తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న యాదగిరిగుట్టకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకుంటే సకల బాధలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే నిత్యం ఈ పుణ్యక్షేత్రం భక్తుల పూజలతో ఎంతో సందడిగా కనిపిస్తుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో నేటి(మార్చి 11) నుంచి స్వామివారి రెండవ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆ విశేషాలను తెలుసుకుందాం.
తెలంగాణలోని యాదాద్రిలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆలయ ఉద్ఘాటన అనంతరం రెండో సారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. సోమవారం(మార్చి 11)న స్వస్తి పుణ్యాహవాచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమైన వేడుకలు 21 వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగియనున్నాయి. ఒకకోటి అరవై లక్షల రూపాయలతో ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మొత్తం పదకొండురోజులపాటు నిర్వహించనున్నారు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు.

రోజువారీ కార్యక్రమాల జాబితా ఇదే..
నేటి(మార్చి 11) నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం మొదలయ్యాయి. చివరి రోజున(మార్చి 21) శృంగార డోలోత్సవంతో ఉత్సవాలను ముగిస్తారు. బ్రహ్మోత్సవాలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు విచ్చేశారు. మార్చి 12వ తేదీన అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. ఇక ఎల్లుండి అంటే మార్చి 13వ తేదీన ఉదయం మత్స్య అలంకారం, సాయంత్రం శేష వాహనం సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈ నెల మార్చి 14న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ కార్యక్రమాలు అలాగే, మార్చి 15 ఉదయం మురళీ కృష్ణుడి అలంకారం, రాత్రి పొన్న వాహన సేవమార్చి కార్యక్రమాలు ఉండనున్నాయి. మార్చి 16న ఉదయం గోవర్థనగిరిధారి అలంకారం, రాత్రి సింహవాహన సేవ నిర్వహించనున్నారు. మార్చి 17న స్వామివారి ఎదుర్కోలు, 18న తిరుకల్యాణ మహోత్సవం, 19న దివ్యవిమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, చత్రతీర్థం, 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవం నిర్వహిస్తారు.

పలు కార్యక్రమాలు రద్దు..
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ 11 రోజుల పాటు జరగాల్సిన రోజువారీ కార్యక్రమాలను ముందుగా రద్దు చేశారు. తాత్కాలికంగా రద్దు చేసిన కార్యక్రమాలలో ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లను ఆలయ అధికారులు ఎంతో వైభవంగా పూర్తి చేశారు. ఆలయంలోని సప్తగోపుర ప్రధానాలయ సముదాయానికి ప్రత్యేక లేజర్ లైటింగ్‌ను కూడా పెట్టారు.
సుమారు 10 వేల మంది కూర్చునేలా ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నట్లు టీఎస్ ఆర్‌టీసీ ప్రకటించింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానాలయ ముఖ మంటపం, హనుమాన్ టెంపుల్, ఆండాళ్ అమ్మవారి ఆలయాలకు ఆకర్షణీయమైన లైట్ సెట్టింగ్‌ను ఏర్పాటు చేశారు.



Click it and Unblock the Notifications












