Search
  • Follow NativePlanet
Share
» »బీజాపూర్ లో ప్రతిబింబించే ప్రపంచ వారసత్వ సంపదలు !

బీజాపూర్ లో ప్రతిబింబించే ప్రపంచ వారసత్వ సంపదలు !

By Mohammad

చరిత్ర మీద ఆసక్తి కనబరిచే వారు బీజాపూర్ తప్పక సందర్శించాలి. ఇక్కడున్న చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలు, గోపురాలు, మసీదులు మరియు కోటలు మిమ్మల్ని చరిత్ర లోకి తీసుకొనిపోతాయి. బీజాపూర్ ను ఒక్కసారి సందర్శిస్తే చాలు మన గత చరిత్ర వైభవం ఏమిటనేది ఇట్టే తెలిసిపోతుంది. ఈ పట్టణ శిల్ప సంపద, లెక్కలేనన్ని చారిత్రక చిహ్నాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు నగరం యొక్క సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పుతాయి.

ఇంతకీ బీజాపూర్ ఎక్కడుందో చెప్పలేదు కదూ ..! బీజాపూర్ కర్నాటక రాష్ట్రంలో ఉత్తరం వైపున, మహారాష్ట్ర సరిహద్దులో ఒక జిల్లాగా ఉన్నది. కర్నాటక రాష్ట్ర రాజధానైన బెంగళూరు మహానగరం నుండి బీజాపూర్ పట్టణం సుమారు 525 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రముఖ వీర శైవ మతస్థాపకుడు బసవేశ్వరుడు ఈ జిల్లాలోనే జన్మించినాడు. కర్నాటక రాష్ట్రంలోని బీజాపూర్ లో ప్రతిబింబించే ప్రపంచ వారసత్వ సంపదలు విషయానికి వస్తే గోల్ గుంబజ్ ఇక్కడి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనితో పాటు అనేక ఆలయాలు, మసీదులు, కోటలు కూడా ఆకర్షణల్లో భాగంగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : ఐహోళే - రాతి శిల్పాల నగరం !!

బీజాపూర్ జిల్లా చరిత్ర విషయానికి వస్తే, బీజాపూర్ క్రీ.శ 900 లో రాష్ట్రకూటుల రాజప్రతినిథి తైలప్ప చేత నిర్మించబడింది. పూర్వం దీనిని "విజయపుర" అని పిలిచేవారట. క్రీ.శ.13వ శతాబ్ధ కాలంలో గుల్బర్గాకు చెందిన బహమనీ సుల్తానులు విజయపూర్ ని ఆక్రమించుకొని బీజాపూర్ మార్పు చేశారు. క్రీ.శ.15 వ శతాబ్ధ ప్రారంభదశలో ఆదిల్షా రాజ్యంగా బీజాపూర్ పాలించబడింది. స్వతంత్ర బీజపూర్ సామ్రాజ్య స్థాపన చేసిన యూసఫ్ ఆదిల్ షా కాలంలో బీజపూర్ ఉన్నత స్థితికి చేరింది. ఆతరువాత జరిగిన సంఘటనల్లో బీజాపూర్ ను వరుసగా మొఘల్ చక్రవర్తులు, నిజాం నవాబులు, మరాఠాలు పాలించగా చివరగా బ్రిటీష్ వారి పాలనలో బాంబే రాష్ట్రంలో భాగంగా మారింది. స్వాతంత్ర్యానంతరం బాంబే నుండి వేరుచేయబడి కర్నాటక రాష్ట్రంలో భాగమయిపోయింది.

ఆదిల్షా కోట, బీజాపూర్

ఆదిల్షా కోట, బీజాపూర్

ఆదిల్షా నిర్మించిన కోట ప్రాకారం 2 - 6 మైళ్ళ చుట్టుకొలతతో నిర్మించబడింది. ఇది విస్తారమైన సామాగ్రితో శక్తివంతంగా నిర్మించబడింది. కోట గోడ ఎత్తు 30-50 అడుగులు, గోడ వెడల్పు 25 అడుగులు కలిగి ఉండి, కోటకు 10 ద్వారాలు ఉన్నాయి. ప్రస్తుతం కోట చుట్టూ శిధిలాల నడుమ సమాధులు మరియు మసీదులు మొదలైనవి ఉన్నాయి.

చిత్ర కృప : Xavier

ఇబ్రహీం రౌజా, బీజాపూర్

ఇబ్రహీం రౌజా, బీజాపూర్

పర్యాటకులు తమ సందర్శనలో భాగంగా రెండవ ఇబ్రహీం అదిల్ షా నిర్మించిన ఇబ్రహీం రౌజా తప్పక చూడాలి. దీనిని దక్కన్ సామ్రాజ్య తాజ్ మహల్ గా అభివర్ణిస్తారు. ఇబ్రహీం రౌజాకు కుడివైపున ఒక మసీదు, నాలుగు గోపురాలు మరియు ఎడమవైపు ఒక సమాధి ఉన్నాయి. ఎంతో అందమైన ఈ చారిత్రక చిహ్నాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి.

చిత్ర కృప : lesterlester1

బరాకామన్, బీజాపూర్

బరాకామన్, బీజాపూర్

సమయం దొరికితే, సందర్శకులు చూడవలసిన మరో ఆకర్షణ రెండవ అలి అదిల్ షా సమాధి బరాకామాన్. అద్వితీయమైన శిల్ప సంపదతో ఈ సమాధి నిర్మించాలని అలి అదిల్ షా భావించాడు. సందర్శకులు చూసే రీతిలో ఇవి సమాంతరంగాను, నిట్ట నిలువుగాను ఉంటాయి. అయితే, గోల్ గుంబజ్ ను ఈ మసీదు నిర్మాణం తాకుతున్నందువలన నిర్మాణాన్ని ఆపివేశారు. ప్రస్తుతం ఈ నిర్మాణం పురావస్తు శాఖ అధీనంలో ఉంది.

చిత్ర కృప : Nagarjun Kandukuru

చాంద్ బావడి, బీజాపూర్

చాంద్ బావడి, బీజాపూర్

చాంద్ బావడి, అలి ఆదిల్ షా చే బీజాపూర్ లో నిర్మించబడింది. చాంద్ బావడి అంటే, మెట్లు గల బావి అని అర్థం. అదిల్ షా ఈ ట్యాంక్ ను తన భార్య చాంద్ బీబి జ్ఞాపకార్థం, సుమారుగా 20 మిలియన్ లీటర్ల నీటిని ప్రజలకు అందించే సామర్ధ్యం తో నిర్మించినాడు. ట్యాంక్ సైజులో నగరంలో మరికొన్ని ట్యాంక్ లు నిర్మించినా అవి పూర్తిగా ప్రభువుల కుటుంబాల వినోదాలకు ఉపయోగించారు.

చిత్ర కృప : wikicommons

గగన్ మహల్, బీజాపూర్

గగన్ మహల్, బీజాపూర్

గగన్ మహల్ రాజప్రసాదం బీజపూర్ నగరానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. దీనిని ఒకటవ అలి అదిల్ షా 1561 లో నిర్మించాడు. దీనినే దర్బార్ హాల్ గా కూడా వాడేవారు. ఈ చారిత్రక నిర్మాణంలో 21 మీటర్ల విశాలమైన ప్రాంగణం మరియు నాలుగు అతి పెద్ద కొయ్య స్తంభాలు మధ్యలో ఒక చక్కటి ఆర్చి ఉంటాయి. గగన్ మహల్ మొదటి అంతస్తును రాజ కుటుంబీకులు తమ నివాసంగా, దాని కింది నేల అంతస్తు దర్బార్ హాల్ గా వాడేవారు.

చిత్ర కృప : Ramnath Bhat

జుమ్మా మసీదు, బీజాపూర్

జుమ్మా మసీదు, బీజాపూర్

జుమ్మా మసీద్ కు ఎంతో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నది. దీనిని అలి అదిల్ షా తళ్ళికోట యుద్ధంలో తన విజయానికి చిహ్నంగా నిర్మించాడు. మసీదుకు ఒక అందమైన గోపురం, పెద్ద చావడి మరియు ఆకర్షణీయమైన ఆర్చీలు ఉంటాయి. ఈమసీదులో బంగారంలో వ్రాసిన పవిత్ర ఖురాన్ గ్రంధం ఒక కాపీ కూడా ఉంది. ఈ మసీదు మధ్య భాగంలో ఒక ఫౌంటెన్, ఒక హాలు మరియు ఒక గోపురం ఉన్నాయి.

చిత్ర కృప : Ramnath Bhat

మిఠారి మరియు అసర్ మహల్, బీజాపూర్

మిఠారి మరియు అసర్ మహల్, బీజాపూర్

బీజపూర్ దర్శించే పర్యాటకులు మిఠారి మరియు అసర్ మహల్ భవనాలను తప్పక చూడాలి. వీటిని క్రీ.శ.1640 లో మహమ్మద్ అదిల్ షా పర్షియన్ శైలిలో నిర్మించినాడు. దీనిని హాల్ ఆఫ్ జస్టిస్ అని మొఘల్ కాలంలో అనేవారు. అందమైన గదులు, పెయింటింగ్ అంకరణలు మరియు రాళ్ళపై శాసనాలు లోపల కనపడతాయి. ప్రతి సంవత్సరం ఉర్స్ పండుగ ఇక్కడ చేస్తారు.

చిత్ర కృప : Ramnath Bhat

మాలిక్ ఎ మైదాన్, బీజాపూర్

మాలిక్ ఎ మైదాన్, బీజాపూర్

బీజపూర్ లో క్రీ.శ. 1549 లో షెర్జా బురుజుపై తన యుద్ధ విజయానికి రుజువుగా మహమ్మద్ అదిల్ షా నిర్మించిన ఒక అతి పెద్ద ఫిరంగిని కూడా చూడవచ్చు. దీనిని యుద్ధ ప్రభువు లేదా మాలిక్ ఎ మైదాన్ అని కూడా అంటారు. ఈ ఫిరంగి బీజపూర్ కు 3 కి.మీ. దూరంలో ఉంది. ఆ కాలంలో దీనిని అతి పెద్ద ఫిరంగిగా భావించేవారు. ఈ ఫిరంగి ముఖ భాగం ఒక సింహం తన కోరలు తెరచిన రీతిని గుర్తు చేస్తుంది. సింహం కోరలకు మధ్య ఒక ఏనుగు నలిపి చంపివేయబడినట్లుగా ఉంటుంది.

చిత్ర కృప : Rupak Sarkar

ఉప్రి బురుజు లేదా ఉప్పిలి బురుజు, బీజపూర్

ఉప్రి బురుజు లేదా ఉప్పిలి బురుజు, బీజపూర్

ఉప్రి బురుజు ను బీజాపూర్ వచ్చే యాత్రికులు తప్పక సందర్శించాలి. దీనిని క్రీ.శ. 1584 లో హైదర్ ఖాన్ నిర్మించాడు. 80 అడుగుల ఎత్తు కల ఈ బురుజులో పురాతన యుద్ధ సామాగ్రి అంటే తుపాకులు, నీటి తొట్టెలు పెట్టేవారట. ఈ బురుజు పై భాగం నుండి నగరాన్ని బాగా వీక్షించవచ్చు. పైకి వెళ్ళాలంటే పర్యాటకులు సర్కులర్ మెట్లు ఎక్కి వెళ్ళాలి. దీనిని శత్రువుల రాకను గమనించేందుకు వినియోగించేవారు.

చిత్ర కృప : Abhijit Rao

గోల్ గుంబజ్, బీజాపూర్

గోల్ గుంబజ్, బీజాపూర్

బీజాపూర్ లో ఏదైనా చూడకపోయిన ఫర్వాలేదు కానీ, గోల్ గుంబజ్ ను మాత్రం ప్రత్యేకంగా చూడాల్సిందే. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద సమాధిగా కీర్తికెక్కింది. ఇది బీజపూర్ సుల్తాన్ మహమ్మద్ అదిల్ షా సమాధి. ఈ భవనం యాకుత్ అనే ప్రముఖ శిల్పి చే నిర్మించబడింది. ఈ డోమ్ లోపలి భాగాలు ఏ ఆధారం లేకుండా నిలవటం అనేది ఒక మిస్టరీగా ఉంటుంది. ఈ కట్టడ శిల్పకళా నైపుణ్యం పరిశీలిస్తే, దీనిలో 4 గోపురాలు, 8 అంతస్తులు ఉంటాయి.

చిత్ర కృప : Amit Rawat

బీజాపూర్ ఎలా చేరుకోవాలి ?

బీజాపూర్ ఎలా చేరుకోవాలి ?

విమాన ప్రయాణం

బీజాపూర్ కి 100 కి.మీ. దూరంలో షొలాపూర్ వాణిజ్యరహిత విమానాశ్రయం మరియు 200 కి.మీ. దూరంలో బెల్గాం విమానాశ్రయంలు సమీపంలో ఉన్నాయి. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బీజపూర్ 538 కి.మీ. దూరం ఉంది. ఐరోపా, ఆసియా, అమెరికా మధ్య ప్రాచ్య దేశాల పర్యాటకులు ఈ విమానాశ్రయాల ద్వారా బీజపూర్ చేరవచ్చు.

రైలు ప్రయాణం

బీజపూర్‌ లో బ్రాడ్ గేజ్ స్టేషన్ ఉంది. ఇది నగరం నుండి 2 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి నుండి బెంగుళూరు, ముంబయి, హైదరాబాదు, హుబ్లి, షోలాపూరు, షిర్ది మరియు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళ రాక పోకలుంటాయి.


రోడ్డు మార్గం

బీజాపూర్ రోడ్డు వ్యవస్థ అనేక పట్టణాలతో కలుపబడి ఉంది. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బెంగుళూరు, పూనే, ముంబై లనుండి కూడా బీజపూర్ కు బస్సులు నడుపుతుంది. నగరం లోపల టాటా సుమో, టాటా ఇండికా, టెంపో టాక్సీలు లభిస్తాయి. దీంతోపట్టణంలోని చారిత్రక కట్టడాలైన గోల్ గుంబజ్, ఇబ్రహీం రౌజా, జుమ్మా మసీద్, మాలిక్ ఎ మైదాన్ వంటివి దర్శించవచ్చు.

చిత్ర కృప : Heleen van Duin

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X