Search
  • Follow NativePlanet
Share
» »రాయ‌ల‌సీమ‌లో దాగిన ర‌హ‌స్యాల మూట‌.. గుత్తి కోట‌!

రాయ‌ల‌సీమ‌లో దాగిన ర‌హ‌స్యాల మూట‌.. గుత్తి కోట‌!

రాయ‌ల‌సీమ‌లో దాగిన ర‌హ‌స్యాల మూట‌.. గుత్తి కోట‌!

రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. అయినా, అలనాటి గుర్తులు కొన్ని రాతి కోటల‌ రూపంలో చాలాచోట్ల కనిపిస్తాయి. నాటి చారిత్రిక ముచ్చట్లను మనకు వినిపిస్తాయి. రాయల సీమలోని రాళ్లగుట్టల మాటున దాగిన గుత్తికోట అందుకు ఓ నిదర్శనం. శతాబ్దాల చరిత్రకు ఇది నిలువెత్తు సాక్ష్యం . టైం మిషన్లో వందల ఏళ్ల వెనక్కు వెళ్లిన అనుభూతిని సొంతం చేస్తూ.. గుత్తి కోట సందర్శనలో మేము చూసిన అనుభవాలు మీకోసం!

ఎన్నో ర‌హ‌స్యాల‌తో నేటికీ ఠీవిగా ద‌ర్శ‌న‌మిస్తోన్న గుత్తి కోట ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా విరాజిల్లుతోంద‌ని విన్నాం. ఎలాగైనా ఆ కోటలో అడుగుపెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మా మిత్ర‌బృందంతో క‌లిసి మా ప్ర‌యాణాన్ని మొదలుపెట్టాం. గుత్తి కోట అనంతపురం నగరం నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుత్తి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల వెళ్లిన తర్వాత కోట ప్రవేశమార్గం కనిపించింది. ఎదురుగా రెండు పురాతన ఉక్కు ఫిరంగులు ద్వారానికి ఇరువైపులా పహారా కాస్తున్నట్లు కనిపించాయి.

ఎండా వానలకు చెక్కుచెదరకుండా ధీటుగా నిలబడిన వాటిని చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అక్కడి ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. సుమారు మూడు వందల అడుగుల ఎత్తులో ఉన్న కోటను చేరుకునేందుకు కాలినడక తప్పదు. మేం పైకి వెళ్లేందుకు ఎంతో ఆయాశపడ్డాం. మామూలు రోజుల్లో కంటే వారంతపు సెలవుల్లో కొద్దిగా ఎక్కువ సంఖ్యలో సందర్శకులు ఇక్కడకు వస్తుంటారని అక్కడివారు చెప్పారు. అంతేకాదు, ఈ కోట వందల ఏళ్ల నుంచి ఎంతోమంది రాజులకు నిలయంగా ఉందట! దీనిని పటిష్ట పరిచిన వారు కొందరైతే, ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వారు మరికొందరు.

ఎంతో చరిత్ర క‌లిగిన కోట‌..

ఎంతో చరిత్ర క‌లిగిన కోట‌..

స్థానికంగా గుత్తి కోటగా పిలవబడే ఈ దుర్గం ప్రాచీన నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఎంతో ఆకట్టుకుంటుంది. కొండ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కోటను పరిశీలించిన మాకు అదో త్రీడీ పిక్చర్‌లా గోడలు పెద్దవిగా, చిన్నవిగా కనిపించాయి. కోటను కబళించినట్లుగా గోడలు ఉన్నాయి. దీన్ని పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మించారట! అయితే విజయనగర రాజులు దీన్ని పటిష్టపరిచారు. దీని తొలి శాసనాలు సంస్కృతం, మరాఠీ భాషలలో ఉన్నాయి. ఇవి ఏడవ శతాబ్దం నాటివని అంచనా. విజయనగర రాజులు శాసనంలో గుత్తి కోట రాజ దుర్గంగా కీర్తించబడింది.

విజయనగర రాజుల పాలనానంతరం కుతుబ్షాల ఆధీనంలోకి చేరింది. తర్వాత 1746లో మరాఠీ ఆర్మీ జనరల్ మురారిరావు ఘోర్పాడే తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. 1775లో మైసూర్ రూలర్ హైదర్ ఆలీ తొమ్మిది నెలలు నిర్బంధించి, కోటను వశపరుచుకున్నారు. తదననంతరం బ్రిటీష్ జనరల్ థామస్ మున్రో ఈస్టిండియా ఆధీనంలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ దుర్గం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.

ఇక్క‌డ వేసే ప్రతి అడుగూ ఆశ్చర్యమే!

ఇక్క‌డ వేసే ప్రతి అడుగూ ఆశ్చర్యమే!

పూర్తిగా రాళ్లతో నిర్మించిన కోటలోకి అడుగుపెట్టిన తర్వాత మమ్మల్ని ఓ నీటిగుంట ఎంతగానో ఆకర్షించింది. దానికి దగ్గరగా వెళ్లాం. అప్పుడు తెలిసింది అది బావి అని. అలా ముందుకు వెళ్లే కొలదీ ఒక్కొక్కటిగా బావులు ఎదురయ్యాయి. మేం మొత్తంగా పది బావుల వరకూ చూశాం. కోటలో మొత్తంగా 108 బావులను తవ్వారని స్థానికులు చెప్పారు. అయితే కోటలో ప్రస్తుతం పది బావులు వరకు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ దుర్గం సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రస్తుతమున్న బావుల్లో కొన్నింటిలో పుష్కలంగా నీరుంది.

వాస్తవానికి అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు చాలా లోతులో ఉంటాయి. గుత్తిలో దాదాపు 150 అడుగుల లోపలే భూగర్భ జలాలు ఉన్నాయి. అయితే ఇంత ఎత్తులో ఉన్న ఈ రాళ్ల కొండల్లో నీరు ఉందంటే నిజంగా ఆశ్చర్యమేసింది. అంతేకాదు, ముఖద్వారాలు కూడా దాదాపు వంద వరకు ఉండేవట! కానీ ఇప్పుడు అన్ని కనబడవు. శిథిలమైపోయాయి. గోడలకు ఉన్న దరవాజాల్లో చాలా వరకూ ఇప్పటికీ దృఢంగానే ఉన్నాయి.

ఇదొక అద్భుత నిర్మాణశైలి!

ఇదొక అద్భుత నిర్మాణశైలి!

కొండను ఎక్కేటప్పుడు అలసటతో సేదతీరేందుకు ఏ రాయి మీద కూర్చున్నా సరే చల్లగా ఉంటుంది. మేం వెళ్లిన రోజు ఎండ తీవ్ర‌త కాస్త ఎక్కువ‌గా ఉంది. అయినా అక్కడి రాళ్లు, బీడుపడ్డ మొండి గోడలు చల్లగానే ఉన్నాయి. కొండ ఎక్కేటప్పుడు మధ్యలో గుర్రాలను కట్టేసుకునే స్థలం కనిపించింది. ఆ ప్రదేశం బల్లపరుపుగా, విశాలంగా ఉంది. గుర్రాలకోసం నిర్మించిన ఈ భవనం చతురస్రాకారపు సి ఆకారంలో ఉంది. ఈ భవనానికి ముందు అక్కడక్కడా రెండు మూడు కానుగ చెట్లు ఉన్నాయి. వాటిని చూస్తే నేటికీ అక్కడ ఎవరైనా నివసిస్తున్నారేమో అన్న సందేహం కలుగుతుంది. కొంతమంది ఈ ప్రదేశంలో అదోరకమైన గుర్రాల వాసన ఇప్పటికీ వస్తుందని చెప్పుకుంటుంటారు. రక్షక గోడ ఎత్తు 20 అడుగులపైనే ఉంటుంది. గోడలపై శత్రువులను గమనించేందుకు సైనికులు ఏర్పాటు చేసుకున్న రంధ్రాలు ఎంతో ఆలోచింపజేశాయి.

ఈ రంధ్రాలు ఎలా ఉంటాయంటే, చూసేది ఒక దగ్గర నుంచే అయినా 180 డిగ్రీల కోణంలో చుట్టుపక్కల వారు కనిపించేలా నాలుగైదు రంధ్రాలను ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల శత్రువులు ఏ దిక్కున నక్కుతున్నా తల బయట పెట్టకుండానే చూడగలిగి, శత్రు సైన్యాన్ని మట్టి కరిపించవచ్చు. ఈ గోడల వెంబడీ, కొండపై శిఖరాగ్రాన ఆకాశాన్ని తాకేలా కనబడే గుండ్రటి ఆకారంలో బురుజులు ఏర్పాటు చేసుకున్నారు. వీటిని ప్రతి వంద మీటర్ల దూరంలో ఒకటి లెక్కన నిర్మించుకున్నారు. కొన్నిచోట్ల నలుదిక్కులా దగ్గర దగ్గరే కొండ చరియలపై బురుజులను ఏర్పాటు చేసుకున్నారు. బహుశా అవి రాజులు ఉండే ప్రాంతం కాబోలనుకున్నాం. ఎందుకంటే, అక్కడ నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చేవారు చాలా స్పష్టంగా కనబడతారు.

గుప్తనిధుల రహస్యం

గుప్తనిధుల రహస్యం

కోట పైభాగాన గుప్తనిధులు దాచుకునే ఓ గది ఉంది. అందులో చాలా వరకు తవ్వకాలు జరిగినట్లు స్పష్టంగా కనిపించింది. ఆ ప్రదేశాన్ని నిశితంగా పరిశీలిస్తే, పూర్వీకులు ఆ గదికి రాళ్లతోనే డోర్‌లాక్‌ల‌ను ఏర్పాటు చేసినట్లు అర్థమైంది. భవన ముఖద్వారం ఒకవైపు గోడలో రాతి డోర్‌లాక్‌ను ఇప్పటికీ మనం చూడవచ్చు. ఈ గది కొండపై నడిచేటప్పుడు దూరం నుంచి కనబడదు. దగ్గరకు వెళ్లి చూస్తేనే అది ఓ గది అని అంచనాకి వస్తాం. చిన్నపాటి గుహలా కనిపించే ఈ ప్రదేశం నడిచే నేలకంటే ఇంకా దిగువులో చుట్టుపక్కల చెట్లు, పచ్చికతో ఉంటుంది. బయటకు చూసేందుకు చిన్న గదిలా కనిపించినా లోపలకి వెళ్తే అర్ధచంద్రాకారంలో పలు గదులు లోపలకి ఉన్నాయి. ఆ గది అంతా కటిక చీకటి కమ్ముకొని ఉంది. అక్కడంతా కందిరీగలతో నిండి ఉంది. దాంతో అక్కడి నుంచి లోపలకి వెళ్లేందుకు సాహసం చేయలేకపోయాం. ఈ గదిలో బయట పలుచోట్ల ఇటీవల తవ్విన లోతైన గుంతలు కనిపించాయి. కొన్నిచోట్ల మందుపాతరలు పెట్టిమరీ పేల్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ పురాతన కట్టడాలను చూస్తే వందల ఏళ్ల క్రితమే మానవునిలో ఎంత నైపుణ్యం ఉండేదో తెలిసిపోతుంది.

నాలుగు కొండలపై కవచంగా ఏర్పాటు చేసుకున్న గోడను దాటి రావడం శత్రువులకు అంత సులువు కాదు. గుత్తికొండ కోటను సందర్శించకపోయుంటే మేం ఎన్ని చారిత్రక విషయాలను మిస్సయ్యేవాళ్లమో అర్థమైంది. మరెందుకు ఆలస్యం మీరూ గుత్తికొండ కోట‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వ్వండి.

Read more about: gutti kota ananthapuram
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X