Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో తప్పక దర్శించుకోవలసిన శక్తి పీఠాలు !

భారతదేశంలో తప్పక దర్శించుకోవలసిన శక్తి పీఠాలు !

By Staff

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని ప్రాంతాలను 'శక్తి పీఠాలు' అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతారు. కొంత మంది 18 అనీ, 51 అనీ, మరి కొందరైతే 52 అనీ, 108 అనీ ఎవరికి తోచింది వారు చెబుతారు. అయితే ఎవరెన్ని చెప్పిన 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారన్నది సత్యం.

శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి నేడు పూజిస్తున్నాం. అందులో ఒకటేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో (ప్రస్తుతం గుడి ధ్వంసం అయ్యింది), మరొకటేమో శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన ఇండియాలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి : పరమ శివుని పన్నెండు పవిత్ర లింగాలు !

పురాణ కథ

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు కానీ కూతురినీ(సతీదేవి), అల్లుడినీ(శివుడిని) పిలవలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి తండ్రిని ధిక్కరించి శివుడిని పెళ్ళాడింది. సతీదేవి, శివుడు ఎంత వారించినా వినకుండా యాగానికి వెళ్ళింది. కానీ అక్కడ శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేసింది. దాంతో కోపొద్రిక్తుడైన శివుడు, వీరభద్రుణ్ణి పంపి దక్షుని తలను ఖండంప జేస్తాడు. దాంతో దేవతామూర్తులు శివుణ్ని ప్రార్ధించగా మేక తలతో దక్షున్ణి అనుగ్రహించి యాగం పూర్తయ్యేటట్లు చేస్తాడు.

కాని సతీ దేవి దేహాన్ని చూసిన శివుడు ఆ బాధను తట్టుకోలేక నాట్యం చేస్తాడు. ఆ నాట్యం కాస్త ప్రళయతాండవం గా మారటంతో, దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో దేవి దేహాన్ని ఖండాలుగా చేస్తాడు. అలా ఖండించినపుడు అమ్మవారి శరీరాభాగాలు పడినచోటల్లా శక్తి పీఠాలుగా మారి భక్తులకు ఆరాధనా స్థలాలు మారాయి. అలాంటి శక్తి పీఠాల్లో ప్రముఖమైన 18 శక్తి పీఠాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబొతున్నాం .. ఇవి భారతదేశంలో తప్పక దర్శించుకోవలసిన శక్తి పీఠాలు గా ప్రసిద్ధికెక్కాయి.

ఇది కూడా చదవండి : మహాభారతం జరిగిన ప్రదేశాలు !

శాంకరీదేవి

శాంకరీదేవి

అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా చెప్పుకోవలసినదిశక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీలంకలో ట్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్లున్న కొండపైన ఉన్న శిధిలఆలయాన్నే శాంకరీ దేవి ఆలయంగా చెప్పబడుతున్నది. ప్రస్తుతం అక్కడ స్తంభం మాత్రమే ఉంటుంది. అమ్మవారి ‘తొడ భాగం' పడిన స్థలంగా ప్రతీతి ఈ క్షేత్రం.

చిత్ర కృప : Ananda Bodhichitta

కామాక్షి

కామాక్షి

సతీదేవి వీపు భాగం పడిన ప్రదేశం కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉన్నది. ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణం నుండి 75 కి. మీ. దూరంలో ఉన్నది. అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అర్పించి ఆ పుణ్యంతో కామాక్షి దేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి.

చిత్ర కృప : Manfred Sommer

శృంఖలాదేవి

శృంఖలాదేవి

అమ్మవారి ఉదారభాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గురించి రెండు భిన్న వాదనలు ఉన్నాయి. కొందరేమో గుజరాత్ లో ఉన్నదని కాదు .. కాదు ... పశ్చిమ బెంగాల్ లో ఉన్నదని మరికొందరు అంటారు. కానీ కలకత్తాకు 85 కి.మీ దూరంలో హుగ్లీ జిల్లాలోని ‘పాండువా' అనే గ్రామంలో ఉన్నదే అసలైన క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు.

చిత్ర కృప : shaktipeethas.org

చాముండేశ్వరి

చాముండేశ్వరి

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పట్టణంలో, ఆ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరి అమ్మవారిగా వెలిసిందని దేవిభాగవతం చెబుతుంది. హరుని రుద్ర తాండవం లో అమ్మవారి ‘తలవెంట్రుకలు' వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

చిత్ర కృప : Saravana Kumar

జోగులాంబ

జోగులాంబ

తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాలో కర్నూలుకు 10 కి.మీ దూరంలో ఉన్న ప్రాచీన ఆలయం అలంపూర్ జోగులాంబ. సతీదేవి ‘దంతాలు' ఇక్కడ పడ్డాయని ప్రతీతి. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయంలోని గర్భగుడి లో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ.

చిత్ర కృప : రహ్మానుద్దీన్

భ్రమరాంబికా దేవి

భ్రమరాంబికా దేవి

కర్నూలు పట్టణానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రముఖ శైవ క్షేత్రం. ఈ క్షేత్రంలో అమ్మవారు భ్రమరాంబికా గా నిత్య పూజలందుకుంటున్నారు. ఈ ప్రదేశంలో అమ్మవారి మెడ భాగం పడినట్లు ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఇక్కడి ప్రజలను, మునులను తెగ ఆందోళనలకు గురిచేసేవాడు. రెండుకాళ్లు, నాలుగు కాళ్ళు జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించడానికి అమ్మవారు తుమ్మెద (భ్రమర) రూపంలో వచ్చి అతన్ని సంహరించినది.

చిత్ర కృప : jony dev

పురుహూతిక

పురుహూతిక

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోటకు 13 కి.మీ దూరంలోని పిఠాపురంలో సతీదేవి ‘పీఠభాగం' పడడం వల్ల పీఠికాపురంగా, కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది. ఇక్కడ అమంవారు పురుహూ తికా దేవిగా హుంకారిణి గా పూజలందుకుంటున్నది. అమ్మ వారి నాలుగు చేతుల్లో బీజ పాత్ర, గొడ్డలి, తామర పువ్వు మరియు మధుపాత్ర ఉంటాయి.

చిత్ర కృప : KATTAMURI VENKATA SUBRAHMANYAM

ద్రాక్షారామం

ద్రాక్షారామం

సతీదేవి ‘కణతల భాగం' పడిన ప్రదేశంగా అష్టాదశ పీఠాలలో 12వదిగా, పంచారామాలలో మొదటిదిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు. దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశం. భోగానికి, మోక్షానికి, వైభవానికి ప్రసిద్ధి చెందినదీ క్షేత్రం.

చిత్ర కృప : Manidweepa MahaSamsthanam

మహాలక్ష్మీ

మహాలక్ష్మీ

మహారాష్ట్రలోని పుణేకి 300 కి.మీ దూరంలో కొల్హాపూర్‌ లో వెలసిన అమ్మ మహాలక్ష్మి అవతారం. ఇక్కడ సతీదేవి ' నేత్రాలు' పడ్డాయని చెబుతారు. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవు. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.

చిత్ర కృప : Mariel Owen-Simon

ఏకవీరా దేవి

ఏకవీరా దేవి

మహారాష్ట్రలో నాందేడ్ సమీపంలోని మహోర్ కి 15 కి. మీ. దూరంలో వెలసిన తల్లి ఏకవీరా దేవి. దక్ష యజ్ఞంలో తనువుచాలించిన అమ్మవారి ‘కుడి చేయి' పడిన స్థలంగా ఇది ప్రతీతి. గుడిలో పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత ఎత్తులో ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది.

చిత్ర కృప : Himanshu Sarpotdar

మహాకాళి

మహాకాళి

ఉజ్జయినీ నగరంలో సతీదేవి యొక్క ‘పై పెదవి' పడిన స్థలంగా దేవిభాగవతం చెబుతుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టణానికి 50 కి.మీ దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లంగం, మహాకాళి ఆలయం ఉన్నాయి. పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్దం చేస్తాడు. కానీ బ్రహ్మదేవుని వరం కారణంగా అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేలను తాకితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారు. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో ప్రవేశించి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం.

చిత్ర కృప : M P Tourism

మాధవేశ్వరి

మాధవేశ్వరి

అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు డేవిభాగవతం చెబుతుంది. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రమే ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను ఊయలలో ఉంచుతారు.

చిత్ర కృప : shaktipeethas.org

గిరిజా దేవి

గిరిజా దేవి

నేటి ఒరిస్సా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలసింది. ఈ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు. ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్ నుంచి 20 కి.మీ దూరం ప్రయాణిస్తే గిరిజాదేవి (ఇక్కడ భిరిజాదేవిగా ప్రసిద్ధి) ఆలయానికి చేరుకోవచ్చు. సతీదేవి ‘నాభి స్థానం' ఇక్కడ పడిందని అంటారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగితా విగ్రహాన్ని పూలతో, దండలతో మరియు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.

చిత్ర కృప : Odisha1

కామాఖ్యా

కామాఖ్యా

అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతి పట్టణంలో బ్రహ్మపుత్రానది ఒడ్డున నీలాచల పర్వత శిఖరం పై సతీ దేవి యొనిభాగం పడిందని ప్రతీతి. నీలాచలంలోని గర్భగుడిలో యోని వంటి శిల ఒకటి ఉంది. ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది. ఏటా వేసవి కాలంలో మూడు రోజుల పాటు ఎర్రని నీరు వస్తుంది. అమ్మవారు రజస్వల అయిందని, ఈ మూడు రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు. నాలుగో రోజున సంప్రోక్షణ జరుపుతారు.

చిత్ర కృప : Ramendra Singh Bhadauria

వైష్ణవీ దేవి

వైష్ణవీ దేవి

సతీదేవి ‘పుర్రె' పడిన ప్రదేశం. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు 50 కి.మీ దూరంలో కాట్రా అనే ప్రదేశంలో ఉందీ ప్రాంతం. అక్కడి నుండి గుర్రాల మీద లేదా హెలీకాప్టర్‌లో కొండపైకి వెళ్లి జ్వాలాముఖి లేదా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో గుహ ఉంది. నాడు మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా చేయించి, తన స్వహస్తాలతో మోస్తూ కొండపైకి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించిన వెండి గొడుగు నేటికీ ఈ ఆలయంలో ఉంది.

చిత్ర కృప : Raju hardoi

మంగళగౌరీ

మంగళగౌరీ

బీహార్ రాష్ట్రంలో పాట్నాకు 75 కి.మీ. దూరంలో గయా క్షేత్ర శక్తి స్వరూపిణి మంగళగౌరి కొలువుదీరి ఉంది. సతీదేవి ‘స్తనం' పడిన ప్రదేశం. దగ్గరలో బుద్ధగయ, బోధి వృక్షం, బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు.

చిత్ర కృప : NB

విశాలాక్షీ

విశాలాక్షీ

సతీదేవి ‘మణికట్టు' పడిన స్థలం కాశీ పుణ్య క్షేత్రం. శివుని విశిష్ట స్థానంగా కాశి/వారణాశి విరాజిల్లుతోంది. వరుణ, అసి అనే రెండు నదుల సంగమం. గంగాస్నానం, విశ్వేశ్వరుడు, విశాలాక్షి దర్శనం నయానందకరం. శుభకరం.

చిత్ర కృప : Manfred Sommer

సరస్వతి

సరస్వతి

ఇక్కడ సతీదేవి ‘చేయి' పడినదని కొందరు, కుడి చెంప పడిన స్థలమని కొందరు చెబుతారు. పురాణేతిహాసాల వల్ల అమ్మవారి ఆలయం కాశ్మీర్‌లో ఉందని తెలుస్తోంది. కానీ ఆ ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ పూజలు జరగడం లేదని శంకచార్యులు ఆ పీఠాన్ని శృంగేరిలో (కర్ణాటక రాష్ట్రంలో) ప్రతిష్ఠించారని తెలుస్తోంది. మంగుళూరుకు 100 కి.మీ దూరంలో సరస్వతి ఆలయ రూపకల్పన చేసి, ఒక రాయిపై చక్రయాత్ర స్థాపన చేసి, సరస్వతీదేవి చందనపు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు.

చిత్ర కృప : Irfan Ahmed

మరిన్ని శక్తి దేవాలయాలు

మరిన్ని శక్తి దేవాలయాలు

ఇది కూడా చదవండి : ఇండియాలోని మరిన్ని శక్తి దేవాలయాలు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X