Search
  • Follow NativePlanet
Share
» »కర్నూలు లో ఒక్కరోజు బైక్ యాత్ర !!

కర్నూలు లో ఒక్కరోజు బైక్ యాత్ర !!

కర్నూలు జిల్లా పర్యాటక ప్రదేశాలతో పాటుగా, ఆలయాలకు పెట్టింది పేరు. ఈ జిల్లా ముఖ్య పట్టణం కర్నూలు. ఇక్కడ ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రదేశాలలో ఒకటేమో చరిత్రకి సంభంధించినది, మిగిలిన రెండు ఆధ్యాత్మికత తో పాటుగా ప్రకృతి అందాలను ప్రసాదించేవి. మీకు ఈ పాటికే అర్ధం అయి ఉంటుంది నేను ఎన్ని ప్రదేశాల గురించి వివరిస్తున్నానో ... !

అవును ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రదేశాలు మూడు. ఈ మూడు ప్రదేశాలను మీరు ఫ్రెండ్స్ తో అయితే బైక్ ల మీద, కుటుంబం తో అయితే ప్రైవేట్ వాహనాలు అయిన తూఫాన్ బండి, టాటా సుమో లేదా చిన్న బస్సుల్లో ప్రయాణించవచ్చు. మీకు ఈ ప్రదేశాల్లో ఎక్కడా లేని ప్రశాంతత దొరుకుతుంది. ఈ మూడు ప్రదేశాలను కేవలం ఒకే ఒక్క రోజులో చుట్టిరావచ్చు. ఇంతకు ఈ మూడు ప్రదేశాలు ఏవో చెప్పలేదు కదూ ..! కాల్వబుగ్గ, బెలుం గుహలు, యాగంటి మరియు మార్గ మధ్యలో మరిన్ని అందాలు. ఈ ప్రదేశాలకు కర్నూలు జిల్లాలోని ప్రజలే కాక, చుట్టుప్రక్కల జిల్లాల నుంచి ప్రజలు ప్రైవేట్ వాహనాలు వేసుకొని వచ్చి మరీ చూసి వెళుతుంటారు అంతే కాక విద్యార్థులు విహారాయాత్రల నిమిత్తం టూర్ వేసుకొని వస్తుంటారు.

కర్నూలు లో చూడవలసిన ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండికర్నూలు లో చూడవలసిన ఆకర్షణల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కర్నూలు ఎలా చేరుకోవాలి ??

కర్నూలు ఎలా చేరుకోవాలి ??

ఈ మూడు ప్రదేశాలను చూడాలంటే ముందుగా కర్నూలు చేరుకోవాలి. విమానం నుంచి వచ్చే పర్యాటకులు హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగి, సమీపంలోని శంషాబాద్ లో ఎం జీ బీ ఎస్ నుంచి వచ్చే కర్నూలు / అనంతపురం / మదనపల్లె / హిందూపురం / ధర్మవరం / కడప / బెంగళూరు / తిరుపతి / చిత్తూర్ వెళ్లే బస్సుల్లో ప్రయాణించి చేరుకోవచ్చు.

Photo Courtesy: Vamshi Krishna

కర్నూలు ఎలా చేరుకోవాలి ??

కర్నూలు ఎలా చేరుకోవాలి ??

కర్నూలు లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. హైదరాబాద్ - బెంగళూరు రైల్వే లైన్ లో ఉంది కనుక బెంగళూరు వెళ్లే రైళ్లు అన్ని ఇక్కడ ఆగుతాయి. ఒక వేళ కోస్తా ఆంధ్ర నుంచి వచ్చే పర్యాటకులు డోన్ జంక్షన్ లో దిగి సమీపంలోని బస్ స్టాండ్ వరకు వెళ్ళి బస్సులో కర్నూలు చేరుకోవచ్చు లేకుంటే డోన్ లోనే కర్నూలు వెళ్లే రైళ్ళ కొరకు వేచి ఉండి ,వెల్దూర్తి మీదుగా చేరుకోవచ్చు.

Photo Courtesy: Musaddiq Shabaz

ప్రయాణం మొదలు

ప్రయాణం మొదలు

మీకు ఇక్కడ చెప్పబోయేది బైక్ జర్నీ గురించి. కర్నూలులో ఉదయం సరిగ్గా 7:30 గంటలకు 10 మంది స్నేహితులం కలిసి మొత్తం 5 బైక్ లలో ఈ మూడు ప్రదేశాలను చూడటానికి బయలుదేరాం. అందరం ఇంటినుంచి వాటర్ బాటిల్లు , మధ్యానానికి క్యారేర్ బాక్స్ లు తీసుకొని జర్ని ప్రారంభించాం. ఎందుకంటే చుట్టూ పచ్చని పొల్లాల్లో తినే తిండి ఒంటికి అంటపడుతుంది మరియు సిటీ లైఫ్ లో కాంక్రీట్ గోడల మధ్య తినే భోజనానికి , పోలాల్లో తినే భోజనానికి పోలికా ??

Photo Courtesy: Lovell D'souza

బెలుం గుహలకి దారి

బెలుం గుహలకి దారి

ముందు బెలుం కేవ్స్ పోదాం అని, చీకటి అయితే అంత దూరం నుంచి రాలేమని మాలో చాలా మంది వాదన. కనుక బెలుం గుహల కె ముందుగా వెళ్ళాము. కర్నూలు నుంచి బెలుం కేవ్స్ 106 కి. మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గుండా కాల్వబుగ్గ వరకు వెళ్ళి , అక్కడి నుంచి మలుపు తిప్పుకొని కొలిమిగుండ్ల మార్గంలో ప్రయాణం సాగించాము.

Photo Courtesy: mahaveer

చుట్టుప్రక్కల అందాలు

చుట్టుప్రక్కల అందాలు

మార్గ మధ్యలో ప్రకృతి మమ్మలను తనివితీరా పులకరించింది. బేతంచెర్ల, బట్టలూరుపాడు, బనగానపల్లె, అవుకు మీదుగా సాగే మా ప్రయాణంలో ఒక కేక వినిపించింది అదే ఆకలి ఎందుకంటే ఉదయం బయలు దేరేటప్పుడు అందరు లైట్ గా టిఫిన్ చేసి వచ్చాము.

Photo Courtesy: venky

టిఫిన్ సెంటర్

టిఫిన్ సెంటర్

సరెలే అని అప్పటికే బేతంచెర్ల దగ్గరికి వచ్చేశాము. బైక్ లు ఆపి కాక హోటల్లో వెళ్ళి పూరీలు, దోశెలు, ఇడ్లీలు, వగ్గని బజ్జీ ఆర్డర్ ఇచ్చి తిన్నాము. అన్నట్టు మీరు ఇక్కడ వస్తే పూరీ, కుచ్ఛ(ఉల్లిగడ్దల కూర)తప్పక రుచి చూడాలి. రాయల సీమలో చిన్న చితక కాక హోటళ్లు ఉన్న ప్రతి పల్లెటూర్లలో పూరీ భలే రుచిగా ఉండి, బాగుంటుంది.

Photo Courtesy: Kishore Nagarigari

టీ

టీ

టీ తాగుదాం అని వసంత్ చెబితే, మాలో మరో స్నేహితుడు సురేంద్ర , వంశీని తొందర తినురా .. ఎంత సేపు తింటావు గంటలు గంటలు తింటావా ఏందీ ..! అని ఒకటే సనుగుడు. నేను, వసంత్, విక్రమ్, సిద్ధయ్య, తౌసీఫ్ వెళ్ళి టీ తాగాము. మేము టీ తాగిన 10 నిమిషాలకి వంశీ తినటం పూర్తవడంతో మేము బైక్ స్టార్ చేసాము. ఒరే..! నేను టీ తాగలేదురా అని చెబితే, పక్కనే ఉన్న సిద్ధయ్య నువ్వు తాగితే మధ్యానం అవుతుంది ఇక్కడే భోజనం చేసుకొని వెనక్కు వెళ్ళాలి అని చెబితే, వాని మొహం పెట్టాడు ఒకసైడ్ ఏమో గంభీరం, మరో సైడ్ ఏమో దీనం. సరేఅని 4 రూపాయల టీ ని 1/2 చేసు కొని తాగాడు.

Photo Courtesy: ravi

బెలుం గుహలు

బెలుం గుహలు

ఇంక ఎక్కడా ఆగేది లేదు కనుక బైక్ డైరెక్ట్ గా బెలుం గుహలలో ఆగింది. చుట్టూ విశాలమైన మైదానాలు, అక్కడున్న కొండమీద వ్రాసిన బెలుం గుహలు అనే అక్షరాలు, గౌతమ బుద్దుని విగ్రహం ఇవన్ని మాకు కనిపించినవి. ఇక్కడ ప్రభుత్వ గెస్ట్ హౌస్ తో పాటుగా, పున్నిమి హోటల్ ఉన్నది. తెల్లని పాలరాతి రాళ్లతో, కలువ పువ్వు మధ్యలో ఉన్న గౌతముని విగ్రహం ఇక్కడ ఆకర్షణగా నిలిచింది.

Photo Courtesy: Dr.Prithvi Raval

ఎంట్రెన్స్ హాల్

ఎంట్రెన్స్ హాల్

బెలుం గుహల లోపలికి వెళ్ళడానికి మాకయిన ఖర్చు ఒక్కొక్కరికి తలా 50 రూపాయలు అదే ఫారేనర్స్ కి అయితే 300 రూపాయలు. టికెట్టు తీసుకొని మెట్ల మార్గాన లోనికి వెళితే ఎంట్రెన్స్ లోనే అక్కడ మాకు పెద్ద హాలు కనిపించింది. అక్కడ రాతి బెంచీల మీద మేము కూర్చున్నాము.

Photo Courtesy: Sylvester D'souza

గాలి గొట్టాలు

గాలి గొట్టాలు

లోపల లైటింగ్ సిస్టమ్ ఉండటంతో గుహలో లోపలికి వెళ్లే కొలది చీకటి అనిపించదు. గాలి అనేది అంతగా ఉండదు కానీ గుహలో కొన్ని కొన్ని చోట్ల గొట్టాల ద్వారా ఆక్షీజన్ పంపిస్తుంటారు. వీటినే గాలి గొట్టాలు అంటారు. ఉక్కపోతే భరించలేని విధంగా ఉంటుంది వేసవి కాలం ఐతే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. మా వంశీ బనీన్ మీదే గుహ మొత్తం తిరిగాడు.

Photo Courtesy: shafi_naughty19

గేబర్ హాలు

గేబర్ హాలు

గుహల లోపల కోటి లింగాలు, మాయా మందిరం, పాతాల గంగా, గేబర్ హాలు, కొలను, వేయి పడగలు, వివిధ ఆకృతిలో రాతి నిర్మాణాలు, సహజ సిద్దంగా ఏర్పడ్డ శివలింగం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రదేశాలు మాకు తారాసపడ్డాయి. సుమారు రెండు నుంచి మూడు గంటలు పట్టే ఈ గుహల సందర్శన ఆనందాన్ని కలిగించింది.

బెలుం గుహల మరిన్ని పోటోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Sudhamshu Chandra

శంబో శంకర

శంబో శంకర

గుహ లోపల ఉండే శివలింగానికి నిత్యం నీళ్ళతో అభిషేకం జరుగుతూనే ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఆ లింగం తీరు నిజంగా చూస్తుంటే ఆశ్చర్యం కలిగించక మానదు. వంశీ టెంకాయ తీసుకొని ఠపీ మని అక్కడున్న రాయి మీద శంబో శంకర అని కొట్టాడు. ఒక్కేటుకే టెంకాయ కాస్త రెండు ముక్కలైంది. అబ్బో ... ఎంత బలం ఉంది వంశీ కి అనుకున్నాం మేము.

Photo Courtesy: duggiv

శివలింగం కిందనే ఉండే పాతాల గంగా

శివలింగం కిందనే ఉండే పాతాల గంగా

మహా లింగ అభిషేకం దర్శనం తరువాత దాని కిందనే ఉన్న పాతాల గంగా తప్పక చూడాలి. ప్రస్తుతం లోనికైతే పోనివ్వరూ. మహా అయితే రెండు లేదా మూడు అడుగులు పోవచ్చు( ఎవ్వరూ చూడకుంటే) . మరీ అలోనికి వెళితే చీకటిగా ఉంటుంది. లైటింగ్ సిస్టమ్ అస్సలు ఉండదు.

Photo Courtesy: Ramesh Ramakrishnan

సన్యాసీ పాన్పు

సన్యాసీ పాన్పు

గుహలో పూర్వకాలంలో సన్యాసులు నివసించేవారు. వారు నిత్యం దేవుణ్ణి స్మరిస్తూ, వారి అనుగ్రహం కొరకు వేచి ఉంటారు. సన్యాసులు పాన్పు ఎలా ఉంటుందో మాకు తెలీదు కానీ అప్పట్లో గుహలో సన్యాసులు వాడిన పాన్పు చూసి ఆ లోటు కూడా తీరిపోయింది. మా స్నేహ బృందం మొత్తం దానిమీద పడుకొని ఫోటోలు తీసుకున్నాం.

Photo Courtesy: Saran Sabapathy

కొలను

కొలను

గుహల లోపల ఒక కొలను ఉంది. పూర్వం మునులు ఈ కొలనునె ఉపయోగించి స్నానాలు చేసేవారేమో !!

Photo Courtesy: Arul Damodaran

కోటి లింగాలు

కోటి లింగాలు

స్టాలాగ్ మైట్ తో ఏర్పడ్డ ఆకృతి తీరు ఆశ్చర్యం కలిగించింది. స్థానికులు వీటిని కోటి లింగాలు అంటారు. వీటిలో నుంచి ఒక్కొక్కటిగా జారే నీటి స్పటికాలు నిజంగా చూస్తే గాని తెలీదు . మీరు వీటిని తాకవచ్చు. తాకి, నీటి స్పటికాలను గుర్తించవచ్చు.

Photo Courtesy: Dr.Prithvi Raval

లోపలి ఎలా ఉంటుందంటే ..!

లోపలి ఎలా ఉంటుందంటే ..!

బెలుం గుహలలో లోపలికి వెళ్లే మార్గాలు మలుపులతో సాహసయాత్రని తలపిస్తాయి. లోనికి వెళ్లేటప్పుడు అదేదో నిధి కోసం వెళ్లే విధంగా ఉంటుంది. బహుశా నిధి కూడా దొరకొచ్చేమో రెపొద్దునా?? చెప్పలేం. కొన్ని ప్రదేశాలో లోనికి వెళ్ళేటప్పుడు తలకాయ కిందకు వంచుకొని వెళ్ళాలి. మీరు వెళ్ళేటప్పుడు పైన ఆకృతులను గమనిస్తూ వెళ్లండి.

Photo Courtesy: Deepak Venkatesan/ Arul Damodaran / Vincent Albert / Sylvester D'souza

అవుకు రిజర్వాయర్

అవుకు రిజర్వాయర్

12 గంటలకి బయటికి వచ్చిన మేము, ఇక యాగంటి దర్శనానికి బయలుదేరాము. బెలుం గుహల నుంచి యాగంటికి 44 కి. మీ. దూరం. యాగంటి వెళుతున్న మార్గంలో అవుకు రిజర్వాయర్, అదేవిధంగా నవాబుల వేసవి విడిది ( అరుంధతి కోట) తారసపడ్డాయి. యాగంటికి రావాలంటే బనగానపల్లె టచ్ కావాల్సిందే.

బనగానేపల్లెలో చూడాల్సిన ప్రదేశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: kurnool project

అరుంధతి కోట

అరుంధతి కోట

ఇక్కడి నుంచి ప్రయాణం కాస్త ఆధ్యాత్మికత వైపు, ప్రకృతి అందాల వైపు తిరిగింది. ముందుగా నవాబు బంగాళా వైపు బైక్ లు తిరిగాయి. ఒక మెట్ట మీద ఉన్న ఈ బంగాళా నవాబు తన ఉంపుడుగత్తె కు కట్టించినాడు అని అక్కడ ఉండే స్థానికులు చెప్పారు. ఈ బంగాళా లో అరుంధతి చిత్ర సన్నివేశాలని తీయడంతో అప్పటి నుంచి అరుంధతి కోట గా ముద్రపడిపోయింది.

Photo Courtesy: Srivathsa Rao U

పచ్చని పొలాలు

పచ్చని పొలాలు

అప్పటికే దగ్గర దగ్గర మధ్యాహ్నం ఒకటిన్నర కావోస్తుంది. ఎప్పుడో ఉదయం టిఫిన్ చేసింది ... ఆకలి అవడంతో ఎక్కడ తిందాం అని ప్రాంతాన్ని చూసుకుంటూ యాగంటి వైపు బయలుదేరాము. మార్గ మధ్యలోనే మాకు ఒక ఆరుగు కనిపించింది, పక్కనే పొలాలు, చెట్లతో నిండిన ఆ ప్రాంతం మాకు తినటానికి సరైన ప్రదేశం అనుకోని తీసుకు వచ్చిన ఒక్కగానొక్క బెడ్ షీట్ ను కింద పరుచుకొని క్యారేర్ బాక్స్ లను ఓపెన్ చేసాము.

Photo Courtesy: ramesh naidu

అరిటాకు భోజనం

అరిటాకు భోజనం

ఊరి నుండి తీసుకు వచ్చిన అరిటాకు లో అన్నం, పుండు కూర పప్పు ( గోంగూర పప్పు), ఎర్ర పప్పు, పచ్చి మిరపకాయల పప్పు, ఆవకాయ చట్నీ, రోకలి లో దంచిన బుడ్డల చట్నీ, ఉల్లిగడ్డల సాంబారు, పెరుగు, బనగానేపల్లె నుండి తీసుకువచ్చిన మిరపకాయ బజ్జీలను వేసుకొని కడుపు నిండా తిన్నాము.

Photo Courtesy: praveen

ఆగస్త్య పుష్కరిణి

ఆగస్త్య పుష్కరిణి

భోజనం చేసిన తరువాత మా ప్రయాణం యాగంటి కి చేరుకుంది. పైన కొండపైన వెలసిన శివుణ్ని దర్శించు కోవడానికి వెళ్లే ముందు మేము పుష్కరిణి లో స్నానాలు ఆచరించాము. పూర్వం ఈ కోనేరులో ఆగస్త్య మహానుని స్నానం చేశారని అప్పటి నుంచి దీనిని ఆగస్త్య పుష్కరిణి అని పిలుస్తారు. పుష్కరిణి లోని స్వచ్ఛమైన నీరు నంది నోటిలో నుంచి వస్తుంది.

Photo Courtesy: Suresh Kumar

ఆలయ ముఖ ద్వారం

ఆలయ ముఖ ద్వారం

పుష్కరిణి లో నీటి మట్టం ఏ కాలం లో నైనా మారక పోవడం విశేషం. ఇక్కడి నీటిలో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. పుష్కరిణి లో స్నానాలు ఆచరించిన తరువాత, శివుని దర్శనానికి వెళ్ళాము. అక్కడ బయటవైపు చెప్పులు వదిలేసి( 2 రూపాయలు తీసుకుంటారు), కాళ్ళు, చేతులు కడుక్కొని లోనికి వెళ్ళాము.

నల్లమల్ల అడవులలో 3 రోజుల ట్రిప్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Andhra Pradesh Tourism

బసవన్న

బసవన్న

ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. ఇక్కడి ప్రధాన ఆలయం ఉమామహేశ్వరుడు. ఈయన లింగ రూపంలో దర్శనం ఇస్తాడు. ఇక్కడే ఏటేటా పెరిగే నంది విగ్రహం ఉంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో చెప్పబడింది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు మాత్రమే చెందుతుంది.

Photo Courtesy: Rama Mahendravada

కాకులు కనిపించవు

కాకులు కనిపించవు

ఆగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేసేటప్పుడు కాకులు వచ్చి తపస్సు భంగం కలిగించాయి. దాంతో కోపొద్రిక్తుడైన మహర్షి కాకులు ఈ ప్రాంతంలో సంచరించకూడదని శాపం పెట్టాడట దాంతో కాకులు ఈ ప్రాంతంలో కాకులు కనిపించకుండా పోయాయి.

Photo Courtesy: andhratourism

మూడు గుహలు

మూడు గుహలు

ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడ్డ మూడు గుహలు మమ్మలను ఎంతగానో ఆశ్చర్య చకితులను చేశాయి. వీటి వద్దకి చేరుకోవాలంటే మెట్ల వల్లే అవుతుంది. ఆగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించిన గుహను వెంకటేశ్వర గుహ అని, ఇక్కడే పక్కన ఉన్న మరో గుహలో శివలింగాన్ని ప్రతిష్టించినాడు దీనినే రొకళ్ల గుహ అని పిలుస్తారు. ఇక్కడ మీరు మరో గుహ, శంకర గుహ గమనించవచ్చు. వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులకి జ్ఞానొపదేశం ఇక్కడే చేసాడని చెబుతుంటారు.

Photo Courtesy: jinka subbarayudu

వసతి

వసతి

యాగంటి లో మీరు బస చేయటానికి సత్రాలు ఉన్నాయి. ఉచితంగా భోజనం అందిచే రెడ్డి వారి సత్రం కూడా ఇక్కడ ఉంది.

Photo Courtesy: yaganti temple

పాలీష్ బండలు

పాలీష్ బండలు

యాగంటి దర్శనం పూర్తవడంతో మా ప్రయాణం ఇక కాల్వబుగ్గకు బయలుదేరసాగింది. మార్గ మధ్యలో బనగానేపల్లె లో కాస్త కూల్ డ్రింకులు తాగి, బేతంచెర్ల మీదుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాల్వబుగ్గ చేరుకున్నాము. అన్నట్టు బేతంచెర్ల పాలీస్ బండలకు కర్నూలు జిల్లాలోనే కాక చుట్టూ ప్రక్కల జిల్లాలలో ఫెమస్.

Photo Courtesy: bethamcherla rocks

కాల్వబుగ్గ

కాల్వబుగ్గ

ఎర్రమల కొండల్లో, కాల్వబుగ్గ లో పరమేశ్వరుడు బుగ్గ రామేశ్వరుని గా దర్శనం ఇస్తున్నాడు. స్వయాన పరుశురాముడే ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించడం జరిగింది. ఇక్కడ కూడా కోనేరు ఉంది. ఈ కోనేరు లో స్నానం చేసుకొని భక్తులు స్వామి వారి అనుగ్రహం కొరకు వస్తుంటారు. ఇక్కడ పెళ్లి చేసుకుంటే నవదంపతులు సుఖంగా జీవిస్తారని ప్రజల నమ్మకం. ఈ ప్రాంతం అంతా కోనేటి నీటి ప్రవాహంతో కొబ్బరి, మామిడి చెట్లతో కలకళలాడితూ ఉంటుంది.

Photo Courtesy: kurnool temples

రాక్ గార్డెన్

రాక్ గార్డెన్

కాల్వబుగ్గ దర్శనం అనంతరం ఇక ప్రయాణం కర్నూలు వెళ్ళసాగింది. అప్పటికే సాయంత్రం 6 గంటలు అయింది. కర్నూలు వెళుతున్న మార్గ మధ్యలో, బుగ్గకు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో పావుగంటలో చేరే విధంగా ఉన్న రాక్ గార్డెన్ వైపు వెళ్ళాము. సూర్యాస్తమం ఇక్కడ బాగుంటుంది. పూర్తిగా ఎర్ర ఎర్రగా కనిపించే రాళ్లు ఇక్కడి ప్రత్యేకత.

Photo Courtesy: shesh murthy

హోటల్

హోటల్

రాక్ గార్డెన్ లో ఆడుకోవడానికి పిల్లలకైతే మైదానం ఉంది. ఇది ఏపీ పర్యాటక శాఖ వారిచే నడపబడుతుంది. ఇక్కడ గల హోటల్ లో మీకు టీ, కాఫీ వంటివే కాక అల్పాహారాలు, భోజనాలు లభ్యమైతాయి.

Photo Courtesy: ap tourism

జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ..

జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ..

ఆధ్యాంతం ఆహ్లాద భరితంగా సాగిన మా ప్రయాణం ఎన్నో ప్రకృతి రమణీయతల మధ్య ముగిసింది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రదేశాలను సందర్శించి నూతన ఉత్తేజంతో ఆనందంగా ఉండండి.

Photo Courtesy: Kishore Nagarigari

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X