తెలుగు రాష్ట్రాలలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం దేవస్థానం ఒకటి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏప్రిల్ ఆరో తేది నుంచి పదో తేది వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర పాదయాత్ర భక్తబృందాలతో ఆలయ ఈవో పెద్దిరాజు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు జరగబోయే ఈ ఉగాది మహోత్సవాల సమయంలో భక్తులందరికీ కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉండనున్నట్లు ప్రకటించారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తుల సందర్శనార్థం ఈ రోజు(మార్చి 27) నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు రోజుకు నాలుగు విడతలుగా స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దీనిని పురస్కరించుకుని, స్వామివారి స్పర్శదర్శనం కోసం వెళ్లే భక్తులకు రూ.500 టిక్కెట్టును ఒక్కొక్క విడతలో 1500 టిక్కెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. దీనికి అనుగుణంగా క్షేత్రపరిధిలోని ఆలయంలోని ప్రదేశాలలో చలువపందిర్లు, మంచినీటి సౌకర్యం, శౌచాలయాలు, విద్యుత్ దీపాలు, వైద్యశిబిరాల ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

29 నుంచి ఏప్రిల్ 10వరకు వారి సేవలు..
ఆలయంలో ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు జరగబోయే ఉగాది మహోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. శ్రీశైల మల్లిఖార్జున స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే, వేసవిని దృష్టలో ఉంచుకుని నిరంతరం మంచినీటి సదుపాయం, అల్పాహారం అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు, ఉగాది ఉత్సవాల సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛందసేవకుల సేవలను దేవస్థానం వినియోగించుకోనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వీరంతా భక్తలకు పలు సేవలను అందిస్తారు.
శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలో..
స్వచ్ఛంద సేవా బృందాలకు ఆలయం, క్షేత్రపరిధిలోని ప్రదేశాలలో లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. ఈ స్వచ్ఛంద సేవకులు మార్చి 29 నుంచి ఏప్రిల్ పదో తేది వరకు ఈ సేవలను కొనసాగించనున్నారు. స్వామివారి ఆలయం, ముఖ మండపం, నంది మండపం, ధ్వజస్తంభం, అమ్మవారి ఆలయం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం, ఉచిత క్యూ లైన్, భక్తులు దర్శనానికి వేచి ఉండే క్యూ కాంప్లెక్స్, పుష్కరిణి, గంగా భవానీ స్నాన ఘట్టాలు, పాతాళ గంగ, హఠకేశ్వరం, సాక్షి గణపతి, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, అన్నదానం, వైద్యశాల వంటి తదితర ప్రాంతాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది.
కుటుంబసమేంతంగా స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా గట్టి చర్యలు తీసుకోనున్నారు. అలాగే, శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం కుటుంబసమేంతంగా తప్పక సందర్శించాల్సిందే. ఇది హైదరాబాద్‌కు 214 కిలోమీటర్లు, విజయవాడకు 263 కి.మీలు, కర్నూలుకు 180 కి.మీల దూరంలో ఉంటుంది. ఇక్కడికి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.



Click it and Unblock the Notifications













