Search
  • Follow NativePlanet
Share
» »ప‌చ్చ‌ని గిరులు మ‌ధ్య దాగిన‌ పుణ్యగిరి జలపాతం!

ప‌చ్చ‌ని గిరులు మ‌ధ్య దాగిన‌ పుణ్యగిరి జలపాతం!

ప‌చ్చ‌ని గిరులు మ‌ధ్య దాగిన‌ పుణ్యగిరి జలపాతం!

చుట్టూ గుబురుగా పెరిగిన చెట్లు.. ఎత్త‌యిన కొండ కోన‌లు.. విన‌సొంపైన జ‌ల‌పాత‌పు స‌వ్వ‌డులు. ఇవ‌న్నీ ఒకేచోట ప‌ల‌క‌రిస్తే ఎలా ఉంటుంది. ప్ర‌కృతి ప్ర‌సాదించిన ఆ అద్భుత క్ష‌ణాల‌ను జీవితంలో మ‌ర్చిపోలేం అనిపిస్తుంది క‌దూ! అలాంటి ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణే పుణ్య‌గిరి. పని ఒత్తిడిలో స‌త‌మ‌త‌మైన మాకు కాస్త మాన‌సిక ఉల్లాసాన్ని అందించిన పుణ్య‌గిరి రైడ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆ టూర్ విశేషాలు మీకోసం.

విజ‌య‌న‌గ‌రం ఆర్టిసి బస్ స్టాండ్ నుంచి గంటన్నర ప్రయాణం తర్వాత శృంగవరపుకోట చేరుకున్నాం. అక్క‌డి ఆర్‌టిసి బ‌స్‌స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మేం చేరుకోవాల్సిన‌ పుణ్యగిరి. ఇక్కడి కొండపైన పురాతన ఉమాకోటి లింగేశ్వర ఆలయం ఉంది. ఆలయం దగ్గరగా ఉండే జ‌ల‌పాతంలో నిత్యం నీరు ప్ర‌వ‌హిస్తూ ఉండ‌ట‌మే ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌. బస్ స్టాండ్ నుంచి ఆటోలో కొండ దిగువ ప్రాంతానికి

చేరుకున్నాం. కాలినడకన మాత్రమే ఆలయాన్ని చేరుకోగలం అని అక్కడివారు చెప్పారు. దాంతో మా కాళ్లకు పనిచెప్పాం. మెట్ల మార్గం గుండా పైకి వెళ్లాం. దారిపొడవునా కోతులు తారసపడ్డాయి. అయితే అవి మా జోలికి రాలేదు. పైకి వెళ్లే కొలదీ మాకు ఎదురైన పచ్చని ప్రకృతి అందాల గురించి మాటల్లో చెప్పలేం.

Punyagiri falls

భలే ఆశ్చర్యం అనిపించింది..

కొంత అలసట మమ్మల్ని ఆవహించింది. అదే సమయంలో ఆ మార్గానికి కుడివైపున కొందరి కేరింతలు మా చెవిన పడ్డాయి. ఆసక్తిగా అటువైపుగా అడుగులు వేశాం. ముప్పై అడుగుల లోతున గలగలా ప్రవహిస్తోన్న జలపాతం మాకు దర్శనమిచ్చింది. సుమారు నలభై అడుగుల పైనున్న కొండలపై నుంచి స్వచ్ఛమైన నీటిధారలు అక్కడి పర్యాటకులను ఆటలతో ముంచెత్తుతున్నాయి. దానిని ధార గంగమ్మ అని స్థానికంగా పిలుస్తారని అక్కడివారు చెప్పారు.

అంటే, మేం చేరాల్సిన పుణ్యగిరి జలపాతం చేరుకోవాలంటే ఇంకా పైకి వెళ్లాలని మాకు అర్థమైంది. గంగమ్మధార దగ్గర కాస్త సేదదీరాకపైకి వెళ్లాం. ఆలయం దగ్గరకు చేరుకోగానే ఎడమవైపున మరోధార కనిపించింది. దానిని పార్వతి ధార పిలుస్తారట! ఆలయం నూతన నిర్మాణంలా అనిపించి విశిష్టతను గొప్పగా చెప్పుకొచ్చారు అక్కడి వారు. మాకు మాత్రం ప్రారంభ స్థానం ఎక్కడుందో ఇప్పటి వరకూ చెప్పలేకపోతున్న ఆ నీటిధారను చూస్తుంటే భలే ఆశ్చర్యం అనిపించింది.

Punyagiri falls

జీవితంలో మ‌ర్చిపోలేని క్ష‌ణాలు..

ఆ కొండ ప్రాంతం ప్రశాంతతకు నెలవుగా అనిపించింది. అందుకే ఇక్కడి ప్రకృతి అందాలు, ఆకట్టుకునే పుణ్యగిరి జలపాతం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుందని అర్థమైంది. ఎక్కువగా కార్తీకమాసం సమయంలో పుణ్యగిరి ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతుందని అక్కడివారు చెప్పారు. చుట్టూ గుబురుగా పెరిగిన చెట్లు.. ఎత్త‌యిన కొండ కోన‌లు.. విన‌సొంపైన జ‌ల‌పాత‌పు స‌వ్వ‌డులు. ఇవ‌న్నీ ఒకేచోట ప‌ల‌క‌రించే ప్ర‌దేశ‌మే పుణ్య‌గిరి అని అర్థమైంది. ప్ర‌కృతి ప్ర‌సాదించిన ఆ అద్భుత క్ష‌ణాల‌ను జీవితంలో మ‌ర్చిపోలేం అనిపించింది.

అప్పటికే సమయం మించిపోవడంతో తిరుగు ప్రయాణమయ్యాం! ఒక్క రోజులోనే ఇన్ని వింతలు, విశేషాలు తెలుసుకున్న మావాళ్లు ఎంతో సంతోషించారు. విశాఖ‌ప‌ట్నం నుంచి నేరుగా శృంగ‌వ‌ర‌పుకోట‌ చేరుకునేందుకు రోడ్డు మార్గం ఉంది. అర‌కు వెళ్లేవారు పుణ్య‌గిరి మీదుగానే వెళ‌తారు. మరెందుకు ఆలస్యం మీ ప్ర‌యాణాన్ని మొదలు పెట్టండి!

Read more about: punyagiri andhra pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X