నాగాలాండ్‌లోని ఈ మోట్సు ఫెస్టివల్ గురించి తెలుసా?
నాగాలాండ్ భారతదేశంలోని ఈశాన్య భూభాగంలో ఉన్న రాష్ర్టాలలో ఒకటి. ఇది పర్యాటకులను మంత్రముగ్దులను చేసే సుందరమైన అందాలకు మాత్రమే కాకుండా కొన్ని ముఖ్యమైన ఉత్సవాలకు కూడా ప్రసిద్ది చెందింది. నాగాలాండ్ లాంటి ప్రదేశాల్లో కొన్ని సాంస్కృతిక సంప్రదాయాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. దీనికున్న చారిత్రక నేపథ్యం ఇప్పటి యాంత్రిక జీవితం అనుభవిస్తున్న చాలామందికి తెలియకపోవచ్చు.
అక్కడ అడుగుపెడితే పచ్చని ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి మనకు కలుగుతుంది. ఇక్కడి వస్త్రాధారణ మొదలుకుని ఫుడ్‌కల్చర్ వరకు ప్రకృతితో ముడిపడి ఉంటుంది. నాగాలాండ్‌లో చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉండే అనేక పండుగలు, ఉత్సవాలను నిర్వహిస్తారు. అందులో ఒక పండగే మోట్సు.

మోట్సు పండగ విశేషాలు..
నాగాలాండ్‌లోని మోట్సు ఫెస్టివల్ మే 1న జరగనుంది. నిజానికి నాగాలాండ్ పండుగలు ప్రయాణికులకు సంస్కృతి సంప్రదాయాలను చూపిస్తాయి. ఎందుకంటే భారతదేశంలోని ఈ రాష్ట్రం గిరిజన సంస్కృతి మరియు ఆచారాలతో నిండి ఉంటుంది. పదహారు నుండి పదిహేడు గిరిజన సమూహాలతో, నాగాలాండ్ ప్రధానంగా గిరిజన రాష్ర్టంగా ఉంది. నాగాలాండ్‌లోని గిరిజన ఉత్సవాలు భారతదేశం యొక్క విభిన్న కోణాలను మీకు పరిచయం చేస్తాయి.
ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే అద్భుతమైన హార్న్‌బిల్ ఫెస్టివల్‌తో ఈ రాష్ట్రం విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. అయితే రాష్ట్రంలోని విభిన్న సంస్కృతులు మరియు సంప్రదాయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ ప్రాంతాన్ని తప్పకుండా వీక్షించాల్సిందే. ఈ నాగాలాండ్‌లోని అయో తెగకు అలాంటి ఒక ప్రత్యేక పండుగ ఉంది. దీనినే మోట్సు పండుగ అని పిలుస్తారు. ఈ ఉత్సవం మే 1, 2023న నిర్వహించబడుతోంది. ఆ పండగ విశేషతలెంటో తెలుసుకుందాం పదండి..

ఈ పండుగను ఎందుకు జరుపుతారు
ఈ పండుగ రాష్ట్రంలోని అయో తెగకు చెందిన ప్రజలు జరుపుకుంటారు. ఈ పండుగ ముఖ్యంగా వ్యవసాయ పద్ధతులతో ముడిపడి ఉంటుంది. ఈ పండుగ ఇతర పండుగల మాదిరిగా కాకుండా, పొలాన్ని శుభ్రం చేసి పొలాల్లో విత్తనాలు నాటిన తర్వాత దీనిని జరుపుకుంటారు. ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకుని, ఈ పండుగ జరుపుకోవడానికి పెద్ద సంఖ్యలో బయటకు వస్తారు. ఇది మే మొదటి వారంలో మూడు రోజుల పాటు జరుపుకునే ఉత్సవం. అయో ప్రజలకు ఇది సంవత్సరంలో అత్యంత సంతోషకరమైన సమయం.
ఈ తెగకు చెందిన ప్రజలు ఈ ఉత్సవం నాడు సాంగ్పాంగ్తు అనే అగ్నిని వెలిగిస్తారు. సాంగ్పాంగ్తు అంటే అర్థం పెద్ద మంటలు వేయడం. ఆ మంటల చుట్టూ అక్కడి పురుషులు స్రీలు గుమిగూడి సంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఉత్తమమైన దుస్తులు ధరించి దాని చుట్టూ కూర్చుంటారు. ఈ ఉత్సవాన్ని వీళ్లు ఉల్లాసమైన పాటలు మరియు నృత్యాలతో చేస్తారు. ఈ వేడుకలో స్త్రీలు అందరికీ ద్రాక్షరసం మరియు మాంసాహారాన్ని వడ్డిస్తారు.

ఎప్పుడూ స్త్రీలే విజేతలు..
నాగాలాండ్‌లోని కోహిమా నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోకోక్‌చుంగ్‌లోని అయో పట్టణంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పట్టణం దిమాపూర్ మరియు కోహిమా తర్వాత మూడవ అతిపెద్ద పట్టణం. ఇక్కడి ప్రజలు గ్రామ ద్వారాలకు తాళం వేసిన తర్వాత మాత్రమే ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే అయో ప్రజలు మాత్రమే ఈ పండుగలో హాజరవుతారు, ఇది ఒక సన్నిహిత వ్యవహారం.
పాటలు మరియు నృత్యాలతో ఈ ఉత్సవం సందడిగా ఉంటుంది. అత్యంత సంతోకరమైన ఈ ఉత్సవం చివరి అంకం పురుషులు మరియు స్త్రీల మధ్య జరిగే టగ్ ఆఫ్ వార్‌తో ముగుస్తుంది. ఈ చివరి అంకంలో ఎప్పుడూ స్త్రీలే గెలుస్తారు. మరెందుకాలస్యం ఈ గిరిజనులు చేస్తున్న ఈ పండుగ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ ప్రాంతాన్ని తప్పకుండా సందర్శించాల్సిందే.



Click it and Unblock the Notifications












