ఆహ్లాదానికి కాస్త సమయం కేటాయించుకోవడం.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరమేకదా! అందుకు కాసేపు ప్రకృతితో మమేకమైతే మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగానూ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఒత్తిడికి దూరమై.. హాయిగా కాసేపు సేద తీరడానికి సిర్నాపల్లికి వెళ్లండి.. ఎటుచూసినా చుట్టూ దట్టమైన అడవులు... అప్పుడప్పుడు చెవులను తాకే రైలు కూతలు.. నలభై అడుగుల ఎత్తు అలుగు నుంచి పడుతున్న జల సవ్వడులు.. ప్రకృతి రమణీయతను చాటే ఈ దృశ్యాలు చూసిన వారెవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ఈ అనుభూతి పొందాలంటే నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లికి వెళ్లాల్సిందే.

జలపాతాన్ని చూశారా?
ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో పులకరించాలనుకునే వారికి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి స్వాగతం పలుకుతోంది. సిర్నాపల్లిలోని జానకీబాయి చెరువు నుంచి పారుతున్న అలుగు జలపాతాన్ని తలపిస్తోంది. నలభై అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న జలపరవళ్లు.. చుట్టూ పచ్చదనం.. పక్షుల కిలకిలరావాలు.. పైరగాలులతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదాన్ని పంచుతోంది. తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన సిర్నాపల్లి సంస్థానంలో స్వర్ణ యుగంగా భావించిన రాణి జానకీబాయి పాలనలో నిర్మించిన చెరువులు, కోటలు ఇప్పటికీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అందులో మూడేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన జానకీబాయి చెరువు అలుగు నుంచి పడుతున్న జలపరవళ్లలో తడిసి ముద్దయేందుకు సందర్శకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. పచ్చని వాతావరణంలో కుటుంబ సమేతంగా గడిపేందుకు ఈ ప్రాంతం సరైన ఎంపిక.

చెరువు నిండితే జలపాతపు
జిల్లా కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి గ్రామానికి.. మూడు కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవిలో నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాల్లోని ఆరు చెరువులను నింపడానికి సుమారు రెండు వందల ఏళ్లకు పూర్వం రాణి జానకీబాయి చెరువు తవ్వించారు. ఈ చెరువు అలుగు 100 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తులో రాతితో నిర్మించారు. చెరువు నీటితో పూర్తిగా నిండి అలుగు పారుతుంటే.. ఆ నీరంతా నలభై అడుగుల ఎత్తునుంచి జలపాతంలా పారుతూ.. ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. ప్రకృతిలో పులకరింతలు వేస్తోంది. అందుకే ఆ ప్రాంతాన్ని పర్యాటకానికి అనుగుణంగా.. అన్ని వసతులు కల్పించారు. కట్ట నుంచి దిగడానికి మెట్లు.. అలుగుపైకి వెళ్లకుండా రక్షణ ఏర్పాటు చేశారు. గట్టుపై విహరించేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. గత కొన్నిరోజులుగా విస్తారంగా వానలు కురవడం వల్ల చెరువులు అలుగు పారుతూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

మరెందుకు ఆలస్యం
లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు. క్షణం తీరిక లేని జీవితాలు. కాస్త సేదతీరాలనుకుంటే చుట్టూ కాంక్రీటు ప్రపంచమే. ఈ బిజీ లైఫ్లో.... ప్రకృతి ఒడిలో.. చల్లని గాలులు చెంపను తాకుతుంటే.. పక్షుల కిలకిలరావాలు చెవుల్లో తేనె పోసినట్టుగా హాయిని పంచుతుంటే.. కాసేపు కుటుంబంతోనో.. స్నేహితులతోనో గడపాలని అనుకోనివారుండరు. చదువులు, ఉద్యోగాలతో తీరికలేని జీవితాలు గడుపుతున్న నేటి తరానికి వీకెండ్ వస్తే అదో హాయి. అందుకే శుక్రవారం రాగానే బ్యాగ్ సర్దేస్తున్నారు. ఓ గుట్టుకో.. చెట్టుకో.. పుట్టల చుట్టూ తిరగడానికి బయల్దేరుతున్నారు. అలా బయలుదేరాలనుకునేవారు సిర్నాపల్లికి వెళ్లడం మర్చిపోవద్దు.



Click it and Unblock the Notifications











