Search
  • Follow NativePlanet
Share
» »కోన‌సీమ ప్ర‌కృతి అందాలు.. ఆంత్రేయ‌పురం పూత‌రేకులు

కోన‌సీమ ప్ర‌కృతి అందాలు.. ఆంత్రేయ‌పురం పూత‌రేకులు

కోన‌సీమ ప్ర‌కృతి అందాలు.. ఆంత్రేయ‌పురం పూత‌రేకులు

తుళ్లిప‌డే పిల్లకాలువ‌ల‌ నడుమ ప్రకృతి ఒడిలో ప్రయాణం.. ఓవైపు చారిత్రక ఆనకట్ట విశేషాలు.. మరోవైపు ఆప్యాయతకు మారుపేరైన గోదారోళ్లు ఆత్మీయ పలకరింపులు.. ప్రపంచ ఖ్యాతి పొందిన పూతరేకుల రుచులు.. జుర్రుకు తినాలనిపించే మామిడితాండ్ర రహస్యాలు.. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ప్ర‌యాణపు విశేషాల మేళవింపు మీకోసం..!

మిత్రులతో కలసి ఒక్కరోజులో దగ్గరలోని విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. వేకువజామునే విజయవాడ బస్టాండులో రాజమహేంద్రవరం వెళ్లేందుకు బస్సు ఎక్కాం. భీమడోలు మీదుగా నిడదవోలు చేరే సమయానికి ఉదయం 9 గంటలయ్యింది. అక్కడ నుంచి ఆటోలో మా ప్రయాణం విజ్జేశ్వరం మీదుగా బొబ్బర్లంక ఆనకట్ట వద్దకు చేరింది. అపరభగీరథుడుగా చెప్పుకునే కాటన్ మహాశయుడు కట్టిన ఆనకట్ట గురించి తెలుసుకోవాలని బొబ్బర్లంక గ్రామానికి చెందిన ఒక పెద్దాయన దగ్గరికి వెళ్లి వివరాలు అడిగాం.

ఒకప్పుడు కోనసీమ చుక్కనీరు లేక ఎడారిని తలపించేదని, బ్రిటీషు వారి హయాంలో ఈ ఆనకట్ట నిర్మించడంతో ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు అందించారంటూ కాటన్ ఘనత చెప్పుకుంటూ వచ్చారాయన. తర్వాత అందరం కలిసి, అప్పటి రాతి కట్టడాలను వీక్షించాం. ఆ ఆనకట్ట నిర్మాణం పరిశీలిస్తే అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు సలాం చేయాల్సిందే! అక్కడి నుంచి బయలుదేరి రావులపాలెం వైపుగా సాగింది మా ప్రయాణం.

పూతరేకుల పుట్టినిల్లు

పూతరేకుల పుట్టినిల్లు

ఒకవైపు పిల్ల కాలువ, రెండోవైపు గోదావరి నది మధ్యలో రోడ్డుకిరువైపులా చెట్లు.. ఆ జర్నీ భలే గమ్మత్తుగా అనిపించింది. దారిపొడవునా ప్రకృతి అందాలు మాకు స్వాగతం పలుకుతున్న అనుభూతి కలిగింది. అలా ఆత్రేయపురం గ్రామం చేరుకున్నాం. ఆ గ్రామం పూతరేకులకు ప్రసిద్ధి అని చెప్పారు. దాంతో పూతరేకుల పరిశ్రమల గురించి తెలుసుకోవాలనే కోరిక మాలో మరింత బలపడింది. ఎన్నో ఏళ్లుగా పూతరేకుల తయారీనే ఉపాధిగా చేసుకున్న కొంద‌రు మహిళల‌ దగ్గరకు వెళ్లి.. పూతరేకుల తయారీ గురించి ఆరా తీశాం. వారు ఆ వివరాలను పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు.

వెంట‌నే క‌రిగిపోయే పూత‌రేకులు..

వెంట‌నే క‌రిగిపోయే పూత‌రేకులు..

ఆ మ‌హిళ‌లు చెప్పిన దానినిబట్టీ ముందుగా బియ్యాన్ని మూడు గంటలపాటు నానబెట్టి, తరువాత మెత్తగా గ్రైండ్ చేస్తారు. పలుచగా చేసి అనంతరం మట్టి కుండను తీసుకొని దాన్ని బొర్లా పెట్టి కింద మంట పెట్టి ఒక పల్చటి గుడ్డతో పిండిలో ముంచి కుండపై వేస్తారు.. దాంతో క్షణాల్లో పలుచని రేకుల పూతరేకు వస్తుంది. వంద నుంచి ఎనభై రేకులు చుట్టలుగా తయారుచేస్తారు. బెల్లాన్ని పొడిగా చేసి జీడిపప్పు, బాదంపప్పును చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు.

ముందు కొంచె నెయ్యి రాసి, ఆ పొడిని వాటిపై చల్లి, చుట్టలుగా చుడతారంటూ వివరించారు. వారి మాటలు విన్న తర్వాత ! మేమూ ఒక్కసారి పూతరేకుల రుచిని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాం. అక్కడే తయారైన ఓ పూతరేకును నోట్లో పెట్టుకున్నాం. ఇలా పెట్టామో లేదో అలా కరిగిపోయింది. అప్పుడు అర్ధమైంది పూతరేకులు ఎందుకు అంత ప్రసిద్ధి గాంచాయో అని. అవి మేం అనుకున్నదానికంటే చాలా రుచిగా ఉన్నాయి.

ఒక్కొక్కటి ఎంత ఉంటుందని అడిగితే... జీడిపప్పుతో అయితే ఇర‌వై రూపాయలు, డ్రైఫ్రూట్స్ అయితే ముప్పై రూపాయలకు అమ్ముతామని చెప్పారు. అంతే కాదండోయ్! షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ లెస్‌ పూతరేకులు ఇక్కడ మరో ప్రత్యేకత. ఓ నాలుగైదు ప్యాకెట్లు కొనుగోలుచేసి, మా బ్యాగుల్లో వేసుకుని అక్కడి నుంచి బయలుదేరాం.

గోదారోళ్లు ఆప్యాయత

గోదారోళ్లు ఆప్యాయత

అక్కడికి దగ్గరలోనే మామిడితాండ్రకు పేరుగాంచిన ఓ వీధివైపు పడ్డాయి మా అడుగులు. తాండ్ర తయారీలో మంచి అనుభవం ఉన్న కొంత‌మందిని కలిశాం. విషయం చెప్పకుండానే ఆత్మీయంగా మమ్మల్ని లోపలకు పిలిచి, కూర్చోమని రెండు కుర్చీలు వేసి, తాగడానికి మంచినీళ్లు ఇచ్చారు. గోదారోళ్లు పలకరింపులు ఆ నోటా ఈ నోటా వినడమే కానీ, కళ్లారా చూసింది లేదు. ఆ క్షణంలో ఆ అనుభవమూ మాకు తీరిపోయింది.

అనంతరం తాండ్ర ఎలా తయారు చేస్తారు అని అడిగాం. పక్వానికి వచ్చిన మామిడిపండ్లను జ్యూస్ తీసి మిక్సీలో వేసి దానికి పంచదార కలుపుతారు. బల్లలుగా ఏర్పాటు చేసిన ఈతచాపలపై రోజుకు మూడుసార్లు పలుచని పొరలా అలుకుతారు. అంతే, ఓ వారం రోజులకు మామిడితాండ్ర తయారువుతుంది. దీన్ని ముక్కలుగా కోసి వ్యాపారులకు విక్రయిస్తారు. కొంత తాండ్రను శీతలగిడ్డంగులలో భద్రపరుచుకొని నెలనెలా తెచ్చి విడిగా కేజీ 130 నుంచి 250 రూపాయలకు అమ్ముతామని చెప్పుకొచ్చారు. ఓ రెండు ముక్కలు అక్కడే రుచి చూశాం.

అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. భోజనం చేసేందుకు పక్కనే ఉన్న రావులపాలెం అనువైందని అక్కడివారు చెప్పడంతో అటువైపుగా బ‌య‌లుదేరాం.

ప్రకృతి ఒడిలో ప్ర‌యాణం

ప్రకృతి ఒడిలో ప్ర‌యాణం

అక్కడి నుంచి రావులపాలెం వెళ్లే మార్గం మధ్యలో ఆహ్లాదకరమైన లాల్ల లాకుల వద్ద ఆగాం. ప్రకృతి సోయగాలను వీక్షించడానికి అదే సరైన ప్రదేశం అని చెప్పొచ్చు. లాకులు నుంచి కిందికి జాలువారే సెలయేటి అందాలను చూడడంతో పాటు పచ్చటి తివాచీ పరిచినట్టుగా కనిపించే పంటపొలాలను,కాలువగట్లను, కొబ్బరి తోటలను మనసారా ఆస్వాదించాం.

ఎగసి పడుతోన్న గోదారి నీటి ప్రవాహం మా మనసులను కట్టిపడేసేలా చేసింది. ఆ ప్రకృతి అందాలను మా మొబైల్ ఫోన్లలో బందించేందుకు పోటీపడ్డాం!

భలే భలే కుండ బిర్యానీ

భలే భలే కుండ బిర్యానీ

అలా రావులపాలెం వచ్చేసరికి మధ్యాహ్నం రెండయ్యింది. అక్కడ కుండ బిర్యానీ బాగా ప్రసిద్ధి చెందినదని చెప్పారు. దాని గురించి తెలుసుకునేందుకు ఓ రెస్టారెంట్‌లో దాని వివరాలు అడిగాం. బిర్యానీ తయారీకి బాస్మతీ రైస్తో పాటు రెండు కోడి లెగ్ పీస్‌ల‌ను మట్టికుండలో పెట్టి, ఆ కుండను నిప్పులపై వేడి చేసి, ఉడికిస్తారని చెప్పారు. అందుకే కుండబిర్యానీకి ఓ ప్రత్యేకమైన రుచి వస్తుందట! ఒక్కో కుండ బిర్యానీ 260 రూపాయలకు అమ్ముతున్నారు.

ఇక ఆలస్యం చేయకుండా మేమూ ఆ బిర్యానీ లాగించేశాం. కుండ బిర్యానీ రుచిని మాట‌ల్లో చెప్ప‌లేం లేండి. ఒక్కొక్క‌రం ఒక్కో కుండను కాళీ చేసేశాం అంటే మీరే అర్థం చేసుకోండి. తర్వాత అక్కడి నుంచి బైపాస్ రోడ్డు మీదుగా విజయవాడకు తిరుగుముఖం పట్టాం. ఒక్కరోజు సాగిన మా ప్రయాణంలో కొన్ని కోనసీమ అందాలతోపాటు... అక్కడివారి ఆప్యాయతలు, ప్రసిద్ధ రుచులు మూటకట్టుకుని వచ్చాం. మాఈ ప్ర‌కృతి ఒడిలో ప్ర‌యాణం జీవితంలో మ‌ర్చిపోలేని ఎన్నో అనుభూతుల‌ను మిగిల్చిందనే చెప్పాలి. మరెందుకు ఆలస్యం మీరూ మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి!

Read more about: anthreyapuram vijayawada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X