Search
  • Follow NativePlanet
Share
» »అణువణువునా పచ్చదనం నింపుకున్న కొండలు !!

అణువణువునా పచ్చదనం నింపుకున్న కొండలు !!

మెట్టుపాళయం నీలగిరి కొండలకు పాదంలాంటిది. కొండలు, లోయలు, జలపాతాల మీదుగా ఐదున్నర గంటల స్టీమ్‌ ఇంజన్‌ ట్రైన్‌ లో ప్రయాణం. సింప్లీ సూపర్బ్‌ అన్నమాట! అణువణువునా పచ్చదనం నింపుకున్న కొండలు !

మెట్టుపాళయం నీలగిరి కొండలకు పాదంలాంటిది. మెట్టుపాళయంనిండా 'రోబో' ఫీవరే. ఎటుచూసినా ఆ సినిమా పోస్టర్లే! ఏమైనా ఒక వ్యక్తిపై అంతెత్తున అభిమానం పొంగిపొర్లడం, దాన్ని సంబంధిత వ్యక్తులు భరించడమూ కష్టమేనేమో! అది వికటించిందా ఇక అంతే! కుష్‌బూకు గుడి కట్టడం, దాన్ని కూలగొట్టడం మనం చూడలేదూ?! ఇక మన యాత్రకొద్దాం.

మెట్టుపాళయం నుండి ఊటీ కి నేరోగేజ్‌ రైలుమార్గం వుంది. స్టీమ్‌ ఇంజన్‌ ట్రైన్‌ లో ప్రయాణం. కొండలు, లోయలు, జలపాతాల మీదుగా ఐదున్నర గంటల ప్రయాణం. సింప్లీ సూపర్బ్‌ అన్నమాట! అటు పక్క చూడాలో, ఇటు పక్క చూడాలో తెలియని డోలాయమానం. అందాలన్నీ కళ్లలో నింపేసుకోవాలన్న తాపత్రయం. తల ఒకవైపు తిప్పితే మరోవైపు మిస్సయిపోతామేమోనన్న ఆత్రం. ఒకదాని వెనుక మరోటి, దాని వెనుక ఇంకోటి... ఇలా అనేక కొండలు, లోయల సమూహం. నీలగిరి కొండల అందాలు ఏమని వర్ణించేది? ప్రకృతికాంత నిండారా తలస్నానంచేసి కురులన్నీ విరబోసుకుని నీరెండలో ఆరబెట్టుకుంటుంటే ఎలా వుంటుంది? అచ్చం అలా వుంది అక్కడి సన్నివేశం. ఓ వైపు ఎత్తైన కొండలు, మరోవైపు లోతైన లోయలు... వీటిముందు మనమెంత? ఏదో సాధించేశామని విర్రవీగే మన అహమెంత?

ఫ్రీ కూపన్ సేల్ : క్లియర్ ట్రిప్ వద్ద హోటళ్లు బుక్ చేసుకోండి 50% వరకు ఆఫర్ పొందండి

స్టీమ్‌ ఇంజన్‌ ట్రైన్‌

స్టీమ్‌ ఇంజన్‌ ట్రైన్‌

యావత్‌భారతదేశాన్ని ఉర్రూతలూగించిన 'ఛయ్య ఛయ్య' పాటంతా దీనిమీదనే షూట్‌ చేశారు. అలాగే సంతోషం లాంటి ఎన్నో తెలుగు సినిమాలూనూ. ఆ రైలు కేవలం మూడే పెట్టెలు. దాని ఛార్జి ఎనిమిది రూపాయలు. ముందే రిజర్వ్‌ చేయించుకుంటే 23 రూపాయలు.

Photo Courtesy: Prakhar

కొండల పచ్చదనాలు

కొండల పచ్చదనాలు

ఈ కొండల్లో అంతర్లీనంగా కనిపించిందేమిటంటే స్వేచ్ఛ! అవును! స్వేచ్ఛే! ప్రతి చెట్టు తనకు నచ్చిన రీతిలో, తనకు తోచిన దిశవైపు హాయిగా, ఆనందంగా విస్తరించింది. దాన్ని అడ్డుకునేవారూ, అదుపు చేసేవారూ లేరు. ఈ ఆకృతిలోనే పెరగాలనే ఆంక్షలు లేవు. ఆ ఆనందం ప్రతి ఆకులోనూ, పువ్వులోనూ కనిపించింది. అందుకేనేమో మనం పెంచుకునే కుండీల్లోని మొక్కల్లో ఈ జీవం కనిపించదు. ఎంత పోషణ చేసినా సరే! బహుశా మనిషైనా అంతేనేమో! మనం ఎంతో ఖరీదుపెట్టి కొనుక్కునే మొక్కలెన్నో ఇక్కడ పిచ్చిమొక్కల్లా పెరిగాయి. ఇక పేరు తెలీని మొక్కలెన్నో తనువంతా విరిబాలలతో విరగబూశాయి. బలమైన వేళ్లతో విస్తరించిన చెట్లు, పొదలు, తీగలు... అక్టోబర్‌ నెల, మంచు తెరలింకా తొలగని సంజెవేళ, అబ్బ వర్ణింపశక్యం కావడంలేదు.

Photo Courtesy: rajonthemove

కొండల్లో చెట్ల సోయగాలు

కొండల్లో చెట్ల సోయగాలు

బతకాలన్న కోరిక ఎంత బలంగా వుండకపోతే... తన ఉనికిని చాటుకోవాలన్న ఆశ ఎంత తీవ్రంగా లేకపోతే ఆ చెట్లు ఈ బండరాళ్లను చీల్చుకుని పైపైకి ఎగబాకుతాయి?! మరి మనమెందుకు చిన్నపాటి కష్టాలకే వెన్ను చూపిస్తాం? ఎందుకు వెనుకంజ వేస్తాం? భద్రతాలేమి మనల్ని పట్టి పీడించడం వల్లేమో! ప్రపంచంలో ఏ జీవికీ లేని ఆత్మహత్య అనే దౌర్భాగ్యపు ఆలోచన మనకే ఎందుకొస్తోంది?

Photo Courtesy: Anis Ahmad

టీ తోటలు

టీ తోటలు

ఇట్లాంటి ఆలోచనలో ఉండగానే కూనూర్ వచ్చేస్తుంది. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది చూడండి అసలు మజా. చిన్న చిన్న ఊర్లు, టీ గార్డెన్లు, టీ ప్లాంటేషన్స్‌, మధ్య నిలువెత్తు 'సిల్వర్‌ ఓక్స్‌' వృక్షాలు ఇలా ఒకటేమిటి చూపరులు తనివితీరా అందాలనూ చూసి తమ అలసటను మరిచిపోతారు. వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

Photo Courtesy: Thangaraj Kumaravel

ఊటీ లేక్

ఊటీ లేక్

అక్కడక్కడా ఆగుతూ ఉదకమండలం వచ్చేస్తుంది. వచ్చి రాగానే ఊటీ లేక్ దర్శనం ఇస్తుంది. పూర్వం సినిమా డ్యూయెట్లన్నీ ఈ లేక్ లోనే షూటింగ్‌లు జరిగేవి ఉదాహరణకు 'అభినందన' సినిమాలోని 'మంచు కురిసే వేళలో..'! కానీ ఇప్పుడది పొల్యూట్‌ అయిపోయింది. ఊటీ లేక్ , ఊటీ దర్శించే పర్యాటకులకు ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక కృత్రిమ సరస్సు. దీనిని 1824 లో జాన్ సుల్లివాన్ సుమారు 65 ఎకరాల లో నిర్మించారు. వర్షాకాలం లో కొండలపై నుండి పడే నీటిని ఈ సరస్సు పొందుతుంది. అది నిండిన వెంటనే సుమారు మూడు సార్లు ఖాళీ చేస్తారు. స్థానిక మత్స్యకారులు ఇక్కడ చేపలు వేతాడతారు. మే నెలలో ప్రభుత్వం రెండు రోజులపాటు బోటు రేస్ లు నిర్వహిస్తుంది.

Photo Courtesy: Swaminathan

పైన్‌ ఫారెస్ట్‌

పైన్‌ ఫారెస్ట్‌

పైన్‌ ఫారెస్ట్‌, అక్కడన్నీ ఆకాశాన్నంటే చెట్లే. మీకు 'వసంత కోకిల' సినిమాలో ఓ సన్నివేశం గుర్తుందా?! అమాయకురాలైన శ్రీదేవి కమల్‌హసన్‌ను ''ఈ చెట్లు ఇంత ఎత్తుకు ఎందుకున్నారు?'' అని రెప్పలు అల్లల్లాడించుకుంటూ అడుగుతుంది. దానికతను ''ఆకాశంలో బూజు పడుతుంది కదా! దాన్ని దులపడానికి!'' అనేస్తాడు సింపుల్‌గా! అన్నట్లు ఆ సినిమా షూటింగంతా ఊటీలోనే!

Photo Courtesy: Rajesh Narendran

షూటింగ్‌ స్పాట్‌

షూటింగ్‌ స్పాట్‌

షూటింగ్‌ స్పాట్‌ అని ఇక్కడ ఓ ప్రదేశం వుంది. నున్నగా వున్న కొండ, చుట్టూ దట్టంగా చెట్లున్న కొండలు... టోటల్లీ సూపర్బ్‌. అది సినిమాల్లో హీరో, హీరోయిన్లు కలిసి దొర్లుకుంటూ పోతారే ఆ కొండన్నమాట! వ్యూ మాత్రం అదిరిపోతుంది! సినిక్‌ బ్యూటీకి మారుపేరనుకోండి! దాన్ని ఆస్వాదించాక ఆనందం కలగకమానదు.

Photo Courtesy: mohsinali_online

చిరుతిండ్లు

చిరుతిండ్లు

అక్కడ మొక్కజొన్న పొత్తులు ఉడకబెట్టి... ఉప్పు, కారం జల్లి వేడివేడిగా అమ్ముతుంటారు అంత చల్లటి ప్రాంతంలో! ఇక ఊరుకుంటామా, వెంటనే వాటి పని పనిపడదాం పదండి!!.

Photo Courtesy: indfood

పైకారా ఫాల్స్‌

పైకారా ఫాల్స్‌

మెల్లగా పైకారా ఫాల్స్‌ వైపుకు వెళితే, చాలాదూరం నడవాలి. దారిలో మన తెలుగువాళ్లే ఎదురై ఆ జలపాతం చిన్నగా ఉందని కంగారు పడకండి.అక్కడ ఏం కనిపిస్తాయో తెల్సా?! పిచ్చుకలు! పిచ్చుకలా అని తేలిగ్గా తీసిపారేయకండి. పిచ్చుకలు అంతరించిపోతున్నాయని వినడం లేదూ?! మీరు పిచ్చుకల కిచకిచారావాలు విని ఎన్నాళ్లైంది చెప్పండి? పైగా ఆ పిచ్చుకలు బొద్దుగా భలే ముద్దొచ్చాయి. అడవిలో పెరగడం కదూ! ఇటీవల మన జనవాసాలలోనూ పిచ్చుకలు అక్కడక్కడ మళ్లీ కనిపిస్తున్నా అవి డైటింగ్‌ చేస్తున్న పిచ్చుకల్లా ఉంటాయి.

Photo Courtesy: Ksanthosh89

పైకారా లేక్‌

పైకారా లేక్‌

ఇక 'చలో పైకారా లేక్‌'. పైకారా లేక్‌... ''ఏమని వర్ణించనూ..!'' ఒక చేయి తిరిగిన చిత్రకారుని కుంచె నుండి అలవోకగా జాలువారిన చిత్రమంటే సరిపోతుందా?! అనుమానమే! అం..త గొప్పగా ఉంటుందా సరస్సు. ప్రకృతి ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దిన ఆ రంగవల్లికను ఊపిరి బిగబట్టి కళ్లనిండా నింపుకోవడమే సరిపోతుంది. అదే గొప్ప అనుకుంటే... అందులో బోటింగ్‌! అందరూ జంగ్లీలో షమ్మీకపూర్‌లా 'యాహూ' అని అరిచి బోట్‌లో సెటిలైపోవచ్చు. చుట్టూ చిక్కనైన చక్కదనమే! అణువణువునా పచ్చదనమే... అవును పచ్చదనమే..! ప్రకృతిని చూసి పరవశించే ప్రతివారూ అక్కడ తన్మయం చెందాల్సిందే! ఆ మైమరపులోనే బోటింగ్‌ పూర్తవుతుంది. ఈ ప్రదేశం ఉదయం 8.30 గం. నుండి సా. 5 గం వరకు పర్యాటకులకు తెరచి వుంటుంది. బోటు విహార ప్రవేశ రుసుము రూ.550 మాత్రమే. సరస్సు ప్రేవేశానికి ఎంట్రీ ఫీసు లేదు.

Photo Courtesy: Antony Grossy

నీడిల్‌ రాక్‌ వ్యూ పాయింట్‌

నీడిల్‌ రాక్‌ వ్యూ పాయింట్‌

నీడిల్‌ రాక్‌ వ్యూ పాయింట్‌, అక్కడికి చేరేసరికి ఒక మధుర అనుభూతి కలుగుతుంది. కొంతదూరం నడిచాక ఆ పాయింట్‌కు చేరవచ్చు. మీరుగానక వర్షం పడుతున్న రోజులలో గనక వెళితే ఉంటుంది సుమీ...ఆ మాటలు చెప్పలేం! వాన, మబ్బుల మధ్యగా దూరంగా మొనతేలిన కొండ... ఓ వర్ణచిత్రంలా గొప్ప సొగసుగా ఉంటుందిలే!! నాకు తెలిసి సినిమాలలో సూసైడ్ లకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనుకుంటా!!

Photo Courtesy: Aasif Iqbal J

పర్యావరణానికి ప్రాధాన్యం

పర్యావరణానికి ప్రాధాన్యం

అన్నట్లు మొత్తం టూరంతా ప్రతిచోటా 'ప్లాస్టిక్‌ ప్రొహిబిటెడ్‌ ఏరియా' అని బోర్డులు కనిపిస్తాయి.. అది వుండబట్టే ఈమాత్రం ఈ అడవులు మనగలుగుతున్నాయి. లేకుంటేనా... 'సర్వనాశనం' అయిపోయి వుండేది. వరదలు రావడానికీ, పశువులు చనిపోవడానికీ, నేలంతా పాడైపోవడానికీ ప్లాస్టిక్‌ భూతం చేస్తున్న హాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే అంతటా కొండలు, చెట్లు, పువ్వులు ఎలా పెరిగేవి అలాగే వుంచారు. చెట్లను కాపాడమని హోర్డింగులుంచారు. పువ్వు చూస్తే కోయాలనుకోవడం, కాయ చూస్తే తెంచాలనుకోవడం వరకూ ఓకే! దానివల్ల ఎలాంటి నష్టం రాదు. పర్యావరణానికి ఎలాంటి భంగమూ వాటిల్లదు. కానీ... ఆ చెట్టే నరికేస్తే, కొండే తవ్వేస్తే ఎలా? కూర్చున్న కొమ్మను నరుక్కున్న కాళిదాసు గురించి విని ఎగతాళిగా నవ్వుకున్నాం. మరి మనం చేస్తున్నదేంటో!

Photo Courtesy: nilgiri

మదుమలై అడవులు

మదుమలై అడవులు

అలా అలా సాగుతున్న మా ప్రయాణం వున్నట్టుండి క్రమేణా దట్టంగా అల్లుకున్న వెదురు పొదల్లో సాగింది. ఎంత దట్టంగా అంటే ఆకాశం కనపడనంతగా! రోడ్డుకిరువైపులా వున్న పొదలన్నీ ఏకమైపోయి దారిని చీకటిమయం చేసేశాయి. కానీ రాదారి మాత్రం బహు రమణీయంగా వుంది. అలా వెళ్తూ వెళ్తూ దట్టమైన ముదుమలై అడవుల్లోకి అడుగుపెట్టాం. అదంతా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌. ఎక్కడా దిగే సాహసాలు కూడదు. కేవలం అడవి అందాలను కళ్లతో జుర్రుకోవాలంతే!

Photo Courtesy: Hrishikesh Karambelkar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X