రంగుల హోలీని బృందావనంలో జరిపేందుకు బయలుదేరండి!
రంగుల హోలీ పండగ వచ్చేస్తోంది. ఏటా హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో గొప్ప వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు, మన దేశంలో కొన్ని ప్రదేశాలలో ఈ పండుగలో కొన్ని విభిన్న దృశ్యాలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మధురలోని బృందావం హోలీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాంటి హోలీ రోజున మీ జీవితంలో మర్చిపోలేని మదురక్షణాలను పదిలపరుచుకునేందుకు మంచి ట్రిప్ ప్లాన్ చేయండి.
ఎందుకంటే, ప్రతి సంవత్సరం బృందావంలో హోలీ వేడుకలను చూడటానికి దేశ విదేశాల నుండి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ పండుగకు వారం రోజుల ముందు నుంచే వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ప్రజలు హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుతారు. మీరు కూడా ఈ సంవత్సరం హోలీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, కుటుంబసమేతంగా బృందావనం వెళ్ళవచ్చు. హోలీ ప్రత్యేక సందర్భంగా ఇక్కడి దేవాలయాలలో చాలా అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. బృందావనంలోని ఆ ఆలయాల గురించి తెలుసుకుందాం.

ఇస్కాన్ ఆలయం
బాంకీ బిహారీ ఆలయానికి సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో మీరు హోలీ సందర్భంగా ముస్తాబయ్యే అద్భుతమైన వీక్షణలను చూడవచ్చు. హోలీ సందర్భంగా ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రజలు రంగురంగుల పూలతో హోలీ ఆడుతున్నారు. ఈ ఆలయం తెల్లటి పలకలతో నిర్మితమైనది. హోలీ దినాన దీని అందం రెట్టింపుగా కనిపిస్తుంది. ఆలయం లోపల పెయింటింగ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
బృందావనంలోని ఈ ఇస్కాన్ ఆలయాన్ని కృష్ణ బలరామ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటుంది. హోలీ ప్రత్యేకతను దగ్గరగా చూసేందుకు ఇస్కాన్ ఆలయం ఓ మంచి ఎంపికగా చెప్పొచ్చు. మనసుకు ప్రశాంతతను చేరువ చేసే ఈ ఆలయ సందర్శన అస్సలు మిస్సవ్వొద్దు.

ప్రేమ మందిరం
బృందావన్ ప్రేమ మందిరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం రాధా-కృష్ణులకు అంకితం చేయబడింది. సుమారు 54 ఎగరాల విస్తీర్ణంలో ఉన్న గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. మామూలు సమయాల్లో కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో జనం కనిపిస్తారు. ఇక హోలీ అంటే ఇక చెప్పనవసరం లేదు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు హోలీని జరుపుకోవడానికి ఈ ఆలయానికి గుంపులుగా చేరుకుంటారు.
ఈ ఆలయంలోని రంగురంగుల దీపాలు చూపరుల ఆకర్షణకు కేంద్రబిందువుగా నిలుస్తాయి. మీరు హోలీ పండుగను గుర్తుండిపోయేలా చేయాలనుకుంటే, తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. జీవితంలో ఒక్కసారైనా ప్రేమ మందిరంలో అడుగుపెట్టాలని కోరుకునేవారు చాలామందే ఉంటారు.

బాంకీ బిహారీ ఆలయం
బాంకీ బిహారీ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుంది. కానీ ఇక్కడ హోలీకి భిన్నమైన గ్లో కనిపిస్తుంది. హోలీకి కొన్ని రోజుల ముందు ఇక్కడ సంబరాల వాతావరణం మొదలవుతుంది. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు జరుపుకొనేందుకు ఇక్కడ వాలిపోతారు. స్థానిక ఆలయ సముదాయాలన్నీ సందర్శకులతో కిటకిటలాడుతాయి. ఎక్కడ చూసినా హోలీ ఉత్సవం కనిపిస్తుంది. మీరు హోలీని ఓ గొప్ప జ్ఙాపకంగా జరుపుకోవాలనుకుంటే, మీరు బృందావన్‌ని సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications












