Search
  • Follow NativePlanet
Share
» »విద్యా, బుద్ధుల్లో అందరికంటే ముందు మీరే ఉండాలంటే ఇక్కడికి వెళ్లండి

విద్యా, బుద్ధుల్లో అందరికంటే ముందు మీరే ఉండాలంటే ఇక్కడికి వెళ్లండి

By Staff

డిచ్ పల్లి రామాలయ రహస్యం ?డిచ్ పల్లి రామాలయ రహస్యం ?

భారతదేశంలో సరస్వతి దేవి కి ఆలయాలు చాలా అరుదు అంటే తక్కువగా ఉన్నాయని నా అభిప్రాయం. ఇండియాలో కెల్లా ఉన్న ఆ కొద్దీ ఆలయాలలో ప్రసిద్ధి చెందినది తెలంగాణ లోని బాసర క్షేత్రం. బాసర అదిలాబాద్ జిల్లాలో పవిత్ర గోదావరి నది తీరాన కలదు. హైదరాబాద్ మహా నగరానికి 208 కిలోమీటర్ల దూరంలో, జిల్లా ముఖ్య పట్టణం అదిలాబాద్ నుండి 157 కిలోమీటర్ల దూరంలో మరియు నిజామాబాద్ పట్టణం నుండి 35 కిలోమీటర్ల దూరంలో కలదు.

ఇది కూడా చదవండి : అదిలాబాద్ పర్యాటక ప్రదేశాలు !

ఇండియాలో రెండే రెండు సరస్వతి దేవాలయాలలో ఒకటేమో జమ్మూకాశ్మీర్ లో ఉండగా, మరొకటి తెలంగాణ లోని బాసరలో కలదు. బాసరలో గల దేవాలయాన్ని చాళుక్యులు నిర్మించినారు.

బాసర ఆలయం మరియు ప్రాంగణం

బాసర ఆలయం మరియు ప్రాంగణం

చిత్ర కృప : Sambasiva rao S

సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు దీరి ఉన్నారు. దేవాలయ ప్రాంగణం ఎంతో ప్రశాంత వాతావరణంలో సాదాసీదా గా ఉన్నది. పెద్దలు ప్రతి సంవత్సరం తమ పిల్లలు మొదటి సారి అక్షరాభ్యాసం చేయించటానికి వస్తుంటారు. హిందూ మతం ప్రకారం, సరస్వతి దేవి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత.

ఇది కూడా చదవండి : నిజామాబాద్ పర్యాటక ప్రదేశాలు !

పురాణగాధ

కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు తన కుమారునితో(శకునితో) కలిసి వచ్చి గోదావరి నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతాన్ని చూసి ముగ్ధుడై ఇక్కడే కుటీరాన్ని ఏర్పాటుచేసుకుంటాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనం ఇచ్చి, ముగ్గురు అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించమని అడుగుతుంది. అప్పుడు వ్యాసుడు నది లోంచి ఇసుకను తోడుకొని ముగ్గురు దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టిస్తాడు.

పసుపుకొమ్ము మీద కూర్చున్న సరస్వతి దేవి

పసుపుకొమ్ము మీద కూర్చున్న సరస్వతి దేవి

చిత్ర కృప : Bhaskaranaidu

వ్యాసుడు ఇక్కడ కొంత కాలం నివసించాడు కనుక అప్పటి నుండి వ్యాసపురి అని, వ్యాసర అని, తర్వాత మహారాష్ట్ర ప్రజల ప్రభావం వల్ల బాసర గా నేడు పిలువబడుతున్నది.

బాసర లో వ్యాస మహర్షి ఇసుకతో ప్రతిష్టించిన విగ్రహాలకు ప్రజలు పసుపు పూసి అలంకరించి పూజలు చేస్తారు. ఆ పసుపును రవ్వంత తిన్నా అపార జ్ఞాన సంపద, విజ్ఞానం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఆలయ విశేషాలు

బాసర లో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయించడం గొప్ప ప్రాధాన్యత గా పరిగణిస్తారు. పెద్దలు తమ బంధుమిత్రులతో కలిసి వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఈ అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ఇపుడైతే వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం లోని జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి చేతి లో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచటానికి భక్తులు ఆసక్తిని ప్రదర్శిస్తారు.

బాలికకు అక్షరాభ్యాసం చేయిస్తున్న పూజారి

బాలికకు అక్షరాభ్యాసం చేయిస్తున్న పూజారి

చిత్ర కృప : Bhaskaranaidu

ఆది కవి గా పిలువబడే వాల్మీకి ఇక్కడే సరస్వతి దేవి ని ప్రతిష్టించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది. గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి పాలరాతి శిల ఉన్నాయి.

బాసర సరస్వతి దేవి ఆలయంలో నిరంతరం అక్షరాభాస్యం, వివాహాలు, భజనలు ఇతరత్రా శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి ప్రజలు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

బాసర ఆలయం యొక్క గోపురం

బాసర ఆలయం యొక్క గోపురం

చిత్ర కృప : RameshSharma

బాసర ఆలయం ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంచుతారు.

బాసర ప్రధాన దేవాలయానికి సమీపంలో చూడదగిన స్థలాలు

తూర్పున వృక్ష ఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. పశ్చిమాన మహాకాళీ ఆలయం, దక్షిణాన వ్యాస మహర్షి మందిరం లు ఉన్నాయి. వ్యాస మహర్షి మందిరంలో వ్యాస మహర్షి విగ్రహం, వ్యాస లింగం చూడవచ్చు.

వేద శిల, బాసర

వేద శిల, బాసర

చిత్ర కృప : రహ్మానుద్దీన్

బాసర ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

బాసర కు సమీపాన 208 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానా శ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లను అద్దెకు తీసుకొని బాసర చేరుకోవచ్చు.

రైలు మార్గం

బాసర లో రైల్వే స్టేషన్ కలదు. హైదరాబాద్ నుండి ముంబై కు వెళ్లే రైళ్లు బాసర లో ఆగుతాయి. స్టేషన్ వద్ద ఆలయానికి చేరుకోవటానికి ఆటోలు లభ్యమవుతాయి.

బస్సు / రోడ్డు మార్గం

హైదరాబాద్ (208 KM), ఆదిలాబాద్ (157 KM), నిజామాబాద్ (35 KM), కరీంనగర్ (174 KM), మెదక్ (138 KM), నాందేడ్ (117 KM) తదితర ప్రాంతాల నుండి బాసర కు రాష్ట్ర సర్వీసు బస్సులు, ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

గోదావరి బ్రిడ్జ్, బాసర

గోదావరి బ్రిడ్జ్, బాసర

చిత్ర కృప : Bhaskaranaidu

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X