ఎటుచూసినా లోయలు. చుట్టూ ఎత్తైన హిమశిఖరాలు. ప్రశాంతమైన ప్రకృతి, పచ్చని మైదానాలు. దట్టమైన అడవులు, అందమైన జలపాతాలు, హిమనీ నదీ ప్రవాహాలు. మరోవైపు పక్షుల కిలకిలారావాలు, ఎటుచూసినా రంగు రంగుల పూలు, సుమసౌరభాలు. ఇదంతా ప్రకృతి వర్ణన అనుకుంటే పొరపాటే. ఇది వాస్తవం. మన కంటిముందు ప్రత్యక్షంగా నిలిచిన సుమనోహర ప్రదేశం. అదెక్కడో విదేశాలలో లేదు. మన దేశంలోనే ఉంది. అదే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌గా పేరొందిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ ఘర్‌వాల్ ప్రాంతం. నందాదేవి నేషనల్ పార్కుకి దగ్గరలో ఢిల్లీకి 595 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. అక్కడి ప్రకృతి అందాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రాంతం... చమోలీ లోయ!
ఉత్తరాఖండ్‌లో చుట్టూ పర్వతాలు ఉన్న ఈ ప్రదేశం రహస్యంగానే ఉండేది. 1931లో ఫ్రాంక్ ఎస్ స్మిత్ అనే పర్వతారోహకుడు ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడు. ప్రపంచానికి ఈ అందమైన ప్రదేశాన్ని పరిచయం చేశాడు. చమోలీ ఘర్‌వాల్ లోయ ప్రాంతంలోని రంగు రంగుల పుష్పాల సౌందర్యానికి ముగ్ధుడై ఈ లోయ గురించి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే పుస్తకాన్ని రచించాడు. దీనివలన మరింతమందికి ఈ లోయ గురిం చి తెలిసింది. అన్నివైపులా పర్వతాలతో మూసి ఉన్న ఈ లోయ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. 8,950ఎకరాలు గల ఈ ప్రాంతాన్ని నేషనల్ పార్కు గా 1982లో ప్రకటించారు. యునెస్కోచే 2005లో ప్రపంచ పర్యాటక ప్రదేశంగా ఈ లోయ గుర్తింపు పొందింది. ఏటా సందర్శకుల తాకిడి పెరుగుతూ వస్తోంది. దేశవిదేశీ పర్యాటకులు సేదదీరేందుకు అనువైన ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. ఇక్కడికి చేరాలంటే గోవింద ఘాట్ నుండి చేరాలి. పున్నా ప్రాంతం నుండి ప్రారంభమై ఎన్నో అడవి పుష్పాలు, సెలయేర్లు, జలపాతాలు కనిపిస్తాయి. ఇక్కడ బసకు వీలులేదు. బేస్‌క్యాంప్‌గా గంగారియ లోయనే ఎంచుకుంటారు. ఈ లోయకు నడిచి వెళ్ళాలి.

అడవి పుష్పాల
ఈ లోయ చలికాలంలో అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవి తరువాత మంచు కరిగిన తరువాత ఈ ప్రాంతం అంతా పుష్పాలతో నిండి మనోహరంగా కనువిందు చేస్తుంది. ఎక్కడాలేని ఎన్నడూ చూడని వింత వింత వివిధ రకాల అడవి పుష్పాలు ఇక్కడ గుబాళిస్తాయి. ఊదా, నీలం, తెలుపు, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబి ఇలా ఎన్నో రంగుల కుసుమాలు విరబూస్తాయి. అలా రంగు రంగుల పూల తివాచీ ఎకరాల మేర పరుచుకునే ఉంటే, చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అంతేకాదు, ఒకే పుష్పానికి రెండేసి రంగులు మిళితమై ఎవరూ ఊహించలేనంత అందంగా కనిపిస్తాయి. దాదాపు 500 రకాల అడవిజాతి పుష్పాలు, వైద్యానికి ఉపయోగపడే ఔషధీపుష్పాలు ఇక్కడ ఎన్నో. అందుకే పర్యాటకులనేకాక వృక్షశాస్త్రజ్ఞుల్నీ విశేషంగా ఆకర్షిస్తోందీ ఈ లోయ. పర్యాటక ఆకర్షణగానే కాకుండా పరిశోధనలకు కేంద్రబిందువుగా పేరుపొందింది చమోలీ లోయ ప్రాంతం. అందుకే, ఇక్కడి ప్రకృతి అందాలను తమ కెమెరాల్లో బంధించాలని ఎవరు అనుకోరు చెప్పండి. అయితే, ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాలకు ఈ ప్రాంత పర్యాటక చాలా ప్రమాదకరంగా ఉంటుంది. స్థానిక సమాచారం మేరకు ప్లాన్ చేసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications












