లతో పాటు చుట్టూ పచ్చని చెట్లు, పక్కనే ముత్యాలమ్మ చెరువు, ఆ పక్కనే పచ్చని పంటపోలాలతో కమనీయ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

ఆలయానికి వెళ్లే దారిలో గరుత్మంతుని భారీ విగ్రహం అందర్నీ ఆకట్టుకొంటుంది. పక్కనే ఉన్న పెద్ద చెరువులో బోటింగ్‌ చేయవచ్చు. శని, ఆదివారాల్లో భక్తజనంతో ఆలయం కిక్కిరిసిపోతోంది. పట్టణంలో ఎక్కడా ఆహ్లాదపర్చే పార్కులేని కారణంగా సెలవు దినాల్లో అందరూ ఆలయం సేదతీరుతున్నారు. భక్తులేకాకుండా పర్యాటకులు ఇక్కడికి వచ్చి శుభకార్యాలు చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉండడంతో నిత్యం హడావుడి కనిపిస్తోంది. ప్రతి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి రోజు సందర్శకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

ప్రకృతి ఒడిలో ... అనంతాద్రి ఆలయం !!

గరుత్మంతుని విగ్రహం

Photo Courtesy:jeevan

ఈ ఆలయానికి కాస్త దగ్గరిలోనే ఇమాంషావలి దర్గా పర్యాటక ప్రాంతంగా మారింది. ప్రతి శుక్రవారం వివిద ప్రాంతాల నుంచి ముస్లింలతో పాటు హిందువులు కూడా దర్గాను సందర్శిస్తారు. మహబూబాబాద్‌కు ఈ దర్గా మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రతి 20 నిమిషాలకు ఆటో వెలుతుంది.

ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

ఈ ఆలయానికి దగ్గరిలో రెండు విమానాశ్రయాలు ఉన్నాయి. అవి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. మరొకటి విజయవాడలోని దేశీయ విమానాశ్రయం. అక్కడ దిగి ఆర్టీసీ బస్సులో మహబూబాబాద్ కు చేరుకోవచ్చు.

రైలు మార్గం

మహబూబాబాద్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో అనంతాద్రి ఆలయం ఉంది. హైద్రాబాద్‌, వరంగల్‌, విజయవాడ రైలుమార్గం మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగితే ఆటో సౌకర్యాలు ఉన్నాయి.

రోడ్డు మార్గం

ఇక్కడికి చక్కటి రోడ్డు వ్యవస్థ ఉంది. మీరుగనక చూసినట్లయితే ఈ ఆలయానికి వెళ్లేందుకు మహబూబాబాద్‌, ఇల్లందు , మొగిలిచర్ల వంటి అక్కడి ప్రాంతాలనుంచే కాకుండా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ వంటి నగరాలనుంచి కూడా ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ప్రతీ శనివారం మానుకోట నుండి ఆలయం వరకు భక్తులను చేరవేసేందుకు ఉచిత వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ప్రకృతి ఒడిలో ... అనంతాద్రి ఆలయం !!

మహబూబాబాద్ లోని రైల్వే స్టేషన్

Photo Courtesy: Rcbutcher

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X