Search
  • Follow NativePlanet
Share
» »ట్రెక్కింగ్ ప్రియుల మ‌న‌సుదోచే.. దాల‌ప‌ల్లి ప్ర‌యాణం!

ట్రెక్కింగ్ ప్రియుల మ‌న‌సుదోచే.. దాల‌ప‌ల్లి ప్ర‌యాణం!

ట్రెక్కింగ్ ప్రియుల మ‌న‌సుదోచే.. దాల‌ప‌ల్లి ప్ర‌యాణం!

కాంక్రీట్ జంగిల్‌ను వదిలి.. అలా పచ్చని ప్రకృతి సోయగాల నడుమ అడుగులు వేయాలనే ఆలోచన ఆచరణ రూపం దాల్చితే ఆ క్షణాలను మాటల్లో వర్ణించలేం. అక్కడి కొండలు, గుట్టలూ దాటుకుంటూ వేసే ప్రతి అడుగూ ఉత్కంఠత కలిగిస్తుంది. మారుమూల గిరిజన గ్రామంలో విడిది చేసి, అక్కడి వారి జీవన విధానాన్ని కనులారా ఆస్వాదించేందుకు సాగే పయనం జీవితంలో మర్చిపోలేని ఎన్నో అనుభూతులను చేరువ చేస్తుంది. పచ్చని లోయల పక్కన మేఘాలను ముద్దాడే శిఖరాగ్రాలను అధిరోహించటం ట్రెక్కింగ్ ప్రియులకు గొప్ప ఆనందానుభూతిని కలిగిస్తుంది. అలాంటి సాహసోపేతమైన ట్రెక్కింగ్ ముచ్చట మీ కోసం!

మేం ఎక్కడానికి ఎలాంటి శిక్షణా పొందలేదు. కొండ శిఖరంలో మా పాదాలను ఉంచుతామ‌ని అని కలలో కూడా ఊహించలేదు. నిజానికి, మా కోరికల జాబితాలో ట్రెక్కింగ్ అనే పదం లేదు. అకస్మాత్తుగా మా బృందానికి వచ్చిన ఓ మెరుపులాంటి ఆలోచనే మా ట్రెక్కింగ్ ప్రయాణం. మందుగా మా బృందం ఆసక్తి చూపించలేదు. అయితే, నిత్యం పుస్తకాల మధ్య సాగే మా అధ్యయనాలకు కాస్త విరామం ఇచ్చి, ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకునేందుకు మా మనసు పూర్తి అంగీకారం తెలిపింది. ట్రెక్కింగ్ ప్రిపరేషన్లో భాగంగా మా బృందం ముందుగా స్కిప్పింగ్ నేర్చుకున్నాం. మానసికంగా, శారీరకంగా సిద్ధమైన తర్వాత మా ట్రెక్కింగ్ స్పాట్ నిర్ణయించబడింది. విశాఖపట్నానికి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాలపల్లి అనే కుగ్రామానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యాం. అది పాడేరు ప్రాంతానికి చెందిన ఓ గిరిజన గ్రామం. సముద్రమట్టానికి 2,986 అడుగుల ఎత్తులో ఉంటుంది. అదోక పచ్చని ప్రపంచం!

ప్రకృతి అందాల సాదర స్వాగతం..

ప్రకృతి అందాల సాదర స్వాగతం..

మొత్తంగా ముప్పైమంది ఓ బస్సులో ఉదయం నాలుగు గంటలకే విశాఖ నుంచి బయలుదేరాం. అందరూ యువకులే కావడంతో జోకులు, సెటైర్లతో మా ప్రయాణం చాలా సరదాగా సాగింది. ఘాట్రోడ్డు చేరుకునేసరికి అసలైన ప్రకృతి అందాలు మాకు సాదర స్వాగతం పలికాయి. ముందుగా పాడేరు చేరుకున్నాక ఓ వ్యూ పాయింట్ దగ్గర ఆగాం. అక్కడి అందమైన లోయల దృశ్యాలు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇది మా మొదటి యాత్ర కావడంతో గొప్ప థ్రిల్లింతకు గురయ్యాం. పచ్చని అద్భుతమైన ప్రపంచంలో అడుగుపెట్టిన అనుభూతి కలిగింది. అక్కడి నుంచి మరో గంటన్నర ప్రయాణం తర్వాత దాలపల్లి గ్రామాన్ని చేరుకున్నాం. అది చాలా చిన్న గిరిజన గ్రామం. మొత్తంగా ఓ నలభై గుడిసెలు కూడా ఉండవు. అక్కడి గిరిజనుల వేషభాషలు మ‌మ్మ‌ల్ని ఎంతగానో ఆకర్షించాయి. తర్వాత గ్రామ శివారులో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడి నుంచి, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా గమ్యాన్ని చేరుకునేందుకు కాలినడక ప్రారంభించాం. ముందుగానే అక్కడి పరిసరాల గురించి మా గైడ్ క్లుప్తంగా వివరించారు.

కొండపైకి వెళ్లేందుకు మూడు నాలుగు గంటలు పడుతుందని చెప్పారు. నిజానికి మాలో ఎవరూ అంతకు ముందు ట్రెక్కింగ్‌కు వెళ్లలేదు. దాంతో సరికొత్త ఉత్సాహంతో మా బృందం అడుగులు ముందుకుపడ్డాయి. కొంత దూరం నడిచాక, మేం వేరే దిశలో వెళ్తున్నామా? అని అనుమానం వచ్చింది. కానీ, మా మొఖాల్లో కనబడుతున్న ఆందోళనను గమనించిన గైడ్ మనం సరైన దిశలోనే ఉన్నామని చెప్పి, ముందుకు నడిపించారు.

ఆ క్షణాలను మాటల్లో వర్ణించడం కష్టమే..

ఆ క్షణాలను మాటల్లో వర్ణించడం కష్టమే..

అలా సుమారు ఏడు కిలోమీటర్లు దూరం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాం. ఆ దారిలో ఎన్నో ఒంపులను అధిరోహించాం. అంతకంతకూ కొండలు ఏటవాలుగా మారుతున్నాయి. దారి సన్నగా, కాస్త కటువుగా అనిపిస్తోంది. ఒకరి అడుగుల్లో ఒకరు అడుగులు వేస్తూ ముందుకు సాగాం.. అప్పటికే మా శరీరంలో శక్తి తగ్గినట్లు అనిపించింది. గొంతు ఎండుతోంది. మనసులో ఏదో తెలియని వణుకు మొదలైంది. సరిగ్గా అప్పుడే మేం చేరుకోవాల్సిన వ్యూ పాయింట్ వచ్చింది. ఒక్కసారిగా అక్కడి ప్రకృతి రమణీయతకు చేరువ‌య్యామా అనిపించింది.

మాలో ఏదోతెలియని నూతన ఉత్సాహం ఉరకలు వేసింది. ఆ క్షణాలను మాటల్లో వర్ణించడం కష్టమే. ఆ ప్రకృతి అందాలను చూస్తూ... అక్కడే మేం తెచ్చుకున్న ఆహారాన్ని పంచుకు తిన్నాం. పచ్చని తివాచీ పరిచిన కొండ కోనల మధ్య అందరితో కలిసి, సరదాగా గడిపిన ఆ క్షణాలు జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతులనే చెప్పాలి. అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వెళితే వ్యూ పాయింట్ చాలా బాగుంటుందని మా గైడ్ చెప్పారు. అయితే, అప్పటికే మా బృందంలో చాలామంది నీరసించిపోయారు. అంత సాహసం చేసేందుకు ముందుకు రాలేదు.

ఆకాశాన అద్భుత దృశ్యాలు..

ఆకాశాన అద్భుత దృశ్యాలు..

ఈ అవకాశం ఎప్పుడోగానీ, మళ్లీ రాదని గైడ్ నచ్చజెప్పడంతో మా బృందం అక్కడికి వచ్చేందుకు అంగీకరించింది. అక్కడి నుంచి మరో రెండు కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేశాం. మా బృందంలోని కొందరు అప్పటికే బాగా నీరసించి పోవడంతో అక్కడే ఆగిపోయారు. చివరిగా ఏడుగురం మిగిలాం. మధ్య మధ్యలో సేదదీరుతూ ముందుకుసాగాం. అలా ఒక గంట పైకి వెళ్లిన తర్వాత, మేం అప్పటి వరకూ చూడని అద్భుత దృశ్యం మా కళ్లకు కనిపించింది. తెల్లని పొగమంచులాంటి మేఘాలు నేలను తాకుతున్న క్షణాలవి. చల్లని స్వచ్ఛమైన పిల్లగాలి మా శరీరాలను తాకిన వెంటనే మా అలసట పటాపంచలైంది.

కొండ కోనల ఒంపులో పసుపు పచ్చని గడ్డిపూల వనం అందాలు మా మనసు దోచాయి. ఎటుచూసినా ఆహ్లాదాన్ని పంచే అక్కడి వాతావరణం మమ్మల్ని కొన్ని క్షణాలపాటు మైమరపింపజేశాయి. మేం ఆ సాహసం చేయకపోయి ఉంటే, అలాంటి సుందర దృశ్యాన్ని మిస్సయ్యేవాళ్లం. ఆలస్యం చేయకుండా మా మొబైల్ ఫోన్లోని కెమెరాలకు పనిచెప్పాం. అదే ఉత్సాహంతో బేస్ క్యాంపు దగ్గరకు తిరుగు ప్రయాణం అయ్యాం. అప్పటివరకూ మేం చూసిన పచ్చని ప్రకృతి అందాలు ఒకెత్తయితే, ఆ రోజు రాత్రి మరొకెత్తు. టెంట్ల దగ్గర పడుకుని, నల్లని ఆకాశంలో మిలమిల మెరిస్తోన్న నక్షత్రాలు మా బృందాన్ని ఊహాలోకంలోకి తీసుకెళ్లాయి. ఆకాశాన అంతటి అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తాయని మేమెప్పుడూ ఊహించలేదు. మొత్తంగా మా దాలపల్లి ట్రెక్కింగ్ యాత్ర విజయవంతంగా పూర్తి చేసి, మరుసటిరోజు తిరుగు ప్రయాణం అయ్యాం. మ‌రెందుకు ఆల‌స్యం.. మ‌న‌ దగ్గరలో ఉండే ఇలాంటి ప్రకృతి అందాలను చూసేందుకు మీరూ ప్రయత్నించండి మరి!

Read more about: dalapalli paderu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X