Search
  • Follow NativePlanet
Share
» »ఆహ్లాదకర ప్రకృతి ఒడిలో సుందర జలపాతం - ఉబ్బలమడుగు !

ఆహ్లాదకర ప్రకృతి ఒడిలో సుందర జలపాతం - ఉబ్బలమడుగు !

By Mohammad

ఆ జలపాతం గురించి పెద్దగా ఎవ్వరికీ తెలీదు ... ఇలా చెప్పేదానికన్నా వారికి శ్రమ, ఓపిక తక్కువ అని చెప్తే మంచింది. లేకపోతే ఏంటండీ ! అంతటి సుందర ప్రదేశాన్ని చూడకుంటా ఉంటె ఎట్టా ?! వర్షాకాలంలో చూడాలి ఆ ప్రాంతం యొక్క పచ్చదనం ధగధగ మెరుస్తూ కళకళలాడుతూ ఉంటుంది. ఆ ప్రదేశమే .. ఉబ్బలమడుగు.

ఉబ్బలమడుగు జలపాత దృశ్యం

ఉబ్బలమడుగు జలపాత దృశ్యం

చిత్ర కృప : PROMatthieu Aubry. Follow

తెలంగాణ లో ఆదిలాబాద్, ఆంధ్ర ప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలు జలపాతాలకు పెట్టింది పేరు. అలాంటి చిత్తూరు జిల్లాలో బుచ్చినాయుని కండ్రిగ, వరదయ్య పాలెం మండలాల సరిహాద్దు ప్రాంతంలో ఉబ్బలమడుగు జలపాతం కలదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో సిద్ధులకొన అని పిలువబడే అడవిలో ఈ సుందర జలపాతం కలదు. తిరుపతి నుండి ఈ జలపాతం 85 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ జలపాతాన్నే తడ జలపాతం అని కూడా పిలుస్తారు. వరదయ్యపాలెం నుండి ఉబ్బలమడుగు కు రోడ్డు సౌకర్యం కలదు. అందుకే పర్యాటకులు కూడా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు.

వీలైతే ఇది కూడా చదవండి : శ్రీకాళహస్తి - ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం !

తడ జలపాతానికి వెళ్లే మార్గం

తడ జలపాతానికి వెళ్లే మార్గం

చిత్ర కృప : McKay Savage

సిద్దులకొన భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతం. ఉబ్బలమడుగు జలపాతానికి చేరుకోవాలంటే 10 కి. మీ ల వరకు ట్రెక్కింగ్ చేయాలి. అడవి అంతా అందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి అలసట కనపడకుండా చేస్తాయి. ఎంత దూరం ప్రయాణించామో కూడా తెలీదు. రోడ్డు మొత్తం మట్టితో ఉన్నప్పటికీ చిన్న చిన్న కొలనులు అక్కడక్కడ దర్శనం ఇస్తుంటాయి. కొలనులో దిగి కేరింతలు, ఈతలు కొట్టవచ్చు. అవసరమైతే ఫోటోలు, సెల్ఫీ లు దిగవచ్చు. నీళ్ల మీద నిర్మించిన వంతెన ఇక్కడి ప్రధాన ఆకర్షణ.

నీటి సెలయేర్ల మీద నిర్మించిన వంతెన

నీటి సెలయేర్ల మీద నిర్మించిన వంతెన

చిత్ర కృప : Deepak kumar

పక్షుల కిలకిలరాగాలు, చిన్నపాటి సెలయేర్లు, ప్రశాంత ప్రకృతిని దాటుకుంటూ అలానే ముందుకు వెళితే వెళితే గలగల శబ్దాలు చేస్తూ పై నుండి కింద పడే సుందర జలపాతం దర్శనం ఇస్తుంది. దాన్ని చూస్తే మనల్ని మనం మరిచిపోవాల్సిందే! చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ జలపాతం కింద తనివితీరా జలకాలు ఆడవచ్చు.

తడ ఫాల్స్ వద్ద పర్యాటకులు

తడ ఫాల్స్ వద్ద పర్యాటకులు

చిత్ర కృప : Pradeep Paratamsetti

సిద్దేశ్వర ఆలయం

ఉబ్బలమడుగు జలపాతం పక్కనే సిద్దేశ్వర ఆలయం కలదు. ఈ ఆలయం పురాతనమైనది మరియు వందేళ్ల చరిత్ర కలది. ఈ ఆలయంలో పూజలు చేస్తే శుభం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ వెలసిన శివలింగం స్వయంభూగా పురాణాలలో పేర్కొన్నారు.

జలపాతం సమీపంలోని శివాలయం

జలపాతం సమీపంలోని శివాలయం

చిత్ర కృప : sabiths Follow

ఇక్కడికి వచ్చే చాలా మంది పర్యాటకులు ఆలయాన్ని దర్శించుకొని ఆతరువాత జలపాతం వద్దకు చేరుకుంటారు లేదా జలపాతం వద్ద సాయంత్రవరకు సేదతీరి ఆతరువాత సిద్దేశ్వరుడిని దర్శించుకుంటారు.

వసతి సౌకర్యాలు

ఉబ్బలమడుగు పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎటువంటి వసతి సౌకర్యాలు ఉండవు. ఎంతవరకు మీరు వరదయ్యపాలెం వద్దనే అన్ని చూసుకోవాలి. వరదయ్యపాలెం నుండి ఆటోలు లేదా సొంత వాహనాలలో ఉబ్బలమడుగు ఎంట్రెన్స్ వద్దకు చేరుకోవచ్చు. అక్కడి నుండి ఇక నడకమార్గమే!

ట్రెక్కింగ్ చేస్తూ జలపాతం వద్దకు చేరుకుంటున్న యాత్రికులు

ట్రెక్కింగ్ చేస్తూ జలపాతం వద్దకు చేరుకుంటున్న యాత్రికులు

చిత్ర కృప : deva Follow

నడకమార్గంలో ప్రయాణించే పర్యాటకులకు సూచించదగినవి

నీళ్ల బాటిల్, తినుబండారాలు, బిస్కట్లు, లంచ్ పొట్లాలు (పులిహోర, చపాతీలు, రొట్టెలు తీసుకొని వెళ్ళటం ఉత్తమం), ఒక జత బట్టలు, టవాలు (ఈత కొడితే) వెంట తీసుకెళ్లడం ఉత్తమం.

తడ ఫాల్స్ నీటి ప్రవాహం

తడ ఫాల్స్ నీటి ప్రవాహం

చిత్ర కృప : Jagadeesh SJ

ఉత్సవాలు, పండగలు

మహాశివరాత్రి రోజున ఉబ్బలమడుగు ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది. కుటుంబంతో సహా ఇక్కడకు చేరుకొనే స్థానికులు ఇక్కడే టెంట్లు వేసుకొని వంటావార్పు కానిచ్చేస్తారు. ఆ సమయంలో దుకాణాలు సైతం ఇక్కడ వెలుస్తాయి.

తడ ఫాల్స్ వద్ద పర్యాటకుల కోలాహలం

తడ ఫాల్స్ వద్ద పర్యాటకుల కోలాహలం

చిత్ర కృప : Michael Fernando

ఉబ్బలమడుగు జలపాతానికి ఎలా చేరుకోవాలి ?

ఇదివరకే చెప్పుకున్నట్లు ముందుగా వరదయ్యపాలెం నుండి ఆటోలలో ఇక్కడికి చేరుకోవాలి. శివరాత్రి పర్వదినాన ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. శిసాధారణ రోజులలో ఉబ్బలమడుగు ప్రాంతంలో ఉండటం ప్రమాదకరం. కనుక చీకటి పడగానే వరదయ్యపాలెంకు తిరుగు ప్రయాణం అవ్వండి !

జలపాత కొండచరియలు వద్ద సేదతీరుతున్న యాత్రికులు

జలపాత కొండచరియలు వద్ద సేదతీరుతున్న యాత్రికులు

చిత్ర కృప : deva Follow

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X