Search
  • Follow NativePlanet
Share
» »బిష్ణుపూర్‌.. అదోక అంద‌మైన బొమ్మ‌ల న‌గ‌రం!

బిష్ణుపూర్‌.. అదోక అంద‌మైన బొమ్మ‌ల న‌గ‌రం!

బిష్ణుపూర్‌.. అదోక అంద‌మైన బొమ్మ‌ల న‌గ‌రం!

పురాతన నగరమైన బిష్ణుపూర్‌లో వేసే ప్రతి అడుగూ ఆహ్లాదాన్ని పంచుతుంది. సంగీత కళాకారులు తమ వాయిద్యాలతో పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుంటారు. అక్కడి హస్తకళాకారులు తయారు చేసే అద్భుత కళాకృతులు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అంతేకాదు.. ఆ నగరం కళలకు పుట్టినిల్లు. చారిత్రక నేపథ్యమూ ఆసక్తికరమే. ఆ బొమ్మల నగరంలో దాగి ఉన్న కళాఖండాల విశేషాల‌ను తెలుసుకుందాం!

ఈ రోజు మా ప్రయాణం పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్‌కు చేరుకుంది. బిష్ణుపూర్‌ను పురాతన కట్టడాలకు నిలయం అని చాలామంది చెప్పుకుంటారు. ఎందుకంటే, ఇక్కడ అధికశాతం ఆలయాలు ఉంటాయి. కానీ, ఈ రోజు మేం ఇక్కడ పుట్టిన కళల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే, బిష్ణుపూర్ కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడి గాయకుల సంగీతాన్ని ఆలకించాల్సిందే.

ఏటా డిసెంబర్‌లో ఇక్కడ మేళా నిర్వహిస్తారు. ఈ మేళాలో స్థానికంగా తయారు చేసిన హస్తకళా శిల్పాలను ఉంచడం ప్రత్యేక ఆకర్షణ.. మేం వెళ్లేసరికే అక్కడ వార్షిక మేళా జరుగుతోంది. అందులో పాల్గొనడం మాకెంతో సంతోషాన్నిచ్చింది. అంతేకాదు, ఈ మేళాలో స్థానిక ప్రాంతాలకు చెందిన సంగీత విధ్వాంసుల‌ను, వారి కళలను ప్రదర్శించేందుకు ఆహ్వానిస్తారు. మేం అక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది.

ప్రతికూల సమయాల్లోనూ..!

ప్రతికూల సమయాల్లోనూ..!

మేళా సాయంత్రం ఐదు గంటలకు ప్రదర్శిస్తారని అక్కడివారు చెప్పారు. అంతసేపు ఏం చేయాలా? అని ఆలోచిస్తుండగా మాకో పెద్ద స్టేజీ కనిపించింది. దానికెదురుగా ప్రజలు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ మాసం కాబట్టి చలి వణికిస్తోంది. ఓ కప్పు గరమ్ గరమ్ ఛాయ్ తో పకోడీలు తీసుకుని మరీ ఆ స్టేజ్ ఎదురుగా కూర్చున్నాం.

వాటి రుచిని ఆస్వాదిస్తూ అక్కడ జరిగే సంగీత కళావిభావరిని వీక్షించాం. శాస్త్రీయ సంగీత కార్యక్రమం కాబట్టి ఎక్కువగా జనాలు కనిపించలేదనిపించింది. కొంతమంది యువకళాకారులు మాత్రమే ఉన్నారు. అయితే, ఇక్కడి ప్రాచీన సంప్రదాయం ప్రతికూల సమయాల్లో కూడా ఉట్టిపడుతుంద‌ని చెప్పొచ్చు.

ఇదీ చ‌రిత్ర‌..

ఇదీ చ‌రిత్ర‌..

కొందరు స్థానికులు టెర్రకోటకు సంబంధించిన విషయాలను చెబుతూనే కళల ప్రాముఖ్యతను పరిచయం చేశారు. అందులో సంగీతం ఒకటి. ఔరంగజేబు కాలంలో కళాకారులపై సామ్రాట్‌ల‌ కన్నుపడింది. దాంతో కళాకారులు ఎటు వెళ్లాలో తెలియక పక్కనే ఉన్న సుభో అనే ప్రాంతంలో దాక్కొన్నారు. తాన్ సేన్ కుటుంబానికి చెందిన గాయకులు చుపద్, వాదక్ బహదూర్ ఖాన్ క‌ళాకారులలో ముఖ్యమైనవారు. వీరంతా బిష్ణుపూర్‌లోని రాజా రఘునాథ్ సింహ్ రెండవ దర్బారులో ఆశ్రమం పొందారట! ఇలాంటి విషయాలను వారి మాటల్లో, పాటల్లో తెలుసుకుంటూ.. వారి సంగీతాన్ని ఎంతో ఆస్వాదించాం.

తర్వాత అక్కడి హ‌స్త‌క‌ళ‌ల‌ను ప్రత్యక్షంగా వీక్షించాల‌ని అనుకున్నాం. బిష్ణుపూర్ దగ్గరి బంన్కురా జిల్లాలో హార్స్ టాయ్స్ (గుర్రాల బొమ్మలు) చాలా ప్రత్యేకమైనవి. ఇవి జిల్లాలోనే కాదు పశ్చిమ బెంగాల్‌కు ప్రతీకగా నిలుస్తున్నాయి. బెంగాల్ నుంచి జార్ఖండ్ వ‌రకూ మ‌రెక్క‌డా ఇలాంటి గుర్రాల బొమ్మలను చూడలేం. అంత ప్రత్యేకంగా వాటి తయారీ ఉంటుంది. కొన్ని దశాబ్దాల క్రితం ఈ బొమ్మల తయారీ ద్వారానే జిల్లా ప్రసిద్ధికెక్కింది అని చెప్పుకోవాలి. ఒకానొక సమయంలో టెర్రకోటతో తయారుచేసిన ఈ గుర్రాలబొమ్మలను సంప్రదాయ పూజల్లో పెట్టేవారు. ప్రస్తుతం డ్రాయింగ్ రూమ్‌ల‌లో

ఆకర్షణీయమైన బొమ్మలుగా రూపుదిద్దుకున్నాయి.

టెర్రకోట బొమ్మల ప్రత్యేకం

టెర్రకోట బొమ్మల ప్రత్యేకం

టెర్రకోట మట్టితో ఆరెంజ్, బ్రౌన్ రంగులో ఉండే ఈ గుర్రాల బొమ్మలు మూడు లేదా నాలుగు అడుగులలో లభిస్తాయి. ఈ గుర్రపు బొమ్మలకు సమాన ఆకారం వాటి శరీరాలకు ఉండే గుండ్ర‌ని వంక‌ర్లు తిరిగే ఆకారాలు వాటి అదనపు ప్రత్యేకత. ఎత్తయిన మెడ, విభిన్న ఆకృతులతో కనిపించే ముఖంతో మేళాలో

ఎక్కడచూసినా అవే కనిపించాయి. వాటి కళ్లను చూస్తే ప్రాణమున్న నిజమైన గుర్రాలే ఇక్కడ ఉన్నాయా? అన్నంత ఆశ్చర్యం కలుగుతుంది. టెర్రకోట, మట్టితో బొమ్మలు తయారు చేసే కళ బిష్ణుపూర్, బంన్కురాలోని గ్రామాల్లోనే ఉందని చెప్పారు. సమయం ఉంటే గనుక ఆ గ్రామాల్లోకి వెళ్లి కళ్లారా వాటి తయారీని వీక్షించవచ్చు. కానీ మా షెడ్యూల్‌లో అంత సమయం లేదు.

హస్తకళా సౌందర్యం

హస్తకళా సౌందర్యం

ఇక్కడ చేతితో తయారుచేసిన జార్స్, డిస్కులు కూడా ఉన్నాయి. కేవలం గుర్రాల బొమ్మలు మాత్రమే కాకుండా టెర్రకోటతో తయారుచేసిన గణేశుని బొమ్మలు, పలకాబలపం పట్టిన స్త్రీ బొమ్మలు, ఇంటిపనులు చేస్తున్న మహిళల బొమ్మలు ఇలా దారిపొడవునా అక్కడి హస్తకళా సౌందర్యం మమ్మల్ని కళ్లార్పనీయలేదు.

ఈ మేళాలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తయారుచేసిన వస్తువులను కొనుక్కోవడం ఎంతో సంతోషంగా అనిపించింది. వాటి ఖరీదు యాభై రూపాయల నుంచి 150 రూపాయలలోపే. వాటి తయారీని బట్టి ధర ఉందని చెప్పుకోవచ్చు. వాటితోపాటు చేతితో చేసిన బ్యాగులు, ఉలెన్లు, చెప్పులు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

బాల్చూరీ చీరలు

బాల్చూరీ చీరలు

కళలు, హస్తశిల్పాలకే గాక, బిష్ణుపూర్ బాల్చురీ చీరలకు కూడా ప్రసిద్ధిగాంచింది. ముర్షిద్‌కలీ కాలంలో ముర్షిదాబాద్ నుంచి బాల్చురీ గ్రామం వరకూ ఈ చీరలను నేసేవారు. క్రమేణా ఆ కళ బిష్ణుపూర్ వరకూ వ్యాపించింది. మల్లరాజుల కాలంలో తసర్ సిల్క్ చీరలను బిష్ణుపూర్‌లోని చేనేత కార్మికులతో తయారు చేయించేవారు. తసర్ పై ఉన్న బాల్చురీ చీరలపై మహాభారతం, రామాయణం నాటి దృశ్యాల ప్రతిబింబాలే ఈ చీరల ప్రత్యేకత. బిష్ణుపూర్ మందిరంలో కనిపించే కొన్ని దృశ్యాలు బాల్చురీ చీరలపై కూడా కనిపిస్తాయి.

బెంగాల్ నవాబుల కాలంలో వారి జీవనశైలిలో ఈ చీరలు కూడా ఓ భాగమనే చెప్పుకోవాలి. చీరల షాపుల్లో గంటలు తరబడి ఉండి, విషయాలు తెలుసుకున్న తర్వాత మా తిరుగు ప్రయాణం మొదలైంది. బిష్ణుపూర్ నుంచి వెళ్లే దారిలోని గ్రామాల్లో చీరలను నేయడం చూడవచ్చు. చేనేత కార్మికులు ఓ వారంపాటు పనిచేస్తేగానీ ఓ చీర తయారవ్వదు. కేవలం చీరలే కాకుండా ఈ ప్రాంతంలో టవల్స్‌ను కూడా నేస్తారు. ఒక్కో టవల్ 30 లేదా 40. రూపాయలకు అమ్ముతారు.

ఒక్కరోజు కూలీకి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే వస్తుంది. అందుకే, వీటికి ఇక్కడ ప్రాధాన్యత తగ్గడమే కాక తయారీ కూడా క్రమేణా తగ్గుముఖం పట్టింది. ఎప్పుడైనా బెంగాల్‌కు వెళితే తప్పకుండా బిష్ణుపూర్‌ను సందర్శించండం మర్చిపోవద్దు. ఎందుకంటే, ఇంత చిన్న ప్రాంతంలో ఇన్ని కళలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు కదా!

Read more about: bishnupur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X