Search
 • Follow NativePlanet
Share
» »ఒడిశా స‌రిహ‌ద్దుల్లో విహారం.. అవ‌ధుల్లేని ఆహ్లాదం!

ఒడిశా స‌రిహ‌ద్దుల్లో విహారం.. అవ‌ధుల్లేని ఆహ్లాదం!

అంద‌మైన పల్లెల మాటున దాగివున్న పచ్చని ప్రకృతి అందాలు.. సహజసిద్ధ నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోన్న అసమాన మానవ నిర్మణాలు.. చరిత్రను పరిచయం చేసే పురాతన ప్రాంతాలు.. చుట్టూ దట్టమైన చెట్టూ చేమలు.. కొండాకోనలూ.. అంతకుమించి మనసును ఆనంద డోలికల్లో ముంచే జలపాతాల సోయగాలు.

వీటన్నింటినీ ఒకేరోజు చూడటం అంటే అదో మరుపురాని జ్ఞాపకమే! శ్రీకాకుళం జిల్లా సమీపంలోని ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లోకి ఒక్క‌సారి వెళ్లొద్దాం రండి!

ఒడిశా స‌రిహ‌ద్దుల్లో విహారం.. అవ‌ధుల్లేని ఆహ్లాదం!

ఒడిశా స‌రిహ‌ద్దుల్లో విహారం.. అవ‌ధుల్లేని ఆహ్లాదం!

శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది హిరమండల. ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టాక అక్కడి వంశధార ప్రాజెక్టు గట్టు అచ్చం పాములా మెలికలు తిరుగుతూ తారసపడింది. దూరంగా కనిపిస్తోన్న కొండలతో పోటీ పడుతూ నిర్మించిన మానవ నిర్మితం భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. దాన్నీ దాటుకుంటూ హిరమండలం టౌనులోకి ప్రవేశించాం. ఇక్కడి పరిసరాలు వంశధార రిజర్వాయర్ కోసం కొంత భాగాన్ని కేటాయించడం వల్లో ఏమోగానీ, అంతగా అభివృద్ధి చెందినట్లులేదు. కానీ చుట్టుపక్క ఉన్న గిరిజన గ్రామాలనుంచి లభ్యమయ్యే చాలా వస్తువులతో మార్కెట్ కళకళలాడుతోంది. ఈ హిరమండలానికి తూర్పున వంశధార నదిపై గొట్టా బ్యారేజి ఉంది. పడమరన కొత్తగా తయారవుతున్న బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార రిజర్వాయరుల మధ్య ఇక్కడి ప్రాంతం ఇమిడి ఉంటుంది.

ఉర‌క‌లు వేసే.. వంశ‌ధార‌..

ఉర‌క‌లు వేసే.. వంశ‌ధార‌..

అలా హిరమండలాన్ని దాటుకుంటూ వెళితే, కిలోమీటరు దూరంలో వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజీ శ్రీకాకుళం జిల్లాకే తలమానికంలా క‌నిపించింది. దాని వద్దకు చేరేసరికి ముందుగా కుడికాలువ దర్శనమిస్తుంది. అక్కడ నుంచి సంగీతంలా వినిపిస్తున్న జలప్రవాహంతో మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. బ్యారేజి మీది నుంచి ఉత్తరం వైపు నిండుకుండలా కనిపిస్తున్న జలాలు సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. దూరంగా ఆకాశాన్ని తాకుతున్న సాగరంలా కనిపిస్తుంది. మధ్యలో పచ్చనికొండలు చూడచక్కగా కనిపిస్తాయి. అక్కడే వంశధార నది మరింత ఉరకలువేస్తూ కనిపిస్తుంది. ఆ దృష్యాన్ని చూస్తుంటే మనస్సు ఉవిళ్ళూరిపోతుంది. ఇంక ప్రాజెక్టు దిగువభాగాన్ని చూస్తే మన కాళ్లకింది నుంచి జలపాతాలు గలగలమని పారుపోతుంటే ఆనందడోలికల్లో తేలియాడుతున్నట్లు అనిపిస్తుంది. స‌మ‌యం ఎలా గడిచిపోయిందో అసలు తెలియదు. ఒకక్షణం కాలం ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. మాతోపాటు అక్కడే ఉన్న కొంతమంది సందర్శకులు మొబైల్ ఫోన్లతో ఫొటోలకు ఫోజులు ఇస్తూ కనిపించారు.

రాజ కోటల రాజనం

రాజ కోటల రాజనం

మా ప్రయాణాన్ని అలా ముందుకు పోనిచ్చాం. చిట్టడవులు, చిన్నచిన్న గ్రామాలు కొండల మధ్యగా ఓ అపురూపమైన రహదారి గుండా ప్రయాణం సాగింది. కొంతదూరం తర్వాత పాతపట్నం టౌను దర్శనమిచ్చింది. పాతపట్నం టౌనులోనుంచి ముందుకు సాగితే మహేంద్రతనయ నది దానిపై బ్రిడ్జి వస్తుంది. బ్రిడ్జికి దక్షిణంలో తెలుగులో.. ఉత్తరం వైపు ఒడియాలో.. బోర్డులు దర్శనం ఇచ్చాయి. అప్పుడే అర్థమైంది. మన రాష్ట్రం సరిహద్దులు దాటిపోయామని, బ్రిడ్జిపై నుండి తూర్పు వైపు చూస్తే దట్టమైన పచ్చని తోటలతోపాటు ఓ కోట కనిపించింది. సుమారు 300 మీటర్ల దూరంలో మహేంద్రతనయ నది ఒడ్డున ముందుకు వెళుతుంటే ఏదో చారిత్రక ప్రదేశంవైపు అడుగిడిన అనుభూతి కలుగుతుంది. అక్కడికి కాలినడకనే వెళ్లాలి. అది పర్లాకిమిడిరాజుల బృందావనం ప్యాలస్ అని స్థానికులు చెప్పుకొచ్చారు. ఆ ప్యాలస్ చూస్తే పూర్వపు రాజుల వైభవం కళ్లముందు ప్రత్యక్షమైనట్లు అనిపించింది. స్థానికులు చెప్పినదాని బట్టీ పర్లాకిమిడి రాజుల రాజ కోట నుంచి సొరంగ మార్గం ద్వారా ఈ ప్యాలెస్‌కు చేరుకునేవారట! ఈ బృందావనంలోనే విహారయాత్రలు, నదిలో జలకాలాటలు చేసేవారని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆ సొరంగ మార్గం వినియోగంలో లేదు. అక్కడ కొంత సేపు విహరించాక పర్లాకిమిడి చేరుకున్నాం.

ఒడిసా ఫ్లేవర్

ఒడిసా ఫ్లేవర్

అప్పటికే మధ్యాహ్నం కావడంతో భోజనం కోసం ఓ హోట‌ల్‌కు వెళ్లాం. అక్కడ హోట‌ల్‌లో ఒడిసా వంటలు గంట (కలగూర) ఫేమస్. దానిని రుచి చూసేందుకు ప్రయత్నించాం. అయితే, కొత్త రుచులు ఆస్వాదించాలి అనుకునేవారికి మాత్రమే అది అసాధ్యమని తర్వాత తెలిసింది. ఇక్కడ ఎక్కువగా చేపలతో వంటకాలు అందుబాటులో ఉంటాయి. బంగాళాదుంపలు, అరటికాయలు ప్రతి వంటకంలోనూ కనిపిస్తాయి. రసంలో పసుపు ఎక్కువగా వినియోగిస్తారు. రైస్ తోపాటు ఇవన్నీ వడ్డిస్తారు. ఆంధ్రా భోజనం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది.

పర్లాకిమిడి రాజకోటల సముదాయం..

పర్లాకిమిడి రాజకోటల సముదాయం..

ఎక్కడ చూసినా రాజుల కాలంనాటి నిర్మాణాలు తారసపడతాయి. మొదటగా మాకు కనిపించిన కోట దాన్ని చూద్దామనుకుంటే కుదరలేదు. దాన్ని జిల్లా జైలుగా మలిచారట! దానికి కొంచెం మొదలు ఇంకో కోట. దీన్ని కళాశాలగా మార్చారు. దానిని చూస్తే తనివి తీరనంత అందంగా కనిపించింది. ఇంకో కోట చీలికలు సూటిగా మలిచారు. పర్లాకిమిడి మధ్యలో కోటకు ముందుగా మూడురోడ్ల కూడలి నాటి రాజుల వీధులను గుర్తుకుతెస్తుంది. రాజ కోటలోనికి ప్రవేశం లేదు. సంవత్సరానికి ఒక్కసారే రధయాత్ర సమయంలోనే పర్యాటకులకు అనుమతి ఉందని చెప్పారు. బయటి నుంచి కూడా చాలా సుందరంగా దర్శనమిస్తుంది. కోటకు వెనుకవైపు సీతాసాగరం అనే పెద్ద సాగరం చూడముచ్చటగా ఉంటుంది. తామర పువ్వులు అందులో చూడాల్సిందే. ఎంతో అందంగా ఉంటాయి. ప్రకృతి అందాల సోయగం పర్లాకిమిడిలో చారిత్రక ప్రదేశాలను చూశాక అడవిని అనుకుని ఉన్న ప్రకృతి అందాలు చూడాలని బయలుదేరాం.

పచ్చని తివాచీతో కప్పినట్లు..

పచ్చని తివాచీతో కప్పినట్లు..

ఇక్కడికి తూర్పు వైపుగా పయనించి, ఉత్తరం వైపు చివరికి వెళితే రామసాగరం దర్శనం ఇస్తుంది. ఇది చాలా పెద్ద సాగరం. పచ్చని తివాచీతో కప్పినట్లు సాగరం మొత్తం చుక్కనీరు కూడా కనిపించకుండా తామరాకులతో కప్పేసి ఉంది. వాటిమీద తామర పువ్వులతో సాగర అందాలు పువ్వులు విరబూసినట్లు ఉంటుంది. ఆ అందాలను కొంత సమయం ఆస్వాదించాం. కొంత దూరం ప్రయాణం తర్వాత సెంచారియన్ యూనిర్సిటీ వ్యవసాయ క్షేత్రాలు పచ్చదనంతో నిండుగా కనిపించాయి. అక్కడినుంచి అటవీ మార్గంలో కొండ గుట్టులు దాటుకుంటూ వెళ్లాం. ప్రకృతి తన అందాలనంతా ఇక్కడే వొలకబోస్తుందా అన్నంతగా ఉంది ఇక్కడి ప్రదేశం. దట్టమైన అరణ్యం మధ్యలోని కొండల పైనుంచి

జారువారుతున్న గండాహతి జలపాత సోయగాలు చూస్తూ తనువూ మ‌న‌సూ ఏకమయ్యేలా మైమరిచిపోయాం. ఆదివారం వచ్చిందంటే కాకులు దూరని ఈ కారడవి జనారణ్యంగా మారిపోతుందట! ఒడిసా పర్యాటక అధికారులు ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం కొన్ని ఏర్పాట్లు చేశారు. పిల్లలు ఆటలాడేందుకు కూడా సదుపాయాలు కల్పించారు. అక్కడికి చుట్టుపక్కల గిరిజన గ్రామాల అందాలు, అడవులు మధ్యలో కొండపై నుంచి జాలువారే జలపాతం. చూడముచ్చటగా మనసును ఆనంద డోలికల్లో ముంచెత్తుతుంది. మరెందుకు ఆలస్యం మీ 'జర్నీ' మొదలు పెట్టండి!!

  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X