Search
  • Follow NativePlanet
Share
» »తెలుగు వారి సంవత్సరాది...ఉగాది పండుగ!!

తెలుగు వారి సంవత్సరాది...ఉగాది పండుగ!!

By Mohammad

శాస్త్రీయమైన మన యదార్థ విజ్ఞానాన్ని తెలుసుకోకుండా పాశ్చ్యాత్య చెడు సంప్రదాయాలపై మోజు చూపుతోంది నేటి మన యువతరం. పరమాన్నం వంటి ఆరోగ్యదాయకమైన మన తెలుగు సంవత్సరాదిని ఓ ప్రక్కకు నెడుతూ, విస్కీ.. బ్రాందీ సీసా వంటి ఆంగ్ల సంవత్సరాది వైపు "విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్!" అంటూ పరుగులు తీస్తోంది.
"హ్యాపీ న్యూ ఇయర్" అనే మాట వినగానే నేడు చాలా మందికి మనసులో మెదిలేది "జనవరి 1వ తేది". సంవత్సరం ఆరంభం అనగానే ఎందరికో ఆ తేదియే గుర్తుకొస్తుంది. కానీ మన శాస్త్రీయమైన సంవత్శరారంభం "ఉగాది",ఈ విషయాన్ని నేడు ఎంతమంది గుర్తిస్తున్నారు?? ఉగాదికి "సంవత్సరాది" అనే పేరైతే ఉంది కానీ, "హ్యాపీ న్యూ ఇయర్" అనగానే ఉగాది మాత్రం ఎవ్వరికీ గుర్తుకు రాదు. మనకు కేవలం వేపపువ్వు పచ్చడి తినే పండగ గానే నేడు మన "ఉగాది" వ్యవహరించబడుతుంది. ఏ ప్రత్యేకత లేని జనవరి 1ని "సంవత్శరారంభం" గా సూచించడం , "ఉగాది" పండుగ యొక్క విశిష్టతను మరచిపోవడం చాలా దురదృష్టకరం.
కాలమానంలోని అంశాలన్నింటిని పూర్తిగా ఖగోల శాస్త్రరీత్యా ఏర్పాటు చేసుకున్న ఏకైక జాతి "హిందుజాతి", కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, కార్తె మాసం, రుతువు, అయనం, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం మొదలైన అన్నింటినీ హిందువులు ఖగోళ శాస్త్ర ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఖగోలశాస్త్ర బద్దమైన కాలమానాన్ని పురాణకాలం నుండి కలిగివున్న ఘనత హిందువులది! ఈ విషయం నేడెంత మందికి తెలుసు? "తిని, త్రాగి పడుకుంటే మనిషికి - గొడ్డుకి తేడా ఎమున్దన్నాడు" ఓ రచయిత. "మా తాతలు నేతులు త్రాగారు - వారి మూతులు వాసన గురించి చెప్పుకుంటున్నాం" అన్నట్లు కాకుండా, ఆ నేతుల్ని మనమూ కాస్త రుచి చూద్దాం రండి. మన జాతికున్న కాలమాన పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుందాం పదండి. అంతేకాదు మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా ఉన్న ఉగాది, దేశంలోని ఏ ఏ రాష్ట్రాలలో జరుపుకుంటారో, ఎలా జరుపుకుంటారో ఒకసారి పరిశీలిద్దాం!!

ఫ్రీ కూపన్లు: యాత్ర వద్ద ఫ్లైట్ బుక్ చేసుకోండి 8000 వరకు ఆఫర్ పొందండి

ఉగాది

ఉగాది

ఉగాది పండగ తెలుగు వారి ప్రముఖ పండగ మరియు ఘనంగా అధికారికంగా జరుపుకునే పండగ. ఈ పండగ చైత్ర మాస చైత్ర మాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఈ పండుగ రోజున పంచాంగ శ్రవణము చేయుట ,షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ని భుజించుట ప్రశస్త్యమైనది మరియు ముఖ్యమైనది. ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. మనకు జాతరలు ఈ పండుగ సమయంలోనే ప్రముఖంగా కనిపిస్తాయి. ఉగాది సందడి చూడాలంటే పట్టణంలో కంటే, పల్లెల్లోనే చాలా సరదాగా, ఆహ్లాదంగా బాగుంటుంది. ఏదిఏమైతేనేం పట్టణాల కంటే పల్లెలే దేశానికి పట్టుసీమలు.

Photo Courtesy: Animesh Hazra

ఉగాది

ఉగాది

ఇక్కడ కూడా ఉగాది పండగను ఆంధ్ర రాష్ట్రం మాదిరిగానే జరుపుకుంటారు. ప్రతీ ఇంట ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి , రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దుతారు. శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంత శుభం కలగాలనికోరుకుంటారు. ఆరోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు . ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలెడతారు. ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు విశేషం. ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సరరాశి ఫలాలు తెలుసుకుంటారు సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు.

Photo Courtesy: avadhii

గుడి పడ్వా

గుడి పడ్వా

తెలుగువారిలానే చాంద్రమానాన్ని అనుసరించే మహారాష్ట్రీయులకి కూడా ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడే వస్తుంది. వారి సంవత్సరాదిని 'గుడి పడ్వా'గా జరుపుకుంటారు. పడ్వా అంటే పాడ్యమి అని అర్థం. మన ఉగాది పచ్చడి లాంటిదే తయారుచేసి దానికి అదనంగా వాము చేర్చి భుజిస్తారు. బ్రహ్మదేవుడు ఆ రోజున సృష్టి ఆరంభించినందుకు గుర్తుగా ఆయన పేరున బ్రహ్మ ధ్వజం నిలుపుతారు. వెదురుపుల్లకు పట్టువస్త్రం కప్పి, పూలతో అలంకరించి పైన వెండి లేదా కంచు పాత్రలు మూస్తారు. గుడి పడ్వా రోజు ఈ బ్రహ్మధ్వజాలను తప్పనిసరిగా ప్రతిష్ఠిస్తారు.

Photo Courtesy: Samuel Raj

పుత్తాండు

పుత్తాండు

తమిళుల ఉగాదిని పుత్తాండు అని వ్యవహరిస్తారు. ఒకప్పుడు తమిళుల ఉగాది కూడా తెలుగు వారిలానే ఏప్రిల్‌ లో వచ్చేది. కానీ, డీఎంకే ప్రభుత్వం దీన్ని ఆర్యుల పండుగగా భావించి జనవరిలో జరిగే సంక్రాంతి సమయంలోనే ఉగాది వేడుకలు కూడా జరుపుకోవాలని శాసనసభలో చట్టం చేసింది. ఏప్రిల్‌ లో వచ్చే ఉగాది రోజును చిత్తిరై తిరునాళ్‌ గా జరుపుకోవాలని ప్రకటించింది.చిత్తిరై తిరునాళ్‌ అంటే చైత్ర మాసంలో వచ్చే జాతరలు అని అర్థం. ఆ చట్టం ప్రకారం ప్రస్తుతం తమిళుల ఉగాది వారి పంచాంగం ప్రకారం జనవరిలో వస్తుంది. సంప్రదాయబద్ధంగా వచ్చే పుత్తాండు నాడు తమిళులు ప్రత్యేకంగా ఆచరించే పనులేమీ ఉండవు. ఆరోజున ప్రత్యేక పూజలు చేస్తారు. నవకాయ పిండివంటలతో విందు భోజనాలు ఆరగిస్తారు. పంచాంగ శ్రవణం మాత్రం తెలుగువారిలాగానే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు జరుగుతాయి.

Photo Courtesy: KeithDM

విషు

విషు

మలయాళీలు సంవత్సరాదిని "విషు"గా వ్యవహరిస్తారు. వీరి ఉగాది ఏప్రిల్‌ మధ్యలోనే వస్తుంది. కానీ పండగ మాత్రం భలేగా ఉంటుంది. పండుగ ముందురోజు రాత్రి ఇంట్లోని మహిళల్లో పెద్దవయస్కురాలు పచ్చి బియ్యం, కొత్తబట్టలు, బంగారు-పసుపు వన్నెలో ఉండే దోసకాయలు, అరటిపళ్లు, తమలపాకులు, అద్దం వీటన్నిటినీ ఉరళి అనే ప్రత్యేక పాత్రలో పెట్టి పూజగదిలో దేవుడి దగ్గర ఉంచుతారు. వాటన్నిటినీ ఉంచిన పాత్రను "విషుకని" అంటారు. మర్నాడు ఆమె ముందుగాలేచి వయసుల వారీగా ఇంట్లో అందరినీ నిద్రలేపి, వారి కళ్లు మూసి ఆ పాత్ర దగ్గరకు తీసుకొచ్చి అప్పుడు కళ్లు తెరవమంటుంది. ఎందుకంటే ఉదయాన్నే లేవగానే మంగళకరమైన "విషుకని" ని చూస్తే అంతా శుభమే జరుగుతుందని వారి నమ్మకం.

Photo Courtesy: Aruna

వైశాఖీ

వైశాఖీ

సిక్కుల క్యాలెండర్ ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి వారి యొక్క సంవత్సరాది. ఇక్కడ కూడా ఈ వైశాఖీ ప్రతి సంవత్సరం ఏప్రిల్ రెండవ వారంలో వస్తుంది. తెలుగు వారి సంక్రాంతిలాగా ఇది వారికి పంటల పండుగ. ముఖ్యంగా రబీ పంట మార్పిడి చెందే సమయం. సిరులు పొంగే ఆ సమయంలో సిక్కుల మనసులు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఉత్సాహంలో స్త్రీ, పురుషులు అన్న భేదం లేకుండా అంతా కలసి భాంగ్రా, గిద్దా నృత్యాలు చేస్తారు. కొత్తగా పండిన గోధుమలను పట్టించి ఆ పిండితో రొట్టెలు చేసి బెల్లం, నెయ్యి కలిపి ఆరగిస్తారు. పెద్ద పెద్ద మంటలు వేసి వాటిచుట్టూ ఆడిపాడతారు. ఇది చూస్తే సంక్రాంతి పండుగలో మనకు కనిపించే భోగి మంటలుగా అగుపిస్తుంది.

Photo Courtesy: flickr

పొయ్‌లా బైశాఖ్

పొయ్‌లా బైశాఖ్

బెంగాలీయుల నూతన సంవత్సరం వైశాఖ మాసంతో మొదలవుతుంది. వారి కాలమానం ప్రకారం చైత్రం ఏడాదిలో చివరిమాసం. వైశాఖ శుద్ధ పాడ్యమినాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు. ఆరోజు ఉదయాన్నే స్త్రీ, పురుషులు సంప్రదాయ బెంగాలీ దుస్తులు ధరించి ప్రభాత భేరీ పేరిట నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుతారు. వ్యాపారులు ఆ రోజున పాత ఖాతాపుస్తకాలన్నింటినీ మూసేసి, సరికొత్త పుస్తకాలు తెరుస్తారు. తమ దుకాణానికి వచ్చిన వినియోగదారులకు మిఠాయిలు పంచుతారు. ఏవైనా బాకీలుంటే ముందురోజే తీర్చేస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆరోజంతా ఆనందంగా ఉండడానికే ప్రయత్నిస్తారు. కొత్తవ్యాపారాలు, కొత్తపనులు ప్రారంభిస్తారు.

Photo Courtesy: Satyaprakash Bommaraju

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X