Search
  • Follow NativePlanet
Share
» » రాయ‌ల‌సీమ చారిత్ర‌క ఆనవాలు.. క‌ర్నూలు..

రాయ‌ల‌సీమ చారిత్ర‌క ఆనవాలు.. క‌ర్నూలు..

రాయ‌ల‌సీమ చారిత్ర‌క ఆనవాలు.. క‌ర్నూలు..

రాయలసీమ చారిత్రక విశేషాల వీక్షణకు ఆహ్వానం పలికే కొండారెడ్డి బురుజు అందాలు ఓ వైపు. పురాతన శిల్ప సంపదను అక్కున చేర్చుకుని, సందర్శకులను ఆశ్చర్యపరిచే విజ్ఞాన విశేషాలున్న మ్యూజియం మరోవైపు. ఎన్నో వింతలు.. మరెన్నో విశిష్టతలు.. పలు ఆసక్తికర విషయాలకు కర్నూలు జిల్లా పురిటిగడ్డ. ఇక్కడ వేసే ప్రతి అడుగూ పర్యాటకులకు మరపురాని అనుభవమే అవుతుంది. ఆ సీమ నేలపై పరిడవిల్లే పర్యాటక విశేషాలను చూసొద్దాం రండి.

కర్నూలు ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది కొండారెడ్డి బురుజు. ఇక సినిమాల్లో అయితే 'సీమ' అంటే చాలు బ్యాక్ డ్రాప్‌లో బురుజు కనిపించాల్సిందే. రాయలసీమ ప్రజల పౌరుషానికి.. అలనాటి రాజుల రాజసానికి అద్దం పడుతుంది ఈ కట్టడం. నగరం నడిబొడ్డున హుందాగా నిలిచిన ఈ బురుజు చారిత్రక అధ్యయనానికి ఓ నిదర్శనం. కర్నూలు కొత్త బస్టాండ్‌కు కూత‌వేటు దూరంలో ఉందని తెలియడంతో అక్కడి నుంచి ఆటోలో బురుజు దగ్గరకు చేరుకున్నాం. నగరంలోని చుట్టూ కాంక్రీటు కట్టడాల మధ్య ఎత్తయిన అలనాటి రాతి నిర్మాణం మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. ఉదయం అయినప్పటికీ సందర్శకులు బాగానే కనిపిస్తున్నారు. ప్రవేశ మార్గంలో అంతా పచ్చదనంతో మమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నట్లు అనిపించింది.

బురుజు చరిత్రను వివరిస్తూ ఓ శిలాఫలకం కనిపించింది. 15వ శతాబ్దంలో విజయనగర రాజుల వంశానికి చెందిన అచ్యుత రాయులు ఈ కోటను నిర్మించారు. అప్పట్లో ఈ ప్రాంతం రాజులకు సామంతులుగా ఉన్న పాలెగాళ్ళ ఏలుబడిలో ఉండేది. ఆ సామంతరాజుల్లో చివరివాడైన కొండారెడ్డి పేరు మీద ఈ కట్టడాన్ని నిర్మించారు. పూర్తిగా రాతికట్టడమైన ఈ నిర్మాణం ఎంతో దృఢంగా ఉంది. 2009లో కర్నూలును ముంచెత్తిన భారీ వరదను కూడా తట్టుకోగలిగిందంటే దీని దృఢత్వం ఏంటో అర్థమవుతుంది. ఆ సమయంలో చాలా మంది ప్రజలు ఈ బురుజుపైకి చేరుకుని, ప్రాణాలను కాపాడుకున్నారు. బురుజు చుట్టూ ఎంతో అతృతగా తిరగసాగాము. దానిపై నుంచి చూస్తే కర్నూలు నగరం విహంగ వీక్షణ అనుభూతి కలిగింది.

సొరంగ మార్గం 'ప్రవేశం లేదు'..

సొరంగ మార్గం 'ప్రవేశం లేదు'..

అయితే ఓ సొరంగ మార్గం 'ప్రవేశం లేదు' అనే బోర్డు కనిపించింది. అలా ఎందుకు మూసివేశారో తెలుసుకోవాలనే ఉత్సుకత మాలో మొదలైంది. ఓ పెద్దాయన మాటల ప్రకారం కర్నూలుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్వాల్ కోటకు ఈ కోట నుంచి సొరంగ మార్గం ఉందట! అదే ఈ మూసివేసిన సొరంగమని చెప్పారు. ఈ మార్గం తుంగభద్ర నీటి అడుగునుంచి వెళ్తూ నల్లా సోమనాద్రి నిర్మించిన గద్వాల్ కోటకు అనుసంధానం చేయబడిందట! 17వ శతాబ్దంలో ముస్లిం దురాక్రమణల నుంచి తప్పించుకునేందుకు ఈ సొరంగ నిర్మాణం తరచూ ఉపయోగించే వారని ప్రచారంలో ఉంది.

దీనిద్వారా అప్పట్లో తెలంగాణా సంస్థ నాథీసులకు రాయలసీమ రాజులకు మైత్రి ఉన్నట్లుగా తెలుస్తోంది. 1901లో అప్పటి ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసినట్లుగా స్థానికులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన కొండారెడ్డి బురుజును భావితరాలకు గతచరిత్ర వైభవాన్ని చాటి చెప్పే నిర్మాణం గుర్తించి, సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఇంకా అక్కడి అందాలను చూడాలని ఉన్నా, కడుపులో మూషికలు పరుగెట్టడం మొదలైంది. దాంతో వేడి వేడిగా సీమ రుచులను ఆరగించేందుకు కిందకు దిగేశాం.

ఉగ్గాని బజ్జీ తినాల్సిందే

ఉగ్గాని బజ్జీ తినాల్సిందే

దగ్గరలో ఉన్న ఓ హోటల్‌కు వెళ్ళాం. స్థానికంగా ఏది స్పెషల్ అని ఎంక్వయిరీ చేస్తే మాకు వినిపించింది 'ఉగ్గాని బజ్జీ'. రాయలసీమలో ఈ పేరు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వినిపిస్తుంది. ఇంతకీ దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసుకునేందుకు మస్తాన్ అనే వంట మాస్టారు దగ్గరకు వెళ్ళాం. ఆయన మాటల ప్రకారం 'బొరుగులను (మరమరాలను) ముందుగా కొంతసేపు మంచినీటిలో నానబెట్టుకోవాలి. అవి నానుతుండగానే టమోట ముక్కలు చిన్నవిగా కోసుకోవాలి. అలాగే రెండు పచ్చిమిర్చి తరుగుకోవాలి.

ఈలోగా బాణలిలో నూనె వేయాలి. అందులో పోపుగింజలు (తాలింపు గింజలు) కరివేపాకు, ఎండుమిర్చి, చిన్నవిగా తరుగుకున్న టమోట ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి, వేగనీయాలి. కాస్త వేగాక అందులో తగినంత పసుపు, ఉప్పు వేయాలి. నీటిలో నానబెట్టిన బొరుగులను పూర్తిగా నీటి నుంచి వేరు చేసి, ఆ బాణలిలో వేసి వేడి చేయాలి. అంతే ఉగ్గాని రెడీ అయినట్లే! దానిపై పచ్చి వేరుశనగ పప్పును పొడిగా చేసి చల్లాలి. ఈ మిశ్రమాన్ని వేడి వేడి మిరపకాయ బజ్జీలతో కలిపి తింటే, ఆ రుచే వేరు.. సార్!' అంటూ ముగించాడు. అలా మస్తాన్ చెబుతుంటేనే నోరూరిపోయింది. అంతలో వేడి వేడి మిరపకాయ బజ్జీలతో ఉగ్గాని బజ్జీ ప్లేట్లు రానేవచ్చాయి. వాటిని ఆశగా తీసుకుని అలా నోట్లో పెట్టామో లేదో ఆకలిమాట దేవుడెరుగు కళ్లల్లోంచి నీరు తన్నుకొచ్చింది. వాటి కారం నశాలానికి అంటిందంటే నమ్మండి.

సీమ పౌరుషానికి ఈ రుచి కూడా ఓ కారణమేమో అనిపించింది. అయినా నిద్ర సుఖమెరగదు.. ఆకలి రుచి ఎరగదు అని ఊరకనే అంటారా? కొద్దిగా కష్టమనిపించినా ఉగ్గాని బజ్జీలను లాగించేశాం. కారం ఎక్కువ అనిపించింది కానీ నిజంగానే మస్తాన్ బాయ్ చెప్పినట్లు రుచి అదిరిపోయిందండోయ్!

ఓ విజ్ఞాన గని.. మ్యూజియం

ఓ విజ్ఞాన గని.. మ్యూజియం

రాష్ట్రంలో అరుదైన మ్యూజియంలలో ఒకటైన కర్నూలు పురావస్తు ప్రదర్శనశాల 2009 భారీ వరదకు బాగా దెబ్బతింది. ఇప్పుడు మళ్ళీ సందర్శకుల కోసం సిద్ధమైంది. ఎన్నో చారిత్రక ఆనవాళ్ళకు, ప్రాచీన వస్తువులకు కేంద్రం కర్నూలు పురావస్తు శాల అనే చెప్పాలి. నగరానికి సమీపంలోని కేతవరం వద్ద ఆదిమ మానవుల ఆనవాళ్ళు బయటపడ్డాయి. జుర్రేలు లోయ, కటవానికుంట, యాగంటి తదితర ప్రాంతాలలోని తవ్వకాలలో లభించిన పురాతన శిల్పాలు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.

అలనాటి శిల్పకళా సంపదను చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు అంటే నమ్మండి! లోపలకు వెళ్ళే కొద్దీ నాగరికతకు ఆనవాళ్ళయిన మట్టి పాత్రలు, రంగురాళ్ళు, విగ్రహాలు, అలనాటి లిపి, నాణేలు, కత్తులు, కటారులు ఇలా ఒక్కొక్కటిగా మమ్మల్ని ఆకర్షించాయి. వాటిని భద్రపరచిన తీరు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. సిబ్బంది మాటలను బట్టి ఈ మ్యూజియంలో సుమారు వెయ్యికి పైగా వస్తువులను ప్రదర్శ నకు ఉంచినట్లు తెలు స్తోంది.

అంతేకాదు, మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాల‌రీ ఓ ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. అందులో ఎందరో స్వాతంత్ర సమరయోధుల చిత్రాలతో పాటు, మరికొందరి స్థానిక ప్రముఖులు చిత్రాలను కూడా చూడవచ్చు. కర్నూలు మెడికల్ కాలేజ్ పక్కనే, హంద్రీ నది సమీపంలో ఈ మ్యూజియం ఉంది. సంగమేశ్వరం, అలంపూర్, శ్రీశైలం వంటి సమీప ఆలయాలలో విరిగిన శిల్ప కళాఖండాలు, సామంత రాజుల ఆయుధాలు ఇందులో భద్రపరిచారు. ఈ మ్యూజియం స్థానికంగా కోట్ల విజయ భాస్కరరెడ్డి స్మారకానికి సమీపంలో ఉంది. ఓ ప్రాంతం చరిత్రకు ఆ ప్రాంత ఆనవాళ్ళూ ప్రాచీన వస్తువులే సాక్ష్యాలు. నాగరికత, భాష, వ్యవహారశైలి, అలవాట్లూ, ఇవన్నీ తెలుసుకోవాలంటే చారిత్రక అవశేషాలే ఆధారం. అలాంటి ఆధారాలన్నీ ఒకచోట కొలువుతీరే పురావస్తు ప్రదర్శనశాలలు విజ్ఞాన గనులనే చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం మీరు మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి.

Read more about: kondareddy buruju kurnool
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X