Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు చుట్టూప్రక్కల గల 25 ట్రెక్కింగ్ ప్రదేశాలు !!

బెంగళూరు చుట్టూప్రక్కల గల 25 ట్రెక్కింగ్ ప్రదేశాలు !!

ఇప్పుడు నేను చెబుతున్నది బెంగళూరు మహానగరం చుట్టూప్రక్కల గల ట్రెక్కింగ్ ప్రదేశాల గురించి. ఈ ప్రదేశాలను మీరు - మీ సహచర ఉద్యోగులతో గానీ, ఫ్రెండ్స్ తో గానీ లేదా మీకిష్టమైన వారితో గానీ పర్యటించవచ్చు.

By Mohammad

బెంగళూరు ... చాలా మందికి తెలిసిన పేరే. ఈ మహానగరం కర్నాటక రాష్ట్ర రాజధాని. ఈ మహానగరానికి రకరకాల పేర్లు ఉన్నాయి నేను చదువుకొనే రోజుల్లో అయితే "గార్డెన్ ఆఫ్ సిటీ" అని చదువుకున్నాను కానీ నేడు "గ్రీన్ సిటీ" అని, "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అని , "సరస్సుల నగరం" అని పిలుచుకుంటున్నాం. ఏమైన బెంగళూరు నగరం భారత దేశంలోని అన్ని నగరాలలో పోల్చి చూస్తే చల్లగా, నిర్మలమైన వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే కాబోలు విదేశీయులు సైతం బెంగళూరు మహానగరాన్ని ఇష్టపడుతుంటారు.

ఇక మన అసలు విషయానికి వద్దాం ..! ప్రస్తుతం(ఆంధ్ర రాష్ట్రం విడిపోవడంతో) అనే కాదు చాలా మంది తెలుగు వారు ఉద్యోగం చేయటానికి, ఉద్యోగం వెతుక్కోవడానికి, చదువుకోవడానికి ఇంకా ఇతర అవసరాల కొరకై బెంగళూరు మహానగారానికి వస్తుంటారు. కేవలం అవసరాలకే కాదు కొంత మంది హాలిడేస్ ఎంజాయ్ చేయటానికి కూడా వస్తుంటారనికోండి ... ఆది వేరు విషయం. ఐతే బెంగళూరు నగరంలో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల ప్రజల కోసమై వారాంతం(వీకెండ్) జాలీ .. జాలీగా ఎంజాయ్ చేయటానికి మరీ ముఖ్యంగా ట్రెక్కింగ్ లవర్స్ కి హుషారు గొలిపే విధంగా ఇక్కడ కొన్ని ప్రదేశాలను మీ తెలుగు నేటివ్ ప్లానెట్ అందిస్తున్నది.

అవును .. మీరు ఊహించిది కరక్టే..! ఇప్పుడు నేను చెబుతున్నది బెంగళూరు మహానగరం చుట్టూప్రక్కల గల ట్రెక్కింగ్ ప్రదేశాల గురించి. ఈ ప్రదేశాలను మీరు - మీ సహచర ఉద్యోగులతో గానీ, ఫ్రెండ్స్ తో గానీ లేదా మీకిష్టమైన వారితో గానీ పర్యటించవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు?? అవేమిటో ఒక్కొక్కటిగా చూసొద్దాం పదండి ..!

కుంతి బెట్ట ట్రెక్

కుంతి బెట్ట ట్రెక్

కుంతి బెట్ట, బెంగళూరు మాహానగారానికి 123 కి. మీ. దూరంలో ఉంది. ఈ ప్రదేశంలో పాండవులు కొన్ని రోజుల పాటు గడిపారని అందుకే వారి తల్లి పేరు మీద కుంతి బెట్ట గా పిలుస్తున్నారని ఇతిహాసాల కథనం.

బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 5 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 130 కి. మీ.
పైకి ఎక్కడం : సులభం

Photo Courtesy: Shyamal

సావన్ దుర్గ ట్రెక్

సావన్ దుర్గ ట్రెక్

సావన్ దుర్గ ప్రాంతంలో రెండు ఎత్తైన కొండలు మరియు ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ఈ ప్రదేశం బెంగుళూరు నగరానికి 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ కొండలు దక్కన్ పీఠభూమికి సుమారు 1226 మీటర్ల ఎత్తున ఉన్నాయి. గట్టి రాళ్ళు, గ్రానైట్, లేటరైట్ లతో కూడిన ఈ కొండలు ఎక్కేందుకు చాలా కష్టపడాలి. కాని సాహస యాత్రికులకు ఇది సులభమే.

బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 4 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 60 కి. మీ.
పైకి ఎక్కడం : సులభం

Photo Courtesy: Earth-Bound Misfit, I

అంతరగంగ

అంతరగంగ

అంతరగంగ అందాలు దాని రాతి నిర్మాణాలలోను, గుహలలోను ఉన్నాయి. సాహసం ఇష్టపడేవారికి, అంటే పర్వతా రోహణ, ట్రెక్కింగ్ వంటివి చేసేవారికి ఈ ప్రదేశం మరువలేని అనుభూతులనిస్తుంది. ఇక్కడి గుహలు కూడా అన్వేషించదగినవే. ట్రెక్కింగ్ కనీసం ఒకటి రెండు గంటలు పడుతుంది. అయితే, కొండనుండి కిందకు వేగంగాను, తేలికగాను రావచ్చు. ఈ ప్రదేశం బెంగుళూరుకు 68 కి.మీ.ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం సౌకర్యం కనుక యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు.

బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 4 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 68 కి. మీ.
పైకి ఎక్కడం : సులభం

Photo Courtesy: telugu native planet

రామనగరం

రామనగరం

పర్వతారోహణ వంటి సాహసాలు చేయాలనుకునే పర్యాటకులకు రామానగరం చెప్పుకోదగ్గది. ఈ ప్రదేశం ఒక వ్యాలీలో ఉంటుంది. బెంగుళూరుకు సుమారుగా 55 కి. మీ. ల దూరంలో కొండలతో నిండి ఉంటుంది. ఇక్కడ వివిధ పొడవైన గ్రానైట్ కొండలు ఒకటి నుండి రెండు పిచ్ ల పొడవు కలిగి తేలికగా అధిరోహించగలిగినవిగా ఉంటాయి. వనక్కల్ వాల్, గబ్బర్ కి అసలీ పసంద్, రెయిన్ బౌ వాల్ మరియు అన్నా - తమ్మా అనే కొండలు కూడా ప్రసిద్ధి.


బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 6 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 55 కి. మీ.
పైకి ఎక్కడం : సులభం

Photo Courtesy: telugu native planet

బి ఆర్ హిల్స్

బి ఆర్ హిల్స్

కొండపై ఎత్తులో కల దేవాలయం బి ఆర్ హిల్స్ లో ఒక యాత్ర స్థలం. ఈ ప్రదేశం బెంగళూరు నగరం నుండి 70 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడ రాత్రి పూట ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండ భాగాన చేరుకుంటే ఆకాశంలోని మిరమిట్లుగొలిపే నక్షత్రాలను, వెన్నల ప్రకాశిస్తున్న చంద్రడిని తనివితీరా చూడవచ్చు. బిఆర్ హిల్స్ - ర్యాఫ్టింగ్, కావేరి నది పై విహారం చేయాలనుకునేవారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. చేపలు పట్టడం, బోట్ విహారం వంటివి కూడా చేయవచ్చు.

బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 10 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 70 కి. మీ.
పైకి ఎక్కడం : సులభం

Photo Courtesy: toufeeq hussain

భీమేశ్వరి ట్రెక్

భీమేశ్వరి ట్రెక్

బెంగుళూరు నుండి భీమేశ్వరి 110 కి.మీ. దూరంలో ఉంది. వారాంతపు సెలవులలో విహరించేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఆటలాడే మహసీర్ చేపలు ఎంతో వినోదాన్నికలిగిస్తాయి. ట్రెక్కింగ్ చేయాలంటే ఈ ప్రాంతం ఎంతో అనుకూలం. దొడ్డమకాళి ప్రదేశానికి ట్రెకింగ్ చేయవచ్చు. ఈ ప్రదేశంలో పక్షుల విహారాలు కూడా చూసి ఆనందించవచ్చు లేదా చేపలు పట్టవచ్చు. అలాగే గాలిబోర్ కూడా ట్రెక్కింగ్ కు అనుకూలమే.

బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 5-10 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 110 కి. మీ.
పైకి ఎక్కడం : సులభం

Photo Courtesy: telugu native planet

కబ్బాలదుర్గ నైట్ ట్రెక్

కబ్బాలదుర్గ నైట్ ట్రెక్

కనకపుర బెంగళూరు మహానగారానికి 55 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ బణంతిమరి బెట్ట, బిలికల్ బెట్ట, కబ్బలదుర్గ మరియు అనేక ట్రెక్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి. చూడటానికి అందంగా కన్పించే పచ్చిక బయళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ప్రదేశ సొంతం.


బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 4 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 60 కి. మీ.
పైకి ఎక్కడం : సులభం

Photo Courtesy: Arun Joseph

మధుగిరి ట్రెక్

మధుగిరి ట్రెక్

3,930 అడుగుల ఎత్తున ఉన్న మధుగిరి శిఖరం ఆసియా ఖండంలోనే రెండవ ఎత్తైనది. ఈ శిఖరాన్ని అధిరోహించడానికి చాలా మంది ట్రెక్కర్లు బెంగళూరు కి 100 కి. మీ .దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి వస్తుంటారు. కొండ శిఖరాన గోపాలకృష్ణ ఆలయం ఉన్నది.

బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 4 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 60 కి. మీ.
పైకి ఎక్కడం : సులభం

Photo Courtesy: Sangrambiswas

మకలి దుర్గ ట్రెక్

మకలి దుర్గ ట్రెక్

బెంగళూరు నగరానికి 60 కి. మీ. దూరంలో ఉన్న మకలి దుర్గ చుట్టూ కొండలతో, మధ్యలో పచ్చని బయళ్లతో ఉంది. మకలి దుర్గ ప్రదేశం 1, 350 మీటర్ల వద్ద ఉండటం వలన ఈ ప్రదేశాన్ని చాలావరకు సాహసికులు ఇష్టపడతారు.

బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 7 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 60 కి . మీ.
పైకి ఎక్కడం : సులభం

Photo Courtesy: Sakeeb Sabakka

తడియాండమోల్

తడియాండమోల్

తడియాండమోల్ కర్నాటకలో రెండవ ఎత్తైన శిఖరం. ఇది పడమటి కనుమలలో ఉంది. కూర్గ్ జిల్లాలో కక్కాబే పట్టణానికి సమీపంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 1748 మీటర్ల పొడవున ఉంటుంది. ఈ శిఖరం ట్రెక్కర్లకు, పర్వతారోహకులకు ఎంతో సవాలుగా ఉంటుంది.

బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 8 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 264 కి . మీ.
పైకి ఎక్కడం : సులభం

Photo Courtesy: R E B E L TM® Follow

ముల్లాయనగిరి శ్రేణులు

ముల్లాయనగిరి శ్రేణులు

కర్నాటకలోని అత్యధిక ఎత్తు కల ముల్లయానగిరి శ్రేణులను చిక్కమగళూరు జిల్లాలో చూడవచ్చు. ముల్లాయనగిరి శ్రేణులు సముద్ర మట్టానికి 1930 మీటర్ల ఎత్తున ఉన్నాయి. ముల్లాయనగిరి పర్వత శ్రేణుల పై భాగం చేరాలంటే, యాత్రికులు సర్పదారి నుండి ట్రెక్కింగ్ చేయాలి. పైకి చేరిన తర్వాత యాత్రికులు శివ భగవానుడి దేవాలయం సందర్శించవచ్చు. ట్రెక్కింగ్ మాత్రమే కాక, ఆసక్తి కలవారు రోడ్డు బైకింగ్ లేదా పర్వత బైకింగ్ కూడా చేయవచ్చు.

బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 12 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 263 కి . మీ.
పైకి ఎక్కడం : సులభం

Photo Courtesy: Doc.aneesh

కుమార పర్వతం

కుమార పర్వతం

కర్నాటక రాష్ట్రంలోని కూర్గ్ హిల్ స్టేషన్ కి సమీపంలో ఉన్న కుమార పర్వతం 1712 అడుగుల ఎత్తులో పశ్చిమ కనుమలలో ఉన్నది. ఇది కర్నాటక రాష్ట్రంలో ఉన్న మూడవ పొడవైన శిఖరం. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి సాహసికులు తరచూ వస్తుంటారు. పర్వత శిఖరం పైకి చేరుకోగానే కుక్కే సుబ్రమణ్య దేవాలయాన్ని కూడా చూడవచ్చు.

బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 15 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 220 కి . మీ.
పైకి ఎక్కడం : మధ్యస్తంగా

Photo Courtesy: Vivekvaibhavroy

కొడచాద్రి ట్రెక్, షిమోగా

కొడచాద్రి ట్రెక్, షిమోగా

ట్రెక్కింగ్ చేసే సాహసికులకి కొడచాద్రి ఒక చక్కని ప్రదేశం. ఇక్కడున్న ప్రదేశాలు ఎంతో రమణీయంగా ఉంటాయి కనుక ట్రెక్కింగ్ కు అనువైనదిగా పేర్కొంటారు. పడమటి కనుమలలోని అందమైన ఈ కొండలపై సాహసికులు పౌర్ణమి నాటి వెన్నెలలను కూడా ఆస్వాదించవచ్చు. శిఖరం నుండి టూరిస్టులు అందమైన సూర్యాస్తమయ సీనరీలు, అరేబియా సముద్రం వంటివి చూడవచ్చు.

బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : 12 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : 278 కి . మీ.
పైకి ఎక్కడం : మధ్యస్తంగా

Photo Courtesy: Premnath Thirumalaisamy

కుద్రేముఖ్ ట్రెక్

కుద్రేముఖ్ ట్రెక్

కుద్రేముఖ్ ప్రాంతం తన సహజ అందాలతో వివిధ రకాల ట్రెక్కింగ్ మార్గాలకు అనువుగా ఉంటుంది. ఇక్కడున్న కుద్రేముఖ్ కొండ శిఖరం 1894 అడుగుల ఎత్తులో ఉంది అయితే ట్రెక్కింగ్ చేయకోరేవారు ముందుగా అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి. కుద్రేముఖ్ లో ట్రెక్కింగ్ లోబో ప్లేస్ నుండి మొదలవుతుంది. అడవిలో కుద్రేముఖ్ కొండ ఇక్కడినుండి మొదలవుతుంది. వివిధ కొండ మార్గాలు, నీటి వాగులు, అటవీ అందాలు కన్నులకు విందు చేస్తూ ఉంటాయి

Photo Courtesy: Amithbangre

బిస్లె ఘాట్, సకలేశ్ పూర్

బిస్లె ఘాట్, సకలేశ్ పూర్

సకలేశ్ పూర్ సముద్ర మట్టానికి 949 మీటర్ల ఎత్తున ఉండి, పర్వతారోహకులకు స్వర్గంగా ఉన్నది. ఇక్కడికి వచ్చే యాత్రికులు బిస్లే రిజర్వ్ అడవులలోను, కుమార పర్వత కొండలలోను ట్రెక్కింగ్ చేసి ఆనందిస్తారు. బిస్లె ఘాట్ లేదా బిస్లె రిజర్వ్ ఫారెస్ట్ గుండా మీరు ట్రెక్కింగ్ చేసినట్లయితే వివిధ రకాల జంతువులను, పక్షులను గమనించవచ్చు మరియు దొడ బెట్ట, పుష్పగిరి, కుమార పర్వతం మరియు పట్ట బెట్ట చూడవచ్చు.

Photo Courtesy: L. Shyamal

దూద్ సాగర్ ట్రెక్

దూద్ సాగర్ ట్రెక్

దూద్ సాగర్ కర్నాటక - గోవా సరిహద్దు ప్రాంతం మధ్యలో ఉన్న ఒక అందమైన ప్రదేశం. ఈ ప్రాంతం పర్వతారోహణకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ పర్వతారోహణ చేసేవారికి తగిన ఏర్పాట్లు పర్యవేక్షక సిబ్బంది చేపడుతుంది. సాహసికులకు విశ్రాంతి ఆశ్రయాలు కూడా ఉన్నాయి. ట్రెక్కింగ్ కి అనువైన ప్రదేశం గా ముద్రపడ్డ దూద్ సాగర్ సమీపంలో ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంది.

బ్రహ్మగిరి ట్రెక్

బ్రహ్మగిరి ట్రెక్

బ్రహ్మగిరి కొండలు కర్నాటక - కేరళ సరిహద్దు ప్రదేశంలో విస్తరించి ఉన్నాయి. ఇవి సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తున కలవు. ఇవి ట్రెక్కింగ్ ప్రియులకు ప్రసిద్ధి చెందినవి. ట్రెక్కింగ్ యాత్రికులు కొండ అగ్ర భాగాన చేరుకుంటే అనేక జీవ మరియు వృక్ష సంపదను చూడవచ్చు. బ్రహ్మగిరి కొండలకు చేరుకోవాలంటే కర్నాటక నుండైనా లేదా కేరళ నుండైనా ఎటువైపైనా సరే ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. ట్రెక్కింగ్ చేయాలంటే మాత్రం ముందుగా అటవీ అధికారుల తప్పనిసరి.

బెస్ట్ సీజన్ : నవంబర్ నుండి ఫిబ్రవరి
ట్రెక్ పొడవు : దాదాపుగా 9 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : దాదాపుగా 270 కి . మీ.
పైకి ఎక్కడం : మధ్యస్తంగా

Photo Courtesy: Indi Samarajiva

పుష్పగిరి ట్రెక్

పుష్పగిరి ట్రెక్

కుమార పర్వతం - దీనినే పుష్పగిరి శిఖరం అని పిలుస్తారు. ఈ ప్రదేశం కూర్గ్ హిల్ స్టేషన్ సమీపంలో ఉన్న కుక్కే సుబ్రమణ్య గ్రామంలో ఉన్నది. పుష్పగిరి కొండలకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పుష్పగిరి కొండల సౌందర్యం మరియు చుట్టూప్రక్కల గల ప్రకృతి అందాలు సాహసికులను ఇట్టే కట్టిపడేస్తాయి.

బెస్ట్ సీజన్ : సంవత్సరం పొడవునా
ట్రెక్ పొడవు : 12 కి. మీ.(ఎగువ కొండ), 15 కి. మీ.(దిగివ కొండ)
బెంగళూరు నుంచి దూరం : దాదాపుగా 275 కి . మీ.
పైకి ఎక్కడం : సులభం

Photo Courtesy: solarisgirl

ఫనస్వడీ జలపాత ట్రెక్కింగ్

ఫనస్వడీ జలపాత ట్రెక్కింగ్

ఫనస్వడీ జలపాతం కర్నాటక మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రదేశంలో ఉంది. ఈ ప్రదేశం బెంగళూరు నగరానికి 654 కి. మీ. దూరంలో ఉంది. నగరం నుండి సుదూర ప్రదేశంలో ట్రెక్కింగ్ యాత్ర చేయాలనుకునే వారు ఈ ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు. ట్రెక్కింగ్ సుమారుగా 12 కి. మీ. దూరంలో ఉండి, మార్గం మొత్తం అడవిలో అప్పుడే పడ్డ వర్షానికి తాడిచిన పచ్చని పొదల్లో నడుస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది.

బెస్ట్ సీజన్ : మాన్సూన్
ట్రెక్ పొడవు : 12 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : దాదాపుగా 654 కి . మీ.
పైకి ఎక్కడం : మధ్యస్తంగా

Photo Courtesy: maharashtra tourism

ఆవలంచే

ఆవలంచే

ఆవలంచే సరస్సు నీలగిరి కొండలపై ఊటీ కి 22 కి. మీ. దూరంలో ఉంది. చుట్టూప్రక్కల గల పరిసరాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. సరస్సు ఒడ్డున ఎంతో మంది పర్యాటకులు వాకింగ్ చేస్తుంటారు. ఈ ప్రదేశంలో ఫిషింగ్, రాప్టింగ్ మరియు ట్రెక్కింగ్ వంటివి పర్యాటకులు చేపట్టవచ్చు. సరస్సు చుట్టూ అందమైన పూల మొక్కలు, ఏపుగా పెరిగిన చెట్లు ఇంకా అనేక పూల తోటలు ఉండి, సినిమా షూటింగ్ లకు అనువుగా ఉన్నది.

బెస్ట్ సీజన్ : సంవత్సరం పొడవునా
ట్రెక్ పొడవు : 18 కి. మీ.
బెంగళూరు నుంచి దూరం : దాదాపుగా 290 కి . మీ
ట్రెక్కింగ్ : సులభం

Photo Courtesy: Raghavan Prabhu

దొడబెట్ట ట్రెక్, ఊటీ

దొడబెట్ట ట్రెక్, ఊటీ

నీలగిరి కొండల్లో దొడబెట్ట శిఖరం ఎత్తైనది. ఇది 8650 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. ఎంతో మంది పర్యాటకులతో పాటు ట్రెక్కింగ్ యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. ఎండాకాలం వచ్చిందనే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా..! ఈ శిఖరం వాస్తవంగా చెప్పాలంటే ఒక బల్ల పరుపుగా ఉంటుంది. శిఖరం పై ఉన్న ఖగోళ అబ్సర్వేటరీ కార్యాలయంలో ఉన్న టెలీస్కోప్ సహాయంతో వ్యాలీ అందాలను ఆస్వాదించవచ్చు.

Photo Courtesy: Edukeralam, Navaneeth Krishnan S

వెన్ లాక్ డౌన్స్

వెన్ లాక్ డౌన్స్

వెన్ లాక్ డౌన్స్ ప్రదేశం ఊటీ కి సమీపంలో 20, 000 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ప్రదేశ సహజ అందాల కారణంగా ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. ఇక్కడ పూర్వం బ్రిటీష్ వారు హంటింగ్ చేసేవారు తరువాత పూర్తిగా నిషేదించారు. ఏటవాలు చెట్లు, పచ్చటి మైదానాలు మరియు యూకలిప్తస్ చెట్లు మిమ్మలను పులకరింపజేస్తాయి. ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ ప్రదేశంలో కలియతిరగటం ఒక రకమైన అనుభూతి.

నరసింహ పర్వత ట్రెక్కింగ్, అగుంబే

నరసింహ పర్వత ట్రెక్కింగ్, అగుంబే

అగుంబే సముద్రమట్టానికి 1837 మీటర్ల ఎత్తున ఉన్నది. దక్షిణ భారత దేశంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రదేశం గా మరియు కింగ్ కొబ్రా పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందినది. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ సౌకర్యం కలదు. ట్రెక్కింగ్ ప్రియులు అధికంగా ట్రెక్కింగ్ చేయాలంటే, ఆగుంబే నుండి శ్రింగేరి వరకూ ట్రెక్కింగ్ చేయవచ్చు. మార్గంలో అందమైన నరసింహ పర్వతం ఒక దట్టమైన అడవిలో చూడవచ్చు. శిఖర పై భాగాన సూర్యాస్తమయాలు ఆనందించవచ్చు. అయితే, జలగలు, ఇండియా లోని ప్రసిద్ధ విష నాగులు వుంటాయి జాగ్రత్త సుమా !

Photo Courtesy: Neelima v

ముకుర్తి ట్రెక్

ముకుర్తి ట్రెక్

ముకుర్తి ఊటీ లో ఉన్న ప్రముఖ ట్రెక్కింగ్ ప్రదేశం. ఇది 4900 అడుగుల నుండి 8625 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. పడమటి కనుమలలో భాగంగా ఉండి, ఒక నేషనల్ పార్క్ గా అవతరించింది. ఈ పార్క్ నుండి ప్రసిద్ధ శిఖరాలైన కొల్లరి బెట్ట శిఖరం, ముకుర్తి శిఖరం మరియు నీలగిరి శిఖరం చూడవచ్చు. ఈ శిఖరాలు గ్రానైట్ రాయి అంచును కలిగి ఉంటాయి. ట్రెక్కింగ్ చేసే వారు ఈ శిఖరాలను ఎక్కి వారి ఆనందాన్ని తీర్చుకోవచ్చు.

Photo Courtesy: Dibesh Thakuri

బాబా భూధాన్ గిరి

బాబా భూధాన్ గిరి

బాబా భూధాన్ గిరి చిక్కమగళూరు జిల్లాలో ఒక అరణ్య ప్రదేశంగా ఉన్నది. ఇది షుమారు 1895 మీటర్ల ఎత్తున ఉన్న ప్రదేశం. పర్వతారోహణ, ట్రెక్కింగ్ వంటివి ఇష్టపడే వారికి బాబా భూదాన్ గిరి చక్కటి ప్రదేశం. ఇక్కడ రెండు పర్వత శ్రేణులున్నాయి. వాటిని ములాయంగిరి (1930 మీటర్ల ఎత్తు) మరియు దత్తగిరి అంటారు. ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే 'కురింజి' పువ్వును కూడా చూడవచ్చు. పక్షులపట్ల ఆసక్తి కలవారికి ఈ ప్రాంతం ఎంతో అనువైనది.

Photo Courtesy: S N Barid

కెమ్మన గుండి

కెమ్మన గుండి

కెమ్మనగుండి కర్నాటక రాష్ట్రంలో ఉన్న ఒక హిల్ స్టేషన్. దీని చుట్టూ బాబా భూధాన్ కొండలు విస్తరించి ఉన్నాయి. జీ పాయింట్ అనేది ఇక్కడి ఎత్తైన కొండ. దీనిి చేరుకోవడానికి 30 నిమిషాల సమయం పడుతుంది. అలాగే ఇక్కడ ఉండే జలపాతాలు, ఎత్తైన కొండలు , దట్టమైన అడవులు మరియు పచ్చిక మైదానాలు సాహస ప్రియులకు ఎంతగానో నచ్చుతాయి.

Photo Courtesy: Arunkm44

నంది హిల్స్

నంది హిల్స్

నంది హిల్స్ బెంగళూరు నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి వెళ్లే మార్గంలో 4,851 అడుగుల ఎత్తులో ఉన్నది. ట్రెక్కింగ్ కి అనువైన ప్రదేశం గా ముద్రపడిన నంది కొండలలో ఎన్నో శిల్ప సంపదలు కనపడతాయి. ఎన్నో ఉద్యానవనాలు, తోటలు మరియు సరస్సులతో పాటుగా దేవాలయాలు, టిప్పు సుల్తాన్ నిర్మించిన కోటలు, రాజ భవనాలు ఇక్కడ తారసపడతాయి. ట్రెక్కింగ్ చేసుకుంటూ ఈ ప్రదేశాలలో తిరగటం ఒక మరుపురాని అనుభూతి.

Photo Courtesy: Nagaraju Hanchanahal

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X