బ్రహ్మోత్సవాలకు వాసుదేవ పెరుమాళ్ళ ఆలయం సిద్ధమైంది!
శ్రీకాకుళం జిల్లా మందస వాసుదేవ పెరుమాళ్ళ స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 17 వరకూ మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిది రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్వామిజీల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. నిత్య పూజలు జరిపే ఈ ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో.. వైభవోపేతంగా ఉత్సవాలు జరగనున్నాయి.
శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలోని మందసలో ఎనిమిది వందల ఏళ్ల నాటి అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో కట్టిన అతి పురాతన ఆలయం ఈ వాసుదేవ పెరుమాళ్ల స్వామి ఆలయం. వాసుదేవ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. రాజుల కాలంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేవారు. 14వ శతాబ్దం నాటి ఈ వాసుదేవాలయాన్ని మందస రాజులు ఎంతగానో అభివృద్ధి చేశారు. 17వ శతాబ్దం వరకూ మంజూష (మందస) సంస్థానాధీశులు ఆలయ నిర్వహణ చూసేవారు. 1779-1823 మధ్య కాలంలో 45వ రాజు లక్ష్మణరాజమణిదేవ్ ఆలయ వైభవానికి కృషిచేసేవారు.

ఏటా 9 రోజుల బ్రహ్మోత్సవాల నిర్వహణను ప్రారంభించారు. అప్పటి నుంచి సంస్థానాధీశుల కాలం చెల్లే వరకూ ఏటా బ్రహ్మోత్సవాలు సాగేవి. తరువాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా త్రిదండి చినజీయర్‌స్వామి శ్రీకూర్మం నుంచి పూరీ వరకూ పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఈ పురాతన ఆలయాన్ని ఒడిశాకు చెందిన శిల్పకళాకారులను రప్పించి పునర్నిర్మించారు. అలా 2010 ఫిబ్రవరి 5న బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
ఎర్రని ఇసుక రాయితో కళింగ శైలిలో..
ప్రాచీన కళింగ నిర్మాణ శైలితో పచ్చని పల్లె వాతావరణంలో ఉన్న ఈ ఆలయాన్నిసందర్శిస్తే అన్ని వైష్ణవ ఆలయాలని దర్శించినంత ఫలమని చెపుతారు. ఆలయం లోకి ప్రవేశించినంతనే ఏదో తెలియని ఒక అద్యాత్మిక ఆనందానికి లోను అవుతారు. ఎర్రని ఇసుక రాయితో కళింగ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతం. ఆలయంలో నెలకొని నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి కంచిలో కొలువైన వరదరాజ స్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది.

ఇక్కడ ఉండే స్వామి విగ్రహాన్ని కంచి నుండి తయారీ చేయించి తెచ్చారని చెబుతారు. సాధారణ రోజులలో వాసుదేవ పెరుమాళ్ల ఆలయ దర్శన వేళలు ఉదయం 5.30 నుండి 11.30 వరకు మరియు సాయంత్రం 4.30 నుండి 7 వరకు ఉంటాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిది రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
దగ్గరలోని సందర్శనీయ ప్రదేశాలు
ఈ ఆలయం చుట్టుపక్కల అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి వరాహ స్వామి ఆలయం మరియు పాండవుల ఆలయాలు. ఇవి మహేంద్రగిరి పర్వతం వద్ద ఉన్నాయి. అలనాటి రాజవైభవానికి గుర్తుగా మందస కోటను కూడా చూడవచ్చు.
మందస జిల్లా కేంద్రం అయిన శ్రీకాకుళం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై-కలకత్తా జాతీయ రహదారిలో వున్న పలాస నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ ఆలయం ఉంది.



Click it and Unblock the Notifications












