చారిత్రక నిర్మాణాల సమాహారం.. నల్గొండ ప్రాంతం
తెలంగాణలోని నల్గొండ జిల్లాను పూర్వం నీలగిరి అని పిలిచేవారు. చుట్టూ పచ్చటి పంట పొలాలతో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆనకట్ట నాగర్జునాసాగర్ ఈ జిల్లా పరిధిలోనే ఉంది. అంతేకాదు, రకరకాల ఆకృతులతో నగిషీలు చెక్కిన బుద్ధవనం, అందమైన పట్టు, నూలు చీరలు ఇలా ఎన్నో అందాలను, విభిన్న కట్టడాలకు నిలయమైన నల్గొండ జిల్లాను ఓ సారి సందర్శించాల్సిందే.
ప్రస్తుతం ఈ జిల్లాను నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలుగా విభజించారు. ఇక్కడి కొన్ని చారిత్రక నిర్మాణాల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బుద్ధవనం
నాగార్జునసాగర్ దగ్గర 279 ఎకరాల్లో గౌతమ బుద్ధుని చరిత్రకు ఆనవాలుగా విరాజిల్లుతోంది ఈ బుద్ధవనం. సందర్శకులు అద్భుతమైన అనుభూతి పొందటానికి వనంలో చూడచక్కని పుష్పాలు, మొక్కలు, పచ్చని గడ్డితో నిండి, సందర్శన సౌలభ్యానికి బుద్ధ ఎక్స్ ప్రెస్ టారు ట్రైన్ కూడా పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. కుటుంబ సమేతంగా సందర్శించడానికి ఈ ప్రాంతం ఎంతో అనువైనది. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ఈ వనం మధ్యలో అమరావతిలో ఉన్న స్థూపం కొలతలు, ఆకారాలతో మరొక స్థూపం నిర్మితమైంది. ఈ స్థూపానికి ఇసుకరాయితో కూడిన వివిధ రకాల ఆకృతులతో చెక్కిన నగిషీలు పొదగడంతో నిజమైన బౌద్ధ స్థూపంలా ఉంటుంది. క్లిష్టమైన రీతిలో నిశితంగా ఉన్న బుద్ధుని జీవిత దృశ్య రూపాలు సున్నపురాయితో మలచబడ్డాయి. ఇక్కడి నిర్మాణ శైలి అచ్చం పురాతన కట్టడాల్లోని మాదిరిగా దర్శనమిస్తుంది. ఈ ప్రాంత సందర్శనకు వచ్చే పర్యాటకులు ఇక్కడి అద్భుత దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించేందు ఉత్సహాం కనబరుస్తారు.

నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ ఆనకట్ట ప్రపంచలోనే అతి పెద్దదైన కట్టడం. ఇది విజయవాడ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఇది పది లక్షల ఎకరాల భూమి సాగుకు దోహదపడుతోంది. ఈ ప్రాజెక్టు మధ్యభాగంలో ఆకర్షణీయమైన నాగార్జున కొండ ద్వీపం ఉంది. ఇక్కడున్న మ్యూజియంలో వెలకట్టలేని బుద్ధుని కాలంనాటి స్మారక చిహ్నాలు, కట్టడాలు ఉన్నాయి. అవి ఈ ఆనకట్ట నిర్మించిబడినప్పుడు వెలుగులోకి వచ్చాయి. నాగార్జునసాగర్ రిజర్వాయర్ ఒడ్డున పురాతనమైన బుద్ధుడి కాలం నాటి గ్రామం పునర్నిర్మించారు. అనేక పురాతన స్థూపాలు, విహారాలు, సన్యాసి మఠాలు, విశ్వవిద్యాలయం, బలిపీఠం ఇక్కడ చూడవచ్చు. చరిత్రను అధ్యయనం చేసేందుకు అనువైన ప్రదేశంగా చెప్పొచ్చు. ఇక్కడికి దేశవిదేశీ పర్యాటకులు ఏటా వస్తూ ఉంటారు.

కొలనుపాక
నల్గొండ నుంచి 95 కిలోమీటర్ల దూరంలో కొలనుపాక ఉంది. 1.5 మీటర్ల ఎత్తయిన మహావీరుడి విగ్రహంతో గల జైన మందిరానికి పెట్టింది పేరు. ఈ క్షేత్రం 2000 ఏళ్ల నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. నాలగవ శతాబ్దానికి పూర్వం జైన మతం విలసిల్లిందని విశ్వసిస్తారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రదేశంలో వేసే ప్రతి అడుగులోనూ ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఈ సమీపంలోనే చూడదగ్గ మరికొన్ని ఆకర్షణీయ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. దాదాపు 1104లో నిర్మించిన వీర నారాయణ దేవాలయ నిర్మాణ శైలి పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. దీనితోపాటు సోమేశ్వరస్వామి దేవాలయం, కొలనుపాక మ్యూజియం సందర్శనీయ ప్రదేశాలు.



Click it and Unblock the Notifications












