Search
  • Follow NativePlanet
Share
» »బెంగ‌ళూరు టు మైసూర్ జ‌ర్నీ విశేషాలు!

బెంగ‌ళూరు టు మైసూర్ జ‌ర్నీ విశేషాలు!

అద్దాలమేడలు..అధునాతన వాణిజ్య భవనాలు.. రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్ల ఆత్మీయ ఆహ్వానం. ఇప్పుడు మనకు కనిపించే ఉక్క‌పోత‌ అక్కడ మచ్చుకైనా కనపడదంటే నమ్మండి. ఈ మాట వింటుంటేనే భలే ముచ్చటేస్తుంది కదూ! ఇదేదో మనం రోజూ పేపర్లో చూస్తోన్న బొమ్మల రాజధాని కాదండోరు!! నిజమైన గ్రీన్‌ సిటీగా పేరొందిన బెంగళూరు. అలనాటి చారిత్రక విశేషాలు బెంగళూరు నగరంలో చాలానే ఉన్నాయి. ఇక్కడి నగర శివారు ప్రాంతాలు ప్రకృతి నిలయాలుగా పేరొందాయి. అలా బెంగళూరు నుండి మైసూర్‌ రోడ్డు ప్రయాణంలో కనువిందుచేసే కొన్ని పర్యాటక అందాలను ఈ రోజు చూసొద్దాం పదండి!!

బెంగ‌ళూరు టు మైసూర్ జ‌ర్నీ విశేషాలు!

బెంగ‌ళూరు టు మైసూర్ జ‌ర్నీ విశేషాలు!

విజయవాడ నుండి బెంగళూరు బస్సు మార్గంలో అయితే పది నుండి పదకొండు గంటల ప్రయాణం. అలా బస్సులో బయలుదేరి వేకవజామున బెంగళూరు చేరుకున్నాం. కెంపెగౌడా బస్టాండ్‌ దగ్గర మా స్నేహితుడు నవీన్‌ మమ్మల్ని రిసీవ్‌ చేసుకున్నాడు. ఎక్కడెక్కడికి వెళ్ళాలో ముందుగానే ఫోన్‌లో మాట్లాడుకున్నాం. బెంగళూరులో జర్నీ అంటే మావాడు చెప్పిన మార్గాలు రెండు. అయితే సొంత వెహికల్‌ అయినా ఉండాలి, లేదా క్యాబ్‌ బుక్‌ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్‌లో రెండవదానికే మా ఓటు పడింది. అలా ఫోన్‌లోనే క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాం. పికప్‌ పాయింట్‌ నుండి కిలోమీటర్ల రీడింగ్‌ నోట్‌ చేసుకుంటారు.బుక్‌ చేసిన అరగంటలో కారు వచ్చేసింది. డ్రైవర్‌ పేరు రమేష్‌. కన్నడవాడైనా తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నాడు.

శిఖరాన దాగిన ప్రకృతి అందం

శిఖరాన దాగిన ప్రకృతి అందం

ఏదో ఫ్లైట్‌ మిస్సయిపోతున్నాం అన్నంతగా మావాడు మమ్మల్ని బస్టాండ్‌ నుండే హడావుడి పెట్టేసి ఉన్నపళంగా బయలుదేరేలా చేశాడు. నంది హిల్స్‌. సముద్రమట్టానికి 4,851 అడగుల ఎత్తులో, బెంగళూరుకు 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడికి దగ్గరే. ఆ కొండలను చూస్తూ ఉంటే వాటి ఆకారం నిద్రించే ఎద్దులా కనిపించింది. అందుకే ఈ కొండలకు ఆ పేరు వచ్చిందని చెబుతూ ఉంటారట. అలా కొండపైకి చేరుకున్నాక, అక్కడి నుండి సూర్యోదయాన్ని వీక్షించాం. నిజమే..! ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేం. నీలిమేఘాలను నెట్టుకొస్తున్న సూరీడును చూస్తే ఎప్పుడెప్పుడు తల్లిగర్భంలోంచి బయటకు వచ్చి.. ఈ నేలత‌ల్లి అందాలను చూసేద్దామా అని ఆత్రుతపడే చంటిపాప గుర్తుకొచ్చింది. మావాడు ఆ సూర్యోదయాన్ని ఎందుకు మిస్సవ్వనీయలేదో అప్పుడు అర్థమైంది. కొండలపై ఉన్న పురాతన ఆలయం చోళుల కాలం నాటి శిల్ప సంపదకు చిరునామాగా కనిపించింది. అంతేకాదు అక్కడి ఆలయం మధ్యలో నిర్మించిన కోనేరు ఓ ప్రత్యేక ఆకర్షణ. టిప్పు సుల్తాన్‌ ఇక్కడ ఒక కోటను నిర్మించాడు. దానిని నందిదుర్గ్‌ అని పిలుస్తారట. 1791లో బ్రిటిష్‌ పాలకులు దీనిని ఆక్రమించారు. టిప్పుడ్రాప్‌ అనే ప్రదేశం నుండి చక్రవర్తి శిక్షపడ్డ ఖైదీలను పడవేసి, మరణించేలా చేసేవాడు. ఆ స్పాట్‌ ప్రస్తుతం పర్యాటకులకు మంచి సెల్ఫీస్పాట్‌గా కనిపించింది.

జలపాతాల సవ్వడులు

జలపాతాల సవ్వడులు

అక్కడినుండి నేరుగా మైసూర్‌ వెళ్ళేందుకు క్యాబ్‌లో బయలుదేరాం. 207 కిలోమీటర్ల దూరం. హైవేరోడ్‌పై హాయిగా సాగింది మా ప్రయాణం. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు ఆత్మీయ ఆహ్వానాన్ని పలుకుతున్నట్లు కనిపించాయి. అలా ఓ గంట ప్రయాణానికి ఆకలి తోడైంది. బిడది అనే ఊరులో టిఫిన్‌ చేద్దామని ఆగాం. కర్ణాటక ఫేమస్‌ ఫుడ్‌ బిసిబిల్లాబాత్‌(సాంబారుతో కలిపిన అన్నం), తట్టఇడ్లీ తిన్నాక కన్నడ రుచులకు ఫిదా అయిపోయాం. అక్కడ నుండి హైవేపై కొంతదూరం వెళ్ళాక ఎడమవైపున ఓ బోర్డు కనిపించింది. కన్నడ, ఇంగ్లీష్‌ భాషల్లో గగనచుకి, బరచుకి వాటర్‌ఫాల్స్‌ అని రాసి ఉంది. ఆ రోడ్డు గుండా రెండు కిలోమీటర్లు ప్రయాణం చేశాం. అప్పటికే జలపాతాల సవ్వడులు చెవులకు వినిపిస్తూ ఉన్నాయి. కారుదిగి అలా నాలుగడుగులు వేశామో లేదో నల్లని బండరాళ్ళ నడమ జారువాలే జలపాతం దర్శనమిచ్చింది. అక్కడ గుముగూడిన చెట్ల మధ్య స్వచ్ఛమైన నీరు మా అల‌స‌ట‌ను అమాంత‌ మింగేసినట్లు అనిపించింది. అప్పటికే ఎత్తైన ఆ జలపాతాలను తిలకించేందుకు చాలామంది పర్యాటకలు అక్కడికి చేరుకున్నారు. ప‌ర్యాట‌క‌ వినోదానికి ఈ ప్రాంతం మంచి విడిది కేంద్రంగా అనిపించింది. మళ్ళీ హైవేపై ఓ గంట ప్రయాణం చేసిన తర్వాత రోడ్డుకు ఎడమవైపున ఉన్న మరో రోడ్డులో రెండు కిలోమీటర్లు ముందుకు సాగాం. కావేరీ సంగమం ప్రాంతానికి చేరుకున్నాం. బీచ్‌ను తలపించేలా కనువిందు చేసిన తెల్లని ఇసుకుతిన్నెలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. మా జ‌ర్నీలోని మ‌రిన్ని విశేషాలు రోండో భాగంలో చూద్దాం!

Read more about: bangalore mysore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X