తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 22 శనివారం నాడు అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా TTD కొన్ని రకాల ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. అలాగే నిర్దిష్ట తేదీల్లో VIP బ్రేక్ దర్శనాలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కాబట్టి, భక్తులు పండుగ రద్దీలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు దర్శన స్లాట్లు, ప్రయాణం, గదుల కేటాయింపును ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.
ఉత్సవాల సమయంలో ప్రతిరోజూ ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మాడ వీధి ప్రదక్షిణలు జరుగుతాయి. సేవల రద్దు వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 22న సహస్ర దీపాలంకార సేవ రద్దయింది. ఆగస్టు 23 నుంచి 25 వరకు ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఆగస్టు 25న అష్టదళ పాదపద్మారాధన, ఆగస్టు 26న కల్యాణోత్సవం సేవలను నిలిపివేశారు.

తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు.. దర్శనాల్లో మార్పులు, సేవల రద్దు వివరాలివే!
అంకురార్పణ సందర్భంగా ఆగస్టు 22 శనివారం, పవిత్ర సమర్పణ జరిగే ఆగస్టు 24 సోమవారం నాడు విఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ రోజుల్లో కేవలం ప్రొటోకాల్ విఐపీలకు మాత్రమే దర్శన అవకాశం ఉంటుంది. అంతకుముందు రోజుల్లో ఎలాంటి సిఫార్సు లేఖలనూ స్వీకరించరు. కాబట్టి సామాన్య భక్తులు ఈ మార్పులను గమనించి, ఆఖరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా దర్శన ప్లాన్ చేసుకోవాలి.
SSD టోకెన్లు, దివ్య దర్శనం, కాలినడక మార్గం వివరాలు
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కేంద్రాల్లో సర్వదర్శనం (SSD) టోకెన్లు జారీ చేస్తారు. రద్దీని బట్టి అదనపు కౌంటర్లు కూడా అందుబాటులోకి తెస్తారు. SSD లేదా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌పై ఉన్న సమయానికి మాత్రమే భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్లను 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేస్తారు. రద్దీ రోజుల్లో ఈ టోకెన్లు త్వరగా పూర్తవుతాయి.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలినడకన వెళ్లే భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ల నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6:15 గంటల వరకు ఉచిత బస్సులను నడుపుతోంది. ఇక తిరుపతి-తిరుమల మధ్య ప్రతి రెండు నిమిషాలకో APSRTC బస్సు అందుబాటులో ఉంటుంది. పండుగ రోజుల్లో ఇవి 24 గంటలూ తిరుగుతాయి. వర్షాల వల్ల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ మందగించే అవకాశం ఉన్నందున ప్రయాణాన్ని కాస్త ముందుగానే ప్రారంభించడం మంచిది.
ఘాట్ రోడ్డు, గదుల కేటాయింపు, లడ్డూలు, నిబంధనలు
భక్తులు వీలైనంత వరకు ముందుగానే ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకోవడం శ్రేయస్కరం. రద్దీ సమయంలో నేరుగా వచ్చే వారి కోసం CRO కౌంటర్ల ద్వారా టోకెన్ పద్ధతిలో గదులను కేటాయిస్తారు. శ్రీవారి దర్శనం తర్వాత లడ్డూ కాంప్లెక్స్‌లోని కౌంటర్లు 24 గంటలూ తెరిచే ఉంటాయి. భక్తులు తప్పనిసరిగా టీటీడీ సాంప్రదాయ దుస్తుల నిబంధనలను పాటించాలి. లగేజ్ కోసం ఉచిత డిపాజిట్, కాలినడక లగేజ్ రవాణా సదుపాయాలను వాడుకోవచ్చు. అలాగే క్యూలైన్లలోకి వెళ్లే ముందే అన్నప్రసాదం స్వీకరించడం మంచిది. టోకెన్ల కోసం ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.



Click it and Unblock the Notifications











