Search
  • Follow NativePlanet
Share
» » మ‌న్యంలో మ‌రుపురాని దృశ్యాలు..!

మ‌న్యంలో మ‌రుపురాని దృశ్యాలు..!

దారికాచిన పచ్చని చెట్లగుంపును చీల్చుకుంటూ హాయిగా సాగే ప్రయాణంలా.. అలసిన తనువుకు జోలపాడే చల్లగాలి పలకరింపులా.. ప్రతి అడుగూ చారిత్రక అనుభూతులను పంచే అనుభవాల సమ్మేళనంలా ఉండాలి విహారం అంటే! ఎందుకంటే, ప్ర‌కృతి ఒడిలో విహారయాత్ర అంటే శరీరానికే కాదు.. మనసుకూ కాస్త ఆహ్లాదాన్ని పంచాలి కదా! అలాంటి ప్రదేశాల కోసం గూగుల్‌నో.. ట్రావెల్‌ ఏజన్సీలనో.. సంప్రదించాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్‌లో ఒక్కరోజు ప్రయాణం చేసి, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను మూటగట్టుకోవచ్చు. అలాంటి మధురమైన అనుభూతుల సమ్మేళనమే తూర్పుగోదావ‌రి అట‌వీ ప్రాంతం!

 మ‌న్యంలో మ‌రుపురాని దృశ్యాలు..!

మ‌న్యంలో మ‌రుపురాని దృశ్యాలు..!

పూర్వ‌పు తూర్పుగోదావ‌రి జిల్లా రాజమహేంద్రవరం బస్టాండ్‌ నుంచి మేం చేరుకోవాల్సిన విశాఖ జిల్లా సరిహద్దు గ్రామమైన కృష్ణదేవీపేటకు సరిగ్గా 135 కిలోమీటర్లు. అక్కడికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో మా జర్నీ మొదలుపెట్టాం. ఓ రెండు గంటల ప్రయాణం తర్వాత బస్సు నుంచే మిత్రులు రామరాజుకు ఫోన్‌ చేశాం. ఆయనది కృష్ణదేవీపేటకు దగ్గరలోని రాజవొమ్మంగి. ఎక్కడివరకూ వచ్చారని అడిగారాయన. మేం జడ్డంగి అన్నవరం అనే గ్రామం దగ్గరలో ఉన్నామని చెప్పాం. 'సరే ఓ రెండు కిలోమీటర్ల తర్వాత నుంచి మీలో ఫుల్‌ జోష్‌ వస్తుందిలెండి! మీకోసం ఇక్కడ వెయింటింగ్‌..!' అంటూ ఫోన్‌ పెట్టేశారు. ఆయన ఎందుకు అలా అన్నారో అక్కడికి రెండు కిలోమీటర్ల తర్వాత తెలిసింది.

 వానపాములా మెలి తిరుగుతూ రోడ్డు...

వానపాములా మెలి తిరుగుతూ రోడ్డు...

రోడ్డుకు ఇరువైపులా గుబురుగా ఉన్న పచ్చని చెట్లు స్వాగతం పలికాయి. అసలైన అటవీ మార్గం ఎలా ఉంటుందో కళ్ల ముందు ప్రత్యక్షమయినట్లు అనిపించింది. దారిపొడవునా సన్నని రహదారి వానపాములా మెలి తిరుగుతూ కొనసాగుతుంది. మధ్యమధ్యలో చిన్న పల్లెలు, అక్కడి గుడిసెల నిర్మాణం మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి. బస్సు ఆగిన ప్రతిసారీ ఎక్కీదిగుతోన్న ప్రయాణికుల పలకరింపులు అక్కడి ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పరిచయం చేశాయి. బ‌స్సు కిటికిలోంచి వీస్తోన్న పిల్ల‌గాలుల ప‌ల‌క‌రింపులు మ‌మ్మ‌ల్ని స‌రికొత్త ప్ర‌కృతి ప్ర‌పంచంలోకి తీసుకువెళ్లాయి. అలా మాకు టైమే తెలియకుండా సాగిపోయింది మా ప్రయాణం. చివరగా ఏలేశ్వరం, రాజవొమ్మంగి, కాకరపాడు మీదుగా కృష్ణదేవీపేట రానే వచ్చింది.

 అల్లూరి నడయాడిన నేల

అల్లూరి నడయాడిన నేల

మా కోసం ఎదురుచూస్తోన్న రామరాజు అప్పటికే మా కోసం టిఫిన్‌ సిద్ధం చేయించారు. వేడి వేడి ఇడ్లీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఎంతో రుచికరంగా ఉంది. ఒక్కొక్కరం రెండు ప్లేట్ల చొప్పున లాగించేశాం. తర్వాత అక్కడి నుంచి భోజనం పార్సిల్స్‌ పట్టుకుని, చింతపల్లి వైపు వెళ్లే రోడ్డుకు చేరుకున్నాం. బ్రిటీష్‌ కాలం నాటి ఓ చిన్న బ్రిడ్జీ మీదుగా నడుచుకుంటూ ముందుకు వెళ్లాం. అక్కడ అడుగు పెట్టగానే మనసులో ఏదో తెలియని అనుభూతి. చారిత్రక విశేషాల నిలయమైన ఆ అటవీ ప్రాంతంలో మేమేదో అన్వేషకులులా ఫీలయ్యాం. ఎదురుగా 'అల్లూరి సీతారామరాజు స్మారక మందిరం' కనిపించింది. స్థానికంగా ఆ ప్రాంతంపై మంచి అవగాహన ఉన్న మా మిత్రుడు రామరాజు ఆ టైంలో మాకు గైడ్‌గా మారిపోయారు.


అక్కడి విశేషాలను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చారు. లోపల అందమైన మొక్కలతో పార్కు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. ఇందులో ఎత్తయిన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం ఎంతో గంభీరంగా క‌నిపించింది. ప‌క్క‌నే అల్లూరి సమాధిని ఇక్కడ చూడొచ్చు. వీటితోపాటు ఈ పార్కులో ఓ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇందులో అల్లూరి జీవిత చరిత్ర అంశాలతో పదినిమిషాల నిడివి గల ఫిల్మ్‌ను ప్రదర్శించారు. అందులో ఎన్నో అరుదైన ఫొటోలను చూడగలిగాం. చరిత్ర పుస్తకాలలో చదివిన అంశాలే అయినా అల్లూరి నడియాడిన ఆ నేలపై చూడటం ఓ మధురానుభూతి. దీంతోపాటు ఈ ప్రాంతంలో అల్లూరికి సంబంధించిన శిలాఫలకాలు చాలా కనిపించాయి. మ‌రిన్ని చారిత్ర‌క విశేషాలతోపాటు అక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు బ‌య‌లుదేరాం. ఆ వివ‌రాలు రెండో భాగంలో...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X