Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణ గ్రీన్ వ్యాలీ లో అరుదైన జలపాతం !!

తెలంగాణ గ్రీన్ వ్యాలీ లో అరుదైన జలపాతం !!

గోదావరి(గోదారి) నది ఒక జీవనది. దీనిని దక్షిణ గంగా అని పిలుస్తుంటారు. అటువంటి ఈ నది ఎన్నో ప్రకృతి సౌందర్యాలతో చూపరులను ఆకట్టుకుంటుంది. ఎక్కడో మన రాష్ట్రం కూడా కాదు, మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకం వద్ద పుట్టి కోస్తా ఆంధ్రలోని ఉభయగోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదికి అవతలి జిల్లా అదిలాబాద్‌, ఇవతలి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో రాష్ర్టంలోనే అందమైన అడవులు ఉన్నాయి. గోదావరి లోయలో ఉన్న అడవులను తెలంగాణ గ్రీన్‌ వ్యాలీ అంటారు. ఈ గ్రీన్‌ వ్యాలీ అందం అదిలాబాద్‌ జిల్లాలో ఎక్కువ. అలాంటి అరుదైన, అందమైన అడవుల్లో మరింత అందమైన, అత్యంత ఎతైన జలపాతం ఉందని ఆ ప్రాంతం లోని ఒక్కరికి కూడా తెలియకపోవడం నిజంగా దురదృష్టకరం.

మొక్కుడు గుండం కేరాఫ్ తెలంగాణ గ్రీన్ వ్యాలీ !!

అదిలాబాద్ లోని అడవులు

Photo Courtesy: Mujtaba Khan

అలసట కలగకుండానే, ఏ ప్రయత్నమూ చేయకుండానే ఎంతో అద్భుతమైన దృశ్యం కనిపించినా మనకు అంత ఆనందం అనిపించదు. అదే దాని అందాన్ని మనం వెతికి పట్టుకునే ప్రయత్నం కొంత చేసి సఫలీకృతమైనప్పుడు కలిగే ఆనందం ఒక మధుర సృతి అవుతుంది. గ్రీన్‌ వ్యాలీలోని ‘గాడి'ద గుండాన్ని చేరుకుని చూసినప్పుడు మధర సృతి. అంటే గాడిద గుండం దర్శనం ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్నిచ్చి అదొక మధురస్మృతిగా మిగిలేందుకు దోహదం చేసింది.

ఈ ప్రాంతంలో విభిన్న జాతుల సమ్మేళనాన్ని, వైవిధ్య సంస్కృతులను...భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడవచ్చు. ఈ జలపాతానికి పెట్టిన మరొక పేరే ముక్కిడి గుండం. కనుక అక్కడికి వెళ్ళి గాడిద జలపాతం అనే బదులు ముక్కిడి గుండం అని పిలిస్తే కాస్త స్టైలిష్ గా ఉంటుంది. నిజానికి స్థానిక ప్రజలు ఈ జలపాతానికి మొక్కుతారు. అందుకే దీన్ని ‘మొక్కుడు గుండం' అని, ఇది ‘గాడి'లో నుంచి దుముకుతుంది కాబట్టి ‘గాడి'ద గుండం అని పేర్లు వచ్చాయి.

మొక్కుడు గుండానికి వెళ్లే 3 కి.మీ నడక మార్గం ఎలా ఉంటుందంటే ...

పర్యాటకులు సాగు చేసుకుంటున్న పంట పొలాలు మధ్య నుండి నడచిపోవాల్సి ఉంటుంది. అక్కడక్కడా గుట్టబోర్లు, ఎతైన గుట్టలు, అడవులు, లోతైన లోయలు, ఇరు కైన దారి, ఎడ్లబళ్ళ చక్రాల గాడులు, పచ్చని చెట్ల మధ్య చిన్న, చిన్న కుంటలు, వాటి నీటిని తాగడానికి వచ్చిన జంతువుల కాళ్ళ డెక్కల గుర్తులు, జల జలా పారుతూ మనకు అడ్డంగా వచ్చే ఏరులు, పచ్చిక బయళ్ళు మేస్తున్న పశువులు, వాటిని కాపలా కాసే గోండులు, ఆంధ్‌లు, అటవీ మార్గంలో ఎలుగుబంట్లు, అడవిపందులు ఎదురవుతాయేమోనన్న భయం. వీటిల్లో ప్రతి ఒక్కటీ మన మనోఫలకంపై ముద్రించుకుపోయే మధుర స్మృతులను మిగుల్చుతాయి. అంటే మీరు పూర్తిగా పల్లెటూరి వాతావరణం అనుభవిస్తున్నట్లు అన్నమాట !!

మొక్కుడు గుండం కేరాఫ్ తెలంగాణ గ్రీన్ వ్యాలీ !!

ఎడ్లబళ్ళ చక్రాల గాడులు

Photo Courtesy: Suresh Kumar

ఎతైన, లోతైన జలపాతం

గాడిదగుండం జలపాతం పరిసరాలే మనల్ని స్వర్గ లోకానికి తీసుకెళ్తాయి. చుట్టూ గమనించినట్లయితే ఎతైన పచ్చని కొండల మధ్య వంపు తిరిగిన కన్యాలా ఒక వాగు ప్రవహిస్తుంది. అదీ ఒక ఇరుకైన గాడిలో. చిక్కని ఎతైన చెట్ల మధ్యలో, గుండిబాగ్‌ అనే అంధలగూడెం సరిహద్దుల్లో పచ్చని చెట్ల మధ్య నుండి తెల్లని వాగు వడివడిగా ప్రవహిస్తుండటం చూసి పరవశించిపోతాం. అంత కంటే పరవశించే దృశ్యం అల్లంత దూరంలోనే కనిపిస్తుంది. అదే అసలైన అందమైన జలపాతం. అలాగని దాని అందం అంత సులభంగా కనిపించదండోయ్ .. వినిపిస్తుంది. 200 అడుగల ఎత్తు నుండి దూకే శబ్దం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి !! ఇది రాష్ర్టంలోనే ఎతైన జలపాతాల్లో ఒకటి.

మొక్కుడు గుండం కేరాఫ్ తెలంగాణ గ్రీన్ వ్యాలీ !!

మొక్కుల గుండం జలపాత అందాలు

Photo Courtesy: HPC

ఈ జలపాతం ఒక ఇరుకైన గాడిలో నుండి కొండల మధ్య సహజంగా ఏర్పడిన ఒక నిటారైన రంధ్రంలోకి దూకుతుంటుంది. నిజానికి ఆ రంధ్రం ఈ జలపాతం దూకుడు తాకిడికే ఏర్పడిందంటే నమ్మశక్యం కాదు!!. ఆ రంధ్రం ఎత్తు, లోతు సుమారు 100 అడుగుల పైమాటే. అంటే ఈ జలపాతం ఎత్తులో సగం భాగం అన్నమాట. జలపాతం ఈ రంధ్రంలో దూకిన తరువాత మనకు కనిపించకుండా మాయమవుతుంది . అదొక అందమైన ఆసక్తికరమైన దృశ్యం. ఇక్కడే మనకు తెలియని మరో ఆసక్తికరమైన సన్నివేశం కనిపిస్తుంది అదేమిటంటే, కొందరు స్థానిక వేటగాళ్ళు పావురాలను పట్టుకోవడం.

సుందరమైన లోయ

మనం జలపాతం అందాలనూ పూర్తిగా వీక్షించాలంటే ఇక్కడున్న లోయలో దిగి తీరాల్సిందే!!. గాడిదగుండం జలపాత ప్రాంత దృశ్యం కాశ్శీర్‌ లోయను తలపిస్తుంది. ఈ జలపాతం చుట్టూ సుమారుగా 500 అడుగుల ఎత్తైన కొండల వరుసలు పచ్చని చెట్లతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఈ కొండల మధ్య తూర్పు భాగం ఎత్తైన పీఠభూమి, పశ్చిమ భాగం ఏటవాలు లోయ ఉంది. ఏవిధంగా ఉన్న ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది. పీఠభూమినైతే ఈశాన్యం కొండల మధ్య సన్నని చీలక నుండి చేరుకోవాలి. లోయనైతే పశ్చిమపు కొండలు దిగి చేరుకోవాలి. వర్షాలు ఉధృతంగా లేనప్పుడు కడెం నది గుండా మనం చేరుకోవచ్చు.

మొక్కుడు గుండం కేరాఫ్ తెలంగాణ గ్రీన్ వ్యాలీ !!

లోయ వద్ద చిన్నారుల కేరింతలు

Photo Courtesy: bhargav

ఇలా వచ్చినప్పుడు జలపాతం కింద ఉన్న లోయలోకి చేరుకుంటాం. జలపాతం ఎత్తు, అందాన్ని సంపూర్ణంగా చూసి ఆనందిచవచ్చు. పీఠభూమిపై నుండి వస్తే దాని ఎత్తు సగమే కనిపిస్తుంది. వంపులు తిరిగి వయ్యారంగా అంత ఎత్తు నుంచి కింద పడే ఆ నీటిధారాల సోయగాలు నిజంగా చూస్తే మనసు తుల్లింతే మరి! ఈ దృశ్యాన్ని ప్రతి ఒక్క పర్యాటకుడు, ప్రకృతి ప్రియులు తన, మన అనే తేడా లేకుండా తనివితీరా చూడవలసిందే, చూసి తరించాల్సిందే !

జలపాతానికి ఎలా చేరుకోవాలి ??

హైదరాబాద్‌ నుండి నిర్మల్‌, నేరేడిగొండ, దేవల్‌ నాయక్‌ తండల మీదుగా ప్రయాణిస్తే 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ జలపాతం. దీన్ని చేరడానికి పచ్చని అడవులు, గుట్టలు, లోయల్లో మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇది ఒక మంచి ట్రెక్కింగ్ అనుభూతిని ఇస్తుంది. వర్షాకాలంలో కడెంనది ఒక్కోసారి వరద ఎక్కువై దాటనివ్వదు. అందుకని దేవల్‌ నాయక్‌తండా దాటి, ఈ జలపాతానికి చేరుకోవచ్చు. ఐతే ఇక్కడికి నిర్మల్‌, ఇచ్చోడ, సిరిచెల్మ, పట్టణం, గుండిబాగ్‌ల మీదుగా వాహనంలో కూడా రావచ్చునట. ఇక్కడికి చేరుకోవడానికి ఆటోలు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారి నెంబర్ 44 ఈ ప్రాంతానికి కూతవేటు దూరంలో కలదు. కనుక రోడ్డు మార్గం విషయంలో ఎటువంటి ఢోకాలేదు కాబట్టి పర్యాటకులు ఇక్కడికి రావాలంటే సులభమైన మార్గం రోడ్డు మార్గమే !!

మొక్కుడు గుండం కేరాఫ్ తెలంగాణ గ్రీన్ వ్యాలీ !!

రోడ్డు మార్గం

Photo Courtesy: hemanth

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X