భారత్‌లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే, చాలా ఆలయాల్లో మొబైల్స్, కెమెరాలను నిషేదించారు. ఎందుకంటే, ఇటీవల చాలామంది పర్యాటక ప్రాంతాల్లో చేసినట్లుగా ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో కూడా ఫోటోలు, వీడియోలు తీయడం చేస్తున్నారు. అయితే, తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్దిచెందిన ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఈ ఆలయంలో ఫోటోలు, వీడియోలు తీయకూడదంటూ వాటిపై నిషేదం విధించారు.
ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ, క్షేత్ర ప్రతిష్ఠ, భక్తుల మనోభావాలు, భక్తుల విశ్వాసం దెబ్బతినేలా ఫోటోలు, వీడియోలు ఇకపై ఎవరు కూడా తీయోద్దంటూ ఆలయ అధికారులు హెచ్చరించారు. ఆలయ పరిసరాల్లో అనుమతి ఉన్న చోట మాత్రమే ఆధ్యాత్మిక ఉద్దేశంతో ఫొటో, వీడియో చిత్రీకరణలు చేసుకోవచ్చని ఆలయ ఈఓ భాస్కర్ రావు తెలిపారు. ఇటీవలి కాలంలో చాలామంది స్నేహితులతో సరదాగా గడిపేందుకు పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక, కుటుంబంతో కలిసి సంతోషంగా గడపాలనుకునేవారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. ఇందులో చాలామంది ఆలయ పరిసర ప్రాంతాలను అక్కడి నిర్మాణాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించడం చూస్తుంటాం.
అయితే కొందరు మాత్రం వాటినే అదునుగా తీసుకుని ప్రసిద్ధ క్షేత్రాల్లో రీల్స్ చేయడం వంటివి చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసు కున్నారు.ఇకపై గుడికి వచ్చే భక్తులు ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తూ ఓ ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేశారు.

అక్కడ ఫోటోలు దిగొచ్చు...
అయితే, ఆలయంలోని మాఢవీధుల్లో కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు తెలిపారు. వ్యక్తిగత కార్యక్రమాలకు ఆలయాన్ని ఉపయోగించుకోవడమనేది ఆలయ ప్రతిష్టను దెబ్బతీసినట్లు అవుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈఓ భాస్కర్ రావు తెలిపారు.

తీవ్ర విమర్శలు..
ఇటీవలే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో ఆలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, భార్య, కూతురితో కలసి రీల్స్ చేశారు. వీటిని నెట్టింట్లో పోస్ట్ చేస్తారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీటిని చూసిన నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉంటూ, ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఫొటోషూట్లు చేశారంటూ ఆయన ప్రవర్తనపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే, ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
4.03 ఎకరాల్లో ఆలయ నిర్మాణం...
నిజానికి, ఆలయంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు అస్సలు అనుమతి లేదు. కానీ, స్వామివారి దర్శనం తర్వాత బయటికి వచ్చాక మాడవీధుల్లో మాత్రం భక్తుల కోసం ప్రత్యేకంగా ఫోటోలు తీసుకునే వెసులు బాటు ఉంది. అక్కడ కుటుంబసభ్యుల ఫోటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు ఉంటారు. వారే అప్పటికప్పుడు ఫోటోలు తీసి ప్రింట్ చేసి ఇస్తుంటారు. యాదగిరి కొండపై ఉన్నటువంటి అర ఎకరం స్థలాన్ని 4.03 ఎకరాలకు విస్తరించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందుకు అప్పటి ప్రభుత్వం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications












