Search
  • Follow NativePlanet
Share
» »కోలార్ : ముచ్చటైన ప్రదేశాలు !

కోలార్ : ముచ్చటైన ప్రదేశాలు !

By Mohammad

ఇతిహాసాల ప్రకారం బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు ఉన్నారని తెలుసు. త్రిమూర్తులైన ఈ ముగ్గురు కలిసి ప్రతిష్టించిన గణేషుడి విగ్రహం ఒకటి కర్నాటక రాష్ట్రంలో కలదు. అదెక్కడుందో .. అక్కడికి వెళితే ఏమేమి చూడాలో ... చూసెద్దాం పదండి ..!

ఇది కూడా చదవండి : ప్రకృతి శోభాయమానం 'నంది కొండలు' !

కోలార్ ... కర్నాటక రాష్ట్రంలో తూర్పు అంచున దక్షిణ భాగంలో ఆంధ్ర మరియు తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కలదు. బంగారు గనులకు దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఈ జిల్లా అద్భుతమైన ఆలయాలు, ట్రెక్కింగ్ ప్రదేశాలు, కోటలు కలిగి ఉన్నది. బెంగళూరు నుండి జాతీయ రహదారి 4 గుండా 68 కి. మీ. దూరం ప్రయాణిస్తే గంటన్నారలో కోలార్ చేరుకోవచ్చు.

కోలారమ్మ గుడి

కోలారమ్మ గుడి

కోలార్ ను సందర్శించే ప్రతి యాత్రికుడు కోలా రమ్మ గుడి సందర్శించాల్సిందే ..! సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ఈ పార్వతి దేవి ఆలయాన్ని చోళులు 'ఎల్' ఆకారంలో నిర్మించినారు. గుడిలో గ్రానైట్ రాళ్లతో చెక్కిన నమూనాలు, విగ్రహాలు యాత్రికులను మరిపిస్తాయి.

చిత్ర కృప : Gokul Chakrapani

సోమేశ్వర ఆలయం

సోమేశ్వర ఆలయం

శివుని అవతారాలలో ఒకటిగా భావించే సోమేశ్వరునికి క్రీ.శ. 14 వ శతాబ్ధంలో విజయనగర నిర్మాణ శైలిలో కోలార్ పట్టణానికి మధ్యలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆలయం లోపల పాశ్చాత్య దేశాల నిర్మాణ శైలి ని పోలి ఉండే కళ్యాణ మండపం, స్తంభాలు గమనించవచ్చు.

చిత్ర కృప : Karnataka Tourism

అంతరగంగ

అంతరగంగ

కోలార్ కు 4 కి. మీ. దూరంలో ఉన్న అంతరగంగ సాహస ప్రియులకు నచ్చే ప్రదేశం. నిరంతరం పెద్ద పెద్ద రాళ్ళ మధ్యల నుండి ప్రవహిస్తూ ... కొండల మీదకు దూకే నీటి సవ్వడులను వీక్షించవచ్చు. అంతరగంగ అందలన్నీ అక్కడి రాతి నిర్మాణాలు, గుహలలో ఉన్నాయి. పర్వతారోహణ, ట్రెక్కింగ్ వంటివి సూచించదగినది. కొండ పైకి చేరుకోవడానికి గంట - రెండు గంటల సమయం పడుతుంది.

చిత్ర కృప : Gokul Chakrapani

కోలార్ పర్వతాలు

కోలార్ పర్వతాలు

'కోలార్ బెట్ట' గా కూడా పిలువబడే కోలార్ పర్వతాలు కోలార్ పట్టణం నుండి కేవలం 2 కి. మీ. దూరంలో కుటుంబసభ్యులకి, స్నేహితులకి, జంటలకి ఒక పిక్నిక్ స్పాట్ గా ఉన్నది. 100 మెట్లు పైకెక్కి కొండ మీదకి చేరుకోగానే పెద్ద మైదానం, నంది నోటి నుండి జాలువారే నీరు, చుట్టూ ప్రకృతిని చూస్తూ ఆనందించవచ్చు.

చిత్ర కృప : sandeep

మార్కండేయ కొండ

మార్కండేయ కొండ

వోక్కలేరి గ్రామం కోలార్ సమీపంలో యాత్రికులకు అన్వేషించడానికి సూచించబడినది. ఇక్కడ మార్కండేయ ముని తపస్సు చేసిన కొండ ఉన్నది. ముని పేరు మీదనే ఇది మార్కండేయ కొండ గా పిలవబడుతున్నది. యాత్రికులు కొండ మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళితే పైన ఒక ఆలయాన్ని, జలపాతాన్ని మరియు చుట్టూ ఉన్న అడవి అందాలను వీక్షించవచ్చు.

చిత్ర కృప : Gokul Chakrapani

ఆది నారాయణ స్వామి గుడి

ఆది నారాయణ స్వామి గుడి

కోలార్ జిల్లాలోని బాగేపల్లి నుంచి 12 కి. మీ. దూరంలో ఎల్లోడు కొండలపై ఉన్న ఆది నారాయణ స్వామి గుహాలయాన్ని యాత్రికులు తప్పక చూడాలి. గుడిలో ఉద్భావమూర్తి రాతి విగ్రహం ఎటువంటి అలంకరణలు లేకుండా ఉంటుంది. కొండ మీదకి చేరుకోవటానికి 618 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. మాఘ మాసం లో జరిగే రథోత్సవానికి దేశ, విదేశాల నుండి భక్తులు తరలి వస్తారు.

చిత్ర కృప : Gokul Chakrapani

రామలింగేశ్వర గుడి

రామలింగేశ్వర గుడి

కోలార్ కు 10 మైళ్ళ దూరంలో ఉన్న అవని(దక్షిణ గయ) గ్రామం రామలింగేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందినది. సమయముంటే ఇక్కడే సీతాదేవి ఆలయం, శారదా పీఠం చూడవచ్చు. పురాణాల ప్రకారం ఇక్కడే వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిందని, రామునికి అతని కుమారులకు ఇక్కడే యుద్ధం కూడా జరిగిందని స్థానికుల నమ్మకం.

చిత్ర కృప : Gokul Chakrapani

కోటిలింగేశ్వర ఆలయం

కోటిలింగేశ్వర ఆలయం

దేశంలో ప్రసిద్ధిచెందిన కోటి లింగేశ్వర ఆలయం కోలార్ లోని కమ్మసాన్ధ్ర గ్రామంలో కలదు. గుడిలో శివలింగం 108 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. అలాగే శివలింగానికి అభిముఖంగా ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తున్న నంది విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. మహాశివరాత్రి నాడు జరిగే విశిష్ట పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

చిత్ర కృప : Karnataka Tourism

కురుదుమలె

కురుదుమలె

కురుదుమలె ప్రదేశం కోలార్ కు 35 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ త్రిమూర్తులైన శివుడు, విష్ణువు, బ్రహ్మ కలిసి గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్టించినారు. ఈ విగ్రహం సుమారు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించినట్లు అక్కడ వేయించిన శాశనాల ద్వారా తెలుస్తుంది. అలాగే సమీపంలో సోమేశ్వర దేవాలయాన్ని కూడా సమయముంటే దర్శించండి.

చిత్ర కృప : vijayashankar metikurke

బంగారు గనులు

బంగారు గనులు

హరప్పా, మోహంజోదారో నాగరికత కాలం నుంచే కోలార్ గనుల్లో బంగారంను తవ్వకాల ద్వారా వెలికితీసేవారు. ఆతరువాత గుప్తులు కాస్త లోపలికి తవ్వకాలు జరిపి బంగారం బయటికి తీసేవారు. చోళులు, టిప్పుసుల్తాన్ లు, విజయనగర రాజులు, బ్రిటీష్ వారు కూడా తవ్వకాలు జరిపారు. చివరికి ముడి ఖనిజంలో బంగారు శాతం తగ్గడంతో 2001 లో శాశ్వతంగా మూసేసారు.

చిత్ర కృప : Rasheed puthur Perintalmanna

కోలార్ చేరుకోవటం ఎలా ?

కోలార్ చేరుకోవటం ఎలా ?

కోలార్ చేరుకోవటానికి బెంగళూరు నుండి చక్కటి రోడ్డు మార్గం కలదు. రైలు, విమాన మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

65 కి. మీ. దూరంలో ఉన్న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కోలార్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం. దేశ, విదేశాల నుండి ఇక్కడికి విమాన సౌకర్యాలు ఉన్నాయి. ట్యాక్సీ లేదా క్యాబ్ లలో ప్రయాణించి కోలార్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

కోలార్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇది పట్టణం నుండి 2 కి. మీ. దూరంలో కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఈ రైల్వే స్టేషన్ కలుపబడింది. అటోలలో ప్రయాణించి కోలార్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

కోలార్ గుండా జాతీయ రహదారి 4 వెళుతుంది. రాష్ట్ర సర్వీస్ బస్సులు మరియు ఇతర ప్రవేట్ సర్వీస్ బస్సులు బెంగళూరు, చిక్కబల్లాపూర్ ప్రాంతాల నుండి నిత్యం కోలార్ కు బయలుదేరుతుంటాయి.

చిత్ర కృప : Somasekhar L

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X