Search
  • Follow NativePlanet
Share
» »నింగినితాకే ద‌ల్మ‌హిల్స్ ట్రెక్కింగ్‌ విశేషాలు మీకోసం..

నింగినితాకే ద‌ల్మ‌హిల్స్ ట్రెక్కింగ్‌ విశేషాలు మీకోసం..

నింగినితాకే ద‌ల్మ‌హిల్స్ ట్రెక్కింగ్‌ విశేషాలు మీకోసం..

పచ్చని ప్రకృతి ఒడిలో హాయిగా సాగే ప్రయాణమంటే ఏ ప‌ర్యాట‌కునికి అయినా అదో మర్చిపోలేని అనుభవమే! ఓ వైపు వన్యప్రాణుల పలకరింపులు.. మ‌రోవైపు మనసుదోచే పిల్లగాలుల హొయలు.. ప్రయాణపు కాలాన్ని ఉరకలెత్తించేలా చేస్తాయి. పరవళ్లు తొక్కే నదీ ప్రవాహాన పడవ ప్రయాణం మరో ప్రత్యేక ఆకర్షణ. అలాంటి దల్మహిల్స్ ప్రాంతంలో మా పర్యాటక‌పు తియ్యని అనుభూతుల సమ్మేళనం మీకోసం..!

చుట్టూ పచ్చని పర్వతాలు, నదులతో నిండిన జార్ఖండ్‌లోని దల్మహిల్స్ ప్రాంతం పర్యాటకానికే కేంద్రబిందువుగా చెప్పొచ్చు. అందుకే, మొదటగా మా ప్రయాణం జంషెద్‌పూర్‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ దల్మ హిల్స్‌వైపు సాగింది. ఆ కొండపైకి చేరుకునేందుకు బస్సులు అందుబాటులోనే ఉన్నాయి. కాలినడకనా అక్కడికి చేరుకోవచ్చు. అయితే, స్నేహితులతో కలిసి నడిచి వెళ్లడంలోనే మజా ఉంటుందని చెప్పడంతో మా వాహనాలను ముందుగానే నిలిపి, కాలినడకన ప్రయాణాన్ని మొదలుపెట్టాం. దల్మ ఓ వన్యప్రాణుల అభయారణ్యం. అప్పట్లో ఇక్కడ వన్యప్రాణులు ఎక్కువగా సంచరించేవని స్థానికులు చెబుతున్నారు. ఆ మాట వినగానే ఒక్కసారిగా మేమంతా ఉలిక్కిపడ్డాం. ఎందుకంటే, ఇప్పటికీ అక్కడ కొన్ని జంతువులు సంచరిస్తున్నాయట! ఏనుగులు, కోతులు, చిన్న చిన్న జంతువులు నిత్యం ఇక్కడ తారసపడుతూ ఉంటాయని అక్కడివారు చెప్పారు. అంతేకాదు, శిఖరంపైకి వెళ్లగానే జంషెద్‌పూర్‌ మొత్తం కనిపిస్తుందని విన్నాం.

ప్రకృతి ఒడిలో ప్రయాణమే..

ప్రకృతి ఒడిలో ప్రయాణమే..

ఉదయం ఎనిమిది గంటలు దాటింది. దల్మలోని రాకీ టైల్స్‌పై నడుచుకుంటూ ముందుకు సాగాం. ఈ దల్మహిల్స్ సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడికి వెళ్లడానికి సుమారు మూడు నుంచి నాలుగు గంట‌ల స‌మ‌యం పడుతుంది. అలా మేమంతా అడవిలో నడుచుకుంటూ వెళ్లాం. శీతాకాల‌మే అయినా ఇక్కడ ఎందుకో ఉక్క‌పోత అనిపించింది. కొద్దిసేపటికే అందరికీ చెమటలు పట్టేశాయి. నెమ్మదిగా అడవి సాంద్రత పెరుగుతూ వచ్చింది. ఓవైపు ఆకాశాన్ని తాకేలా కనిపిస్తోన్న చెట్లు, మరోవైపు కీకరమైన శబ్దాలు మమ్మల్ని ఉలిక్కిపడేలా చేశాయి.

ఎటు నుంచి ఏ జంతువు వస్తుందోనని మా బృందంలోని కొంద‌రు మిత్రులు భయపడటాన్ని మేం గమనించాం. అడవి నిశ్శబ్దాన్ని ఛేదించడానికి మా దగ్గర ఉన్న సెల్‌లో పాటలు మోగడం ప్రారంభించాయి. అలా వెళ్తూ ఉండగా దారిమధ్యలో ఓ పురాతన వినాయకుని ఆలయం కనిపించింది. అక్కడ కొద్దిసేపు సేదతీరి, మళ్లీ మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. దారిమధ్యలో అక్కడక్కడా ఆగుతూ, ఎంత ఎత్తులో ఉన్నామో చూసుకుంటూ ఆ మనోహర దృశ్యాలను మా వెంట తెచ్చుకున్న కెమేరాల్లో బంధించాం. ఆ దృశ్యకల్పన అందరి మనసులో అలాగే నిలిచిపోయింది. అది నిజంగా ప్రకృతి ఒడిలో ప్రయాణమే! ఆ సుందర దృశ్యాలను చూడాలనే సంకల్పం ముందు మా శారీరక అలసట చిన్నబోయిందనే చెప్పాలి.

వాటి ప్రపంచంలోకి మేం వెళ్లాం!

వాటి ప్రపంచంలోకి మేం వెళ్లాం!

అలా, కొద్ది దూరం వెళ్లగానే ఓ టీ దుకాణం కనిపించింది. దానిపక్కనే 'వన్ విభాగ్' (ఫారెస్టు డిపార్టుమెంట్) ఉంది. మేం చేరుకోవాల్సిన ప్రాంతానికి కేవలం కిలోమీటరు దూరంలో ఉన్నామని అర్థమైంది. ఇంకాస్త హుషారుగా మా ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాం. ఆ మార్గంలో కోతులు, కొండముచ్చుల సమూహం ఒకటి మాకు తారస పడింది. అక్కడ ఏనుగులు కూడా చాలానే ఉన్నాయని చెప్పారు. ఆ గుంపు మా చుట్టూ తిరుగుతూ మమ్మల్ని వింతగా చూడసాగాయి. అప్పుడు అర్థమైంది, వాటి ప్రపంచంలోకి మేం వెళ్లామని. అవి మాకు ఎలాంటి హానీ చేయలేదు. అంతేకాదు, మేం ఫొటోలు తీస్తుంటే అందుకు వాటి సహకారాన్ని అందించాయి. చివరికి ఆ శిఖరం పైకి చేరుకున్నాం.

ఓ చిన్న కుగ్రామంలా మారిపోయింది..

ఓ చిన్న కుగ్రామంలా మారిపోయింది..

నల్లని మబ్బులతో మేఘాల సమూహం, చల్లటి, స్వచ్ఛమైన గాలితో మమ్మల్ని ఆహ్వానం పలుకుతున్న అనుభూతిని పొందాం. అక్కడికి దగ్గరలోనే ఓ శివాలయం కనిపించింది. స్థానిక భక్తులు, సందర్శకులతో ఆ ఆలయం రద్దీగా ఉంది. అందుకనే, మా బృందం అక్కడికి వెళ్లే సాహసం చేయలేదు. అక్కడకు దగ్గరలోనే మా మనసులో ఏ దృశ్యకల్పనైతే నిలిచిపోయిందో ఆ దృశ్యాన్ని తిలకించేందుకు మా బృంద మంతా సిద్ధమైంది. పై నుంచి అలా అందరం ఒకేచోట నిలబడి ఒకర్నొకరు పట్టుకొని ఒకేసారి కిందికి చూశాం. ఒక్కసారిగా కింద ప్రాంతమంతా చాలా చిన్నగా కనిపించింది.

జంషెద్‌పూర్‌ మొత్తం ఓ చిన్న కుగ్రామంలా మారిపోయింది. ఈ దృశ్యంలో ప్రకాశవంతమైన రేఖలు కనిపించాయి. అదే సువ‌ర్ణ‌ రేఖ నది. సువర్ణరేఖ నదిలోని సన్నని గీత ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా అనిపించింది. ఈ చిత్రం నిజంగా అద్భుతమనే చెప్పాలి. అప్పటికే చాలా సమయం అయ్యింది. కొద్దిసేపు అక్కడే ఎంజాయ్ చేశాం. తిరిగి వెళ్లడానికి మనసు అంగీకరించలేదు. కానీ తప్పదు కదా! తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం.

నదీ సంగమం ఓ తియ్యని అనుభూతి..

నదీ సంగమం ఓ తియ్యని అనుభూతి..

దల్మహిల్స్ నుంచి మా ప్రయాణం సువర్ణరేఖ నదివైపుగా సాగింది. ఈ నది స్థానిక ప్రజలకు జీవనరేఖగా చెబుతుంటారు. నదిలో నీరు ఎక్కువగా ప్రవహించినప్పుడు టాటా స్టీల్ ఎడ్వంచర్ ఫౌండేషన్ (టిఎస్ఎఫ్) వారు పడవ ప్రయాణం లేదా రివర్ రాఫ్టింగ్ నిర్వహిస్తారు. ఈసారి మేమంతా ఆ ఎడ్వంచర్‌లో పాల్గొని, రివర్ రాఫ్టింగ్ చేశాం. జమదేశ్‌పూర్‌ నుంచి 15-20 కిలోమీటర్ల దూరంలో మునికుయి అనే ప్రాంతంలో రాఫ్ట్‌లో కూర్చొని, నదిలో మా ప్రయాణాన్ని కొనసాగించాం. గలగలమనే నీటి సవ్వడుల ఈ ప్రయాణం మా చాలామందికి అదే మొదటిసారి.

రెండువైపులా పర్వతాలు, అడవి, ఉర‌క‌లెత్తే నీటి మార్గంలో మేము. ఇక్క‌డి రాఫ్టింగ్ ఏమంతా కష్టంగా ఉండదు. త్వరగా 15 కిలోమీటర్లు వెళ్లేసి రావొచ్చు అనుకున్నాం. కానీ, అంత సులవేం కాదని తర్వాత అర్థమైంది. రాఫ్టింగ్ ఒక్కోసారి ఎడమవైపు, ఒక్కోసారి కుడివైపు. అలా చేయడం చాలా కష్టంగా అనిపించింది. అలా వెళ్తూ కందర్‌బేడా ప్రాంతం దగ్గర నీటి సాంద్రత తక్కువగా ఉన్న చోట రాఫ్ట్‌ను ఆపి, అక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేశాం.

కొద్దిసేపయ్యాక మళ్లీ రాఫ్ట్‌లో దోమానీ దగ్గరికి చేరుకున్నాం. దోమానీ సువ‌ర్ణ రేఖ, కర్కయి నదీ సంగమం. రెండు నదుల సంగమం చూడ్డానికి చాలా భయానకంగా ఉంది. అచ్చం సముద్రంలా అనిపించింది. అయితే, ప్రకృతి ప్రేమికులకు ప్రతి నిమిషం ఓ తియ్యని అనుభూతే కదా! ఇదే మా చివరి మజిలీ.. దోమానీ దాటిన తర్వాతే మా ప్రయాణం పూర్తయిపోయింది. మ‌రెందుకు ఆల‌స్యం ద‌ల్మ‌ హిల్స్‌కు మీ ప్ర‌యాణాన్ని మొదులుపెట్టండి.

Read more about: dalma hills jharkhand
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X