Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాద్... వారంతపు విహారాలు !!

హైదరాబాద్... వారంతపు విహారాలు !!

హైదరాబాద్... ఈ పేరు వింటే చాలు ఘుమఘుమ లాడే బిర్యానీ రుచులు గుర్తుకువస్తాయి కదా!!. నేను దాని గురించి చెప్పనులేండి. హైదరాబాద్ మహానగరం 50 లక్షల పైచిలుకు జనాభాను కలిగి ఉంది. కొన్ని వేల సంఖ్యలో కార్లు, బైకులు నిత్యం రోడ్డుల మీద పరుగెడుతున్నాయి, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. నేటి యాంత్రిక జీవనంలో పర్యావరణం ఒక పెద్ద సమస్యగా దాపరించింది.,అందునా హైదరాబాద్ మరీను!!

హైదరాబాద్ అందాలకు ఏ మాత్రం అవాంతరాలు కలగకుండా ఇక్కడ కొన్ని పార్కులు, గార్డెన్ లు వారంతపు విహారాలుగా ఉన్నాయి. శని,ఆది వారాలలో ఇక్కడికి వెళ్ళి మైండ్ ఫ్రెష్ చేసుకొని రావచ్చు. కుటుంబ సమేతంగా వెళ్ళవలసినవి, స్నేహితులతో వెళ్ళవలసినవి, ప్రేమికులు వెళ్ళవలసినవి ఇక్కడ కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి? ఎక్కడెక్కడ ఉన్నాయి?ఎప్పుడు వెళ్ళాలి? అంటే.....

సూపర్ సేవర్ హోటల్ డీల్స్ 40% ఆఫర్ : ట్రావెల్ గురు

ఎన్ టి ఆర్ గార్డెన్

ఎన్ టి ఆర్ గార్డెన్

దివంగత ముఖ్యమంత్రి ఎన్. టి. రామారావు జ్ఞాపకార్థం హైదరాబాద్ మహానగరంలో 1999 వ సంవత్సరంలో ఎన్. చంద్రబాబు నాయుడు గారిచే ప్రారంభించబడినది. ఈ గార్డెన్ మొత్తం 55 ఎకరాలలో విస్తరించినది. భౌగోళిక ప్రాంతం మరియు అద్భుతమైన సందర్శనా దృశ్యాలు కల ఎన్ టి అర్ గార్డెన్స్ చిన్నదే అయినా స్థానికులలో అత్యంత ప్రాచుర్యం పొందింది. హుస్సేన్ సాగర్ చెరువు పక్కనే ఉన్న ఈ ఎన్ టి అర్ గార్డెన్స్ ని తరచూ పర్యాటకులచే సందర్శించబడే గార్డెన్ గా చెప్పుకొనవచ్చు. కుటుంబ సమేతంగా పర్యాటకులు సాయం సమయాలని వినోదంగా గడపడానికి ఇక్కడి వస్తుంటారు.
టిక్కెట్
పెద్దవారికి 15 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు మరియు కెమరా తో వచ్చినట్లయితే 30 రూపాయలు వసూలు చేస్తారు.
సందర్శించు సమయం
వారంలోని అన్ని రోజులలో పర్యటించవచ్చు. మధ్యానం 2:30 నుంచి రాత్రి 09:00 గంటల వరకు సందర్శించవచ్చు.
చూడటానికి పట్టే సమయం
2 గంటల నుంచి ౩ గంటల సమయం పడుతుంది.
రవాణా సదుపాయం
దీనికి దగ్గరలో ఉన్న బస్ స్టాప్ సెక్రటేరియట్, ఒకవేళ ఎం. ఎం. టి. ఎస్. లో వచ్చినట్లయితే నెక్లెస్ రోడ్ లో దిగాలి.

Photo Courtesy: Rameshng

ఇందిరా పార్క్

ఇందిరా పార్క్

ఇందిరా పార్క్ చుట్టూ పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. ఇది హైదరాబాద్ కి గుండెకాయ వంటిది. దీనిని 1975 - 78 మధ్యకాలంలో ప్రారంభించినారు. హైదరాబాద్ లో కెల్లా పురాతన పార్కులలో ఇదికూడా ఒకటి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్నది. దీనిని పునర్నిర్మించేటప్పుడు చెట్టు,పుట్టలను కదల్చకుండా నిర్మాణం చేశారు. ఇక్కడ గల ప్రధాన ఆకర్షణలు మ్యూజికల్ డ్యాన్సింగ్ ఫౌంటన్, వాటర్‌ఫాల్స్ మరియు నర్సరీలు. ఇక్కడ ఒక చిన్న కొలను మాదిరి కుంటలు ఉన్నాయి. అంతేకాదు వివిధ రకాల రోజా పూలు ఉన్నాయి. ఇందిరా పార్కులో బోటింగ్ భలే అందాన్ని ఇస్తుంది.
సందర్శించు సమయం
ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటలవరకు. వారం లోని అన్ని రోజులలో తెరిచే ఉంటుంది.
టికెట్
ప్రవేశ రుసుము: 5 రూపాయలు
రవాణా సదుపాయం
ఇందిరా పార్క్ క్రాస్ రోడ్ బస్ స్టాప్ దగ్గరలో ఉన్న బస్ స్టాప్.

Photo Courtesy: J.M.Garg

కోట్ల విజయ భాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్

కోట్ల విజయ భాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్

కోట్ల విజయభాస్కర రెడ్డి బొటానికల్ గార్డెన్ గా పేరుగన్న హైదరాబాద్ బొటనికల్ గార్డెన్స్ హైదరాబాద్ లో ని మరి యొక ప్రత్యేక ఆకర్షణ. ఇది సుమారు 120 ఎకరాలలో విస్తరించింది. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలో మీటర్ల దూరంలో హైటెక్ సిటీ కి దగ్గరలో ఈ గార్డెన్ ఉంది. హైదరాబాద్-ముంబై ముఖ్య రహదారిపై ఈ గార్డెన్ ఉంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి మరియు పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో గాడ్జెట్ లతో ఈ గార్డెన్ ని తీర్చిదిద్దారు. వృక్షజాలం మరియు జంతుజాలాన్ని పరిరక్షించడంతో పాటు ప్రకృతిని కాపాడాలనే సద్భావాన్నిఈ గార్డెన్ బోధిస్తుంది. ప్రస్తుతం, ఈ గార్డెన్ లో ని అయిదు విభాగాలని సందర్శకులకు అందుబాటు లో ఉంచారు.
పెరటి ఔషద మొక్కలు, ఆర్నమెంటల్ ప్లాంట్స్, అక్వాటిక్ ప్లాంట్స్, కలప మొక్కలు, వెదురు మొక్కలు, పళ్ళ చెట్లు ఇంకా ఎన్నో ఈ విభాగాలలోకి వస్తాయి. పర్యావరణవేత్త కాకపోయినా అందంగా నిర్మించబడిన ఈ గార్డెన్ ని చూడడానికి పర్యటించవచ్చు. ఇక్కడ అందమైన పచ్చిక బయళ్ళు నీటి చెలమలు చిన్న చిన్న కొండలు పర్యాటకులు చూసి సంతోషించవచ్చు.
ప్రవేశ రుసుం
15 రూపాయలు ప్రవేశ రుసుముగా ఉన్నది.
సందర్శించు సమయం
సోమ-ఆది ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చు.

Photo Courtesy: Abhinaba Basu

లుంబిని పార్క్

లుంబిని పార్క్

అద్భుతమైన హుస్సేన్ సాగర్ చెరువు కి పక్కన ఉన్నది లుంబిని పార్క్ , 7.5 ఎకరాలలో విస్తరించింది. 1994 లో నిర్మితమైన ఈ పార్క్ ఆ తరువాత ఎన్నో మార్పు చేర్పులకు గురవుతూ ఎప్పటికప్పుడు అన్ని వయసుల సందర్శకులకి ఆకర్షణీయంగా మారుతున్నది. లేజర్ ఆడిటోరియం, బోటింగ్ ఫెసిలిటీ, చక్కగా నిర్వహించబడే గార్డెన్స్ మరియు మ్యూజికల్ ఫౌంటైన్స్ తో ఈ గార్డెన్ అలరారుతున్నది. అందువల్ల కుటుంబసమేత విహార యాత్రలకి ఇది నెలవైంది. 2000 మంది కూర్చోగలిగే ఈ లేజర్ ఆడిటోరియం దేశం లోనే ప్రధమమైనది.
ఈ ఆడిటోరియం హైదరాబాద్ నగరం యొక్క ప్రాముఖ్యతని గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచేందుకు నిర్మితమైంది. హైదరాబాద్ నగరం యొక్క చారిత్రిక విశేషాలను తెలిపే ప్రదర్శనలు ఆంగ్ల మరియు హిందీ భాషలలో ఈ ఆడిటోరియం లో ప్రతి రోజు ప్రదర్శితమవుతాయి.
ప్రవేశ రుసుం
10 రూపాయలు వసూలు చేస్తారు. స్పీడ్ బోటింగ్ అయితే 50 రూపాయలు, మామూలు బోటింగ్ అయితే 40 రూపాయలు, లేజర్ షోకి అయితే 50 రూపాయలు వసూలు చేస్తారు.
సందర్శించు సమయం
వారంలోని సోమవారం తప్ప అన్ని రోజులలో పర్యటించవచ్చు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు.
చూడటానికి పట్టే సమయం
3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది.

Photo Courtesy: Rudolph.A.furtado

ఓషియన్ పార్క్

ఓషియన్ పార్క్

హైదరాబాద్ లోని ఓషన్ పార్క్ దేశం లోనే రెండో అతిపెద్ద అమ్యూస్మెన్ట్ పార్క్. ఒస్మాన్ సాగర్ చెరువుకి దగ్గరలో నగరానికి 20 కిలోమీటర్ల దూరం లో నగర శివార్లలో ఉన్నది. చక్కగా నిర్వహించబడే ఈ పార్క్ నిర్మలమైన నీటితొ కన్నుల పండువగా కనిపించే పచ్చటి లాన్ ల తో ఉంటుంది.
ఈ అమ్యూస్మెన్ట్ పార్క్ యొక్క ఉన్నత ప్రమాణాలు స్థానికులు , పర్యాటకులు అనే తేడ లేకుండా అందరికీ ఎంతగానో ఈ పార్క్ నచ్చే విధంగా ఉంటాయి. పెద్ద చిన్న తేడా లేకుండా అందరిని వినోదాలలో ఓలలాడించే విధం గా ఈ పార్క్ ని తీర్చి దిద్దారు. చిన్న పిల్లలకు సురక్షితంగా ఈ పార్క్ ను రూపొందించారు. డ్రై రైడ్ ల తో పాటు వాటర్ రైడ్ లు ఉంటాయి.
ప్రతిఒక్కరు తమ ఇష్టానికి వినోదించే అవకాసం ఉంటుంది.పర్యాటకులు ఓషన్ పూల్ లో సమయం గడపటం లేదా టీ కప్స్,ఎయిర్ డ్రాప్స్, షిప్స్ ఇంకా ట్రైన్స్ వంటి రైడ్స్ లో పాల్గొని వినోదాన్ని పొందవచ్చు.ఇక్కడి వినోద భరిత రైడ్స్ అన్ని సురక్షితమైనవి.
ఎంట్రీ రుసుం
పెద్దలకు 400 రూపాయలు, పిల్లలకి 250 రూపాయలు
సందర్శించు సమయం
పార్క్ టైమ్: ఉదయం 11 నుంచి రాత్రి 7:30 వరకు
నీటి క్రీడలు: ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

Photo Courtesy: oceanpark

పబ్లిక్ గార్డెన్స్

పబ్లిక్ గార్డెన్స్

బాగ్ - ఎ- ఆమ్ అంటే ప్రజల యొక్క పార్క్ అని పూర్వం పిలవబడిన పబ్లిక్ గార్డెన్స్ హైదరాబాద్ లో ఉన్న మరోక సుందరమైన ప్రదేశం. 1920 లో నిజాముల చేత ఈ పార్క్ సాధారణ ప్రజల కోసం నిర్మితమైంది. ఇప్పటికి, వందల మంది ప్రజలు ఈ పార్క్ కి విచ్చేస్తారు. హైదరాబాద్ లో ఎన్నో అందమైన ఉద్యానవనాలు ఉన్నప్పటికీ పర్యాటకుల మరియు స్థానికుల మనసు గెలుచుకున్నది పబ్లిక్ గార్డెన్స్. ఈ పబ్లిక్ గార్డెన్స్ ప్రాంగణంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ పురావస్తు శాఖ మ్యూజియం కళా ప్రేమికులకి ముఖ్యమైనది. స్టేట్ అర్కలాజికల్ మ్యూజియం, జుబ్లీ హాల్, స్టేట్ లెజిస్లేచర్, తెలుగు లలిత కళా తోరణం మరియు జవహర్ బాల్ భవన్ వంటివి ఈ గార్డెన్స్ లో ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్కలాజికల్ మ్యూజియం కి పక్కగా కంటెంపరరి ఆర్ట్ మ్యూజియం ఉంది.
మ్యూజియం ల ని చూడడం ఇష్టం లేని వారు కూడా పబ్లిక్ గార్డెన్స్ ని సందర్శించవచ్చు. పచ్చటి ప్రకృతి ఒడిలో పచ్చని లాన్ ల లో సేద దీరాలనుకునే వారికి అనువైన ప్రదేశం.
ప్రవేశ రుసుం
20 రూ/- పెద్దలకు, పిల్లలకు 10 రూ/-
సందర్శించు సమయం
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యానం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు( శుక్రవారం తప్ప)

Photo Courtesy: Adityamadhav83

స్నో వరల్డ్

స్నో వరల్డ్

స్నో వరల్డ్ అనే అమ్యుస్మెంట్ పార్క్ ఈ తరహా పార్క్ ల లో దేశం లోనే మొట్టమొదటిది. 2004 లో పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఒక్క రోజు లో 2400 మంది పర్యాటకులు వినోదించవచ్చు.కృత్రిమం గా తయారు చేసిన మంచు ఈ పార్క్ లో కురిపిస్తారు.టన్ను ల కొద్ది మంచు ని పొరలు పొరలుగా నేల ఫై పరిచబడి ఉంటుంది. పర్యాటకులు ఈ మంచు ముద్దలతో ఆడుకోవచ్చు, మంచు మనిషిని నిర్మించవచ్చు. చిన్నపిల్లలు ఈ మంచు నోట్లో పెట్టుకున్నా, మంచి నీటితో చెయ్యటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పార్క్ లోపలి వెళ్ళే ముందు పర్యాటకులు ఉన్ని వస్త్రాలు ధరించాలి. పార్క్ లోకి వెళ్ళగానే శరీరాన్ని వెచ్చగా ఉంచటానికి ఓక కప్ వేడి సూప్ ని ఇస్తారు.పార్క్ లోపల స్నో ట్యూబ్ స్లయిడ్ ,ఐస్-బుమ్పింగ్ కార్స్, ఐస్ స్కేటింగ్ రింక్, స్నో వార్ జోన్ అండ్ స్లెఇఘ్ స్లైడ్స్ వంటి వినోద వసతులు ఉన్నాయి.
ప్రవేశ రుసుం
400 రూ/- పెద్దలకు, పిల్లలకు 250 రూ/-
స్కూల్ పిల్లలకు 225 రూ/-, కాలేజ్ స్టూడెంట్లకి 275 రూ/-
సందర్శించు సమయం
ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. వారంలోని అన్ని రోజులు సందర్శించవచ్చు.

Photo Courtesy: Bssasidhar

కెబిఅర్ నేషనల్ పార్క్

కెబిఅర్ నేషనల్ పార్క్

కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ లేదా కెబిఅర్ నేషనల్ పార్క్ జూబిలీ హిల్స్ ప్రాంతం లో ఉంది. ఈ పార్క్ ప్రాంగణంలో ప్రిన్సు ముకర్రమ్ జా కి సంబంధించిన చిరన్ పాలస్ ఉంది. కాంక్రీటు అడవుల మధ్యలో ఉన్న సహజ సిద్దమైన అడవిగా ఈ కెబిఅర్ నేషనల్ పార్క్ ని పేర్కొనవచ్చు. పాలస్ మరియు పరిసర ప్రాంతాలని 1998 లో నేషనల్ పార్క్ గా గుర్తించారు.ఈ ప్రాంతం పేరు మార్చబడినా ఈ పాలస్ పేరు మాత్రం అలాగే ఉంది. తెల్లవారు జామున అలాగే సాయంత్రం వేళల్లో ఈ పార్క్ చాలా హడావిడిగా కనిపిస్తుంది. చాలా మంది వ్యాయామాల కోసం మరియు తాజా గాలి పీల్చడం కోసం ఇక్కడికి ఈ సమయాల లోనే ఎక్కువగా విచ్చేస్తుంటారు. ఆరోగ్యకరంగా ఉండడానికి జాగింగ్, వాకింగ్ వంటివి చేస్తూ ఏంతో మంది ఇక్కడ కనిపిస్తూ ఉంటారు.
ఎన్నో రకాల పక్షులకి, సీతాకోకచిలుకలకి ఈ పార్క్ స్థావరం.నెమళ్ళు, అడవి పిల్లులు, పాంగొలిన్స్ మరియు ఇండియన్ సివెట్ ల వంటి జంతువులని ఇక్కడ గమనించవచ్చు. ఈ పార్క్ లో జంతువుల మరియు పక్షుల దాహాన్ని తీర్చేందుకు ఎన్నో చిన్న చిన్న కొలనులని ఏర్పాటు చేసారు. పర్యాకులు, పక్షులకి, జంతువులకి ఆహారం అందించడం నిషేధం.

Photo Courtesy: Cephas 405

దుర్గం చెరువు

దుర్గం చెరువు

హైదరాబాద్ లో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న దుర్గం చెరువు మంచి నీటి సరస్సు. జూబ్లీ హిల్స్ మరియు మాదాపూర్ ప్రాంతానికి మధ్యలో దాగి ఉండడం వల్ల ఈ సరస్సు ని రహస్యపు సరస్సుగా కూడా పిలుస్తారు. హైదరాబాద్ ప్రజలలోఈ సరస్సుకి అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. ఖుతుబ్ షా సామ్రాజ్యంలో, గోల్కొండ కోటలో ఇంకా కోట సమీపంలో ఉన్న ప్రజలకి మంచి నీటి సదుపాయం ఈ సరస్సు కల్పించింది.రైతులు వ్యవసాయంలో నీటి పారుదల కోసం ఈ సరస్సుని ఉపయోగించేవారు. ప్రధాన పర్యాటక ఆకర్షణ గా ఈ సరస్సుని తయారు చెయ్యడం కోసం 2001 లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సరస్సుని అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించింది. కొద్ది కాలం లో నే ఈ సరస్సు ఏంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ చేపలు పట్టేందుకు అనువుగా ఉంటుంది. ఎంతో మంది సరదాగా చేపలు పట్టడం కోసం ఇక్కడికి వస్తారు.
ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణగా మలిచేందుకు వెలుగులు, రాక్ గార్డెన్, ఫ్లోటింగ్ ఫౌంటెన్ అలాగే కృతిమ జలపాతాల వంటి ఎన్నో ఆకర్షణలని ఇక్కడ జోడించారు. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ ఇంకా రాపెల్లింగ్ వంటి వివిధ వినోద కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.

Photo Courtesy: Nitin Jadon

మృగవాణి నేషనల్ పార్క్

మృగవాణి నేషనల్ పార్క్

హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్కూర్ లో మృగవాణి పార్క్ ఉంది. వివిధ రకాలైన జంతుజాలం మరియు వ్రుక్షజాలం కలిగి ఉండడం ఈ పార్క్ విశిష్టత. వేల మంది పర్యాటకులు ఈ పార్క్ ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం తరలి వస్తారు. దాదాపు 600 రకాల మొక్కలు ఈ పార్క్ లో కనబడతాయి.వెదురు, పలాస్, గంధం, టేకు, పైకస్ మరియు రేలా వంటి చెట్లని ఈ పార్క్ లో గమనించవచ్చు. ఇండియన్ హేర్, చీతా నుండి సివెట్ మరియు ఫారెస్ట్ కాట్ వరకు అలాగే వైల్డ్ బొర్ నుండి సాంబార్ వరకు ఇక్కడ గమనించవచ్చు. ఇండియన్ రాట్ స్నేక్ ఈ పార్క్ ప్రాంగణంలో గమనించవచ్చు. రస్సెల్ వైపర్, కోబ్రా మరియు పైతాన్ లు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
ఫ్లవర్ పెక్కర్ పక్షి ఇక్కడ సాధారణంగా కనబడుతుంది. ఈ పార్క్ ని రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా సందర్శించవచ్చు. అంతే కాదు సాహసవంతులైన పర్యాటకులు ఈ పార్క్ లో ఉండే కాటేజ్ లని అద్దెకి తీసుకుని రాత్రి పూట వైల్డ్ లైఫ్ ని ఆనందించవచ్చు.

Photo Courtesy: J.M.Garg

నెహ్రూ జూలాజికల్ పార్క్

నెహ్రూ జూలాజికల్ పార్క్

మీర్ ఆలం ట్యాంక్ కి సమీపంలో ఉన్న ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రఖ్యాతి పొందిన పర్యాటక ఆకర్షణ కేంద్రం. నిజానికి, హైదరాబాద్ లో ఉన్న మూడు ప్రధాన ఆకర్షణ లలో ఒకటిగా ఈ పార్క్ స్థానం సంపాదించుకుంది. 1959 లో ఏర్పాటయిన ఈ పార్క్ ప్రజలకి 1963 లో అందుబాటులోకి వచ్చింది. వివిధ రకాల జంతువులు, సరీసృపాలు మరియు పక్షులు ఈ జూ లో ఉన్నాయి. టైగర్, పాంథర్, ఏషియాటిక్ లయన్, పైథాన్, కొండచిలువ, ఒరాంగుటాన్, మొసలి, పక్షులు మరియు ఏంటేలోప్స్, జింకలు, ఇండియన్ రైనో వంటి సహజమైన జంతువుల జాతులని ఈ జూ లో గమనించవచ్చు. జంతువులు మరియు పక్షులకి సహజసిద్దమైన నివాసాలని ఏర్పాటు చెయ్యడంలోజాగ్రత్త వహించారు.
ఈ జూ సందర్శన వల్ల ఆహ్లాదంతో పాటు విజ్ఞానం కలుగుతుంది. పర్యాటకులు తమ పిల్లలతో ఈ జూ ని ఎక్కువగా సందర్శిస్తారు. ఏనుగు స్వారిలు, సఫారీలు ఈ జూ లో అందుబాటులో ఉంటాయి. ఈ జూ ప్రాంగణంలో నేచురల్ హిస్టరీ మ్యూజియం కూడా ఉంది.
ప్రవేశ రుసుం
20 రూ/- పెద్దలకు, పిల్లలకు 10 రూ/-
ట్రేన్ రైడ్ అయితే పెద్దలకు 15 రూ/-, పిల్లలకి 5 రూ/-
సందర్శించు సమయం
ఏప్రిల్-జూన్
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు.
జులై-మార్చి
ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
సెలవు
ప్రతి సోమవారం సెలవు.

Photo Courtesy: tigerpuppala_2

మహావీర్ హరిన వనస్థలి నేషనల్ పార్క్

మహావీర్ హరిన వనస్థలి నేషనల్ పార్క్

హైదరాబాద్ నగరంలో ఉన్న వనస్థలిపురంలో ఈ మహావీర్ హరిన వనస్థలి నేషనల్ పార్క్ ఉంది. హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళే దారిలో ఈ నేషనల్ పార్క్ ఉంది. ఈ జింకల పార్క్ లో అనేక రకాలైన జింకలని గమనించవచ్చు. పురాతన కాలంలో నిజాములు వేటాడే ప్రాంతంగా ఈ పార్క్ ని ఉపయోగించుకునే వారు.భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ పార్క్ ని నేషనల్ పార్క్ గా మార్చారు. వేటాడే ఈ ప్రాంతాన్ని వృక్ష మరియు జంతు జాల సంరక్షణకై పార్క్ గా మార్చారు. జింకలతో పాటు ఇక్కడ బ్లాక్ బక్స్ మరియు ముళ్ళపండులని కూడా ఇక్కడ గమనించవచ్చు. తెల్లకొంగలు, కింగ్ఫిషర్లు, నీటి కాకులు, చిన్న తోక గద్దలు, భారత సరస్సు నారాయణ పక్షులు ఇక్కడ కనబడే నిటి పక్షులు.
ఈ పార్క్ కి చాలా సులభంగా చేరుకోవచ్చు. బస్సు ద్వారా లేదా అద్దెకి తీసుకున్న ప్రైవేటు టాక్సీ ల ద్వారా హైదరాబాద్ నుండి ఈ నేషనల్ పార్క్ కి సులభంగా చేరుకోవచ్చు. షటిల్ సర్విసుల ద్వారా ఈ పార్క్ లోపల గైడెడ్ టూర్ అందుబాటులో ఉంది. పార్కు లో కనబడే జంతువుల సంగ్రహావలోకనం కోసం ఒక పెద్ద స్థంబం పర్యాటకుల కోసం నిర్మించబడింది.
ప్రవేశ రుసుం
5 రూ/-
సందర్శించు సమయం
సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.
సెలవు
ప్రతి సోమవారం సెలవు.

Photo Courtesy: J.M.Garg

నెక్లెస్ రోడ్

నెక్లెస్ రోడ్

నెక్లెస్ రోడ్ అనేది ఒక ప్రాంతం. ఈ ప్రాంతం హుస్సేన్ సాగర్ అవలివైపు ఉన్నది. ఇది సంజీవయ్య పార్క్ మరియు ఎన్ టి ఆర్ పార్క్ ల మధ్యలో ఉన్నది. ఇక్కడికి ప్రేమికులు క్రమం తప్పకుండా వస్తుంటారు.

Photo Courtesy: Cephas 405

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

విమానాశ్రయం
హైదరాబాదులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుండి భారతదేశంలోని అన్నిప్రధాన నగరాలకు మరియు కొన్ని అంతర్జాతీయ గమ్యములకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.

రైలు రవాణా

హైదరాబాదుకు జంటనగరమైన సికింద్రాబాదులో దక్షిణమధ్య రైల్వే ముఖ్యకార్యాలయం ఉంది.ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది. హైదరాబాదులో మొత్తం మూడు ముఖ్య రైల్వేస్టేషన్లు ఉన్నాయి 1)సికింద్రాబాదు రైల్వేస్టేషను 2)నాంపల్లి రైల్వేస్టేషను (హైదరాబాదు దక్కన్) 3)కాచిగూడ రైల్వేస్టేషను.హైదరాబాదులో మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ(MMTS) ఉంది.

రోడ్డు రవాణా

హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉన్నది. వాటిలో బెంగళూరు, ముంబాయి, పూణె, నాగ్‌పూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు మరియు కర్నూలు చెపుకోతగ్గవి.జాతీయ రోడ్లయిన ఎన్‌హెచ్-7, ఎన్‌హెచ్-9 మరియు ఎన్‌హెచ్-202 నగరంలో నుండే వెళ్తుంటాయి.

Photo Courtesy: ShashiBellamkonda

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X