Search
  • Follow NativePlanet
Share
» »బౌద్ధం.. జైనం.. గుంటుప‌ల్లి చ‌రిత్ర‌లో నిక్షిప్తం

బౌద్ధం.. జైనం.. గుంటుప‌ల్లి చ‌రిత్ర‌లో నిక్షిప్తం

ప్ర‌కృతిసిద్ధ‌మైన ప్ర‌దేశాల్లో విహారయాత్రలకు వెళ్లాల‌ని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. మరి కొంతమంది సెలవులను వృథా పోనివ్వకుండా చారిత్రక ప్రదేశాలు సందర్శించి, కొత్త కొత్త విశేషాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

అలాంటి ఔత్సాహికులకు మంచి పర్యాటక ప్రాంతంగా, చరిత్ర జ్ఞాపకాలను దర్శింపజేసే బౌద్ధ క్షేత్రంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి ప్రసిద్ధి పొందింది. ఈ విశేషాలే తెలుసుకుందాం రండి!

బౌద్ధం.. జైనం.. గుంటుప‌ల్లి చ‌రిత్ర‌లో నిక్షిప్తం

బౌద్ధం.. జైనం.. గుంటుప‌ల్లి చ‌రిత్ర‌లో నిక్షిప్తం

సుదూర ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లాలంటే నెలల ముందే ప్ర‌ణాళిక‌లు వేసుకోవాలి. అక్కడ సందర్శించాల్సిన ప్రదేశాల జాబితా రెడీ చేసుకుని, లోక‌ల్‌లో వసతి, రవాణా సౌకర్యాలు వంటివన్నీ ముందే మాట్లాడుకుని.. ఏర్పాట్లన్నీ చేసుకుంటాం. అదే దగ్గర్లోని ప్రాంతాలకు వెళ్లాలంటే 'ఆ.. చూద్దాంలే'.. అనే భావన చాలామందిలో ఉన్నట్టే మా మిత్ర బృందానికీ ఉండేది. అయితే దాన్నుంచి బయటపడి ఎట్టకేలకు ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రాచీన బౌద్ధక్షేత్రం గుంటుపల్లి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అనుకున్న‌దే తడువుగా బౌద్ధ‌ క్షేత్రాల‌పై మంచి అవ‌గాహ‌న ఉన్న బెందాలం కృష్ణారావుగారితో ఏలూరు చేరుకుని, అక్కడి నుంచి గుంటుపల్లి బస్ లో బయల్దేరాం.

ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు

ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు

గుంటుపల్లి ఇప్పటివరకూ సందర్శించకపోయినా అంతకుముందే పుస్తకాల్లో చదువుకున్నది మనసులో మెదులుతూనే ఉంది. ఆంధ్రదేశంలో బుద్ధుని కాలం నుంచి బౌద్ధం అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన‌ జీవనవిధానంగా విలసిల్లింది. ఆంధ్ర దేశంలో బయటపడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధ చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. ఇటువంటి క్షేత్రాల్లో అన్నింటికంటే ప్రాచీనమైన భట్టిప్రోలు కాలానికే సుమారుగా గుంటుపల్లి కూడా చెందినదని చరిత్ర చెబుతోంది. క్రీస్తుపూర్వం మూడ‌వ శతాబ్దికే ఇవి ముఖ్యమైన బౌద్ధక్షేత్రాలుగా రుపొందాయి. గుంటుపల్లిని ఇటీవలి వరకూ బౌద్ధ క్షేత్రంగానే భావించేవారు. కానీ కొన్నాళ్ల కిందట లభించిన మహా మేఘవాహన సిరిసదా శాసనం, ఖారవేలుని శాసనాల వల్ల ఇక్కడ జైనమతమూ విలసిల్లిందని తెలుస్తోంది.

కొండమీద అనేక‌ నిర్మాణాలు

కొండమీద అనేక‌ నిర్మాణాలు

మేం ప్రయాణిస్తున్న బస్సు జీలకర్రగూడెం మీదుగా గుంటుపల్లి చేరుకుంది. అక్కడి నుంచి గ్రామ సమీపంలోని కొండలవైపు నడిచాం. పైకి వెళ్లడానికి పురాత‌న మెట్లు స్వాగతం పలికాయి. అక్కడే బౌద్ధారామాలున్నాయని భారత పురావస్తుశాఖ సూచికలు కనిపించాయి. వాటిపై పురాతన అవశేషాలుగా బౌద్ధారామాలను పేర్కొన్నారు. కొండమీద చైత్యగృహం, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. వీటిలో ఒక స్థూపంలో ధాతుకరండం దొరికిందని అక్క‌డి స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతం ఆనాడు బౌద్ధధర్మాన్ని అనుసరించేవారికి విశేషంగా ఆకర్షించ‌డానికి ఇక్కడ కనిపించిన పలు ఉద్దేశిక స్థూపాలే నిదర్శనమని అనుకున్నాం.

మౌలిక బౌద్ధంలో క్రమశిక్షణ కఠినం

మౌలిక బౌద్ధంలో క్రమశిక్షణ కఠినం

కొండలపైన అంచులో తొలిచిన గుహాలయం, బౌద్ధారామాలు, పైన ఉన్న ప్రార్థనా స్థూపాలు, రాతి స్థూపం వంటి కట్టడాలు క్రీస్తుపూర్వం 300 నుంచి క్రీస్తుశకం 300 మధ్యకాలంలో విస్త‌రించాయ‌ని పురావస్తుశాఖ సూచికల్లో రాశారు. అలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం తదితర అంశాలవలన ఇవి బౌద్ధమతం ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషించుకున్నాం. థేరవాదంలో (బౌద్ధం ఆరంభకాలంలో) శిల్పాలంకరణకు ఆదరణ ఉండేది కాదు. దృశ్య కళలు ఇంద్రియ వాంఛలను ప్రకోపింపజేస్తాయని బుద్ధుడు వాటిని నిషేదించాడు. వాటి ప్రయోజనం ధర్మాసురక్తిని కలిగించడానికే పరిమితమవ్వాలి కానీ రసానుభూతి కాదని ఆయన అభిప్రాయం. మౌలిక బౌద్ధంలో క్రమశిక్షణ అంత కఠినంగా ఉండేదని అక్కడి పురావస్తుశాఖవారు తెలిపారు. సమీపంలోని జీలకర్రగూడెం, కంఠమనేనివారి గూడెం గ్రామాల్లోనూ మరికొన్ని బౌద్ధారామాలు
ఉన్నాయని మాకు తెలిపారు.

అక్క‌డి గుహాలయాలవ‌లే ద‌ర్శ‌నం..

అక్క‌డి గుహాలయాలవ‌లే ద‌ర్శ‌నం..

కొండమీదనే ఉన్న గుహాలయం పర్యాటకులను ముందుగా ఆకట్టుకుంటుంది. క్రీస్తుపూర్వం మూడ‌వ, రెండ‌వ శతాబ్దాల్లో నిర్మితమైన ఈ చైత్యం అతి ప్రాచీనమైనది. వృత్తాకారంగా ఉన్న ఈ గుహ లోపల స్థూపం ఉంది. అయితే దీనిని ప్రస్తుతం ధర్మ లింగేశ్వర శివలింగంగా మార్చేశారు. చుట్టూరా ప్రదక్షిణా మార్గం ఉన్నాయి. ఈ గుహ పైభాగంలో వాసాలు, ద్వారానికి కమానులు చెక్క మందిరాల్లో వలే చెక్కి ఉన్నాయి. ఈ గుహాలయానికి బీహారులోని సుధామ, లోమస బ్బుషి గుహాలయాలతో పోలికలు ఉన్నాయనిపించింది.

బౌద్ధ భిక్షువులకు నివాస స్థానంగా

బౌద్ధ భిక్షువులకు నివాస స్థానంగా

కొండ అంచుల్లో ఉన్న ఆరామాన్ని పెద్ద ఆరామం అంటున్నారు. ఇది ఇసుకరాతి కొండ అంచులో తొలచిన గుహల సముదాయం. బౌద్ధ భిక్షువులకు నివాస స్థానంగా ఉండేది. గుహలు ఒకదానికొకటి గుండ్రని కిటికీలతో అనుసంధానించి ఉన్నాయి. గుహలలోకి ఊరే నీరు, వర్షపు నీరు కాలువల ద్వారా పగుళ్లలోకి ప్రవహిస్తూ బయటకు పోతుంది. కొండపైన వివిధ ఆకృతులలో, ముఖ్యంగా గుండ్రంగా సుమారు అరవై స్థూపాలున్నాయి. వీటిని మొక్కుబడి స్థూపాలని వ్యవహరిస్తున్నారు. ఇవి రాళ్ళతో లేదా ఇటుకలతో కట్టిన పీఠాలపై నిర్మించారు. కొండపైనే శిధిల మంటపం ఒకటి, చైత్యగృహం ఇంకొకటి ఉన్నాయి. ఇందులో శిధిల మంటపం నాలుగు విరిగిన స్తంభాలతో ప్రస్తుతం నామమాత్రపు కట్టడంగా మిగిలింది. పూర్వం బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరం ఇక్కడ లభించిన శిలాస్తంభ శాసనంలో క్రీస్తుపూర్వం ఒక‌టి నుంచి ఐద‌వ‌ శతాబ్దం వరకు లభించిన దానాల గురించి వివరణ ఉంది. దీని ప్రవేశద్వారాలకు ఇరువైపుల బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు ఉండేవని వివరాల్లో రాశారు. దీని అలంకృత అధిష్టానం నాసిక్, కార్లే గుహలను పోలి ఉందని మేం అనుకున్నాం.

ఇటుకలతో స్థూప చైత్యం

ఇటుకలతో స్థూప చైత్యం

ఇక్కడ చూడాల్సిన విశేషాల్లో ఇటుకలతో స్థూప చైత్యం ఒకటుంది. పురాతత్వ శాఖ వారి వివరాల ప్రకారం ఇది క్రీస్తుపూర్వం 3-2వ శతాబ్దానికి చెందిన కట్టడం. కొండ తూర్పు చివర ఎత్తయిన సమతల ప్రదేశంలో దీనిని నిర్మించారు. దీనిని చేరుకొనే మెట్ల వరుసను క్రీస్తుపూర్వం 2-1వ శతాబ్దానికి చెందిన ఒక ఉపాసిక కట్టించిందని పేర్కొన్నారు.

ప్రాకృత భాషలో ఫలకం

ప్రాకృత భాషలో ఫలకం

తెలుగు భాష ప్రాచీనతని నిర్ధారించే ఒక శాసనం ఇక్కడే పదేళ్ల కిందట 4 డిసెంబర్ 2007న తవ్వకాల్లో లభించిందని పురావస్తుశాఖ వారు చెప్పారు. క్రీస్తు శకారంభానికి చెందినదిగా భావిస్తున్న ఒక బ్రహ్మలిపితో ఉన్న ఈ శాసనం ద్వారా పలు చారిత్రక సంఘటనలు వెలుగు చూశాయి. నాడు తెలుగులో నూతనంగా
రూపొందుతున్న తెలుగు నుడికారాలు, గుణింతాల రూపాలు ఈ చలువరాతి ఫలకంపై ఉన్నాయట! ప్రసిద్ధ బౌద్ధాచార్యుడైన మిడిలకుడు అనే బౌద్ధ సన్యాసి ఈ ఫలకాన్ని గుంటుపల్లి గుహల్లో నివసించే బౌద్ధ బిక్షులకు దానం చేసినట్లు చెబుతారు. ఈ శిలా ఫలకం ప్రాకృత భాషలో ఉంది. కేంద్ర పురావస్తుశాఖ ఆంధ్ర రాష్ట్ర విభాగం ఈ శిలా శాసనాన్ని వెలికి తీసి, భద్రపర్చిందని చెప్పారు.

పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలంలోని ఈ గుంటుపల్లి గ్రామ పర్యటన మాకు ఎన్నో చారిత్రక అనుభూతులను అందించింది. ఇది మండల కేంద్రమైన కామవరపుకోట నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ, సమీపంలోని పట్టణమైన ఏలూరుకు 45 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. మరింకెందుకాలస్యం మీ చెంతనే ఉన్న చారిత్రక ప్రాంతం గుంటుపల్లిని నేడే సందర్శించండి.

Read more about: guntupalli west godavari
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X