Search
  • Follow NativePlanet
Share
» »ప‌చ్చ‌ని త‌ల‌కోన‌.. చ‌ల్ల‌ని హార్స్‌లీ హిల్స్ చూసొద్దాం!

ప‌చ్చ‌ని త‌ల‌కోన‌.. చ‌ల్ల‌ని హార్స్‌లీ హిల్స్ చూసొద్దాం!

ప‌చ్చ‌ని త‌ల‌కోన‌.. చ‌ల్ల‌ని హార్స్‌లీ హిల్స్ చూసొద్దాం!

ఒంపులు తిరిగిన రహదారిలో పచ్చని చెట్ల మధ్య ప్రయాణం.. గుభాళించే గంధపు పరిమళాల ఆత్మీయ ఆహ్వానం.. ప్ర‌యాణ‌పు అల‌స‌ట‌ను చల్లార్చే ప్రకృతి సోయగాలు అక్కడ అనేకం.. ఓవైపు తలకోన జలపాతాల సవ్వడులు మంత్రముగ్ధుల్ని చేస్తుంటే.. మరోవైపు హార్సిలీహిల్స్ లోని సహజసిద్ధమైన పచ్చని చెట్లు.. వాటికి పూసిన పూల పరిమళాలు మనల్ని అక్కున చేర్చుకుంటున్నాయి. ఇలా ఎన్నో రమణీయ అందాలతో ఈ ప్రాంతం విహారయాత్రకు చిరునామాగా నిలుస్తోంది. పర్యాటకుల విడిది కేంద్రంగా పేరొందిన ఈ ప్రాంత‌పు విహార అనుభ‌వాలు మీకోసం.

ఉదయం ఏడయ్యింది. మా మిత్ర‌బృందంతో కలసి తిరుప‌తి ఆర్టిసి బస్టాండ్ దగ్గరకు వెళ్ళాం. అప్పటికే జనం గుంపుగా ఉన్నారు. బస్టాండ్ అన్నాక ఆ మాత్రం ఉంటారులే అనుకున్నాం. అలా పదినిమిషాలకు పొగలు కక్కుతూ ఓ సింగిల్ డోర్ బస్సు వచ్చి ఆగింది. అంతే ఒక్క ఊపున ఆ గుంపంతా ఒకరినొకరు నెట్టుకుంటూ ఎక్కడం మొదలుపెట్టారు. అప్పుడర్ధమైంది. వారాంతా మేం ఎదురుచూస్తున్న బస్సు బాధితులేనని. ఆ జనంతోపాటే మేమూ ఎలాగోలా బస్కెక్కేశాం.

అన్నట్లు చెప్పడం మర్చిపోయాను! మేం తిరుపతి నుండి తలకోన వెళ్తున్నాం. నేరుగా ఇక్కడి నుండి తలకోన వెళ్ళే ఒకే ఒక్క బస్సు ఇది. 'అందరూ ఎక్కారా? రైట్..రైట్..!' అంటూ కండక్టర్ ఓ కేక వేశాడు. అంతే, బస్సు వదిలిన పొగకు వెనకాల ఉన్న వాహనాలు అదృశ్యమైపోయాయి. బస్సు ఎక్కేటప్పుడు ఫుట్పాత్ పైన ఓ అడుగు వేశాం. అంతే, రెండో అడుగు వేసేందుకు అవకాశం లేదు. అంతలా విద్యార్థులతో బస్సు నిండిపోయింది. ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకుంటున్న వారి మధ్య సంభాషణలు వింటుంటే ఒకప్పడి చదువుకున్న పల్లెటూరి వాతావరణం గుర్తొచ్చింది.

దారి పొడవునా ఒంపులు తిరిగిన రోడ్డు

దారి పొడవునా ఒంపులు తిరిగిన రోడ్డు

అలా మా ప్రయాణం నగర వీధుల్లో కొంత సమయం సాగింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పరిసరాలను చూస్తున్నక్రమంలో 'భక్తులు ఉన్నారు జాగ్రత్తగా వెళ్ళండి!' అనే బోర్డు నాకంట బడింది. ఆశ్చర్యం ఏంటంటే, అలాంటి బోర్డులు మాకు అడుగడుగునా ఎదురయ్యాయి. సామాన్య ప్రజలకంటే భక్తులపై ఎంత ప్రేమో? అయినా, తిరుపతి నగరానికి ఆ భక్తులే ఆర్థిక వనరులు కదా! వాళ్ళ విషయంలో ఆ మాత్రం జాగ్రత్త తీసుకోపోతే ఎలా? అని మనసులో అనుకున్నాను. అలా ఓ 25 కిలోమీటర్ల దూరం సాగింది మా ప్రయాణం.

శ్రీవిద్యానికేతన్ దగ్గర బస్సు ఆగింది. బస్సు బ్రేక్ పడగానే బిలబిలా విద్యార్థులు దిగిపోయారు. అంతవరకూ టిక్కెట్.. టిక్కెట్ అంటూ గొంతు చించుకున్న ఆ కండక్టర్ ఓ పనైపోయింది అన్నట్లు ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే తర్వాత బస్సులో గట్టిగా పదిమంది కూడా లేరు మరి. అక్కడి నుండి హాయిగా సాగింది మా ప్రయాణం. దారి పొడవునా ఒంపులు తిరిగిన రోడ్డును చూస్తుంటే కొండలను చీల్చుకుంటూ వెళుతున్న ఫీలింగ్.

ప్రకృతి సిగలో తలకోన

ప్రకృతి సిగలో తలకోన

బస్సు ప్రయాణం 64 కిలోమీటర్ల సాగిన తర్వాత తలకోన చేరుకున్నాం. పచ్చని అడవిమాటున దాగి ఉన్న అక్కడి ప్రకృతి అందాలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. అడవి మార్గాన ఓ రెండు కిలోమీటర్లు కాలినడకన వెళితే తలకోన జలపాతం చేరుకోవచ్చని స్థానికులు చెప్పారు. అక్కడి నుండి నడక మొదలుపెట్టాం. దారిపొడవునా పెద్ద పెద్ద వృక్షాలు స్వాగతం పలికాయి. రహదారికి ఓవైపుగా సుదూరంగా కనిపిస్తున్న లోయలు కనువిందు చేస్తున్నాయి. దారి మధ్యలో భారీ వృక్షతీగలు కనిపించాయి. అవి లయునాసి తెగల జాతికి చెందినవి. వాటి బెరడులో సపోనిన్ అనే చేపలను చంపే విషపదార్థం ఉంటుందని వివరంగా ఓ బోర్డుపై రాసి ఉంది.

మెలి తిరిగిన ఆ తీగలు ఐదు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. అక్కడి నుండి కొంతదూరం నడిచేసరికే జలపాతపు సవ్వడులు వినిపించసాగాయి. తలకోన జలపాతపు అందాలు చూస్తుంటే రెండు కళ్ళూ సరిపోవేమో అనిపించింది. తలకోన జలపాతం 270 అడుగలతో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ఎత్తయిన జలపాతంగా పేరొందింది. అంతేకాదు, 230 అడుగుల దాకా రాతి మార్గం ద్వారా పైకి ఎక్కవచ్చు. అంతటి ఎత్తు నుండి జారువాలే నీటి హోయల్ని మాటల్లో వర్ణించడం కష్టం. అక్కడి నీటిమ‌డుగు లోతును ఇప్పటి దాకా ఎవరూ చెప్పలే కపోయారట. ఇక్క‌డ స్నానానికి వెళ్ళేవారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే కోతుల బెడద మామూలుగా లేదండోయ్! తలకోనలో పర్యాటకులు విడిది చేసేందుకు అటవీశాఖ, టిటిడి వారి గెస్ట్ హౌస్లు అందుబాటులో ఉన్నాయి. టిటిడి గదులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉంది.

ఓ తియ్యని అనుభవం

ఓ తియ్యని అనుభవం

తలకోన నుండి బకరపేట జంక్షన్‌కు ఆటోలో వచ్చాం. అక్కడి నుండి హార్సిలీహిల్స్ బైక్ పై ట్రావెల్ చేస్తే బావుంటుందని కొందరు యువకులు చెప్పారు. వెంటనే స్థానికంగా ఉన్న మా మిత్రుడు సహాయం తీసుకున్నాం. జర్నీలో తెలియలేదుకానీ, కాస్త విరామం దొరికేసరికి ఆకలి గుర్తొచ్చింది. అక్కడే ఉన్న మహాలక్ష్మి హోటల్లో భోజనం చేశాం. భోజనం యావరేజ్ ఉన్నా, హోటల్ వారు కస్టమర్‌ల‌ను రిసీవ్ చేసుకున్న విధానం మాకు భలే నచ్చేసింది. అలా భోజనం పూర్తి చేశాక, అక్కడి నుండి ద్విచక్ర వాహనాల‌పై హార్సిలీహిల్స్‌కు బయలుదేరాం. అక్కడి నుండి డెబ్బై కిలోమీటర్ల దూరం. ఆ కొండదారిలో గంధపు చెట్లు, యూకలిప్టస్ చెట్లు పరిమళాలు వెదజల్లుతూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

దారి పొడవునా గంధపు సువాసన భరితమే అంటే అతిశయోక్తి కాదు. దారిలో చాలామంది పర్యాటకులు తారసపడ్డారు. ఆ ఒంపులు తిరిగే మార్గంలో ప్రకృతి అందాలను తమ కెమేరాల్లో బంధిస్తోన్న కుర్రకారు కేరింతలు అంతా ఇంతా కావు. హార్సిలీహిల్స్ రోడ్డు ప్రయాణం నిజమైన ప్రకృతి అనుభూతుల్ని పంచిపెట్టింది.

ఆంధ్రా ఊటీ అందాలు..

ఆంధ్రా ఊటీ అందాలు..

అలా రెండు గంటల ప్రయాణం తర్వాత మా గమ్యస్థానాన్ని చేరుకున్నాం. అదేనండీ! మనం ఆంధ్రా ఊటీగా పిలుచుకుంటున్న హార్సిలీహిల్స్. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు ఆ పేరును స్థిరపరిచాయని అర్థమైంది. ఈ ప్రాంతం అసలు పేరు ఏనుగు మల్లమ్మ కొండ. తూర్పు కనుమలలోని దక్షిణ భాగపు కొండల వరుసే ఈ హార్సిలీహిల్స్. 1314 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ఎత్తయిన ప్రదేశం కూడా ఇక్కడే ఉందండోయ్ ! వందేళ్లకు పైగా వయసు కలిగిన నీలగిరి వృక్షాలు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి.

కొండ పై జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషీ వ్యాలీ విద్యాలయం ప్రశాంతతకు మారు పేరుగా ఉంది. ఇక్కడకు వచ్చే పర్యాట‌కులకు గవర్నర్ బంగ్లా, వన్యమృగ కేంద్రం వంటివి ప్రత్యేక ఆకర్షణలుగా చెప్పవచ్చు. ఏపీ టూరిజం రిసార్ట్స్ అందుబాటులో ఉంది. సందర్శకులు విడిది చేసేందుకు పర్యాటకశాఖ సదుపాయాలను కల్పించింది. అంతేకాదు, రాక్ క్లైమింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడల పై మక్కువ ఉండేవారికి ఇక్కడి కొండలు అనువుగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ ప్ర‌యాణాన్ని మొదలు పెట్టండి!!

Read more about: talakona jalapatham
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X