ఉవ్వెత్తున ఎగిసి పడే తీర ప్రాంతపు అందాలను కొండ కోన భాగాన నిలబడి చూస్తే ఎలా ఉంటుంది.. పచ్చదనం కమ్మేసిన పర్వతం పై నుంచి మహనగరాన్ని వీక్షించాలని ఎవరికి ఉండదు.. కెరటాల మాటున కేరింతలు కొట్టే డాల్ఫిన్ అందాలను ఒడ్డున చూడాలని ఆశపడుతునారా? మరెందుకు ఆలస్యం.. విశాఖ తీరాన దశాబ్దాలుగా ప్రకృతి ప్రేమికులను రా రమ్మని ఆహ్వానిస్తున్న డాల్ఫిన్ నోస్ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి....

డాల్ఫిన్ నోస్‌పై నుంచి వైజాగ్ నగర
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సహజ ఓడరేవుగా ఉండటానికి కారణం డాల్ఫిన్ నోస్ కొండే అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కొండ అచ్చం డాల్ఫిన్ ముక్కును పోలి ఉంటుంది. అందుకే ఈ కొండకు ఆ పేరు వచ్చింది. నగర జీవితానికి అలవాటు పడినవారు మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడి ప్రకృతి అందాలకు పర్యాటకులు ముగ్ధులైపోవాల్సిందే. విశాఖపట్నంలోని యారాడ, గంగవరం పోర్టు మధ్యలో ఈ డాల్ఫిన్ నోస్ కొండ (Dolphin nose Hill) నెలకొని ఉంది. వైజాగ్‌లోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలలో ఈ సహజ అద్భుత కొండ ఒకటి. వైజాగ్ పర్యటనకు వచ్చిన వాళ్లు తప్పకుండా ఇక్కడికి వెళ్తారు. ఈ కొండ మీద నుంచి చూస్తే 360 డిగ్రీల్లో వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. చిటారు కొమ్మన నిలబడి సిటీ అందాలను ఆస్వాదిస్తే ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించడం కాస్త కష్టమే. చల్లని పిల్లగాలులు శరీరాన్ని తాకుతూ ఉంటే, సందర్శకుల మనసు మరో ప్రపంచంలో హాయిగా విహరించే అనుభూతి కలుగుతుంది. చిన్నగా కనిపించే ఇక్కడి తీరప్రాంతపు అందాలు అధనపు ఆకర్షణా నిలుస్తాయి.

మత్స్యకారులకు మార్గదర్శిగా..
చరిత్రకు సాక్షాత్కారంగా డాల్ఫిన్ నోస్ కొండ మన కళ్లముందు కనిపిస్తున్నా.. దాని గురించి కొన్ని విషయాలు అందరికీ తెలియవు. అంతే కాదు ఒక ప్రసిద్ధ నౌకా యుద్ధానికి ఈ కొండ నిలువెత్తు సాక్ష్యం. 1804 సంవత్సరంలో ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారి మధ్య ఈ ప్రాంతంలోనే నౌకా యుద్ధం జరిగింది. ఈ కొండపై ఉన్న లైట్‌హౌస్.. సముద్రంలోని ఓడలు.. విశాఖపట్నం ఓడరేవులోకి ప్రవేశించడానికి దారి చూపిస్తుంది. ఇది సముద్ర మట్టానికి 384 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ లైట్ హౌస్ ద్వారా సముద్రంలోని దాదాపు 64 కిలోమీటర్ల వరకు జాలరులకు దారిచూపుతుంది. డాల్ఫిన్ నోస్ కొండపై భాగంలోనే ఈ లైట్ హౌస్ ఉంది. అందుకే స్థానిక మత్స్యకారులు ఈ కొండను అపురూపంగా చూసుకుంటారు. వారు వేటకు వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఈ లైట్ హౌస్ మార్గదర్శిగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు.

సర్వమత సమ్మేళనానికి చిహ్నంగా..
ఈ కొండపై ఉన్న లైట్ హౌస్ ను 1960లో నిర్మించగా, లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించారు. ఇప్పడు మనం చూస్తున్న లైట్ హౌస్.. డాల్ఫిన్ నోస్ హిల్ టాప్ నుండి తుఫానులను ట్రాక్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. కొంతమంది స్థానికులు ఈ ప్రాంతంలోని బీచ్ దగ్గరకు కొన్ని డాల్ఫిన్‌లు వస్తుంటాయని చెబుతుంటారు. అయితే అది నిజమో కాదో ఎవ్వరూ నిర్థారించలేకపోయారు. సురక్షితమైన నావికా మార్గాన్ని రక్షించే బహుళ మత పుణ్యక్షేత్రాలను కలిగి ఉన్న ప్రపంచంలోని ఏకైక లైట్‌హౌస్ ప్రాంతం ఇదేనంటారు స్థానికులు. డాల్ఫిన్స్ నోస్ పైన ఉన్న సాగర మాత ఆలయంతో పాటు అక్కడ ఏడు వందల ఏళ్ల నాటి ఇషాక్ మదీనా దర్గా కూడా ఉంది. నావికులు మరియు నౌకాదళ సభ్యులు నౌకాశ్రయంలోకి వెళ్లేటప్పుడు ఇక్కడ ఆశీర్వాదం తీసుకుని వెళ్తుంటారట. సర్వమత సమ్మేళనానికి చిహ్నంగా ఈ ప్రాంతం పేరు పొందింది. ఇక్కడి మరిన్ని విశేషాలను రెండో భాగంలో తెలుసుకుందాం.



Click it and Unblock the Notifications











