Search
  • Follow NativePlanet
Share
» »సంద‌ర్శ‌కుల‌ను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!

సంద‌ర్శ‌కుల‌ను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!

సంద‌ర్శ‌కుల‌ను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!

తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి ఇలా ఏడు న‌దుల సంగ‌మ ప్రాంతం కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. ఎన్నో శైవాలయాలకు కొలువైన కర్నూలు జిల్లాలో సంగమేశ్వర ఆలయం ఒక్కటే ప్రత్యేక విశిష్టత కలిగి ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలోని పురాత‌న ఆల‌యం సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. నాలుగు నెలుల మాత్రమే క‌నువిందు చేసే ఆ ఆల‌య విశిష్ట‌త మీకోసం.

కర్నూలు జిల్లాలోని నందికోట్కూరు ముచుమర్రి గ్రామం వద్ద ఉంది చారిత్రక సంగమేశ్వర ఆలయం. ఈ ఆల‌యానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఏడాదిలో ఇది నాలుగు నెల‌లు మాత్ర‌మే క‌నిపిస్తుంది. మిగిలిన స‌మ‌యంలో కృష్ణమ్మ ఒడిలోనే సేద‌దీరుతుంది.

Sangameshwaram

ఇటీవ‌ల‌ కృష్ణమ్మ నీరు తగ్గుముఖం పట్టడంతో ఎనిమిది నెలల తర్వాత సంగమేశ్వర ఆలయం మ‌ళ్లీ ద‌ర్శ‌న‌మిచ్చింది. కృష్ణానదికి గరిష్ట నీటిమట్టం ఉండటంతో గత ఎనిమిది నెలలుగా నీట మునిగి ఉన్న ఈ ఆలయం ఇప్పుడు బయటపడి మరలా పూజకు సిద్ధమైంది. 1981 లో శ్రీశైలం ఆనకట్ట నిర్మించటంతో అప్పటి నుంచి నీటిలో ఎక్కువ కాలం ఉంటూ మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను చాటుతోంది.

పురాణ కధనం ప్ర‌కారం..

ఈ చారిత్రక ఆలయంను పాండవ అగ్రజుడు ధర్మరాజు నిర్మించి స్వయంగా చెక్కలింగంను ప్రతిష్టించారని పురాణ కధనం ప్రచారంలో ఉంది. కృష్ణ, భవనాసి, వేణి, తుంగ, భధ్ర, భీమరతి, మలపహరిణి అను ఏడు నదులు కలిసే సంగమం వద్ద నిర్మించినందున దీనికి సంగమేశ్వర ఆలయంగా పేరు స్థిరపడింది. పూర్వం వనవాసంలో భాగంగా పాండవులు సంగమేశ్వరానికి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. భీముడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకరావడం ఆలస్యం కావడంతో ధర్మరాజు సమీపంలో ఉన్న వేప చేట్టు కొమ్మను ప్రతిష్టించి శివునికి పూజలు నిర్వహించారని స్థల పురాణం చెబుతోంది. ఆ నాటి నుంచి నేటి వరకు ఈ వేప శివలింగం చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేక విశిష్టతగా చెప్పుకోవచ్చు.

అంతేకాదు, ధ‌ర్మ‌రాజు ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు .. ప్రతిష్ఠ సమయానికి రాలేదట‌. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.

Sangameshwaram

భవనాసి నది మాత్రమే పురుషుడి పేరు

ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి. ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.

ఈ అద్భుత సంగ‌మ ప్ర‌దేశాన్ని ద‌ర్శించేందుకు ఏటా సుదూర ప్రాంతాల‌నుంచి ప్ర‌జ‌లు ఇక్క‌డికి వ‌స్తూ ఉంటారు. నిత్యం నీటితో ముచ్చ‌ట్లుగొలిపే ఆల‌యం చెక్కుచెద‌ర‌కుండా ఉండ‌డం ఈ ఆలయ నిర్మాణ‌శైలికి ఓ ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

Read more about: kurnool
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X