India
Search
  • Follow NativePlanet
Share
» » విజ‌య‌వాడ టు కొండ‌ప‌ల్లి.. ప్ర‌యాణ‌పు ముచ్చ‌ట్లు! (రెండ‌వ భాగం)

విజ‌య‌వాడ టు కొండ‌ప‌ల్లి.. ప్ర‌యాణ‌పు ముచ్చ‌ట్లు! (రెండ‌వ భాగం)

ఫెర్రీ అందాల‌ను ఆస్వాదించిన త‌ర్వాత ఇబ్ర‌హీం ప‌ట్నం జంక్ష‌న్ జాతీయ‌ రహదారిని అనుకుని ఉన్న ఓ రోడ్డు గుండా ముందుకుసాగాం. ఆ రోడ్డు పక్కనే ' వే టూ కొండపల్లి ఫోర్ట్‌' అని ఓ బోర్డు కనిపించింది. ఆ మార్గం గుండా ముందుకు వెళ్ళాం. దారిపొడవునా టిప్పర్‌ లారీలు ఎగరువేసుకువెళుతున్న తెల్లని దూళి వేకువన కురిసే మంచు దుప్పటిని మించిపోయేలా కనిపించింది. అలా కొండపైకి వెళ్ళే కొద్దీ పచ్చదనం ఆహ్వానం పలికింది. వంపులు తిరుగుతూ చేసే ఆ రోడ్డు ప్రయాణం మర్చిపోలేని అనుభూతి. అంతటి ప్రశాంతమైన దారిలో ఫోటోలు తీసుకోవడం మర్చిపోకూడదు సుమా! అలా ఓ ఐదు కిలోమీటర్లు కొండపైనే సాగింది మా ప్రయాణం.

చివరిగా మా గమ్యస్థానం అదే! వందల సంవత్సరాల చరిత్ర ఉన్న కొండపల్లి ఖిల్లాను చేరుకున్నాం. సెలవు రోజు కాకపోయినా సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంది. ఎంట్రన్స్‌ టికెట్‌ ఐదు రూపాయలు. ఫోటోలు తీసుకునేందుకు కెమెరా ఉంటే ఇరవై రూపాయలు అద‌నం. జంటలకు ఐడీ ప్రూఫ్‌ తప్పనిసరి. ఇలా నిబంధనల అమలు విషయంలో సిబ్బందిని అభినందించాల్సిందే. అలా లోపలకు వెళ్ళాం.

రాచ‌రిక హుందాతనానికి నిద‌ర్శ‌నంగా....

రాచ‌రిక హుందాతనానికి నిద‌ర్శ‌నంగా....

ప‌ద‌మూడ‌వ శతాబ్ధంలో రెడ్డిరాజులు 13 ఎత్తయిన బురుజులతో ఈ కోటను నిర్మించారు. ఇప్పుడు ఖిల్లాకు సంబంధించిన చరిత్రను ప్రస్తావించడం మాకు ఇష్టం లేదు. నేడు ఖిల్లా స్థితిగతులు ఎలా ఉన్నాయన్నదానికే ప్రాధాన్యతను ఇవ్వదలిచాం. ఖిల్లాలోపల వేసే ప్రతి అడుగూ ఓ చారిత్రక అనుభవమే. నిశబ్ధ వాతావరణంలో అక్కడ లభించే ప్రశాంతత బాహ్యప్రపంచం నుంచి దృష్టిమళ్లేలా చేస్తుంది.

రాణీమహల్‌

రాణీమహల్‌

రాణీమహల్‌, జైల్‌, తోప్‌ఖానా వంటి ప్రదేశాలు వరుసగా దర్శనమిచ్చాయి. అలనాటి రాజుల హుందాతనానికి శిథిలమైన కోట గోడలు నిదర్శనంగా నిలుస్తాయి. మ‌రీ ముఖ్యంగా అక్క‌డి కారాగారాన్ని చూస్తే అప్ప‌టి రాచ‌రిక అన‌వాళ్లు క‌ళ్ల‌ముందు సాక్షాత్క‌రించాల్సిందే. రాతితో నిర్మిత‌మైన ఆ గ‌దుల లోప‌ల భ‌యాన‌క వాతావర‌ణం క‌నిపించింది. కోట మధ్య భాగంలో అత్తాకోడళ్ల కోనేరుగా పిలవబడుతున్న కోనేరులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. కోనేరు ఎండిపోవడం ఇప్పటివరకూ చూడలేదని నారాయణ అనే యాభై ఏళ్ళ స్థానికుడు చెప్పాడు. అంతేకాదు వాటి లోతు కూడా చెప్పలేరట. చాలామంది వాటిలో మునిగి చనిపోయారని అన్నాడు.

14 ఎకరాలు ఆదీనంలో ఉంది

14 ఎకరాలు ఆదీనంలో ఉంది

అలా అతని మాటలు వింటూ ఉండగా ఎవరో గట్టిగా అరచినట్లు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళాం. ఓ కుటుంబం తెచ్చుకున్న ఆహార పొట్లం కోతి అందుకోబోయింది. దానికి భయపడి ఆమె కేకలు వేసింది. అక్కడే ఉన్న సిబ్బంది కోతిని అక్కడి నుండి వెళ్ళగొట్టారు. అవి ఇంతవరకూ ఎవరిపైనా దాడి చేయలేదని, ఏదైనా ఆహారం తినేటప్పుడు కాస్త వాటికి వేస్తే చాలని, తిన్న తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాయని సిబ్బంది వివరణ ఇచ్చారు. అంతేకాదు కోట చరిత్రను, అక్కడి విశేషాలను సందర్శకులకు తెలియజేశాడు. అయితే వేల ఎకరాల్లో కోట విస్తరించి ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నా, సుమారు 14 ఎకరాలు మాత్రమే ఇప్పుడు ఆర్కియాలజీ వారి ఆదీనంలో ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల మోములో కనిపించే చిరునవ్వులు అక్కడి సిబ్బంది ముఖంలో మాత్రం కనిపించలేదు. అందుకు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

నవ్యాంధ్రప్రదేశ్‌లో అగ్రగామిగా.....

నవ్యాంధ్రప్రదేశ్‌లో అగ్రగామిగా.....

చారిత్రక నిర్మాణాన్ని నిత్యం కాపు కాస్తున్న ఇలాంటి వారికి అధికారులు అన్ని విధాలా సహాయపడాల్సిన అవసరం ఉంది. కుటుంబంతో సహా వచ్చే పర్యాటకులకు కనీస వసతులు, మంచినీళ్లు, క్యాంటిన్‌ సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ఈ శతాబ్ధాల చారిత్రక కట్టడాన్ని మంచి సందర్శనా కేంద్రంగా అభివృద్ధి చేస్తే నవ్యాంధ్రప్రదేశ్‌లో అగ్రగామిగా నిలుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. దీంతో స్థానికులకు ఉపాధి కూడా దొరుకుతుందని అక్కడివారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోటకు ఆనుకుని ఉన్న దర్గాకు కులమతాలకు అతీతంగా నిత్యం సందర్శకులు వస్తూ ఉంటారు. అలా చివరిగా మా జర్నీ కొండపల్లి ఖిల్లా సందర్శనతో ముగిసింది. మరెందుకు ఆలస్యం మీరూ బయలుదేరండి!!

Photos credit- Wikicommons

Read more about: vijayawada kondapalli fort
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X